డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజీవీడు,
కృష్ణాజిల్లా- 521202. చరవాణి: 9951171299
ఎక్కడో ఓ మూల ఏదో పనిచేసుకుంటూ
క్షణం తీరికలేని సూర్య గమనంలా నేను
అంతరిక్షాలు, శాస్త్ర చర్చ, కాల పట్టికలతో
చదువుల వెన్నెలలు పూయిస్తూ ఉంటా....
మార్చి పన్నెండు బతుకు బాటను మార్చేస్తుందని భావించలే
ఎప్పుడూ విద్యార్థులతో కళకళ లాడే కళ్యాణ మండపం నా కాలం
‘కరోనా సెలవు, ఇళ్లకు వెళ్ళండి’ అనే అధికారుల కుహూరాగాలు
ఏకాంతంగానే ఉన్నా పట్టపగలే నిశ్శబ్ద కోకిల కుహూగానాలు
ఆలస్యం చేయకుండా, కరోనాను తాకకుండా మబ్బుల ఎండలో యానం
అత్తవారిల్లు హారతి పళ్ళెం, మామగారి అభిమానం కాదనలేని స్థితి
అందరూ జాగ్రత్తలు పాటిస్తూ ఉగాది పచ్చళ్లు, నిత్య గృహ కార్యాలూ
రామపట్టాభిషేకాలు, పచ్చి వేరుశెనగల పల్లెల అందాల మమకారాలూ..
పల్లె స్వర్గసీమ, కరోనా అక్కడకు చేర్చిన అనుగ్రహ వీక్షణ
పచ్చని జీడిమామిడి, అంటుమామిడి ఆపై కోతులదాడి
ఆకలికి తాకలేని బతుకుజీవుడు, ఆక్రోషిస్తున్న సూర్యుడు
ఎండల్లో రక్షక భటులు, ఊరు దాటని బాటసారులు
ఇదేదో మరో లోకంలా మరదళ్ళ ముచ్చట్లు, పిల్లల కేరింతళ్ళు
పుస్తకాలతో మస్తకాలు, చలన చిత్రసోయగాలు, కరోనా విన్యాసాలు
దూడల అంబాలు, దారిలో వెళ్ళి పోతున్న పిల్లి చప్పుడు చాలా స్పష్టం
గృహవీణలో నిత్యపు పనులే నేడు బండబారిన చెవులకు సంగీతాలు
అష్టాచమ్మా, వైకుంఠ పాళీ, అంత్యాక్షరి, శ్లోక పారాయణం...
సీక్వెన్స్, బ్యాంక్ ఆట, లక్స్, దాడి దిక్కుడీలతో ఇల్లే ఒక ఆటస్థలం
కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, టాబ్ లతో ఇల్లే ఒక ప్రయోగ స్థలం
కక్కా ముక్కలతో వాసలు పరిమళించే దివ్య గర్భాలయం వంటస్థలం
ఒకరు వంకాయి కోత, ఉల్లిపాయల తొక్క తీత, బీరకాయల చెక్కు
వంకాయి జీడిపప్పు, సాంబారు, కొత్త ఆవకాయ, వడియాలు అప్పడాలతో
వెల్లుల్లి, కొత్తిమీర, కరేపాకులతో వంటిల్లే ఒక అక్షయపాత్ర, కల్పవృక్షం
అందులో వడ్డించే అత్తగారు, మామగారు, మరదలు సరసాల తాళింపులూ
ఇల్లు ఒక జైలుగా కాదు కరోనా ఇచ్చిన ఖరీదైన కర్మాగారం
అందాల్ని ఆరబోసే ఒక ఫేషన్ ప్రపంచం, అందరూ కలగలిపిన
కలగూర గంప, కళాశాల సెలవులు కాదు కానీ ఆశలకు నెలవులు
స్వీయ నిర్బంధం కాదు ఆత్మావలోకనం, ఆనందపు వీక్షణ క్షణాలు
No comments:
Post a Comment