Tuesday, May 30, 2023

పోతన కందాల అందాలు- విశ్లేషణ

 

- డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేత విశ్వవిద్యాలయం,

నూజివీడు ప్రాంగణం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

సంచారవాణి: 9951171299.

            పోతన శ్రీ కైవల్యం కోసం భాగవత రచన చేశారు. తను నిమిత్త మాత్రుడుగా కర్మ సాక్షిగా ఉండడం మరో లక్షణం. ప్రతి చోట అనుకూల దృక్పథాన్ని కలిగిఉండడం లాంటి చాలా అంశాలను పోతన కందాల్లో మనం చూడొచ్చు. పద్య నిర్మాణంలో చిన్న వాక్య ప్రతిపాదన, ఎదుటివారిని ఒప్పించి, మెప్పించే దిశ, ఎక్కడ అహంకారం కనిపించకుండా కవిత్వీకరించడం లాంటి ఎన్నో అంశాలను పోతన భాగవతంలో చూడొచ్చు. కందపద్యాల భక్తి రసమక౦దంగా చేసి, పోతన కందాలలో అందాలను ఇమిడ్చారు. భాగవతంలో మొత్తం గద్య పద్యాలు 9,014 ఉంటే, అందులో 2,624 కంద పద్యాలు.  పోతన కందాలు రసకందాలుగా చేసిన కొన్ని పద్యాలను విశ్లేషణ చేయడమే ఈ వ్యాస ఉద్దేశం.

            పలికెడిది భాగవతమఁట!, పలికించెడి వాడు రామభద్రుండఁట! నేఁ

            బలికిన భవహర మగునఁ ట!, పలికెద వేఱొండు గాథ పలుకఁగ నేలా?(1-18)

  ఆహా! ఏమి నా అదృష్టం. పలికేది పరమపవిత్రమైన భాగవతమా! పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన రామభద్రుడా! పలికినందువల్ల భవబంధాలు పరిహారమౌతాయా! అటువంటప్పుడు వృథాగా మరో కథ పలకటం దేనికి? భాగవతమే పలుకుతాను. ఇక్కడ అట అనడంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని తత్త్వాన్ని సూచిస్తున్నారు. మూడుసార్లు ఆశ్చర్యార్థకాలు ప్రయోగిస్తూ, వేరొకరిని పాకడం ఎందుకు అని హేతువు ఆధారంగా భగవంతుని దర్శనాన్ని సూచించడం విశేషం.          కొందఱకు దెనుగు  గుణమగు, గొందఱకును సంస్కృతంబు గుణమగు, రెండు౦

            గొందఱికి గుణములగు నే, నందఱ  మెప్పింతు గృతుల నయ్యైయెడలన్.  (1-20)

  ఇక భాష విషయ మంటారా! కొందరు తెనుగంటే ఇష్టపడతారు. కొందరు సంస్కృతమంటే చెవి కోసుకుంటారు. మరి కొందరు తెనుగునూ సంస్కృతాన్ని సమానంగా అభిమానిస్తారు. నేను నా గ్రంథాన్ని అందరూ ఆనందించి మెచ్చుకునే విధంగా రచన సాగిస్తాను. ఇక్కడ గుణం అనేటపుడు ఐశ్వర్యాది గుణాలు- ఐశ్వర్య౦, వీర్యం, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం, ఇవి భగవంతుడి షట్ గుణాలు.

శబ్దాది గుణాలు శబ్దం, స్పర్శ, రూప, రస, గంధ. ఇవి ఐదు భూత గుణాలు. సంధ్యాది గుణాలు ఆరు. సంధి, విగ్రహం, యాన౦, ఆసనం, ద్వైధ౦, ఆశ్రయం.

సత్త్వాది గుణాలు- మూడు. సత్త్వం, రజస్సు, తమస్సు వీటికి శక్తులు అనే పేరుంది. కావ్య గుణాలు- శ్లేష, ప్రసాద, మాధుర్యం, సౌకుమార్యం, సమత, అర్థదీపనం, ఔదార్యం, కాంతి, ఓజస్సు, సమాధి.

ఇక్కడ కొందరికి అనడంలో పరోక్షంగా పాల్కురికి సోమన, ప్రత్యక్షంగా తిక్కనగా చెప్పొచ్చు. సంస్కృతం గుణమనడంలో సుదూరంలోని నన్నయ సమీపంగా శ్రీనాథుడు అనిపిస్తారు. ప్రౌఢంగా పలికితే సంస్కృతం అని నుడికరంగా చిలికితే తెలుగుభాష అంటారు. ఇక్కడ తను అందరి అభిప్రాయాల్ని చెప్పినా తన ధర్మం అందరినీ కలుపుకుపోయే వినయం, విశ్వాసం ప్రకటితం. సంస్కృతం గుణం, తెలుగు అచ్చమైన ఆస్వాదనతనం.

             నడవదు  నిలయము వెలువడి, తడవదు పరపురుషు గుణము దనపతి నుదువుం

   గడవదు, వితరణ కరిణలు, విడువదు, లక్కా౦బ విబుధ వసరము వొగడన్.(1-25) 

లక్కమాంబ మహాసాధ్వి. ఆ దొడ్డ యిల్లాలు ఇల్లు వదిలి వెలుపల కాలు పెట్టి ఎరుగదు. ఆమె దాన ధర్మాలకూ, దయాదాక్షిణ్యాలకూ పెట్టింది పేరు. పెద్దల మన్ననల్ని పెద్దగా అందుకున్న ముద్దురాలు. నడవదు, తడవదు, గడవదు, విడువదు అంటూ భార్య పట్ల ఉన్న గాఢమైన అనుబంధాన్ని చెప్పడం విశేషం. స్త్రీని చూసే కోణం విలక్షణం. ముందు క్రియను చెప్పి తర్వాత విశేషాలు లేదా సమాచారం చెప్పడంలో ఉచితజ్ఞతను తెలుపుతుంది. ఇక్కడ వ్యతిరేక అర్థాలు వచ్చినట్లు క్రియాపదాలు వాడి అనుకూలంగా చెప్పడం విశేషం.  

            ఆ మానినికిం బుట్టితి, మే మిరువుర మగ్రజాతుఁ డీశ్వరసేవా

            కాముఁడు తిప్పన; పోతన, నామవ్యక్తుండ సాధునయ యుక్తుండన్. (1-27)

  ఆమెగారికి మేమిద్దరం కొడుకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన్న; ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి; నా పేరు పూతన్న. పెద్దలు అడుగుజాడల్లో నడుస్తున్న వాణ్ణి. ఇక్కడ తన కుటుంబాన్ని పరిచయం చేస్తూనే పోతన నామవ్యక్తుండ అనడంలో వినయశీలత. నయము అంటే నీతి, పొందించుట, మేలైనది, అనే అర్థాలు ఉన్నాయి. సాధు స్వభావులనుంచి నీతిని, మైలైనది మోక్షాన్ని తెలుసుకున్నాను అని సూచించడం విశేషం. మానిని అని తల్లిగారిని గౌరవించడం ఇతడి సంస్కారానికి చిహ్నం. 

చనిచని ముందట గనుగొనె, ఘన పాప తమః పతంగ గరుణా పాంగన్

గాన దుత్తంగ తరంగన్ , జనవరనుత బహుళ పుణ్య సంగన్ గంగన్ (3-178)

ఈ పద్యంలో క్రియతో ప్రారంభించి విశేష్య విశేషణములను అనుప్రాస గా రచించడం కనిపిస్తుంది. అలా వెళ్ళి వెళ్ళి విదురుడు ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించే గంగానదిని కన్నుల విందుగా కనుగొన్నాడు. ఆ గంగా నది పాపాలనే చీకట్లు సూర్యునిలా పారద్రోలుతుంది. కరుణారసం ప్రసరించే కడగంటి చూపులున్న పెద్దలైన వారు ప్రశంసించే అగణ్య పుణ్యాలకు అలవాలమైంది అంటూ గంగను చెప్పడం, క్రియతో ఆరంభించడం చైతన్యానికి చిహ్నం.  గంగన్ అని పొల్లు తో ముగించడంలో ఆ న కారా పొల్లుకు ఉన్న వంపులు సూచితం.

             గురవులు ప్రియశిష్యులకుం, బరమ రహస్యములు  దెలియ బాలుకుదు రచల

            స్ధిర  కల్యాణం బెయ్యది, పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్. (1-42)

గురువులైనవారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులు ఎన్నో బోధిస్తారు. ఈ లోకంలో మానవులకు శాశ్వతమైన కల్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు అని గురువుల పట్ల మాట్లాడే ధోరణిని ఇక్కడ సూచిస్తారు. శిష్యుడు అనే మాట సార్థకం. విద్యకోసం గురువు దగ్గరచేరి సేవ చేస్తూ శిక్షణ పొందేవాడు. గురుముఖతః విద్య రాణిస్తుంది ఇది ఆధ్యాత్మికతను సూచించే అంశం. 

            మన్నాఁడవు చిరకాలము, గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్

            విన్నాఁడవు వినఁదగినవి, యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్.(1-43)

మహానుభావులు సాన్నిధ్యంలో బాహుకాలం ఉన్నావు. ఆయా మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు. మను అంటే జీవించు, వర్తించు అని అర్థాలు, వైకృత పదంగా మట్టి, నేల అని అర్థాలు. ఇక్కడ మట్టి చిరకాలం ఉంటుంది. వ్యవసాయంద్వారా సాహిత్య వ్యవసాయం సూచితం. మహానుభావుల దగ్గర మనుట జీవించడం వారి ఆదరణ పొందడం ఈ మట్టి మనిషి చిరకాలంలో చాలా గ్రంథాలు విన్నాడు అని తన క్రమ వికాసాన్ని  తన గొప్పదనంగా కాకుండా పెద్దల అనుగ్రహంగా చెప్పడం పోతన ఔన్నత్యం.

మన్నాడవు, గన్నాడవు, విన్నాడవు, యున్నాడవు లాంటి పదాలు సహజంగా పడ్డాయి. కన్నాడవు అనడంలో మామూలు చూపు అనే అర్థం కాకుండా లోచూపు అనే అర్థం సూచ్యం.అవు అనేది అనుకూలంగా ఉండే దృక్పథాన్ని సూచిస్తుంది. ఇది పోతన తన పట్ల పెద్దలు అనుకూలంగా ఉన్న స్థితిని తెల్పడ౦.

            భూషణములు వాణికి నఘ, శోషణములు మృత్యుచిత్త భీషణములు హృ

            త్తోషణములు కల్యాణ వి, శేషణములు హరి గుణోపచిత భాషణముల్.(1-46)

ఓ మహర్షీ! శ్రీహరి గుణ సంకీర్తనలతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు! సకల పాప పరిహారాలు! మృత్యుదేవతకు భయాంకరాలు! భక్త హృదయాలకు సంతోషకరాలు! నిత్య కల్యాణ కరాలు. అఘం అంటే పాపం. శోషణము అంటే శోషిల్లుట, మన్మథుడి బాణాల్లో ఒకటి. యమకాలంకారం. భూషణములు, శోషణములు, భీషణములు, తోషణములు శేషణములు పదాల విన్యాసం. వీటికి ముందు ఉపసర్గాలద్వారా అర్థ వైవిధ్యాన్ని చూపడం కవిత్వ భాషా సౌందర్యం.    

            కలిదోషనివారకమై, యలఘుయశుల్ వొగడునట్టి హరికథనము ని

            ర్మలగతిఁ గోరెడు పురుషుఁడు, వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు ? మహాత్మా!(1-47)

మహాత్మా! కలికాల దోషాలను పారద్రోలుతూ ప్రసిద్దలైన సత్పురుషులు ప్రశంస లందుకొన్న గోవిందుని కథలు పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు?

కలిదోషానికి గురైనవాడు నలుడు. ఆ బాధను పోగొట్టడానికి భారతంలోని నలచరిత్రను చూపాడు. ఇక్కడ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం మహాపురుషకథాశ్రవణ ఫలాన్ని చెప్పడం.

        

గురు మతి దలపగ ద్రిజగ, ద్గురుడ వనందగిన నీకు గురుడ వనగా నొం

డొరు డెవ్వ డింతయును నీ, కరయంగ విడంబనంబ యగు గాదె హరీ( 10-326)

ఇది కుచేలుడు కృష్ణుడిని ఉద్దేశించి చెప్పిన సందర్భం. కృష్ణా, ఉర్థ్వదృష్టితో చూస్తే ఈ ముల్లోకాలలో జగద్గురువు అనదగిన నీకు వేరొకరెవ్వరైనను గురువు అవగలుగునా. కానీ యిదంతా జూస్తే ఒక విడ్డూరంగా ఉండి అని భావించాడు. ఇందులో స్నేహ ధర్మాన్ని చూపడంతో పాటు, ఇద్దరికీ గురువు ఒకరే. ఇది గురువు అనుగ్రహంగాను చెప్పడం. స్నేహధర్మానికి, గురు ధర్నాన్ని జతచేసి చెప్పడంలో తక్కువ పదాలతో లోకవ్యవహారంలో గురువు స్నేహితుడు అభేద సూచిక.  గుశబ్దం అంధకారాన్నిస్తుంది. "రు"  శబ్దం(తన్నివర్తతే) అంధకారాన్ని నిర్మూలిస్తుంది. అది నీకు అరయము అని ర కార ప్రాస స్థానంలో ప్రయోగించడం స్థిరత్వ అంధకార నిర్మూలన సూచన. "గురువు దీపించు విద్యార్థి గుండె లందు..." విద్యార్థి ర కారం గురుత్వమైన రుగా మారాలి. అదే నరుడు నారాయణుడుగా మారే స్థితికి అనుకూలంగా స్నేహ ధర్మాన్ని చెప్పడం చిన్ని పద్యంలో పెద్దస్నేహాన్ని చెప్పడం విశేషం. దీనికి పేద, బీద, ధనిక, కులం అంతరాలు కావని సందేశం.

గురువులకు గురువై సంపద లిచ్చువాడు శ్రీకృష్ణుడైన నీవే కదాయని పై మాటలలో స్ఫురించుచున్నది. ఆ మాటలువిని ''సమస్త భవాభిజ్ఞుండై''న శ్రీకృష్ణుడు ''నీవు భక్తితో నాకేమి యుపాయనంబు దెచ్చితివి. ఆ పదార్థము కొంచెమైనను బదివేలుగ నంగీకరింతును. భక్తిలేని నీచవర్తనుడు హిమాచల తుల్యమైన పదార్థ మొసంగినను నాకు సమ్మతముగాదు.

ఒకరోజు గురువు సాందీపుడు ఊర్లో లేనపుడు అతని భార్య శ్రీకృష్ణ కుచేలురకు అరణ్య౦లో కెళ్ళి, కట్టెల తెమ్మ౦ది. ఆ సమయంలో అరణ్య౦లో గాలివానలో చిక్కుకొని కదలలేక,  తెల్లవారు సమయ౦లో వారిని వెదకుచు గురువైన సాందీపులు వచ్చి, ''శిష్యులై కష్ట బుల కోర్చి బుణంబు దీర్చుకొంటిరి. మీకు ధన బంధుదార బహుపుత్ర విభూతి జయా యు రున్నతల్‌ సమకూరెడి'' అని దీవించారు. శ్రీకృష్ణడు కుచేలున కీ విషయమును జ్ఞప్తికి తెచ్చి ''నీకు గురు దీవన ఫలించినదా?'' అని ప్రశ్నించెను. శ్రీకృష్ణున కేమో గురుదీవన ప్రకార౦ సకలసంపదలు వచ్చాయని కుచేలుని అభిమతం. శ్రీకృష్ణుని ప్రశ్నకు బదులుగా కుచేలుడు ''సాభిప్రాయంబుగ'' బలికిన పద్యమిది.

            రారా బుధులు! విరక్తులు, గారా! యీ రీతి నడుగగా నేరరు  వి

            స్మేరావాహము భవన్మత, మౌరా! నా విభుని మర్మ మడిగితి వత్సా!(2-80)

కుమారా! ఎందరు పండితులు నిత్యం నా వద్దకు రావడం లేదు వారందరూ విరక్త్తులే కదా! అయినా వాళ్ళెవరు నీలా నన్ను ప్రశ్నించలేదు. నీ యభిప్రాయం నాకెంతో ఆనందాన్నిస్తుంది. ఆశ్చర్యం! నా ప్రభుని మర్మమే అడిగావు. ఇక్కడ బ్రహ్మను నారదుడు ప్రపంచ విధానాన్ని చెప్పమని అడగడం. దానికి రారా, గారా, మేరా, మౌరా లాంటి పదాలను వాడి తన అనుబంధాన్ని సూచించడం విశేషం. "వత్సా" వాత్సల్య సూచితం.  గారా అనే చోట్ల గారభాన్ని, కారా అనే రెండు అంశాల్ని సూచిస్తుంది. ఓరా అనే ఆశ్చర్యాన్ని తెలిపేది. చిన్న కందంలో అనంత ప్రపంచాన్ని, వాత్సల్యాన్ని చూపడంలో అల్పాక్షర అనల్పార్థ రచన.

            క్రోధము దమ తపములకును, బాధకు మగు టెఱిగి దివిజభామలపై న

            మ్మేధాత్మకు లొక యింతము, గ్రోధము దేరైరి సత్త్వగుణయుతు లగుటన్. (2-130)

కోపం తమ తపస్సులకు లోపం కలిగిస్తుందని గ్రహించి సత్త్వ  సంపన్నులూ, బుద్ధిమంతులూ అయిన నరనారాయణులు వాళ్ళమీద ఏ మాత్రం కోపం చూపలేదు. కోపం అంతరంగ శత్రువుగా గుర్తించే రీతిని మానవుడి తెలుసుకోవడం ఇక్కడ ప్రయోజనం.  

కోపం తపస్సును చెరిచింది

            చిత్రముగ భారత లక్ష్మణ, శతృఘ్నుల కార్ధి నగ్రజన్ముం డగుచున్

            ధాత్రిన్ రాముడు  వెలసె బ, విత్రుడు దుష్కృత లతాలవిత్రుం డగుచున్(2-156)

ఆ శ్రీరాముడు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు అన్నగా పుట్టారు. పాపాలనే తీవలను ఛేదించే కొడవలిగా రాముణ్ణి పోలుస్తారు పోతన్న. ఇతను పోతపోసిన అన్న, అతను మనోహరమైన అన్న. ఇవికూడా చిత్రాలే. ఆ రామన్న దుష్కృతాలు పోగొడితే ఈ పోతన్న శ్రీకైవల్యానికి దారి పెట్టారు. ఇలా చిన్న పదాలతో పద్యానిర్మాణాన్ని హృద్యం చేయడం కందాన్ని అందంగా చెప్పగల కవికే తెల్సు.

             కమనీయ రూపరేఖా, రమణీయత జాల నొప్పు రమణీమణి య

              క్కమలాలయ దన మృదు కర, కమలంబుల విభుని పాదకములము లొత్తెన్ (2-232)

రూపరేఖా విలాసాలతో చక్కని చుక్కలాగున్న లక్ష్మీదేవి తన కోమలమైన పాణి పద్మాలతో ప్రాణేశుని పాదపద్మాల్ని ఒత్తుతోంది.

కమలాలయ అనడంలో లక్ష్మి కమలాల ఆలయ౦ కలిగింది. విష్ణుమూర్తి పాదాలను కర(= చేతులు అనే) కమలంబులన్(= పద్మాలతో ఒత్తడం సాభిప్రాయ విశేషణం. పైగా ఇతను గమల గర్భుడు సూచితం. ఆపైన ప్రాణేశుడు. కమల రమ రమణీమణి పాదకములు ఒట్టడంలో ఆమె పతిసేవా తత్త్వాన్ని సూచించడంలో రమణీమణి ఔన్నత్యం సూచితం.   

మ్రింగెడు వాడు విభుండని, మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ, మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో (భాగ. 8.  239)

ఆహా ! గరళాన్ని మ్రింగే వాడు లోకప్రభువైన తన భర్త. మ్రింగేది కాలకూటం. అలా చేయడం వల్ల లోకాలకు మేలవుతుందని తలచి సర్వ శుభప్రదాయిని పార్వతి విషాన్ని తినమని భర్తతో పలికిందిట. అది పోతన దృష్టిలో మాంగల్య బలం, పార్వతి శక్తి రెండూనూ.

ఆ పతివ్రత తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్ముకున్నదో కదా అంటారు. ఇది శివుడిపై ఉన్న భక్త్యాతిశయమే.

అంత కష్టాన్ని లోకహితం కోసం, లోకాలకు శ్రేయస్సు కలిగించటం కోసం భరించాడు. విషపానం చేసే ముందు పార్వతీ దేవితో శివుడు ఇందరి ప్రాణ రక్షణ నా చేతులలో ఉంది. శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం. ఇప్పుడీ హాలాహలాన్ని తియ్యని పండులా ఆరగిస్తానుఅనగా ఆ యిల్లాలు చిరునవ్వుతో అంగీకరించింది. పరోపకార పుణ్యాయ అనే మాటను నిరూపించారు.

            "కర్మమున బుట్టు జంతువు కర్మమునన్ వృద్ధి పొందు, కర్మమున జెడున్

            గర్మమే జనులకు దేవత, కర్మము సుఖదుఃఖములకు కారణ మధిపా"(10-1-88)

సత్త్వ రాజోగుణాలు ఉత్పత్తి సిద్ధి లయ కారణాలు. అందులో రజంబులో జగం జంమిస్తుంది. రజోగుణ ప్రేరణతో మేఘాలు వర్హిస్తాయి. వర్షం వల్ల ప్రజా వృద్ధి. కర్మమే అన్నిటికి మూల కారణం.

"కర్మణ్యేవాధికారస్తే..." అనే గీతా శ్లోకంలో అశక్తత, అసక్తత ఈ రెండూ జీవితంలో బలమైన శక్తులు. ఎప్పడూ అసక్తకి తగులుకుంటామో ఎక్కడో ఒక చోట దాన్ని మనం, అశక్త రూపంలో కూడా దాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇది జీవన సత్యం.

కథలోకి వెళ్తే అంబరీషుడు సర్వ కర్మలు విష్ణుదత్తంతో చేయడంవల్ల నిష్కామ కర్మయోగిగా కనబడతాడు. పోతన ఆ భావాల్ని పుణికి పుచ్చుకున్నారు.

 

            నరలోక విడంబనమున,హరి పరమపరుండు మానవాకృతితో ని

            ద్దర బుట్టి యాత్మమాయా, స్ఫురణన్  మోహింప జేయు భూజనకోటిన్ (3-68) పరాత్పరుడైన హరి లీలామానవుడై ఈ లోకంలో పుట్టి తన మాయాప్రభావంతో మానవుల నందరీని వ్యామోహంలో ముంచు తున్నాడు.

            పురుషుడు దవిలి చతుర్విధ, పురుషార్ధశ్రేయ మాత్మ బొందెద ననినన్

        ధరత్ప్రాప్తికి హేతువు, హరిపదయుగలంబు దక్క నన్యము గలదే?(4-244)

ధర్మార్ధ కామ మోక్షలు అనే నాలుగు విధాలైన పురుషార్ధాలను పొందాలి అని అనుకునేవాడు హరి పాదపద్మాలను సేవించాలి. అంతే తప్ప మరొక మార్గం లేదు.

 

            శ్రుత ధన కుల కర్మల సము,న్నత మదములు జేసి సజ్జన ప్రతతికి సం

            తతమును నెగ్గొనరించు కు , మతు లర్ధిం జేయు పూజ మతి గొన డెందున్. (4-961)

విద్యా ధన కుల కర్మల వల్ల మదించి సజ్జనులకు కీడు చేసే దుర్జనుల పూజను ఆయన స్వీకరింపడు.

 

            నీ దిక్కు గనివారికి, నే దిక్కును వెదక నుండ డిహపరములకున్

    మోదింప దలచువారికి, నీ దిక్కే దిక్కుసుమ్ము!నీరజనాభా!(6-340)

నీ దిక్కు చూచి నీవే దిక్కని మ్రొక్కని వారికి ఈ ప్రపంచంలో ఏ దిక్కూ లేదు. ఇహపరాలలో కూడా వారు దిక్కుమాలిన వారే. ఓ కమలనాభా! లోకంలో సురక్షితంగా ఉండి సుఖపడాలనుకొనే వారికి  నీ దిక్కే సరైన దిక్కు.

 

గుణనిధి యగు ప్రహ్లాదుని, గుణము లనేకములు గలవు గురుకాలమునన్

      గణుతింప నశక్యంబులు,  ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్. (7-120)

ప్రహ్లాదుడు సుగుణాలకు నిధివంటివాడు. అతని గుణాలు గురించి ఎంతచెప్పినా సమయం సరిపోదు. ఆ గుణాలన్నీ వర్ణి౦చాలంటే సాక్షాత్తు ఆ ఆదిశేషునికైనా, దేవతల గురువైన బృహస్పతి కైనా, భారతీదేవి భర్త అయిన బ్రహ్మకైనా సాధ్యం కాదు.

ఏ పగిది వారు సెప్పిన, నా పగిదిం జదువు గాని యట్టి ట్టని యా

క్షేపింపడు, తా నన్నియు, రూపించిన మిథ్యాలని నీరూఢ మనీషన్ (7-135)

గురువులు చెప్పినవన్నీ శ్రద్ధగా విని అర్థం చేసుకున్నాడు. వారు ఏ విధంగా చెప్తే ప్రహ్లాదుడు ఆ విధంగానే చదివేవాడు. అంతేకాని, అలాకాదు ఇలా అని ఎప్పుడు గురువులకు ఎదురు చెప్పేవాడు కాదు. తనకు ఇష్టం లేనివి గురువు బోధించినా ఈ విద్యలన్నీ అసత్యాలని, భ్రమలని తెలిసినా కూడా ఆక్షేపించేవాడు కాదు వారు చెప్పినట్లు విని చదువుకున్నాడు.

గురుత్వం గురుత్వమే. గురువును అవమానించకూడదు అనే విషయాన్ని చెప్తూ వారి స్థితిని ఏమీ చేయలేని అసమర్థతను సూచిస్తున్నాడు. నేటి గురువుల పరిస్థితి ప్రవేటు విద్యావ్యవస్థ, కార్పొరేట్ లోకి వచ్చాక విద్యా వ్యవస్థ అవస్థల స్థాయికి దిగజారిందనవచ్చు.

            చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్ధ ముఖ్యశాస్త్రంబులు నే

            జదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల జడివితి దండ్రీ!(7-166)

నాన్న గారూ! నన్ను గురువులు చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం ఇంకా చాలా శాస్త్రాలు చదివాను.  ముఖ్యమైన 

గొప్ప శాస్త్రాలు అన్నీ చదివి, అన్నీ చదువులలోని సారమునూ, రహాస్యమునూ తెలుసుకొన్నాను.

 

            దమయము, శౌచము, దపమును, మార్ధవము, గృపయు , సత్యజ్ఞాన

             క్షమలును, హరిభక్తియు , ,ర్షము నిజలక్షణాలు లగ్రజాతికి నధిఫా!(7-412)

బహిరిందరియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, మృదు స్వభావం, శుచిత్వం , తపం, దయ, సత్యం, జ్ఞానం, క్షమ, హరిభక్తి, హర్షం ఇవి విప్రుల ముఖ్య లక్షణాలు. ఇవి కలిగిన వారికి భగవత్ కృప సిద్ధించేలా సూచన చేయడం గమనించాలి.

             జయము లపజయములు సంపద లాపద, లనిల చాలిత దీపికాంచ్చములు

           చంద్రకళలు మేఘచయములు దరగలు మెఱుగు లమరవర్య! మిట్టిపడకు.(8-354)

అమరేంద్రా! జయాపజయములూ, సంపదలూ, అపదలూ శాశ్వతాలు కావు. అవి గాలిలో కదలే దీపాలు. చంద్రకళలు.  మేఘమాలికలు. నీటి తరగలు. మెరుపు తీగలు. అందువల్ల విర్రవీగవద్దు. స్థితప్రజ్ఞతను సూచించడం ఇందులో మర్మం. చంచలమైన మనసును భగవత్ సన్నిహితంగా చేర్చడం సూచన.  

"నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదె"(భాగ. 10-1-1268)

            కంస వధ సందర్భంలో మధురకు వెళ్ళిన బలరామ కృష్ణులకు మాలికుడు దండనిచ్చినపుడు నీకేం వారం కావాలని కృష్ణుడు అడుగుతాడు. దానికి సమాధానంగా పోతన స్వీయ భావాన్ని జత చేసినట్లు అనిపిస్తుంది. భగవ౦తునికి భక్తితో పాటు భూత దయను ప్రసాదించమనడం పోతన దయామృతానికి నిదర్శనం. భగవంతుడి మీద నమ్మకం లేని నాస్తికుడికి సైతం పోతన పలుకుబడి ఆకర్షిస్తుంది. అందుకే పోతన పద్యం రాని తెలుగువారు లేరని చెప్పవచ్చు.

 

      ఆధారాలు:

1. బమ్మెర పోతన(విమర్షా వ్యాసాలు) - సి‌పి బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రం, కడప

2. భాగవతము మందార మకరందాలు - డా. సి. నారాయణ రెడ్డి

3. వ్యాస - పోతనాల భాగవతములతో తులనాత్మక పరిశీలన - డా. శనగవరపు రవి శంకర హృషీకేశ శర్మ

4. శ్రీ పోతన భాగవత మధురిమలు- గీతా ప్రెస్, గోరఖ్ పూర్

5. సమగ్రాంధ్ర సాహిత్యం (ప్రథమ సంపుటి) -ఆరుద్ర

(భాగవతం సమకాలీనత, సంపాదకుడు, ప్రచురణ కర్త: డా. వైరాగ్యం ప్రభాకర్, భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్: 505002: isbn: 978-93-5607-701-0: ఫిబ్రవరి, 2022: లో నా వ్యాసం ముద్రించారు:(పుటలు 89-93)          

 

No comments: