Monday, May 29, 2023

స్వాతంత్రోద్యమ కాలంలో భావకవిత్వం

 

డా. జె. సీతాపతి రావు, సహాయకాచార్యులు,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ౦,

నూజివీడు ప్రాంగణం, ఏలూరు జిల్లా, 521202, ఆంధ్రప్రదేశ్

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

సంచారవాణి: 9951171299         

            బ్రిటీష సామ్రాజ్య వాదులు తమ ఏలుబడి సజావుగా సాగడం కోసం భారత జాతిమీద మోపిన ఆంగ్ల విద్యావిధానం 19 శతాబ్ది ద్వితీయార్థంలో నాటి జాతి జాగృతికి సహకరించింది. లలితకళలకు వ్యక్తికిష్టమైన ప్రతిభ ముఖ్యం. ఇది సహృదయ రంజకంగా మారి ఆలోచనాత్మకమవుతుంది.  భావకవిత్వం ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి ప్రవేశించినా దానికంటూ ఒక ఉనికిని, దేశీయతా ముద్రను వేసుకొన్న దశగా చెప్పొచ్చు. ఈ కాలంలో భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు కూడా కొంత ఊపునందుకున్నై. కేవలం ఊహల్లో తేలిపోయిన స్థితిని మాత్రమే ఈ కాల లక్షణం కాదు. సమకాలీన సమాజ స్థితి కవిత్వ భాషలో చోటుచేసుకుంది. 1920- 1940 ప్రాంతం భావ కవిత్వకాలంలో ఎక్కువగా కనిపిస్తూ నేటికీ కూడా దీని ఛాయాలున్నాయ్. భావకవిత్వానికి అంతర్ముఖత్వం ప్రధాన లక్షణమే అయినా దేశభక్తి, స్వాతంత్ర్య కాంక్ష కవుల్ని ఆకర్షించింది, ప్రజల్ని ఉత్తేజితులుగా చేయాల్సిన కర్తవ్య౦ అంతర్లయగా సాగింది.

            మొదట దేశాభిమానంగా భారత జాతీయతా భావాల్ని ప్రబోధించారు. అందులో దువ్వూరి రామిరెడ్డి, బసవ రాజు అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, కాసుల పురుషోత్తమ కవి, జాషువా, తుమ్మల మొదలైన వాళ్ళున్నారు.  వీళ్లలో కొద్ది మంది రచనల్ని మాత్రమే తీసుకొని ఈ వ్యాసాన్ని తయారు చేస్తున్నాను. కృష్ణపక్షం, గబ్బిలం, ఆంధ్ర నాయక శతకం, స్వాతంత్ర్య రథము, విశ్వనాథ ఆంధ్రప్రశస్తి వరకు మాత్రమే ఈ వ్యాస పరిధి.

            జన్మభూమి గేయంలో భారత మాటను శిరోభూషణమనేలాంటి రచన ఆంధ్రావళి. "ఏ దేశమేగినా, ఎందుకాలిడినా... నిలుపరా నీ జాతి నిండు గౌరవము" రామాయణంలో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే శ్లోక ఛాయ ఇది. ఇది స్వాతంత్ర్యాన్ని రగిల్చే నివురు గప్పిన నిప్పు కణిక.

కృష్ణపక్షం స్వాతంత్ర్యేచ్ఛ:

            స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని అప్పటికే బాలగంగాధర్ తిలక్ చాటారు. ఇది ప్రతి భారతీయుడి గుండెను తాకింది.  కవులలో నిద్రణమైన జాతిని మేల్కొల్పడానికి  స్వేచ్ఛా స్వాతంత్ర్య కాంక్ష ప్రేరకమైంది. కృష్ణశాస్త్రి వినిపించిన లోక మోహన మధుర గానాస్వాదమోదాలకు చుక్కలుసైతం సోక్కిపోవడంగా కవి కుమారుడు పోల్చుకున్నాడు.

"యుగయుగంబుల నీశ్వర యోధులగుచు

స్వేచ్ఛకై ప్రాణసుమము లర్పించు వారి

యమల జీవిత ఫలము ధన్యతను గాంచ

జగమునిండ స్వేచ్ఛాగానఝరులునింతు"  అని కృష్ణపక్షం, స్వేచ్ఛాగానము -1(కృష్ణపక్షం, పుట2) కృష్ణ శాస్త్రి కవిత్వీకరించారు. మకుట రూపంలో పంచకం/ పంచ రత్నాలుగా తేటగీతులతో మలిచారు.  యుగయుగాల  స్వేచ్ఛకోసం ప్రాణం అనే పుష్పాల్ని అర్పించే వీరులు ఈశ్వర యోధులే అని నిశ్చయంగా చెప్పాడు. స్వేచ్ఛా సమర యోధులు ఈశ్వర ప్రేరితులు. వీరి అమల జీవిత ఫలం ధన్యమయ్యేలా ఈ ప్రపంచం అంతా స్వేచ్ఛాగానాన్ని నింపుతాను అంటూ ఆయా కవుల బాధ్యతల్ని ప్రేరేపిస్తూనే, వీరుల్ని స్మరించడం కృష్ణశాస్త్రి తత్త్వం.

స్వాతంత్రేచ్ఛ అంత సులువుగా సాగేది కాదు. భయం కలిగిస్తుంది. భారత దేశాన్ని వ్యాపార దృక్పథంతో వచ్చి, హస్తగతం చేస్తుకున్న పరాయి వాడు ఇంగ్లీషువాడు, వాడి పన్నాగాలు భయంకర౦. ప్రజల్ని వందేమాతరం అనే మాటనే అనకుండా చేసే రోజులవి. పైగా నిరంకుశపాలన.

"క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య

శృ౦ఖలములు తమంతనే చెదరి పోవ

గగనతలము మార్మ్రోగగ కంఠ మెత్తి

జగమునిండ స్వేచ్ఛాగానఝరులునింతు" కృష్ణపక్షం, స్వేచ్ఛాగానము -1(కృష్ణపక్షం, పుట2)కఠినమైన దాస్యమనే సంకెళ్ళను తన స్వేచ్ఛాగానంతో చెదరిపోతాయని భావిస్తూ, పోవాలని ఆకాంక్షను కవిత్వీకరించారు.

స్వేచ్ఛాగానం అనే పేరే స్వాతంత్ర్య దృష్టిని తెల్పేది.

 

దేశంలో పాలక వర్గాన్ని

"రాజవీధుల రతనాల రథము నెక్కి

వెడలు నిర్జీవ పాషాణ విగ్రహంబ" (కృష్ణపక్షం, నేను కవిత, పుట: 3)  'ళుకు బంగారు సంకెళ్ళ దాల్చి లోక పాలకుని బోలె మురియు నో బానిసీడ!' అంటూ కుటిల పన్నగాలను చెవి యొగ్గి వినమని ప్రబోధిస్తున్నాడు. ఉద్యోగం పేరుతో బ్రిటీష్ వారికి కొమ్ము కాస్తున్నావైనాన్ని నిశితంగా విమర్శించారు. కేవలం బ్రిటిష్ వారిచ్చే తాయిలాళ్ళకు మోసపోయే నాటి జమీందారీ వ్యవస్థపు బానిసత్వపువైఖరిని నిరసించే స్థితికూడా. తద్వారా దేశభక్తిని, స్వాతంత్ర్యకాంక్షను ప్రేరేపిస్తున్నాడు.

 

నవ వికస్వర దివ్య సౌందర్య మూర్తి

విశ్వసుందరి పరమ పవిత్ర మూర్తి

ఉదయ లక్ష్మి యవతరించె,  నెదురు వోయి

స్వాగతం బిమ్ము గీతికా ప్రసవ మొసగి(కృష్ణపక్షం, కవి కుమార కవిత, పుట 7)

ఇందులో ఉదయ లక్ష్మి కవి రానున్న స్వాతంత్ర్య దేశ కాంక్షను తెలుపుతోంది.  బ్రిటీష్  సామ్రాజ్యానికి రాత్రి రాబోతోందని కవి సూచన. కాశ్మీర రుచులలో వివరించే రజని అంటూ రాబోయే సూర్యకాంతి అందాన్ని, తద్వారా వచ్చే హృదయానంద భావనను కవి ఆస్వాదిస్తూ, ఆకాంక్షిస్తున్నాడు.

 

"కృష్ణ శాస్త్రిగారు తెలుగు భాషలో కావ్యరచన సాగించి జాతీయతా దృక్పథం, కవితా దృష్టి షెల్లీ భావుకతా నాద మాధుర్యాలతో కూడిన కవిత్వం భారతీయ సాహిత్యాన్నే సుభిక్షం గావిస్తోంది"- శంకర్ కురూప్  చేసిన వ్యాఖ్య పై అంశాలను సుస్పష్టం చేస్తోంది.

మహతీ గేయాల్లో జాతీయోద్యమ ప్రభావం కనిపిస్తోంది. ఏకేశ్వరుణ్ణి విశాల నవ భారత లోకేశుడిగా కీర్తిస్తాడు.

"భారత జనని స్వేచ్ఛాగగన వీధి విహారిణి" అనడంలో భారతీయ స్వాతంత్ర్య కాంక్షను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ప్రియభారత జనయిత్రీ, నిత్య భాగ్య శుభ విధాత, జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి' గేయాలు కృష్ణశాస్త్రికి విశేష ఖ్యాతిని తెచ్చాయి.  

ఆంధ్రనాయక శతకం- స్వాంతత్ర్య కాంక్ష:

ఆంధ్రనాయక శతకాన్ని పుల్లంభట్టు లేదా కాసుల పురుషోత్తమ కవి రాశారు. దీనిలో వ్యాజస్తుతి, వ్యాజనింద అలంకారాలు ఎక్కువగా ఉన్న సీసపద్య, ద్వీపాద మకుట శతకం.

ఆంధ్రనాయక శతకంలో దేశభక్తి, స్వాతంత్ర్యాను రక్తిని ధ్వనింపజేయడం చూడొచ్చు:

చివరికి ఆ ఖర్చులు భరించలేక పోవడంవల్ల ప్యాట్రిక్ తన పటాలంతో ఆ కోటను ఆక్రమించుకున్నాడు. ఇలాంటి చారిత్రక పరిణామాల కారణంగా భారతీయ జమీందారీ పాలకులు దేవాలయపు ఆదాయంలేక ఆలయ మరమ్మత్తు చేయలేక, ధూప దీప నైవేద్యాలకు దిక్కులేక దయనీయమైన స్థితిలో ఆంధ్ర మహా విష్ణువుని "చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య దేవ హతవిమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ" అంటూ నీ లీలల్ని ఎలా గ్రహించాలి స్వామీ? అని వ్యాజస్తుతితో కవిగారు శతక మకుటాన్ని ప్రారంభించారు.

            ఈ మకుటంలోనే సామాజికాంశాన్ని సూచించారు. చిత్ర చిత్ర ప్రభావ అన్నపుడు ప్రభావ శబ్దానికి కోశ బలంవల్ల కలిగిన తేజం, శక్తి[1] ప్రతాపం, సామర్థ్యమని అర్థాలు. ఇలాంటి శక్తి ఆపదలలో ఉన్న వారిని రక్షించడంకోసం వినియోగించాలి. ఇపుడు ఆంగ్లేయులు చాలా దురాగతాలు చేస్తున్నారు. దాక్షిణ్య దేవ= కరుణ కలవాడా నువ్వు ఇపుడు రాదగిన సమయం అని భగవంతుడిని ఆర్తితో పిలిచే మకుటం స్వాతంత్ర్య కాంక్షను ధ్వనింపజేస్తోంది.

"శ్రీ మదనంత లక్ష్మీ యుతోరః స్థల!/చతురాననాండ పూరిత పిచండ!                

ధర చక్ర ఖడ్గ గదా శరాసనహస్త!/నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర!

సకల పావన నదీ జనక పాదాంభోజ!/రమణీయ ఖగకులోత్తమ తురంగ!

మణి సౌధవ త్ఫణామండ లోరగతల్ప!/వరకల్పకోద్యాన వన విహార!

భాను సిత! భాను నేత్ర ! సౌభాగ్యగాత్ర!/యోగిహృద్గేయ ! భువనైక భాగధేయ!

చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!/హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!"       (ఆంధ్రనాయక శతకము, ప1)

ఈ పద్యంలో చాలా ఆభరణాలు, ఆయుధాలతో లక్ష్మీదేవితో కూడి  రమ్మని కవి ఆకాంక్ష. పంచాయుధాలు కలవాడు విష్ణువు: శంఖం(పాంచజన్యం), చక్రం(సుదర్శనం), విల్లు(శార్ ఙ్గ౦), గద(కౌమోదకి), ఖడ్గం(నందకం): ఆయుధాలు శత్రునిర్మూలన కారకాలు. బ్రిటిష్ వారిని తరమమనడం సూచన. లక్ష్మిని అంటే సంపదను సాధించాల్సిన అవసరాన్ని గుర్తించడం. భారత దేశ పూర్వ వైభవస్మరణ ఇవన్నీ సంబోధనపూర్వక సమాస పదాలతోనే వర్ణించడం విశేషం.

"మానుష హర్యక్ష, మార్తాండ సోమాక్ష త్రిభువనాధ్యక్ష, కౌంతేయ పక్ష...  !" (ఆంధ్రనాయక శతకము, ప3)

ఈ పద్యంలో మానుష హర్యక్ష అనే పదం సామాజిక స్పృహను కలిగించేది. హర్యక్ష అంటే సింహం. నారసింహ అవతారసూచకం. సూర్య చంద్రులే నేత్రాలుగా కలవాడవని అర్థం. ఇక్కడ కేవలం నరుడుగా కాకుండా నరసింహుడిగా రావాలి అప్పుడే ఈ భారదేశానికి పాలిస్తున్న వాళ్ళ భరతం పట్టడం వీలవుతుంది తెల్పడం. కౌంతేయ పక్ష ఈ పద ప్రయోగం ద్వారా కృష్ణావతారాన్ని, గజేంద్రుణ్ణి రక్షించిన విష్ణువును స్పురింపజేయడం. ఒక బలవంతంగా చేస్తున్న చాలా దురాగతాలను విభిన్న అవతారాల్లో భక్తులను, జంతువులను రక్షించావు. ఇప్పుడు అలానే బ్రిటీషువారినుంచి భారతీయుల రక్షణ బాధ్యతను నిర్వహించమని కాసుల వారి ధ్వని. 

గబ్బిలం ఖండకావ్యం: స్వాతంత్ర్యత:

భారత దేశంలో అనైకమత్యం, స్వార్థ౦, బహుకుల మతావేశ వ్యాధిపీడ, అంటరానితనంతో పాటు దాస్యముక్తికోసం కొన్ని పద్యాలను గాంధీగారి మీద రాసి స్వాతంత్ర్య ఉద్బోధ చేశారు.

నిద్దుర మేల్కొని యల్లన్

ఖద్దరు రాట్నంబు పౌరకాంత వహించెన్

ప్రొద్దు పసివాడు తూరుపు

ముద్దియ పొత్తిళ్ళలోన ముద్దులు గురిసెన్(గబ్బిలం మొదటి భాగం116ప, పుట: 23) 

నిద్దుర లేచి ఇల్లాలు ఖద్దరు రాట్నం వడకడానికి తయారౌతోంది.  పొద్దు పొడుస్తుంటే పసివాడు పొత్తిళ్లలో ముద్దులు కురిపిస్తున్నాడు. సూర్యోదయమైంది. మనుషుల దినచర్య ఆరంభమైంది. ఇక్కడ ఖద్దరురాట్నం విదేశీ వస్త్ర బహిష్కరణను సూచిస్తోంది. ఉదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు దేశ స్థితిని చూపించడం. పొద్దు పొడిచే నాటి పసి పిల్లలు లేవడం చైతన్య స్థితిని తెలియజేస్తోంది. ప్రొద్దు పసివాడు అనడంలో భారతీయులలో ఇంకా బాల్య చేష్టలు పోలేదని, ఆనందాన్ని పొందేందుకు తగిన స్వాంతత్ర్యాన్ని పొందాలే విదేశ పాలకులను తరమాలనీ ధ్వనింపజేశారు.

‘‘గుఱ్ఱాలకు ఱెక్కలు గల

వెఱ్ఱియుగాల్ దాటిపోయె, విజ్ఞానంబున్

బుఱ్ఱలు గల గాంధియుగమిది

కఱ్ఱలు ఖడ్డంబులేలగాలేవు ప్రజన్’’

మానవ మేధస్సు పెరిగింది. అభూతకల్పనల్ని నమ్మడు. శాస్త్రీయదృష్టితో ఆలోచించడం అలవాటు చేసుకున్నాడు. స్వీయ పరిపాలన చేసుకోగల సత్తా ఉన్నవారు. సామాజిక వాస్తవికతను గుర్తించి తెలుసుకోవడం, తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడ్డమూ తెలుసు. ప్రజాపోరాటాల్ని ఆపేసే అధికారం, నియంతృత్వాలకు కాలం చెల్లిందని తెల్పారు. గాంధీ యుగంగా దీన్ని అభివర్ణించారు. ఇక్కడ గాంధీ ఉద్యమాలకు ప్రతీక. స్వాతంత్ర్య తిరుగుబాటుకు సంకేతం.

రాయప్రోలు స్వాతంత్ర్య భావన:

            భావకవిత్వం ప్రణయ కవిత్వంపై వేసినంత ప్రభావం దేశభక్తి, స్వాత్రంత్రోద్యమ ప్రభావం చూపకలేదు. కానీ భావకవిత్వంలో గతవైభవ స్మరణ ఒక ప్రధాన అంశం. అందులో భాగంగా రాయప్రోలు జన్మభూమి లాంటి గేయాల్లో అవమానమేలరా, అనుమాన మేల, భారతీయుడనంచు భక్తితో పాడ...' లాంటి పాటలు దేశంపట్ల అంకిత భావంతో ఉద్యమం చేయాల్సిన పరిస్థితిని తెలుపుతోంది.

"సూర్యుని వెలుతురుల్ సోకునందాక

ఓడల జండాలు ఆడునందాక

అందాక గల యీ అనంత భూతలిని

మనభూమి వంటి చల్లని తల్లి లేదు" ఈ చరణ భావాలు Alfred Tennyson రాసిన Foresters, Song లోని

There is no land like England

Where're the light of day be అనే పంక్తుల్ని తలపిస్తున్నాయి.

దువ్వూరి ఆత్మ విశ్వాస సూర్యోదయ కాంతులతో భారత జాతీయ ప్రబోధ గీతాల్ని రాసి, ఆలపించారు. ఇందుకు స్వాతంత్ర్య రథము నాటిక చక్కటి ఉదాహరణ. ఇది ప్రగతిశీల రాజకీయ తత్వ సూచికలుగా కనిపిస్తాయి.

విశ్వనాథ స్వాతంత్ర్య పౌరుష స్థితి:

ఆంధ్రప్రశస్తి లో కొండవీటి పొగమబ్బులు, వేంగి క్షేత్రం పూర్వ వైభవాన్ని తెలుపుతూనే ప్రస్తుత వాటి దీనావస్థను సూచిస్తున్నాయ్. నా జాతి పూర్వప్రధా జీవరహితమై శక్తి నాడుల యందుఁ జచ్చిపోయి

నా మాతృభూమి తేజోమహశ్చ్యుతిని బ్రహ్మక్షత్ర తేజంబు మంటగలిపి

నా మాతృభాష నానాదుష్టభాషల యౌద్ధత్యమును దల నవధరించి

నా తల్లినేల నే నాఁటి వాచారముల్‌ పై మెఱుంగులు చూచి బ్రమసిపోయి

        ఏమి మిగిలినదీ నాఁటి కిట్లుపొంగు

        లొలయు వర్షానదీ గభీరోదకముల

        దైన్యగర్భ చారిత్రముల్‌ దక్క భిన్న

        గిరిశిఖర దుర్గ పరిదీన గీతిదక్క.( ఆంధ్ర ప్రశస్తి, ముఖలింగము)

అక్షరాక్షరంలో అతని జాతీయాభిమానం, జాతి గురించిన ఆవేదనా ప్రతిబింబించే పద్యం. అతని మితి లేని జాతీయావేశమే పరభాషలని దుష్ట భాషలుఅని అనిపించింది. తెలుగు తనమన్నా, తెలుగు భాషన్నా విశ్వనాథవారికి ప్రత్యేకాభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన భాషాభిమానాన్ని తెలియచేస్తాయి. జాతీయ భావం తీవ్రంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతీయ భావం కూడా ఎంతో కొంత అవసరం అని విశ్వనాథ వారి విశ్వాసం. శిల్పం గాని, సాహిత్యం గాని జాతీయమై ఉండాలి కాని విజాతీయమై ఉండరాదనే వాదన వారిది.

            మన జాతీయత, సంప్రదాయాలను కాపాడుకోవాలి. సముద్రంమీద పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికెలా చేరుతుందో అలాగే ప్రాచీన విధానాలకు, ఆచారాలకు కట్టుబడ్డది. భారతీయత మీద, తెలుగుదనంమీద అభిమానం కలిగింది. తన అభిప్రాయాల్ని, ఇష్టాయిష్టాలను నిక్కచ్చిగా తెలిపేవారు.  

            భావుకతే తర్వాత జాతీయాభిమానం దిశగా మళ్ళీ తెలుగు జాతి ప్రశస్తిని, పౌరుషాన్ని దశదిశలా ప్రతిధ్వనించింది. అయితే, విశ్వనాథని విశ్వనాథ చేసింది మాత్రం అతని అనన్య కల్పనాచాతుర్యం, శిల్ప నైపుణ్యం.కల్పన అంటే ఊహ. ఒక కొత్త ఆలోచన, కొత్త దృక్కోణం. మనందరికీ తెలిసున్న విషయాల గురించి మనకి తెలియని ఒక కొత్త అంశాన్ని ఆవిష్కరించగలగడమే కల్పనా చాతుర్యం.

వెరసి భావకవిత్వంలో స్వంతత్ర్యభావన స్వేచ్ఛలో భాగంగా పూర్వస్మరణలో భాగంగా నాటి పాఠకులను ఆలోచింపజేస్తోంది.

 

ఆధారాలు:

అర్థశతాబ్దపు ఆంధ్రకవిత్వం: శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, అద్దేపల్లి రామమోహనరావు(సం.), కె సంజీవరావు(సమీకర్త):1994:  తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణలు, హైదరాబాదు

ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు: ప్రయోగములు: డా. సి. నారాయణ రెడ్డి: 1989:  విశాలాంధ్ర ప్రబ్లిషింగ్ హస్, హైదరాబాదు

ఆంధ్రనాయక శతకము: కాసుల పురుషోత్తమ కవి (పాఠకమిత్ర వ్యాఖ్య: డా. అద్దంకి శ్రీనివాస్: 2020 ): ఎస్ ఆర్ పబ్లిషర్, విజయవాడ.

కృష్ణపక్షం:  కృష్ణశాస్త్రి: నవచేతన పబ్లిషింక్ హౌస్, హైదరాబాద్ అక్టోబర్ 2019.

కృష్ణపక్షం:  కృష్ణశాస్త్రి: రాజ హంస ప్రచురణ, మద్రాసు 1925.

కృష్ణశాస్త్రి కవితాత్మ: ఆవంత్స సోమసుందర్, యం. శేషాచలం & కంపెనీ, మచిలీపట్నం, సికింద్రాబాద్

నిత్యహరిత సాహితీ బృ౦దావనం దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి: డా. నిడమర్తి నిర్మలాదేవి: 2010:  సిపి బ్రౌన్ అకాడమీ, హైదరాబాదు

 

 

 



[1] శబ్ద రత్నాకరము: పుట 733

No comments: