"ఆంధ్రనాయక శతకము" సామాజికాంశాలు పరిశీలన
-డా. జాడ సీతాపతిరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్,
రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం(ట్రిబుల్ ఐటి),
నూజివీడు ప్రాంగణం,
ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9951171299.
Email: seethuphd@gmail.com
_______________________________________________________
keywords: ఆంగ్లేయుల పాలన- దేవాలయాల స్థితి- భారతం- భాగవతాలు- సామాజిక అంశాలు- జాతీయ భావాలు- పూర్వ వైభవ స్మరణ- ప్రస్తుత స్థితికి జాగృతి.
ఉపోద్ఘాతం:
ఆంగ్లేయులతో నిరంతరం యుద్ధాలు సాగిస్తూ మైసూరు బెబ్బులిగా టిప్పు సుల్తాన్ పేరుపొందాడు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన నాల్గవ మైసూరు యుద్ధం[1]లో(1799) పోరు సలుపుతూ ప్రాణాలు కోల్పోయాడు. రాజ్యం ముక్కలైంది. యుద్ధంలో సహాయం చేసినందుకు గానూ, నిజాం నవాబు అసఫ్ జాహీ, మహారాష్ట్ర పీష్వాలు కొత్త రాజ్యాల్ని పొందారు. కర్ణాటకలోని కొంత భాగం పీష్వాల, ఆంధ్రదేశంలోని కోస్తా రాయలసీమ ప్రాంతాలు నిజాం నవాబు ఏలుబడిలోకి వెళ్ళాయి.
కొత్తగా చేజిక్కించుకొన్న ఆంధ్ర ప్రాంతాలపై అధికారాన్ని సుస్థిరం చేసేందుకుదృష్టినిసారించారు. క్రీ. శ. 1800 వ సంవత్సరం అక్టోబర్ 12 వ తేదిన సికింద్రాబాదులోని చొల్లారంలో ఉన్న సైనిక శిబిరంనుంచి గుర్రం పై ఠీవీగా కూర్చొని బయలుదేరిన యువకుడు, బ్రిటీషు రాజ్య ప్రతినిధి ప్యాట్రిక్ తన పటాలాన్ని నిజాం నవాబు కోట వైపు నడిపించాడు. చేసేది లేక సంధికి వచ్చాడు నవాబు. అప్పటి గవర్నర్ కారన్ వాలీసు ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతికి అంగీకరించి ఏటా 24 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది[2]. పొరుగు రాజ్యమైన మహారాష్ట్రుల నుంచి భయం లేకుండా చేసేందుకు ఆంగ్ల ప్రభుత్వం తన సైన్యంలో కొంత అతని వద్ద ఉంచింది. దాని ఖర్చులన్నీ నవాబే భరించాలి. చివరికి ఆ ఖర్చులు భరించలేక పోవడంవల్ల ప్యాట్రిక్ తన పటాలంతో ఆ కోటను ఆక్రమించుకున్నాడు. ఇలాంటి చారిత్రక పరిణామాల కారణంగా భారతీయ జమీందారీ పాలకులు దేవాలయపు ఆదాయం లేక ఆలయ మరమ్మత్తు చేయలేక, ధూప దీప నైవేద్యాలకు దిక్కులేక దయనీయమైన స్థితిలో ఆంధ్ర మహా విష్ణువుని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య దేవ అంటూ... నీ లీలల్ని ఎలా గ్రహించాలి స్వామీ అని వ్యాజస్తుతితో కవిగారు శతక మకుటాన్ని ప్రారంభించారు.
ఈ మకుటంలోనే సామాజికాంశాన్ని సూచించారు. చిత్ర చిత్ర ప్రభావ అన్నపుడు ప్రభావ శబ్దానికి కోశ బలంవల్ల కలిగిన తేజం, శక్తి[3] ప్రతాపం, సామర్థ్యమని అర్థాలు. ఇలాంటి శక్తి ఆపదలలో ఉన్న వారిని రక్షించడంకోసం వినియోగించాలి. ఇపుడు ఆంగ్లేయులు చాలా దురాగతాలు చేస్తున్నారు. దాక్షిణ్య దేవ= కరుణ కలవాడా నువ్వు ఇపుడు రాదగిన సమయం అని భగవంతుడిని ఆర్తితో పిలిచే మకుటంగా చూడడం సామాజిక కోణం.
బ్రిటీష్ వారి దురాగతాల సూచన:
"శ్రీ మదనంత లక్ష్మీ యుతోరః స్థల!/చతురాననాండ పూరిత పిచండ!
ధర చక్ర ఖడ్గ గదా శరాసనహస్త!/నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర!
సకల పావన నదీ జనక పాదాంభోజ!/రమణీయ ఖగకులోత్తమ తురంగ!
మణి సౌధవ త్ఫణామండ లోరగతల్ప!/వరకల్పకోద్యాన వన విహార!
భాను సిత! భాను నేత్ర ! సౌభాగ్యగాత్ర!/యోగిహృద్గేయ ! భువనైక భాగధేయ!
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!/హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!" (ఆంధ్రనాయక శతకము, ప1)
ఈ పద్యంలో చాలా ఆభరణాలు, ఆయుధాలతో లక్ష్మీదేవితో కూడి రమ్మని కవి ఆకాంక్ష. పంచాయుధాలు కలవాడు విష్ణువు: శంఖం(పాంచజన్యం), చక్రం(సుదర్శనం), విల్లు(శార్ ఙ్గ౦), గద(కౌమోదకి), ఖడ్గం(నందకం): ఆయుధాలు శత్రునిర్మూలన కారకాలు. బ్రిటిష్ వారిని తరమమనడం సూచన. లక్ష్మిని అంటే సంపదను సాధించాల్సిన అవసరాన్ని గుర్తించడం. భారత దేశ పూర్వ వైభవస్మరణ ఇవన్నీ సంబోధనపూర్వక సమాస పదాలతోనే వర్ణించడం విశేషం.
"మానుష హర్యక్ష, మార్తాండ సోమాక్ష త్రిభువనాధ్యక్ష, కౌంతేయ పక్ష... !" (ఆంధ్రనాయక శతకము, ప3)
ఈ పద్యంలో మానుష హర్యక్ష అనే పదం సామాజిక స్పృహను కలిగించేది. హర్యక్ష అంటే సింహం. నారసింహ అవతరసూచకం. సూర్య చంద్రులే నేత్రాలుగా కలవడాని అర్థం. ఇక్కడ కేవలం నరుడుగా కాకుండా నరసింహుడిగా రావాలి అప్పుడే ఈ భారదేశానికి పాలిస్తున్న వాళ్ళ భరతం పట్టడం వీలవుతుంది తెల్పడం. కౌంతేయ పక్ష ఈ పద ప్రయోగం ద్వారా కృష్ణావతారాన్ని, గజేంద్రుణ్ణి రక్షించిన విష్ణువును స్పురింపజేయడం. ఒక బలవంతంగా చేస్తున్న చాలా దురాగతాలను విభిన్న అవతారాల్లో భక్తులను, జంతువులను రక్షించావు. ఇప్పుడు అలానే బ్రిటీషువారినుంచి భారతీయుల రక్షణ బాధ్యతను నిర్వహించమని కాసుల వారి ధ్వని.
జమీందారుల ప్రాపకం:
గోవింద ! ముచికుంద సేవిత పాదార/ వింద! నిత్యానంద ! విశ్వతుంద !
శ్రీమంత ! విజయలక్ష్మీకాంత నిర్మల/ స్వాంత భక్తోద్యాన వనవసంత !
అఘనాశ ! కోటిసూర్యప్రకాశ ! వరేశ !/ విజితాశ ! సన్మనోంబుజ నివేశ !
సద్గుణ గేహ ! వాసవనీల సమదేహ !/ బంధురోత్సాహ ! సువర్ణవాహ !
పండిత స్తోత్ర చారిత్ర ! పద్మనేత్ర !/ మధుర మంజులభాష! సమస్తపోష !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ! (ఆంధ్రనాయక శతకము, ప4) లో ఈస్ఠిండియా కంపెనీ పాలనే ఉంది. మత మార్పిడులతో హిందూమతం పై అరాచకశక్తులు దాడి చేస్తన్నాయ్. గర్గలాలు కవి ఉండేది అహోబిలం. కాసులవారిది దివిసీమ. ప్రాంతాలు వేరైనా రాజకీయ పరిస్థితులు ఒక్కటే. నృసింహ పంచవింశతి రచించిన గర్గలాలు క్షత్రియుడు కాబట్టి ‘క్రీస్తు మతజుల చెండుమా కినుక బూని’ అని ధైర్యం గా అహోబిల నారసింహాన్ని ప్రార్ధించాడు. కాని కాసుల పురుషోత్తమ కవి భట్టు కులజుడు. అందునా జమీందారు ప్రాపకంలో ఉన్న వాడు. అందువల్ల ‘హత విమత జీవ’ అంటూ ఆంధ్రదేవుని స్తుతిస్తున్నాడు పురుషోత్తమ కవి.
ఉద్యోగాలపేరుతో మోసం:
"వంచన గాదె దివ్యక్షేత్రపతులలో/ మంత్రార్థకృత్యము ల్మాని యున్న?
నపకీర్తిగాదె లోకాలోకములయందు/ వత్సరోత్సవములు వదలి యున్న?
నగుబాటు గాదె యన్యమతస్థజనులలో/ నిజదాసకోటి మన్నింపకున్నఁ?
బరిపాటి గాదె యల్పజ్ఞానమతులలో/ దేవతామహిమంబుఁ దెలుపకున్న?
నేఁటిదా నీ ప్రతిష్ఠ వర్ణించి చూడఁ/ బాడి దప్పిన బలునిందపాలు గావె?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!/ హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!" (ఆంధనాయక శతకము ప: 15)
ఇందులో "అన్యమతస్థజనులలో నిజదాసకోటి మన్నింపకున్న" ప్రధాన౦. అన్యమతాల మధ్య స్వీయధర్మాన్ని నిలబెట్టుకోవడం అనడంలో భారతదేశంలో ఉన్న స్థితి, ఉన్నతంగా ఉండడం లేదని, ఇక్కడ ఉన్న వారే ఉద్యోగాల పేరుతో మోసపోతున్నారని చైతన్య పరచాలనే భావన ధ్వనింపజేస్తున్నాడు.
అసమర్థ స్థితి:
చెల్లింపఁ దగునె వ్రేపల్లెలోఁ గల వెఱ్ఱి/ గొల్లయిల్లాండ్రను గొల్లగొనఁగ?
మెక్కంగఁ దగునె ము న్పెక్కిండ్లలో నుట్ల/ కెక్కి పాల్వెన్నలు డొక్క నిండ?
మ్రుచ్చిలఁ దగునె మళ్ళుచ్చి జలక మ్మాడు/ మచ్చెకంటుల కోక లిచ్చకముగ?
మ్రొక్కంగఁ దగునె ముం దొక్కపువ్వునకుఁ దాఁ/ గక్కసించినయాలి కక్కజముగ
నిట్టీ నగుబాటుపనులు నీ వెన్ని కలుగఁ/ జేసినాఁడవు మంచిప్రసిద్ధకుఁడవె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ! (ఆంధనాయక శతకము ప: 17) శ్రీకాకుళాంధ్రదేవా! రేపల్లెలో అమాయకులైన గొల్ల వనితల్ని లొంగదీసుకున్నావన్న అపప్రధను ఏ రకంగా సమర్ధించుకుంటావయ్యా! (నువ్వు లోక నాథుడివి కాబట్టి ఇది నీకు సులువే). పరాయి వాళ్ళ ఇళ్ళలో దూరి దొంగ చాటుగా ఉట్లలోని పాలు, వెన్నల్ని దొంగలించుకుపోవడం ఏం న్యాయం అంటావు. భగవంతుడికి దొంగా అని పేరు (శివార్చణలో నమఃచోరాయ అని నమకంలో చెప్పారు)(అలా దొంగతనంగా వచ్చి వారి మనస్సుల్ని దొంగలాడుతారు) అవసరమా? బట్టల్ని గట్టు మీద పెట్టుకొని కొలనులో స్నానమాడుతున్న ఆడవారి బట్టల్ని ఎత్తుకెల్లడం ఏం సబబు. శారీరక వాంఛల కన్నా, మోక్ష మార్గాన్ని అన్వేషించమని, వయస్సు౦డగానే దానిపైకి (మోక్షం)వలపు పెంచుకోమనడం.
ఇక్కడ రేపల్లె అంటే భారత దేశం. అమాయకులైన గోపికలు భారతీయులకు ప్రతీకలు. నీది విలాసం. ఆంగ్లేయులది దోపిడి. నీ లీలలు వల్ల తెలివైనవాళ్ళుగా మారారు. జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇక్కడ అవకాశం లేదు. పట్టపగలు చాలా రూపాల్లో దోచుకు పోయినా ఏమీ చేయలేని అసమర్థత. నీవే రక్షించాలి అంటూ ధ్వని, సామాజిక వాస్తవం.
ఆస్తుల పంపకం:
"నాఁగలి రోఁక లన్నకు నిచ్చి శంఖాది/ పంచాయుధము లీవు పట్టినావు
తాటి టెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి/ గరుడధ్వజం బీవు గట్టినావు
వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి/ కనకాంబరం బీవు గట్టినావు
మద్య మగ్రజునకు మత్తిలఁ దావించి/ జున్ను బాల్ పెరుఁ గీవు జుఱ్ఱినావు
తగువరివె యన్నదమ్ముల ధర్మ మీవె/ తీర్చవలెఁ గాని మఱియొండు తీర్పఁగలఁడె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ! (ఆంధ్రనాయక శతకము, ప: 36)
అన్నదమ్ములు ఆస్తుల్ని ఎలా పంచుకున్నారో చెప్తూ, కృష్ణుడు వాటాలు వేసే తీరు రసమయంగా చూపారు, కాసుల వారు.
నాగలి రోకలి - అన్న బలరాముడికి; శంఖం, చక్రం- కృష్ణుడికి
తాటిచెట్టు ధ్వజం - బలరాముడికి; గరుడ ధ్వజం- కృష్ణుడికి
నల్లని వస్త్రాలు(విలువలేనివి)- బలరాముడికి; బంగారు వస్త్రాలు(విలువైనవి)- కృష్ణుడికి
మద్యం- బలరాముడికి; జున్ను, పాలు, పెరుగు - కృష్ణుడికి
పాండవుల కౌరవుల తగువు తీర్చడానికి నువ్వే తగవరివి అంటూ వ్యంగ్యంగా చెప్తూనే కృష్ణ బలరామావతారాల స్వరూప స్వభావాలను స్పష్టంగా చెప్తూ, నారాయణుడికి, ఆంధ్రనాయకుడికి అభేదం చూపడంతో ఇది రూపకం. ఇక్కడ ఆస్తిని పంపకంలో చిన్న వాడికి ప్రాధాన్యం ఉంటుంది అనే లోక సామాన్య అంశాన్ని స్పురింపజేస్తున్నాడు. పెద్దవాళ్ళు చిన్న వాడిపట్ల ఉండే వాత్సల్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అంశాలు పట్టించుకోని పెద్దరికాన్ని ధ్వనింపజేస్తున్నాడు.
ఆలయ పునరుద్ధరణ:
"కఠిన స్తనంబుల ఘట్టించి దట్టించి/జడలచే మోది నున్దొడల నదిమి"
పలుగంట్లు చేసి గోరుల నాటి దొమ్మిగా/యువతీ సహస్రంబు లుపరతాది
బంధనంబుల నిన్నుఁ బైకొని తమి రేచి/రమియింప నిదురింప రాక నాఁటి
బడలిక దీర నాపఁగ రాని సుఖనిద్ర/బవళించియున్నట్టి భావ మిచటఁ
దోఁచుచున్నది సంఫుల్లతోయజాక్ష!/మేల్ బళా! యింత జా గేమి మేలుకొనవె!
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ !/హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ! (ఆంధనాయక శతకము ప: 46)
మొదటి వరుస - సంభోగ దృష్టి
రెండో వరుస చుంబన సౌఖ్యం
మూడో వరుస - కౌగిలింతలు
నాలుగో వరుస – నిద్రాభావం
ఐదో వరుస- లేవడానికి నేపథ్య/ కారణాలు
ఆంధ్రదేవా! రాత్రంతా యువతీ సహస్ర ఉపరతాది బంధనాలతో నిన్ను పైన వేసుకొని కోరికతో క్రీడిస్తూ అలసి పోయి నిద్రలేక, ఇప్పుడు సుఖనిద్ర పోతున్నావా.(వెటకారం) లేకపోతే మేలుకొని, నీ భక్తులను ఏలుకోవడానికి ఇంత ఆలస్యం ఎందుకు స్వామీ! చైత్యన్య పరచటం కవిత్వం లక్ష్యం. ఒక కార్య కారణ సంబంధాన్ని కవి అన్వేషించాడు. ఆంధ్ర విష్ణువుకు నిద్ర లేకపోవడానికి కారణం శృ౦గార సుఖమట.
ప్రస్తుతానికి వర్తిస్తే ఆంగ్లేయులు చాల రకాలుగా భారతీయ స్త్రీలను హింసిస్తున్నారు. నువ్వు చూస్తూ ఉంటావా? అంటూ జనాల్ని చైత్యన్య పరచడం ధ్వని. ఇంకోరకంగా చెప్పాలంటే ఆ దేవాలయం వివిధ రకాల శృ౦గార సుఖాలకు విటులు (దేవదాసీ వ్యవస్థ) వాడేస్తున్నారు. దానిని మేల్ భళా అని మెచ్చుకోవాలా? ఇంకా పునరుద్ధరణకు దేవాలయం నోచుకోదా? అని నిలదీస్తున్నాడు కవి.
భక్తుల్ని ఏలుకోవడానికి ఆలస్యం ఎందుకు? : భక్తులు పడుతున్న ఇబ్బందుల్ని చూడడం. ఆలస్యానికి కారణాలు అన్వేషణ. భక్తుల మనసులతో భారతీయ పీడితులను చేర్చి నివేదన.
స్నేహ ధర్మం:
"కూరిమి నల తంతెగొట్టు సన్న్యాసితో/ ముచ్చటించెద వేమి పుణ్యమూర్తి
సాటిగా వెలిగొండ వీటి జంగముచెల్మిఁ/ బచరింతు వేనాఁటి బాంధవుండు
వెలి పాపపాన్పుపై వేడ్కతోఁ బవళింతు/ వది యేమి భోగిభోగాంతరంబు
పొరుగిండ్ల కేప్రొద్దుఁ బో రాఁ దలఁచు నింతిఁ/ బాయకుండెద వేమి భాగ్యలక్ష్మి
మంచి సహవాసములు గల్గె నెంచి చూడ/ నీకె తగు నట్టివారితో నెనరు నెఱప
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!" (ఆంధనాయక శతకము ప: 52)
శ్రీకాకుళాంధ్రదేవ! మహతి వీణ తీగె ను మీటుకుంటూ తిరిగే సన్న్యాసి ఆ నారదుడితో ఎంతో అభిమానంతో ఎప్పుడూ ఏఏవో ముచ్చట్లాడతావు. ఆయన చేసిన పుణ్యమేమి? వెండికొండ మీద నివసించే జంగమయ్య(శివుడి)తో స్నేహం చేస్తావు. అతనేమైనా నీకు పాత చుట్టమా? తెల్లని శేషపాన్పు మీద విలాసంగా శయనిస్తావు. అదేమైనా నీకు విశేషభోగమా స్వామీ? ఎవరి ఇంటా నిలవకుండా ఎంతసేపు పొరుగు ఇళ్ళకు రాకపోకలు సాగిస్తూ ఉంటుంది నీ ఇల్లాలైన లక్ష్మీదేవి.(చెంచు లక్ష్మి) అయినా ఆమెను నీవు వక్షస్ధల౦లో నిలుపు కొని ఏలుకొంటున్నావు. ఆలోచిస్తుంటే ఎంత మంచిస్నేహాలయ్యా నీవి. ఇలాంటి వారితో స్నేహం చేయడం నీకే తగింది ప్రభూ. తంతెగొట్టు= వీణావాద్యగాడు. శివ శక్తుల క్రీడావల్ల విష్ణువు పుట్టాడు.(శివపురాణం)
కృష్ణుడు కూడా కుచేలునితో స్నేహం. ద్రోణుడు, ద్రుపదునితో స్నేహం. కానీ, ద్రోణద్రుపదులు ఎలాంటి స్నేహం చేయకూడదో మనకు చెబితే; కుచేల కృష్ణులు స్నేహమంటే ఎలా ఉండాలో చెబుతారు. స్నేహంలో హెచ్చుతగ్గులుండవు. ఒకరికి లేకుంటే వారు అడగలేదు కదా అని ఇవ్వకుండా ఉండలేరు నిజమైన స్నేహితులు. ఈవిషయాన్ని చెప్పటానికే కృష్ణుడు కుచేలుడు అడగకపోయినా ఆయన దారిద్య్రంనుంచి దూరమవడానికి సంపదను ఇచ్చాడు. ఒక్క మనదేశంలోనే కాదు ‘స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు ’అని -రెవస్థ్ ఛొవ్దరీ , ‘మాటలకే పరిమితమయ్యే మిత్రుడెప్పుడు నీ మిత్రుడుగా ఉండలేడు ’ అని లియోటాల్ స్టాయ్, ‘అహంకారి కి మిత్రులుండరు’అని అస్కార్ వైల్డ్[4] తెలిపారు.
పగ, ప్రవర్తనలు, పౌరాణికాంశాలు:
"కొంచెపుఁ బని దాసి నించుక దండింపఁ/ బగబట్టి యది యెన్నిపాట్లు వెట్టె
బలిమినిఁ బట్టి శూర్పణఖ నాసికఁ గోయ/ నది నీకుఁ బిదప నెం తలఁతఁ దెచ్చె
జిన్నతనంబునఁ జెనకి పోఁ దోలిన/ మారీచుఁ డొనరించె మాయ లెన్ని
నిరపరాధుని వాలి నురుశరాహతిఁ గూల్ప/ వానియిల్లా లెంత వగచి తిట్టె
స్వామి వై యేమి యెఱుఁగవు స్వల్పకార్య/ కారణంబున నెన్నెన్ని కతలు పుట్టె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ !/ హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ" (ఆంధనాయక శతకము ప: 72)
ఆంధ్రదేవా! నీ చిన్నతనంలో ఆడుకుంటూ నిన్నెత్తుకున్న పనిమనిషి మంథరను కాలితో తన్నావు అన్న కోప౦తో సమయంకోసం ఎదురుచూసి నీవు పెద్దవాడవైన తర్వాత నీ పట్టాభిషేక సమయంలో కైకేయిద్వారా తన పగను తీర్చుకొని నిన్ను అడవుల పాలు చేసింది. బలవంతంగా ఆనాడు శూర్పణఖ ముక్కుచెవులు కోయిస్తే, ఆ రాక్షసి పగబట్టి తన అన్న రావణుని ఎగద్రోసి ఎన్ని కష్టాలపాలు చేసిందో కదా! విశ్వామిత్రుని యాగ సంరక్షణ సమయంలో మారీచుని చంపక వదిలివేయడంతో వాడు మాయలేడిగా వచ్చి నిన్ను ఎన్ని కష్టాలకు గురి చేశాడో కదా ! నిరపరాధి యైన వాలిని సంహరించినప్పుడు ఆతని ఇల్లాలు బాధలో నిన్ను ఎన్ని మాటలందో కదా! నీవు ప్రభువువై ఉండి కూడ తెలియనట్లు ప్రవర్తించావు. అందుకే చిన్నచిన్న కార్య కారణాల మూలంగా ఎన్నెన్ని కథలు పుట్టాయో కదా!
• కొంచెపుఁ బని దాసి నించుక దండింపఁ/ బగబట్టి యది యెన్నిపాట్లు వెట్టె
= జానపద రామాయణంలో చిన్నప్పుడు వంకర కాళ్లమీద రాముడు చిన్న కర్రపుళ్లతో కొట్టాడట. పగవల్ల అడవుల పాలు: మంథర
• బలిమినిఁ బట్టి శూర్పణఖ నాసికఁ గోయ/ నది నీకుఁ బిదప నెం తలఁతఁ దెచ్చె
= ఆడదానికి అవమానం చేయడంలో దిట్ట: ఆమె అన్న రావణుడి దగ్గరికి వెళ్ళి నీ విషయం చెప్పింది
• జిన్నతనంబునఁ జెనకి పోఁ దోలిన/ మారీచుఁ డొనరించె మాయ లెన్ని
= మారీచుడిని విశ్వామిత్ర యాగంలో వధ చేయక వదలడం: సీతాపహరణ
• నిరపరాధుని వాలి నురుశరాహతిఁ గూల్ప/ వానియిల్లా లెంత వగచి తిట్టె
= కారణం అడిగింది: రాజుగా తన ధర్మాన్ని నిర్వహించడం: తమ్ముడికి ఇవ్వాల్సిన విషయంలో మాట తప్పడం
• స్వామి వై యేమి యెఱుఁగవు స్వల్పకార్య/ కారణంబున నెన్నెన్ని కతలు పుట్టె
= స్వల్ప కార్యం- శబరి ఎంగిలి. కానీ ఆమెను మెచ్చుకున్నావు. ఉడుతనుకూడా.
చిన్న తప్పు చేసినా పెద్దకుటుంబంలోని వాళ్ళను గుర్తుంచుకుని వారికి అపకారం చేసే వాళ్ళు ఉంటారు. అలానే చిన్న వల్ల విషయంలో పెద్దవాళ్ళు కూడా. అందుకే అపకారం చేయకుండా ఉండాలి. అపుడే మనకు అందరూ మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది.
శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లు తిన్న దాక్షిణ్యంతో తిన్నాడు. కుబ్జ అందించిన గంధాన్ని కరుణతో తీసుకున్నాడు. పాంచాలి వేడుకోగా దయావేణువుని ఊదాడు. గోపమ్మ చనుబాలు తాగిన కృపా గుణం కలవాడు. మాలికుడిచ్చిన పూల దండల్ని దాల్చిన ప్రేమ, పేద బ్రాహ్మణుడు చింకి ఉత్తరీయంలో ముక్కిన అటుకులు కట్టుకు వచ్చిన తీసుకున్న నీ ఆత్మీయత, అమాయకత్వంతో పాదాల్ని కడగటానికి వచ్చిన వాడికి నువ్విచ్చిన చనువు(గుహుడు), ఉడుత సాయానికి అందించిన ప్రేమ, వీటన్నిటినీ ఒక్కసారి తల్చుకొని నా ఉడుతా భక్తినంగీకరించి, వచ్చి రాని మాటలతో కొడుకున్ తండ్రి ఆదరించినట్లు అర్భకుడైన నన్ను నా శతకాన్ని స్వీకరించు, అంకితం తీసుకో అంటూ ఆంధ్ర నాయకుడికి అంకితం చేసిన అశేష శేముషి, కృషీవలుడు కాసుల పురుషోత్తముడు.
సింహావలోకనం:
మాటలాడే ఒడుపు. మన్నించమనే సమయస్ఫూర్తి. పదాలలో ఒంపు సొంపులు రామాయణ భారత భాగవతాల పాండిత్యాల కలబోత, స్వప్రాంతాభిమానం, భక్తి పారవశ్యం, భక్తుడ్ని ముక్తిడుగా చేయమనే భగవత్ సాక్షాత్కారం వెరసి ఆంధ్రనాయక శతకం.
మనిషి మనీషిగా మారుతూ వ్యక్తిత్వాన్ని సంతరించుకొనే దశలో సేవకుడిగా కర్తవ్య నిర్దేశనం చేసుకుంటూ యుక్తాయుక్త విచక్షణ మరవకుండా భక్తి శిక్తమైన సేవా సాక్షాత్కారాన్ని భగవంతుడి పేరుతో కోరుకునే అదృష్టవంతుడు కేవల నామామాత్రమైన కాసుల వారు.
ఆధారాలు:
1. పాండురంగారావు, ఇలపావులూరి: రామాయణ పరమార్థం:1999, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ.
2. పౌలా రిచ్మన్: అనేక రామాయణాలు: తెలుగు అనువాదం:2018: పి. సత్యవతి: హైదరబాద్ బుక్ హౌస్. హైదరాబాదు.
3. పురుషోత్తమకవి, కాసుల: ఆంధ్రనాయక శతకము: పాతకమిత్ర వ్యాఖ్య: 2020: శ్రీనివాస్, అద్దంకి: ఎస్ ఆర్ పబ్లికేషన్స్, విజయవాడ.
4. గర్గలాలు: శ్రీనృసింహ పంచవింశతి:1845: తేజస్విని వ్యాఖ్య 2016: ముత్తెవి రవిప్రసాద్: అంతర్జాలం mutteviraviprasad.blogspot.com
5. సీతారామాచార్యులు, బహుజన పల్లి: శబ్దరత్నాకరము: 2009: ఆసియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, న్యూ ఢిల్లీ.
6. Naravane, M.S.:2014: Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation.
7. Siva Rao, D.V.: The British Rule in India: 1938: ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షర శాల, బెజవాడ.
No comments:
Post a Comment