Wednesday, May 31, 2023

అంతర్జాలంలో సాంఘిక నాటికలు - సమస్యల చిత్రీకరణ

 

డా. జె. సీతాపతిరావు, తెలుగు ఉపన్యాసకులు,

రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం,

ఏ.పి.ఐ.ఐఐ.టి., నూజివీడు, కృష్ణా జిల్లా.

                                                           విద్యుల్లేఖ: seethuphd@gmail.com

                                                                                              సంచారవాణి: 9951171299

1. ఉపోద్ఘాతం:

            తెలుగుకు వెలుగునివ్వడానికి సహకరించింది నాటక రంగం. సాహిత్యానికి సంభాషణలు తోడై సామాన్యుణ్ణి ఆలోచింపజేయడానికి సహకరించింది సాంఘిక నాటకం. దీనికి వాహికగా యూట్యూబ్ కొంతవరకు విశ్వ వ్యాపిత ప్రచారానికి సహకారం అందించింది. వీధుల్లో ప్రదర్శించిన నాటకాన్ని ఎవరికి ఖాళీ సమయం దొరికినప్పుడో, బడలికగా ఉన్నప్పుడో, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయడానికి ఈ సాంఘిక నాటికలు, నాటకాలు సహకరిస్తున్నాయి. చింతామణి నుంచి ఆధునిక నాటకాల వరకు చూస్తే మారుతున్న ప్రజల అభీష్టాలు, దాని ప్రభావాలు కుటుంబంలో ఎలా పరిఢవిస్తోయో ఈ అంతర్జాల నాటికల్లో చూడవచ్చు.

1.1. వ్యక్తి- సంఘం:-

            వ్యక్తి సంఘంలోనే ఉంటాడు. సంఘం కొన్ని కట్టుబాట్లను కలిగి మనిషికి వర్తింపజేయడం ఒకభాగం. ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా చూడాలి? పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి? ఉపాధ్యాయుడు తన విద్యార్థులపట్ల ఎలా ప్రవర్తించాలో సూచించిన స్థితిని, వివిధ జీవన గమనాల్ని ఇతివృత్తంగా చెప్పడం ఈ సాంఘిక నాటికల్లో తత్త్వం. పునరుత్పత్తిచేసి బయటికి పంపేది తల్లి. గమనానికి ఆధారం ఆడది. సంస్కారాలు తండ్రి నేర్పించాలి. చదువుకున్న పిల్లలు బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలి. విలువలతో జీవనం సాగించాలి. కేవలం చెప్పడానికే నీతులు కావు, ఆచరించడానికి అన్న విషయాన్ని గమనింపజేయడం ద్వారా ఈ సాంఘిక ఇతివృత్త నాటికలు సహకరిస్తున్నాయి.

1.2. అంతర్జాల నాటిక-నాటకం:-

            నాటకంలో విస్తృతిని తగ్గిస్తూ, సమయపు గంటల నిడివిని తగ్గిస్తూ ప్రవేశించినవి నాటికలు. వాటిలో కూడా ఇప్పుడు స్క్రీన్స్ తీసి, లఘు చిత్రాల రూపంలో ఈ నాటికలు రూపాంతంగా కనిపిస్తున్నాయి. వీటిల్లో కూడా సాంఘిక ఇతివృత్తం ఉండటం, చూపరులకు ప్రత్యేకంగా ఆకర్షించడం ప్రధానంగా మారింది. దీనిద్వారా వేగవంతంగా, తక్కువ ఖర్చుతో చూపరులకు చేరువ అవడం దీనిలోని ప్రధాన అంశం.

1.3. జీవితం- పరిణామాలు:-

            ప్రస్తుత జీవన విధానం ఎలా ఉందో కుర్రకారు ఎలా తమ ప్రవర్తనలను మార్చుకుంటున్నారో ముందుగా గమనించాలి. ఫేస్ బుక్, ట్విట్టర్ ల పుణ్యమా అని చాలా మందికి కాలహరణం, మాన హరణానికి, శీల భ్రష్టానికి  కారణంగా, ఆకర్షణే మంత్రంగా చెలామణీ అవుతున్నది.

            అలాంటి సమయంలో ప్రేమ గురించి, దాని ఉన్న హద్దులు, బాధ్యతలు, ప్రవర్తనలు, పెద్దవారు చూసే అంశాలు మొదలైనవాటిని ఎన్నో గమనించాలి. అంతర్జాలం(ఇంటర్ నెట్) పుణ్యమా అని రాత్రులు, పగలు ఖాళీలేకుండా పిల్లలు చదివేస్తున్నారని పెద్దలు భావిస్తున్నారు.

1.4. గమనం- నాటిక పరిశీలన:-

            నాటికల విభాగంలో వచ్చిన 53 నిమిషాల నిడివి ఉన్న గమనం నాటికను పరిశీలించడం ఈ వ్యాస కర్తవ్యం. దీనిని గంగోత్రి పెద్ద కాకాని వారు 2013 లో ప్రదర్శించారు. దాన్ని యూట్యూబ్ లో చేర్చారు. సామాన్యంగా కనిపించే మనుషుల జీవనం ఎలా ఉందో తెలుపుతూ ఎలా ఉంటే ఎలా తయారవుతారో ఆలోచింపజేయడం ఈ నాటికలో చూడవచ్చు.

1.4.1. నాటిక కథాంశాలు-ప్రత్యేకతలు:-  

            గమనం నాటిక మునిపల్లి విద్యాధర్ రాశారు. దీనిలో ప్రధానమైన అంశాలను విభాగాలుగా చేస్తే- బాధ్యతలు, హక్కులు, మమతలు, విలువలు, స్వేచ్ఛ, అంతర్మథనం ప్రధానాంశాలుగా ఈ నాటిక సాగింది. కేవలం మూడు పాత్రలతోనే నాటిక ముగిసింది. కొడుకు కూతురు ఉన్నప్పటికీ, కూతురినే అమితంగా ఇష్టపడుతూ ఆమెను యం.బి.బి.యస్., చదివిస్తాడు. ఆమెకు గోల్డ్ మెడల్స్ వస్తాయి. ఆమెకు స్వేచ్ఛనిచ్చాడు, తండ్రి. సమాజంలో ఆడపిల్లను ఎలా చూస్తున్నారో దానికంటే భిన్నంగా చూడడంద్వారా ఒక విభిన్నతను సూచించే ప్రయత్నం చేశాడు. అది ఎలాంటి విపరీతాలకు దారితీసిందో సూచిస్తూనే ఆలోచింపజేయడం ఈ నాటిక ప్రత్యేకత.

            కేవలం కొడుకుకు వత్తాసు పలికే తల్లి, కేవలం కూతురుకు వత్తాసు పలిగే తండ్రి కథ దీనిలో ప్రధానం. అయితే వారు పెరిగిన తీరు ఏవిధంగా ఉందో నిరూపించే దిశగా సాగడం మరో అంశం.

            ఆడ పిల్ల దాని పని దాన్ని చేసుకోవాలనే తల్లి తత్త్వం. కూతురుకు వంటా వార్పూ చేయడం రావాలనే తల్లి మాటకు తండ్రి “వండి పెట్టాల్సిన ఖర్మ దానికేమిటే. నా కూతురు మహాలక్ష్మి. దానికి తగ్గ  ఏ రాకుమారుడో వస్తాడు. గుర్రం మీద నుంచి నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అంటాడు. దానికి సమాధానంగా మా నాన్న ఇలానే చెప్పాడు నా పెళ్ళికి ముందు ఏం జరిగింది నన్ను తీసుకెళ్లడానికి మీరు రిక్షామీద వచ్చారు అంటూ సమాధానం చెప్తుంది.

            తండ్రికి శత్రువులే కొడుకుగా పుడతారన్న మాటకు అక్షరరూపం ఈ నాటికలో ఉన్న కొడుకు స్వభావం. మిట్ట మధ్యాహ్నం కొడుకు వేడినీళ్లతో స్నానం చేయాలని తల్లిని వేదినీళ్లు పెట్టమంటాడు. దానికి తండ్రికి విపరీతమైన కోపం అసహనం వస్తాయి. తను కొడుకును ఎందుకు కన్నానని బాధ పడతాడు.

“పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అన్న పద్యాన్ని చెప్పడం ద్వారా తల్లిదండ్రుల ఆశాల్ని ఆలోచింపజేస్తాడు.  

            ఒకరోజు కూతురు, మహాలక్ష్మి, డాక్టర్ అయి ప్రాక్టీస్ చేసుకుంటూ ఎప్పటికీ ఇంటికి రాదు. ఆమెకు తండ్రి సాయంత్రం పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తాడు. తన కొడుకును ఎలా పది మందికి పరిచయం చేయాలో బాధ పడే తండ్రి స్థితిని ఈ నాటికలలో చెప్పి కరుణరసాన్ని పుట్టించారు. అంతేకాదు నిర్ధిష్ట జీవన గమనం లేని వాడిని కన్నందుకు తల్లిదండ్రులుగా మనకు శిక్ష తప్పదు అని తండ్రి వాపోవడం కరుణరసప్లావితం. 

            స్వశక్తి మీద పైకి వచ్చిన వారిని చూసి జీవన విధానం నేర్చుకుంటాడని ఒక ఉద్యోగాన్ని తండ్రి తీసుకువస్తాడు. దాన్ని కొడుకు తిరస్కరిస్తాడు.

1.4.2. కొడుకు ఉద్దేశంలో తండ్రి:-

            నాన్న ఎలా ఉండాలి? అన్న ప్రశ్నకు సమాధానం పాఠకుల ఊహకు వదిలేస్తాడు. కూతురుకు మెక్చూర్ ఫంక్షన్ కు పెట్టిన ఖర్చు, చివరకు మెడిసన్ పెట్టి ఖర్చుతో పోలిస్తే తనకు పెట్టిన ఖర్చు లెక్కలు వేసే కొడుకు తండ్రికి కోపం వస్తుంది. కట్టు బట్టలతో వెళ్ళి కోట్లు సంపాదిస్తానని కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోతాడు.

1.4.3. కృతజ్ఞతా తత్త్వం:-

            పీటర్ అనే పేరుతో ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడుగా అతని సాయం చేస్తాడు. దానికి ప్రతిఫలంగా చెప్పుల దుకాణం పెట్టించి అంచలంచలగా ఎదిగి మరిన్ని దుకాణాలు పెట్టి చాలా డబ్బులు సంపాదించాడు.  ప్రతి సంవత్సరం తనకు సాయం చేసినందుకు తానే స్వయంగా చెప్పులు కుట్టి తనకు సాయంచేసినందుకు కృతజ్ఞతగా చెప్పులు కుట్టి తెస్తాడు.

1.4.5. గమనం నాటికలో జీవన విధానం:

            ఆడపిల్ల తను నచ్చిన వ్యక్తితో లేచిపోయి తల్లి తండ్రులకు చెప్పకుంటా వెళ్ళి పెళ్లి చూసుకుంటుంది. దాన్ని ఫోన్ చేసి తండ్రికి చెబుతుంది. దానికి తండ్రి కోపం చెందడం. మహాలక్ష్మి వేరే దేశం వెళ్ళి అక్కడ సీమంతం అని తల్లికి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత రోజూ తండ్రితో మాట్లాడక పోవడం వల్ల చాలా దిగులు పడుతూ మౌనంగా ఏడుస్తూ ఉండడం తండ్రికి తల్లి చెప్పడం సహజ కుటుంబ జీవన విధానాన్ని తెలుపుతుంది.

1.4.6. స్త్రీ జీవిత గమనం:-

            మహాలక్ష్మి నెంబరు తల్లికి తెలియకపోవడం తర్వాత మహాలక్ష్మి బొమ్మకు సీమంతం చేయడం సన్నివేశం. దీనిద్వారా తల్లి దండ్రుల తత్త్వాన్ని తెలిపాడు. అలాంటి సమయంలో ఇంటి నుంచి వెళ్ళిపోయిన కొడుకురావడం. ఈయనగారి కూతురు ఎవడితోనో లేచి వెళ్లిపోయింది. దానికి బతికున్న మనిషికి ఫోటో పెట్టి సీమంతం చేయడాన్ని అవహేళన చేస్తాడు. ఇక్కడ స్త్రీల గొప్పదనాన్ని తెలియజేస్తాడు.

1.4.7. కఠినంగా మాట్లాడే కొడుకు తత్త్వం:-

            గమనం నాటికలో ఇప్పటి దాకా అయిన ఖర్చు ఎంత అయిందో తెలపమని తండ్రిని కొడుకు అడగడం. మొత్తంగా ఏభై లక్షలు చెక్ ఇస్తాడు. రాత్రి రాత్రి కోట్లకు పడగలెత్తే విధంగా సంపాదించాడు అని కొడుకు చెప్తాడు. కలిసి ఉన్న తల్లి దండ్రుల్లో విడదీయాలను కుంటారు. పీటర్ అక్కడే ఉన్న పాత జ్ఞాపకాలు చెప్పినా ఆలోచించని కొడుకు తత్త్వం ఇక్కడ తెలిపాడు. ఆ పీటర్ మంచి మాటలు చెప్పదలచుకుంటే లో క్లాస్ వాళ్లతో పోల్చి అవమాన పరుస్తాడు. తల్లిని తనతో వచ్చే మంటాడు. దానికి తగువు అవుతుంది. తండ్రి మీదకు కొడుకు ఎదురు తిరుగు తాడు. నడి మంత్రపు సిరి కలిగిన కొడుకు తండ్రులను ఇబ్బంది కరంగా మాట్లాడతాడు.

            తను మనిషిని కన్నా ననుకున్నాను అని తల్లి బాధ పడుతుంది. తను పిల్లాడిని కనలేదు రాక్షసుణ్ణి కన్నానని తల్లి ఏడుస్తూ బాధ పడుతుంది. పిల్లల్ని మనం ఆశీర్వదించాలే కానీ శపించ కూడదు. ఏ తండ్రి అయిన తన పిల్లాడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అవ్వాలనే పిల్లల్లి కంటారు.నేనూ అలాగే అనుకున్నాను. పిల్లలు ఏం చేసిన తల్లిదండ్రులు ఆనందంతో అనుభవించాలి కన్నందుకు తప్పదు అంటూ చూపరుల్ని ఆలోచింజేయడం కొసమెరుపు. ఇది జీవన గమనం.  దీనిలో అనుభవాలను, సంస్కారాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జీవన సాగరాన్ని దాటాలి.

1.5. మరిన్ని యూట్యూబ్ నాటికలు:-

            జబర్ దస్త్ అనే పేరుతో ఈనాడు నిర్వహిస్తున్న హాస్య నాటికలు ప్రజలకు ఒక ప్రభంజనం సృష్టించింది. వీటిని ఎప్పటికప్పుడు యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయడంద్వారా విశ్వవ్యాప్తం అవుతున్నది. దీనిద్వారా ఎక్కువ మంది హాస్యాన్ని చూసి ఆనందిస్తున్నారు. హాస్యం అపహాస్యం చేయడం, కొన్ని కొన్ని అశ్లీల పదాలను వాడడంద్వారా కొన్ని ప్రదర్శనలు ఇబ్బందులు కలగజేశాయ్. ఇలా చాలా మనకు వేర్వేరు సాంఘిక నెట్ వర్క్స్ లో కనిపిస్తాయి. ఇప్పుడు ప్రతి టీ.వీ. తమ పరిధిని పెంచుకునే దిశలో అంతర్జాల్ని వాడుకోవలసిన స్థితి ఏర్పడింది.

1.6. సీరియల్స్ లలో లేని సీరియస్ నెస్ :-

            ఇప్పుడు సీరియల్ రూపంలో ఈ సాంఘిక తత్త్వాలు విజృంభించి మనుషుల్ని అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. వీటిని విలువతో కూడిన విధంగా తయారుచేసి సంఘంలో ఉన్న చెడును రూపుమాపడానికి తగిన విధంగా సహకరించినట్లైతే ఆ సీరియల్స్ హితాన్ని కలిగిస్తాయి. వ్యక్తిత్వం నెలకొల్పే తత్వాలు మాత్రమే ఉండాలి. ఎక్కువ సాగదిస్తూ మనిషికి మానసిక ఇబ్బందుకు తెచ్చి పెట్టడం లేని బ్లేడ్ ప్లేషర్ లాంటి రుగ్మతలు రావడానికి కారణం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఇవి సమయాన్ని వృధా చేయడానికి, పనులనుంచి తప్పించడాన్ని ప్రోత్సహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

1.7. ముగింపు:-

            జీవన సమరంలో సాంఘిక జీవనం సాధ్యమేనా? సంఘీ భావం కొరవడిన సమాజంలో బ్రతుకు భారం ఎంతవరకు ఈడ్చాలి? అపరిష్కృత సమస్యల పరిష్కారము వెతకలేని వారు ఎంతమంది? దానికి సమాధానం మనిషి తెలివి తేటలు, అనుభవాల సారం. భగ భగ మండే శాంతివనంలో కపోతాలనేగురవేసి జీవన సాగరంలో వెలిగొందడం మనిషి జీవన విధానం. ఏ నీతి ఏ తీరున సాగేనోయీ ఈ జీవన గమనం!

            ఈ విశ్వం మొత్తం మీద భూమి మీద మాత్రమే జీవరాశి నివశించే విధంగా ఉంది. భూమిమీద చాలా రకాల జీవరాశులు ఉన్నాయి. కానీ ఆలోచించగలిగే శక్తి ఉన్నది మాత్రం కేవలం మానవులకే. మిగతా వాటికి ఆలోచించే శక్తి తక్కువ. ఆలోచనలు వ్యక్తం చేసే శక్తి కూడా కేవలం మానవులకే ఉంది. ఇక ఆలోచనా శక్తి జంతువులలో కూడా ఉంటుంది. మెదడు ఉన్న ప్రతిజీవీ ఆలోచించగలగడమే ప్రధాన కారణం. మానవుడు కోతి నుండి పుట్టాడు అనేది శాస్త్రవేత్తల మాట. సమస్త జీవరాశుల తత్త్వం మనిషిలో ఉంది. దానినుంచి బయటకు వస్తూ మానవత్వం పెంచుకోవాలి. అప్పుడే మనిషి అన్న పదానికి అర్థం. అదే జీవన గమనం.

*****

("సాంఘికోద్యమ రూపకాలు": సంపాదకులు: ఆచార్య సజ్జా మోహన్ రావు: ముద్రణ: 2015:ISBN: 978-81-931899-4-8 లో  ఈ వ్యాసం ముద్రితం)

No comments: