-డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు,
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,
నూజివీడు ప్రాంగణం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విద్యుల్లేఖ: seethuphd@gmail.com
సంచారవాణి: 9951171299
తెలుగును ఆధునికం చేయాలన్నది ఎప్పటినుంచో వింటున్న మాట. ఎవరు ముందుకు వస్తారు? వారికి ఉండే అవకాశాలే౦టి? దానివల్ల ఎలాంటి మార్కెట్ ఉంది? లాంటి సవాలక్ష ప్రశ్నలకు ఒకటే సమాధానం. తెలుగువాళ్లు సాంకేతికతను పుణికిపుచ్చుకొని కథలు సృజించి కొత్తగా దృశ్య కావ్యాలు రాయడం, వేర్వేరు భాషలనుంచి తమ భాషకు మార్చుకోవడం లాంటివి అవసరం. ఇదే ప్రస్తుతం డాలర్లు కురిపిస్తున్న అంశం. ఉపాదికి అవకాశమూనూ.
యానిమేషన్,క్యారికేచర్ లాంటి వాణిజ్య వృత్తి పరమైన ప్రత్యేక కోర్సుల్ని విశ్వవిద్యాలయ స్థాయిలో అన్ని రకాల వారి కోసం ప్రవేశ పెట్టాలి. ఇక్కడ ఒక సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కువమంది తెలుగులో టెక్నికల్ వాళ్లు తెలుగును పట్టించుకోకపోవడం. తెలుగు వచ్చిన వాళ్ళకి టెక్నాలజీని వంటపట్టించుకోకపోవడం. ఈ రెంటినీ విద్యావ్యవస్థలు సమన్వయం చేయాలి. ప్రస్తుతం రాబోతున్న నూత్న విద్యావిధానం(2020జూలై 29 తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది)ద్వారా ఇలాంటిఅవకాశాలు పుష్కలంగాఉపయోగించుకోవచ్చు.
ఈ వ్యాసంలో నాలుగు రకాల సాంకేతిక అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 1. యానిమేషన్ రంగం, 2. OCR, 3. టైపింగ్ 4. అనువాదం.
1. యానిమేషన్ రంగం :
యానిమేషన్ అనే పదానికి సంచాలనం,జీవ౦ కలగచేయడ౦ అని అర్థం. యానిమేషన్ అంటే భ్రాంతిని సృష్టించే సాంకేతిక కళ. ఫ్లిప్ బుక్ ను వేగంగా తెరిస్తే లోపల ఉండే బొమ్మ కదిలినట్లు కనిపిస్తుంది. ఇందులో యానిమేటర్ వేసిన చిత్రాలను వరసగా చూస్తే ఆ బొమ్మ కదిలేలా ఉంటుంది. ఒక్కో బొమ్మ కదలిక కోసం కనీసం 12 చిత్రాలను వేయాల్సి ఉంటుంది.
టెక్నికల్, నాన్ టెక్నికల్ అనే రెండు విభాగాలుంటై. నాన్ టెక్నికల్ ఎలాంటి విద్యార్హతలు లేకుండా యానిమేషన్ రంగంలో స్థిరపడవచ్చు. B.Sc., గేమింగ్, యానిమేషన్ & గేమింగ్, ఇలా చాలా రకాల సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నై.
గేమ్ టెస్టర్ గా ఉంటే గేమ్స్ టు విన్ లాంటి సంస్థలు ఉంటై. EA (ElectronicArts)ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. ఇవి కూడా యానిమేషన్ లో మరో రంగం.
యానిమేషన్ సాధారణంగా ఐదు రకాలు. ప్రాచీన పద్ధతి, 2D, 3D, మోషన్ గ్రాఫిక్స్, స్టాప్ మోషన్. ఇక్కడ D అంటే డైమెన్షన్స్ అని అర్థం. మంచి యానిమేషన్ చేయాలంతే ముందుగా సృజనాత్మక శక్తి ఉండాలి. "Theillusionoflife" అనే పుస్తకంలో OllieJohnston&FrankThomasలు 12 రకాల సూత్రాలను ఇందులో చర్చించారు. ఇవన్నీ ప్రాథమికమైన సాంకేతికాంశాలే.
టామ్ & జెర్రీ లాంటి మాటలు లేకుండా తార్కిక కథలు లాంటివెన్నో ఉన్నై. ఇలాంటివి తెలుగులో తీసుకురావడానికి కథల్ని సృష్టించిగాని, ఉన్న కథల్ని విభిన్నంగా కొత్తగా సాంకేతికను ఉపయోగించి ఎక్కువమందికి అందించవచ్చు. చిట్టి చిలకమ్మనుంచి ఎన్నో అభినయగేయాలు యానిమేషన్ ద్వారా అందుబాటులోకి వస్తూనే ఉన్నై. ఇంజనీరింగ్, వైద్య౦ లాంటి విద్యల్లో దీని అవసరం చాలా ఉంది. ఇందులో మాటలు భాషకు సంబంధించినవైతే ఆ బొమ్మల కదలికలు హావభావాలు సాంకేతిక రంగ సహాయంతో కదిలేలా చేయాలి. పంచతంత్రం, భట్టి విక్రమార్క కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు లాంటివి, నీతిని బోధించడానికి ఈ సాంకేతికతను తెలుగుకు అనుసంధానించడం ద్వారా గ్రహించవచ్చు.
చిత్రం లేదా అక్షర నిర్మాణకర్త(characters constructor) ఆధారంగా కొన్ని చిత్రాల్ని , దాని విడివిడి భాగాలను తీసుకొని దానికి మోషన్ టెక్నాలజీని వాడి ఒక్కో అవయవాన్ని యానిమేట్ చేయవచ్చు. పవర్ పాయింట్ లాంటి చాలా వాటిల్లోనూ వాడొచ్చు.
ఏ భాగాన్ని కదిలించాలో దాన్ని అడోబ్ పేజ్ మేకర్ లో మోషన్ ద్వారా ఒక్కో స్లయిడ్ ఒక్కో ఆప్షనల్ ఎంపిక ద్వారా వాడిన తర్వాత వాయిస్ ఇచ్చి, రెండూ ఒకేసారి ఆ అవయవాల కదలికలను అనుసరించి ఇస్తే అది సహజంగా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది.
2. OCR: (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్)
ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది స్కాన్ చేసిన డాక్యుమెంట్, డాక్యుమెంట్ ఫోటో, సీన్-ఫోటో/ సబ్‌టైటిల్ టెక్స్ట్ నుండి టైప్ చేసిన, చేతితో రాసిన లేదా ముద్రించిన వచనాన్ని మెషీన్-ఎన్‌కోడ్ చేసిన వచనంగా ఎలక్ట్రానిక్ /యాంత్రికంగా మార్చడం, ఒక చిత్రం.ఇది డిజిటల్ ఇమేజ్‌లో వచనాన్ని గుర్తించే సాంకేతికత. స్కాన్ చేసిన పత్రాలు,చిత్రాలలో వచనాన్ని గుర్తించడానికి ఇది సాధారణంగా ఉపయోగిస్తారు. OCR సాఫ్వేర్ భౌతిక కాగితపు పత్రాన్ని / చిత్రాన్ని టెక్స్ట్ తో యాక్సెస్ చేయగల ఎలక్ట్రానిక్ వెర్షన్‌గా మార్చడానికి ఉపయోగించవచ్చు.
దీని ద్వారా విభిన్న అక్షరాలను స్కాన్ చేసి వాటిని యూనీకోడ్ ఫార్మాట్, వర్డ్,excel, .txt లోకి మార్చుకోవచ్చు.
ఇందులో స్కాన్ చేసిన కాఫీని కంప్యూటర్ తీసుకొని outputగా ఆ అంశాన్ని టెక్ట్స్ గా ఇచ్చింది. ఇలా చిన్న చిన్న పదాలను గుర్తిస్తూ డాక్యుమెంట్ చేయడానికి సహకరిస్తుంది.
OCR లోని అంశాలుగా మూడు రకాల విభజించవచ్చు. (i) తెలుగు అక్షరాల డేటాబేస్, (ii) లోతైన అభ్యాస ఆధారిత OCR అల్గోరిథం (iii) ఆన్‌లైన్ విస్తరణ కోసం క్లయింట్ సర్వర్ పరిష్కారం అల్గోరిథం. (అల్గోరిథం = కొన్ని సమస్యను ఎలా పరిష్కరించాలో పేర్కొనే కచ్చితమైన నియమం)దీనికి తెలుగులో కలన గణితం అనే పదాన్ని గూగుల్ లో వాడారు. దీన్ని వాణిజ్య పరంగా కూడా వాడొచ్చు. దీన్ని ప్రాచీన శాసనాల్లో భాషను తెలుసుకోడానికి కూడా వీలౌతుంది. ఉదా: "అంత" అని ఉండాల్సినది "అంత్త" అని ఉంటోంది. అలాగే కొందరు అని ఉండాల్సిన చోట కొంద్దరు అని ఉన్నాయి. కుంతలి అని ఉండాల్సినచోట కుంత్తలి అని ఉంది.
వలపల గిలక (౯) లాంటి ప్రత్యేక వర్ణాలు౦డేవి.జలక మార్చెను అని ఉండాల్సిన చోట జకలమాచె౯ ను అని ఉంది.
Googlelanceapp ద్వారా ప్లేస్టోర్ లో కూడా ఇలాంటి స్కాన్ చేసే యాప్ ఉంది. సమాచారాన్ని స్కాన్ చేసేటప్పుడు 'ఱ, క్ష, ర్మ లాంటి కొన్ని ఒత్తు అక్షరాల విషయంలోను, విసర్గ, అరసున్న లాంటి అంశాల్లోనూ తప్పుగా గ్రహించడం కనిపిస్తోంది. దీనిపై ఇంకా విశేషమైన పరిశోధన జరిగి అందుబాటులోకి రావాల్సి ఉంది.
3. టైపింగ్: ప్రస్తుతం ఎవరైన కంప్యూటర్, లేదా ల్యాప్ టాప్ లలో ఏ వేళ్ళతో ఏ అక్షరాన్ని నొక్కాలో తెలుసుకోడవ౦ టైపింగ్ లో భాగం. ఇలా టైప్ చేస్తేనే వేగవంతంగా టైప్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ టైపింగ్ వర్డ్, లేదా టెక్స్ట్ లలో చేయడానికి Microsoft Indic Language Input Tool for Telugu 1.0ను ఎంపిక చేసుకొని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేస్తే tool బార్ మీద TEఅ/EN లాంటి ఐకాన్ లు వస్తాయి. వర్డ్ ఫైల్ తెరచి, తర్వాత ఈ ఐకాన్ లో TEఅను ఎంపిక చేసుకొని అక్కడనుంచి ఆంగ్లంలో ఉన్న ఫొనిటిక్స్ అనుసరించి ఆంగ్లంలో టైప్ చేసిన తెలుగు అక్షరాలు టైప్ లో వస్తాయి. దీనిలో బారహ్ టైపింగ్ టూల్ లాంటివి చాలా ఉన్నై. దీనికి ఖతులు ప్రధానం.
3.1. ఖతులు(fonts):తెలుగుకు సహకరించే ఫాంట్స్ చాలా ఉన్నై. వీటిలో ఒకదానికి మరొకటి అనుసంధానం చేసుకోవలసిన అవసరం ఉంది. వీటిని తెలుగు విజయం డాట్ కామ్ లో ఉచితంగా పొందొచ్చు. ఇప్పటికీ కంప్యూటర్ లో ఇన్ బిల్ట్ గా తెలుగు ఫాంట్స్ రావడం లేదు. వాటికి యాప్స్ వేసుకోవడం, లేదా చిన్న చిన్న టూల్స్ ఇన్స్టాల్ చేసి వాడుకోవలసి వస్తోంది. ప్రస్తుతం ఈ ఫాంట్స్ అన్నిటిని అనుసంధానం చేస్తూ యూనీకోడ్ ఫాంట్స్ తీసుకువచ్చారు. దీని ద్వారా ఒక ఫాంట్ నుంచి మరో ఫాంట్ కు డేటాను మార్చుకోవచ్చు. అయితే కొన్ని ఖతులు అన్ని తెలుగు అక్షరాలకు సపోర్ట్ చేయడం లేదు.
3.2. స్వరం ద్వారా టైపింగ్: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో వాయిస్ టైపింగ్ టూల్ ద్వారా సరైన ఉచ్చారణచేస్తూ అక్షరాలను టైప్ చేసే సాంకేతికత అందుబాటులో ఉంది. దీని ద్వారా టైప్ చేయడం రానివాళ్ళకు, విలేకర్లకు , విద్యార్థులు మొదలైనవాళ్ళకు సహకారాన్నిస్తోంది. దీనిలో వ్యంగ్యం, కాకువు లాంటివి గుర్తించడం లేదు.
3.3. ప్రింటింగ్: దీనిలో పేజ్ మేకర్, పిడియఫ్ ప్రింట్ లను వాడతారు. దీనివల్ల పుస్తకంలో పేజీలు సరైన విధంగా రావడానికి ఇది సహకరిస్తుంది. వార్తా పత్రికల్లో, పుస్తక ముద్రణలో విభిన్న రకాల ఫాంట్స్ వాడుతున్నారు. దీనికి అంతరూ యూనీకోడ్ వాడితే ఏ ఫాంట్ అయిన దానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది.
4. అనువాద రంగంలో సాంకేతిక అవసరం:
అనువాదం ప్రస్తుతం వరకు బాగా స్థిరపడడానికి ఒక అవకాశంగా చెప్పొచ్చు. దీనికి కృతిమ మేథస్సు(artificialintelligence) అవసరమౌతోంది.
పదబంధాలు, జాతీయాలు, సామెతలు లాంటి అంశాల్లో అనువాదం చేయలేక పోతోంది. దీనికి కారణం సరైన డేటాబేస్, కంపైలర్ ను తయారు చేయలేకపోవడమే. ఇందులో ప్రధానమైనది యంత్రానువాదం.
ఇక్కడ కంపైలర్ చాలా కీలకం. ఇతర వనరుల నుండి సేకరించిన సమాచారం/వ్రాతపూర్వక విషయాల్ని సమీకరించడం ద్వారా జాబితా/ డేటాను తయారుచేసేది. దీన్ని ఆధారంగానే విభిన్న రకాల ఉదాహరణలు, సందర్భాలను ఇచ్చి అనువాదం చేయడానికి ఇది సహకరిస్తుంది.
బైనరీకోడ్ లోకి మార్చుకొని వ్యాఖ్యాతగా output ఇస్తుంది. ఇది అనువాదానికి సహకారి. ఇందులో కచ్చితమైన డేటా బేస్ ను కంప్యూటర్ కి ఇచ్చి ప్రోగ్రామ్ తయారు చేయాలి. వచ్చిన డేటాను సరైనదో కదా సరిచూసుకోవాలి. దీనికి యంత్రానువాదం (మిషన్ లెర్నింగ్) చాలా అవసరం. ఇందులో విభిన్న రకాల టూల్స్ ఉదా: గుణింత పరిష్కరిణి(స్పెల్ చెక్కర్), లిపి పరివర్తని(script converter), పద విశ్లేషణి(morphologicalanalyzer), వాక్య విశ్లేషణి (sentencepanser), సంధి విచ్ఛేదకం(sandhisplitter)లాంటివి విభిన్న రకాల నిర్మాణంలో సహకరిస్తాయి.
చలన చిత్ర రంగంలో ఏదైనా ఒక భాషలో తీసిన చిత్రానికి సబ్ టైటిల్స్ ఇస్తూ మూవ్ చేయడానికి వేగవంతంగా ఈ అనువాదం ఉపకరిస్తోంది. దీనివల్ల ఏ భాషా చలన చిత్రమైన మనకు కావల్సిన భాషలోకి దాన్ని అనువాదం చేసుకోవచ్చు. 1. గూగుల్ ట్రాన్స్ లేటర్, 2. Linguee, 3. SDL Trados Studio, 4. WordFast Pro ఇలా 50 వరకూ అనువాదానికి సంబంధించిన టూల్స్ అంతర్జాలంలో ఉన్నై. ఇవి సామాన్య వాక్యాన్ని సులువుగా అనువాదం చేస్తున్నాయి. పదబంధాలు, జాతీయాలు, సామెతలు,కాకువు(tone), మాండలికాలు లాంటివి 60 శాతం వరకు మాత్రమే అనువాదం చేస్తున్నాయ్.
అవగాహన:
మాతృ భాష, భాషలు సులువు అంటారు. ఎలా? ఒక గణిత అంశం, ఒక భాషాంశం ఆధారంగా చూద్దాం. ఒక లెక్క ఇచ్చి దాన్ని పరిష్కరించమంటే - మొదటగా ఆ ఫలితాన్ని "x" అనుకో... అంటూ మొదలు పెట్టి చాలా రకలగా స్టెప్స్ వేసి చివరకు ∴x= సమాధానం. అదే భాషలు అయితే ఉదా: ఆమె ముఖం చంద్రబింబం. ఆమె ఎలా ఉంటుందో తెలియకపోయినా చంద్రబింబం పోలిక వల్ల గుండ్రని, తెల్లగా లాంటి అంశాలను వేగంగా గుర్తించవచ్చు. వినికిడి కూడా వేగంగా ఉంటుంది. మాతృ భాష అంటే భాషను నేర్చుకుంటున్నాము అనే స్పృహ లేకుండా నేర్చుకున్న భాష. ఇలా ప్రాథమిక అంశాలను తెలుసుకోవాలి. సాంకేతికతతో మరింతగా భాషల్ని వృద్ధిలోకి భాషను తేవాలి, వాడుకోవాలి.
ఆధునికీకరణకోసం చేయాల్సిన సాధారణ పనులు
ఏటియం లలో తెలుగును ఎంపిక చేసుకొని లావాదేవీలు చేయడం, అంతర్జాలలో తెలుగును ఎక్కువగా వాడటం. దానికి యూనీకోడ్ ఫాంట్ అనుకూలం. సంచారవాణి(మొబైల్స్)లో తెలుగును వాడటం, ఎంత వీలైతే అంత, ఎన్నిచోట్ల అవకాశం ఉంటే అన్ని చోట్ల తెలుగును ఎక్కువమంది చాలాసార్లు వాడుతూ ఉండాలి. విభిన్న రకాల ఎథికల్ హకర్స్, వివిధ రకాల కంప్యూటర్ డేటాకు సంబంధించిన సంస్థలు ఆ డేటాను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాయి. ఇలా చేయడం ద్వారా అవి తెలుగు వాడకం దారులు ఎక్కువమంది ఉన్నారన్న విషయాన్ని సాంకేతిక ఆధారాలతో గుర్తిస్తాయి. అలా తెలుగు మరింత అభివృద్ధి పథ౦లోకి తీసుకెళ్లవచ్చు.
అవకాశాలు: యానిమేషన్ రంగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవాన్ని సంపాదిస్తే 4 లక్షల నుంచి 8 లక్షల వరకు జీతాన్ని పొందవచ్చు. దీనికి కావల్సినదంతా నైపుణ్యం, కొన్ని సంస్థలకు యానిమేషన్ రంగంలో డిగ్రీ సర్టిఫికెట్స్ అవసరమౌతాయి.
OCR విషయానికి వస్తే దీనిమీద పరిశోధనలు వస్తున్నా లిపి సంబంధి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి సరైన ప్రోగ్రామ్స్ రాసి కారెక్టర్ ను గుర్తించవలసిన స్థితి వరకు కంప్యూటర్ కు తగిన డేటా బేస్ ను అందించాలి. దానికి కావలసిన విభిన్న రకాల అక్షరాలు, తాళపత్ర గ్రంథాలు మొదలైనవి అవసరం. కొన్ని గ్రంథాలయాల్లో వీటిని ప్రత్యేకంగా భద్రపరిచారు. వాటి పరిశీలన అవశ్యకర్తవ్యం.
ఖతుల విషయంలో ఏకరూపత(uniformity) వచ్చేలా అంతర్నిర్మిత(inbuilt) విధానాన్ని పూర్తిగా అనుసరిస్తే ప్రయోజనం ఉంటుంది.
అనువాదవిషయంలో ఇంతవరకు నోబెల్ కు నామినేట్ అయిన తెలుగు పుస్తకం ఆధునిక మహాభారతం. దీన్ని గుంటూరు శేషేంద్ర శర్మ సృజించారు. ఇలాంటివి ఎన్నో తెలుగు భాషకు, తెలుగునుంచి వివిధ రకాల భాషలలో అనువాదాలు చేస్తే ఆర్థికంగా కూడా దీనిలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది.
దీనిపై విస్తృతంగా ప్రొజెక్టులు, పరిశోధనలు పూర్తిచేసి తెలుగును సాంకేతికంగా వృద్ధి చేయడంతో పాటు ఉపాది అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ఇలా తెలుగుకు సాంకేతిక సహకారం కొలువులకు నెలవుగా మారుతుంది.
No comments:
Post a Comment