Tuesday, May 30, 2023

శ్రీశ్రీ కవిత సమాజపు భవిత- విశ్లేషణ

 

- డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ౦,

నూజివీడు ప్రాంగణం, కృష్ణా జిల్లా- 521202.

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

సంచారవాణి: 9951171299.

1. ఉపోద్ఘాత౦:

            ఒకొక కవికి ఒక్కొక దిశా నిర్దేశం ఉంటుంది. వాళ్ళు చూసిన, చూడబోయే దార్శనికత వాళ్ళను మిగతావాళ్ళనుంచి వేరుచేస్తుంది. ప్రజాకవినీ, మహాకవినీ చేస్తుంది. ప్రపంచ జ్ఞానం, చెప్పిన అంశాలలో స్పష్టత, ప్రజానాడి, చెప్పే వేడి లాంటి చాలా అంశాలు కవిత్వంలో మరింత నగిషీలు చెప్పిన శిల్పంలా మెరుస్తూ ఉంటాయి.

            దీనికి సమకాలీన పరిస్థితులు, దేశపు సమస్యలు లాంటివి తీసుకోవడం ఆధునిక కాలానికి కవితా వస్తువులు. పురాణ ప్రతీకలు, కొత్త పోకడలు మరింత వాహ్వ్ అనిపించేలా అలంకారాలు అలంకరించడం ఆ కవి ప్రతిభకు పట్టాభిషేకం.  1930ల్లో పీడిత ప్రజల తిరుగుబాట్లు ఇండియాలో, క్యూబాలో, చిలీలో, స్పెయిన్లో  జరిగాయి. కార్మికుల సమ్మెలూ హక్కులకోసం, స్వేచ్ఛకోసం జరిగిన పోరాటాలూ ప్రపంచ చరిత్రలో 20వ శతాబ్దిలో ఎక్కువ. ముందున్న ఫ్యూడల్ వ్యవస్థమీద బూర్జువాల తిరుగుబాటే ఇది.  పీడితులే శ్రీశ్రీకి కెరటాలుగా పొంగి కనిపించారు. వర్గ రహిత సమాజం సాధ్యమయ్యే స్వప్నమే రష్యాగా భావించారు. సోవియట్ రష్యాకూ నాజీలకూ జరిగిన యుద్ధం ప్రపంచ చరిత్రలో పురోగమన శీలం కలిగిందో శ్రీశ్రీ ఆ యుద్ధపు తొలిదశలోనే గుర్తించడమే శ్రీశ్రీ కవితా చైతన్యం.  

2. సమకాలిక సమాజ దృశ్యాలు:

సమాజ సంస్కరణ నేపథ్యంగా సాగిన  పురోగమనం గురజాడనుంచి శ్రీశ్రీ ఒక కవితా ప్రస్థానం. గురజాడ కవిత్వంలో ఫ్యూడల్ సమాజ వాస్తవికత, బూర్జువా సమాజపు ఊహలు ప్రతిబింబాలు, శ్రీశ్రీ కవితలో బూర్జువా సమాజపు వాస్తవిక, సామ్యవాద సమాజపు ఊహలు ప్రతిఫలిస్తాయి.

నిరుద్యోగానికి యవకుల బలి,

బిచ్చగాళ్లను ఎవరూ పట్టించుకోకపోవడం,

సామాజిక న్యాయం లేకపోవడం ,

కొందరు ఉన్మాదులుగా మారిపోవడ౦,

ఆకలి తీరని యువతులు పడుపు వృత్తికి దిగడం,

యుద్ధాలలో యువకులు చనిపోవడం,

నిరాశవల్ల త్రాగుడుకు అలవాటు పడడం,

నేరం చేయని వాళ్ళను కూడా ఉరితీయడం,

కూలీలు సమ్మె కట్టడం,

కర్షకులు కార్మికులూ జీవన భారం మోయలేక దుఃఖించడం

ఆత్మహత్యలకు ప్రయత్నించడం,

యంత్ర శాలల్లో ప్రమాదాలకు కొందరు లోనుకావడం,

దిక్కు లేని శవాలుగా మరణాన్ని పొందటం,

ఒకవ్యక్తిని మరో వ్యక్తి, ఒక జాతిని మరోజాతి పీడిస్తూ ఉండడం ఎలా ఎన్నో...

ఈ లోపాలకు పరిష్కారం సంస్కరణం కాదు. హింస దీనికి ప్రధాన ఆయుధం. తన లోపాల్ని అంగీకరించదు. ఇవన్నీ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతికాది రంగాలన్నిటితోనూ ఎంతోకొంత సంబంధాన్ని కలిగి ఉండి. మొత్తంగా వ్యవస్థ మారిపోయేలా మనశ్చైతన్యం కోసం తన కవితా వస్తువుల్ని విస్తరించుకున్నాడు. వర్తమాన దురవస్థా సూచికాలైన కవితా వస్తువుల్ని స్వీకరించడంలో ఈ సమాజ వాస్తవికత నిండుగా కనిపిస్తుంది.

3. వర్గ దృష్టి, పీడక వర్గ ద్వేషం:

సాహసి, బాటసారి, భిక్షువర్షీయసి, ఉన్మాది, చేదుపాట, సంధ్యాసమస్యలు, ఆకాశ దీపం, అవతలి గట్టు, పరాజితులు, ఆః, నీడలు, అద్వైతం, వాడు, వ్యత్యాసం, శైశవగీతి,  మిథ్యావాది అనే 17 ఖండికల్లో సమాజాన్ని వర్గ దృష్టితోనూ, పీడక వర్గ ద్వేషంతోనూ విప్లవ ఆవేశంతోనూ చిత్రించాడు.

ఉదా: సాహసి కవితలో చూస్తే పారిశ్రామిక యుగ సమయం.  శ్రీశ్రీకి 'లోహవిహంగాలు' ఆకర్షించాయి. కవితాదర్శనంలో ఎగిరే లోహశ్యేనం ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా విమాన బాహువులు విసరడాన్ని శ్రీశ్రీ సమర్ధించాడు. నేడు కూడా ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న సైనిక చర్యకు ప్రధానమైన ఆయుధంగా వాడుతున్నది లోహవిహంగాలే. ఎగిరిన ఇనుప డేగగా విమానాన్ని ఉత్రేక్షించారు. అది ద్రోహాలను తూలగొట్టి, శాంతిని తెస్తుందని భావన.

            చిర దీక్షా తపస్సమీక్షణలో నిశ్చలసమాధిలో సర్గద్వారపుతోరణమై వ్రేలిన మస్తిష్కమం శ్రీశ్రీది. ఈ మస్తిష్కంలోనే అతనికి ఘోషలు, భాషలు, దృశ్యాలెన్నో తోచాయి. కవిత్వానికి ఆలోచననూ దృక్పథాన్ని ప్రధానంగా భావించిన శ్రీశ్రీ, మస్తిష్కాన్ని కులాయంగా భావించడం.  అందులో నివసించే భావాలను లోహవిహంగాలుగా భావించడం; వాటిని ఎగిరించ బూనుకోవడం అతివేలమైన అతివాదానికి నిదర్శనాలే.

            సామ్యవాదాన్ని కోరే అతివాది పీడకవర్గాన్ని ద్వేషించకమానదు. ఈ ద్వేషాన్ని తిరస్కరించే మితవాది సుప్త భుజంగాలను కదిలించ వద్దంటాడు. ఈ హితబోధను అనుకరించి వెక్కిరించడమే అతివాది చేసేపని. మనోవల్మీకంలో నిద్రించే భుజంగాలను కదిలించమంటాడు. అతివాది, భుజంగాలకు కదలడమే సహజచైతన్యం. కానీ కుబుసంతో ఉన్న భుజంగాలు వల్మీకంలో నిద్రిస్తూ ఉంటాయి. వాటిని కదిలించడం అపాయ౦. ఈ భుజంగాలు మనోవల్మీకంలోనివి కావడంవల్ల వాటిని కదిలించడమే కర్తవ్యంగా అతివాది భావిస్తాడు. ఇది వైవిధ్య భరిత సన్నివేశాల సమాహారం. అంతరంగ ఆలోచన సరాలు. పీడక వర్గ ద్వేషం.

4. మనో వాస్తవికత, విశ్లేషణా దృక్పథం:

పీడిత మానవుడి మానసిక వేదన మరో అంశం. ఇది బయటకు కనిపించని బలహీనత. దేనికొరకు, కేక, ఒక రాత్రి, ఒక క్షణంలో అనే నాలుగు కవితలో మనో వాస్తవికత, మనో విశ్లేషణ ద్వారా వ్యధను వ్యక్తపరిచాడు.

ఉదా: ఒకరాత్రి కవితలో -  పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత అయినోరోజున ఆకాశంవైపు చూసిన ఒక రాత్రి అది,

గగనమంతానిండి పొగలాగు క్రమ్మి ఉందట ఆ రోజు తన భయానికి కారణం ఆ వెన్నెల! వెన్నెలకు పోలికగా పొగ ఎప్పుడైతే చెప్పాడో, ఆకాళానికి పోలిక శ్మశానంగా అప్పుడే సూచిస్తున్నాడు శ్రీశ్రీ. పొగద్వారా శ్మశానాన్నీ, శ్మశానంద్వారా శవదహనాన్నీ, శవదహనం ద్వారా మృత్యువునీ జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రీశ్రీ 1930లో 63 రోజులు టైఫాయిడ్ జ్వరంతో చివరకు  మృత్యువును గెలిచి బ్రతికాడు. కానీ బ్రతికిన తనకు బ్రతుకు తెరువు కనిపించడం లేదు. ఇదే భయానికి కారణం.

'బహుళపంచమిజ్యోత్స్న భయపెట్టు నన్ను' అంటాడు. బహుళ పంచమి తన జీవితంలోని నిరుద్యోగదశ.  నిరుద్యోగానికి కారణం సమాజవ్యవస్థ అతని భయానికి తగినట్లే  ఆకాశం ఎడారిగాను,  వెన్నెల ఇసుక తుఫానుగాను చెప్పడం. ఒంటరితనానికి సూచికలు.

ఎడారిలో ఇసుకతుఫాను రేగిన దృశ్యం బీభత్సరసాస్పదం. ఆకాశపు టెకారి శ్రీశ్రీ హృదయానికి ప్రతీక.   'ఈరేయి' అనేది తాను ఆ విషాదాన్ని అనుభవించిన రాత్రికే కాదు, కఠోరమైన సమాజ వాస్తవికతకు సంకేతం.

 

 నిజానికి ఈ మానసిక కల్లోలంగా శ్రీశ్రీ కూర్చున్న చోటు సాగరతీర౦!  హోరెత్తడం సముద్రానికి సహజమేకాని, 'నోరెత్తి హోరెత్తడం మాత్రం ఆచేతనానికి మానవత్వం ఆరోపించడ౦. ఇక్కడ సముద్రదుఃఖంలో శ్రీశ్రీ దుఃఖమే ధ్వనిస్తుంది. అంతేకాదు, సమాజంలోని అన్యాయాలను గురించి సాగరుడంతటివాడు నోరెత్తి, హోరెత్తి నొగులుతూ ఉన్నా ఆ సమాజం మాత్రం వినిపించుకునే స్థితిలో లేదు.  

5. సమాకాలీన సమాజ పాలకుల ప్రభావం:

కవిత్వాన్ని నిర్దేశించడం ద్వారా కవితా వస్తువును ఆలోచింపజేయడం ద్వారా కవులను పాఠకులను చైతన్యపరచడం శ్రీశ్రీ లో కొత్తకోణం. కవితా వస్తువు, సామగ్రి, సంవిధానం, ప్రయోజనం, దృక్పథం, పాఠక వర్గం మొదలైన వాటికి విశ్లేషించేలా ఋక్కులు, కవితా ఓ కవితా, నవకవిత, ప్రతిజ్ఞ, కళారవి, స్విన్ బర్న్ కవికి, గంటలు అనే ఖండికలు దీన్ని విశ్లేషిస్తాయి.

ఉదా: ఋక్కులు కవితను చూస్తే- రొట్టెముక్కా, అరటితొక్కా, బల్లచెక్కా కవివేపే చూస్తూ ఉంటాయనీ తమలోతు కనుక్కోమంటాయని చెప్పడంతో అచేతనమైన వస్తువులకు చేతనధర్మాన్ని ఆరోపించడం జరిగింది.

 

            రొట్టెముక్క చూస్తుంది - మాటాడుతుంది శ్రీశ్రీ సృజనలో.  రొట్టెముక్కకు లోతు దాని చరిత్రకు సంకేతం. అది ఎలా తయారైంది? చేసిన శ్రామికుడి ఉత్పత్తి సాధనాలు? అవి ఎవరిదగ్గర ఉన్నాయి? అది దొరకక ఎంతమంది తల్లడిల్లుతున్నారు? లాంటివి అన్నీ లోతులే. అరటితొక్క లోతు ఆ పండ్లపండించిన కర్షకుడిదాకా తీసుకుపోతుంది. బల్ల చెక్క లోతు దాన్ని కోసిన కార్మికుడి జీవితంవైపు చూపిస్తుంది.

వీటిపై దృష్టి పెట్టిన నాయకుడు ఎవరు? అనే ప్రశ్నను చెప్తాయి. శ్రమశక్తిని గుర్తించవలసిన వైనాన్ని సూచిస్తాయి. పాలకులు పాలితులు పడుతున్న వ్యవస్థలోని అవస్థలను గుర్తించాలి. అప్పుడే నిజమైన సేవానాయకుడు అవుతాడు. అలాంటి సమాజాన్ని కావాలనే కవి ఆకాంక్ష కనిపిస్తుందిక్కడ.

 

సమకాలీన సమాజం మీద ఎంతో కొంత పాలకుల ప్రభావం ఉంటుంది. దానికి పర్యయవసానం ప్రజల మీద పడుతుంది. ఇలా రాజకీయ అంశాలు సమకాలీన సమాజం ప్రాతినిథ్యాలు. ఈ నేపథ్యంగా రాజకీయ విమర్శ, రాజకీయ వాస్తవికతను చూపడం, తర్వాత రాజకీయ ప్రక్షాళన చేయడం ప్రధానంగా భావించాడు. ఈ అంశాలను గర్జించు రష్యా, అభ్యుదయం, నిజంగానే, జగన్నాథుని రథ చక్రాలు అనే నాల్గు కవితలు నిరూపిస్తాయి.

6. భౌతిక వాదంద్వారా సామాజిక దృక్కోణం:

            చరిత్రగా ఒకప్పటి వర్తమాన౦. చరిత్రకు ముడిపదార్థం సమాజ జీవన౦. చారిత్రక అంశాలులో భాగాలుగా చరిత్రలో ఉన్న వాస్తవికత, విమర్శ, భౌతిక వాదం ఆధారంగా సమాజ స్థితిని కవితా వస్తువును చూడటం శ్రీశ్రీ కవితల్లో కనిపిస్తాయి. ఈ నేపథ్యాల్లో శ్రీశ్రీ ఐ, జ్వాలా తోరణం, అవతారం, దేశ చరిత్రలు, జయభేరి, ఆశాదూతలు, మనవూడా, కొంపెల్ల జనార్థన రావు కోసం అనే కవితలు భూత కాలాన్ని సూచిస్తూ,  భవిష్యత్ ను చూడాల్సిన కోణాల్ని దర్శింపజేస్తుంది. ఇది కవిని ద్రష్టగా చేయడానికి సహకరించే అంశం.

ఉదా:   '' అనే గీతంలో శ్రీశ్రీ చెప్పిన 'నేను' వేదకాలంనాటి ఆదిమకుటుంబవ్యవస్థలో మధ్య యుగంనాటి ఫ్యూడల్ వ్యవస్థలో ఆధునిక యుగంలోని బూర్జువావ్యవస్థలో- కావ్య స్రష్ట అయిన కవికి ప్రతినిధి.  ప్రయోగాలు భవిష్యత్తులో సంప్రదాయాలుగా మారుతూ ఆసంప్రదాయాలమీద తిరుగుబాటు జరిగి కొత్త ప్రయోగాలు జరిగినప్పుడల్లా కవితాయుగాలు మారి పోయాయి. వాటిని కవి గుర్తించాలి.   వీటి సౌందర్యం తెలుసుకున్న వాడే వాస్తవ ప్రపంచాన్ని మార్చడానికి కవిత్వాన్ని అంకితం చేయగలడు.   నాటి సమాజం ఉన్న దశను బట్టి కోరే అభ్యుదయం భిన్నస్థాయుల్లో ఉంటుంది,

 

ప్రపంచాగ్నికి సమిధ నాహుతిచ్చాననీ విశ్వవృష్టికి అశ్రువు ధారవోశాననీ భువనఘోషకు వెర్రిగొంతుక విచ్చిమోశాననీ చెప్పుకున్న శ్రీశ్రీ, వేదకాలంనాటి సమాజాన్ని స్మరించాడు.. అందుకే భూతాన్ని యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్యగీతాన్ని అన్నాడు. భూతం, యజ్ఞోపవీతం అనే మాటలతో తిరిగి వర్ణాశ్రమ ధర్మాలను గుర్తుకు తెస్తున్నాడా అని సందేహించినవారు ప్రశ్నించగా శ్రీశ్రీయే భూతం స్పిరిట్ కూ;  యజ్ఞోపవీతం పవిత్రతకూ సంకేతాలు. మానవుడికి సమస్త చైతన్యాన్ని కలిగిస్తున్న పదార్థమే భూతం. వస్తుగత వాస్తవికతే మానవుడికి కలుగుతున్న మనోభావాలకు మూలం. భౌతికవాదమే శ్రీశ్రీ తాను భూతాన్ని (matter) అనడంలోప్రేరణ.   యజ్ఞోపవీతం పవిత్రతేకాక   ఆంధవిశ్వాసాలకు అతీతమైన ఆలోచన ఇది.

7. పరిభాషలను సంకేతాలతో సామాజిక కోణం:

ప్రాచీన పరిభాషలను నూతన చైతన్య సంకేతాలుగా వాడటం శ్రీశ్రీ టెక్నిక్. యజ్ఞోపవీతం, ఋక్కులు, మహాప్రస్థానం, జ్వాలాతోరణం, ఆకాశదీపంలా౦టి కవితల్లో ఇలాంటి పరిభాషలు కనిపిస్తాయి.

            వేదకాలపువాఙ్మయమంతా ఛందోవిశిష్టమైన గీతాలే. వచనం లేదు. వేదంలోని భావాలన్నీ 'భువనఘోషకు వెర్రిగొంతుకలే' కానీ ఉబుసుపోకకు విలాసంగా ఆలాపించినవి కావు. ఆనాడే మొదలయింది విప్లవగీతం. అయితే అది భౌతిక విప్లవం కాకపోవచ్చు. చీకటి ను౦చి వెలుగులోకి పోవడమే ఆనాటి భావవిప్లవం. అనాటి సమాజం సమష్టి కుటుంబవ్యవస్థే కనుక సమస్యలు వేరు..

 

8. విభిన్న సిద్ధాంతాల నేపథ్యంలో సమాజాన్ని చూసేకోణం:

            శ్రీశ్రీమీద మార్క్స్ ఏంగెల్స్ గతితార్కిక భౌతిక వాదం, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం, హెగెల్ భావ వాదం, బలమైన ప్రభావాన్ని వేశాయి.  

ఇందులో మూడు సూత్రాలు ఉన్నాయి పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ, 2. విరోధి, వైరుధ్య సూత్ర౦, ౩ పరిణామానుగుణంగా మారే పద్ధతి. మొత్తం మీద ఈ వైరుద్ధ్య గుణాల ఫలం మూల పదార్థం నాశనం, తద్వారా కొత్తది రావడం. శ్రీశ్రీ దేశచరిత్రలు గతితార్కిక భౌతిక వాదానికి ప్రతీక. 

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం

నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ బూర్జువా చరిత్ర కవులు దేశచరిత్రను వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల నేపథ్యాలను ఆలోచింపజేశాడు. రాజుల దండయాత్రలు, రాజకీయ వేత్తల చాకచక్యాలు, సేనాపతుల పరాక్రమాలు ఏం చెప్పాయి? జాతి గౌరవాన్ని, దేశ గౌరవాన్ని నిలబెట్టడానికి పోరాటాలు ఇవన్నీ నాటి ప్రజలను ఎంత ఇబ్బందులకు గురిచేశాయి...

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో

ఏ రాజ్యం ఎన్నాళ్లు౦దో

తారీఖులు దస్తావేజులు

ఇవి కావోయ్   చరిత్రకర్థం

నైలు నదీ నాగరికతలో 

సామాన్యుని జీవన మెట్టిది?

తాజ్ మహల్ నిర్మాణానికి

రాల్లెత్తిన కూలీలెవ్వరు?

వీరంతా కష్టజీవులు. నిజమైన సామాజిక చరిత్ర. ఇది చీకటి కోణంగా చిత్రించిన చరిత్ర చరిత్ర కాదు అని నిగ్గు తేల్చాడు. వీరంతా అణగారిన జనులు, ఖండాంతరాల్లో ఉన్నారు. వారి యథార్థ తత్త్వాన్ని తమ తమ గొంతుకతో చాటి చెప్తున్నాయ్ కార్మిక పీడిత వర్గంగా.

ఇలాంటి నిర్వేదం నుంచి ఆశావాదంలోకి ప్రజలు రావాలి.  

శ్రమ నిష్ఫలమై

జని నిష్ఠురమై

నూతినిగోతిని వెదకే వాళ్ళూ

అనేకులింకా ఆభాగ్యులంతా

విప్లవ శంఖం వినిపించాలని పిలుపు నిచ్చారు.

నరజాతి సమస్తం, దరిద్రులను కాల్చుక తినడం అంటూ ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు అంటూ పెట్టుబడి దారి, జమీందారీ వ్యవస్థలో ఉన్న వర్గ వైరుధ్యాన్ని విరోధ వైరుధ్య సూత్ర ప్రాతిపదికగా ప్రబోధించడం గమనించాలి.

 

9. సింహావలోకనం :

            ఇలా సమాజంలో ఉన్న అధర్మాన్ని సామాజిక ధర్మంతో ముడివేసి పీడిత వర్గం, పీడన వర్గం ప్రవర్తిస్తున్న స్థితిని తెలియజేస్తుంది. పీడిత వర్గ పురోగతికి అవరోధాల్ తొలగిపోవడం కోసం నరకలోకపు  జగిలమ్ములు, గొలుసు త్రెంచుకు ఊరికి పడ్డాయి  అంటూ గ్రీకు పురాణ సాంప్రదాయంలో నరక ద్వారంలో మూడు తలలలు ఉన్న కుక్కలు కాపలా ఉండే సన్నివేశాన్ని సూచించారు. కనక దుర్గా చండ సింహం  జూలు దులిపి ఆవులించింది అంటూ కార్మికుల తిరుగుబాటు ప్రతికలుగా వర్ణించాడు. నందికేశుడు వ్యవసాయానికి ప్రతీక. నందికేశుడు రంకె జమీందారీ విధానంపై కర్షకుల తిరుగుబాటుకు ప్రతీక. వరాహమూర్తి ఒంటికోరతో ప్రళయ సముద్రంలో ప్రళయ సముద్రంలో మునిగిన వేదాలను ఉద్ధరించిన పురాణగాథను తెల్పుతుంది. వేదం సామ్యవాద వేదం దీన్ని ఉద్ధరించడానికి లోక కళ్యాణ హేతువుగా సమసమాజ  నిర్మాణానికి సంఘటిత శక్తి గా శ్రీశ్రీ భావించారు. వెరసి శ్రీశ్రీ కవితా శక్తి సమాజపు దివిటీ, యువతకు భవితను సూచించే శక్తి కూడా.

ఆధారాలు:

మహాప్రస్థానం- శ్రీశ్రీ

యుగకర్త శ్రీశ్రీ

శ్రీశ్రీ కవిత్వం, వస్తువు సంవిధానం- మిరియాల రామకృష్ణ

శ్రీశ్రీ బులిటెన్ 1,2

శ్రీశ్రీ విశేష సంచిక

(మహాకవి శ్రీశ్రీ జీవితం- సాహిత్యం, జాతీయసదస్సు, నిర్వహణ: శ్రీశ్రీ కళావేదిక, శ్రీకృష్ణరాయ విశ్వవిద్యాలయం శాఖ, అనంతపురం, 515003, జాతీయ సదస్సు: తేదీ: 9&10 మే, 2022లో పత్ర సమర్పణ: భావవీణ ప్రత్యేక సంచికలో ముద్రణ: vol: 19, issue: 5 ప్రత్యేక సంచిక: మే, 2022, ISSN: 2456-4702 )

 

No comments: