- డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు,
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేత విశ్వవిద్యాలయం,
నూజివీడు ప్రాంగణం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
విద్యుల్లేఖ: seethuphd@gmail.com
సంచారవాణి: 9951171299.
1.0. ఉపోద్ఘాతం:-
జాషువా అనగానే గుర్తు వచ్చే కవిత్వం గబ్బిలం. మిగతా కవిత్వాలకంటే ప్రజలలో ఎక్కువ పేరు సంపాదించి పెట్టింది, ఈ గబ్బిలమే. గబ్బిలంలో వస్తువు- దళిత సమస్యలు, వారి సాంఘిక అసమానతలకు, వెనుకబాటు తనానికి ఉండే అంశాలు కథా వస్తువు. హిందువులుగా ఉన్నా దూరంగా ఉంచే స్థితి. ఇది జీవితంలో పడి లేచిన వ్యక్తిత్వ తత్త్వానికి నిలువెత్తు నిదర్శనం జాషువా.
1. 1. వస్తు నవ్యత:
వస్తువు పర౦గా చూస్తే ఆధునికం. ప్రాచీన సాహిత్యంలో ఇలాంటి వర్ణ వ్యవస్థ దళితులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన కావ్యాలు జాషువా కాలానికి రాలేదు. ఇందులో అభ్యుదయం కూడా ఉంది. అంటే వస్తువు సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిమ్నవర్గాల వేదనకు సాక్ష్యం. పైగా జాతీయోద్యమం అంతర్లయగా సాగడం లోచూపు. ఆంధ్రోద్యమం అంతర్వాహిని. ఇవన్నీ అప్పటికి సమకాలీనం, ఆధునికమే. నేటికీ అన్వయించడానికి తగిన సరంజామాను సిద్ధం చేశాడు. మతం మారణహోమం, మానవత్వం మసకబారిపోవడం లాంటివి లోకంలో కనిపిస్తూనే ఉంటాయి. అక్కడ జాషువా కవిత్వం స్వేచ్ఛాయుత ఆలోచనలకు శక్తిని ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.
ఉదా: పామునకు పాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడ
నులికిపడు జబ్బు కలదు వీడున్న చోట(గబ్బిలం, 6)పాముకు పాలు, చీమకు పంచదార పెట్టి పోషించే కర్మ భూమి అనడంలో అధిక్షేపణ. పైగా కర్మభూమి అనడంలో వ్యంగ్యం. ఇతడు ఉన్న చోట ధర్మదేవత కూడా ఉలిక్కిపడే జబ్బు కలిగి ఉంటుంది అనడంలో చమత్కారం, దళితుడి పట్ల చీత్కారం చూపించడం, అంతరానితనం అనే దైన్యాన్ని వ్యక్తం చేయడం ఇవన్నీ ఆధునిక వస్తుజనితాలే. ధర్మం అనేది ఎప్పటినుంచో వస్తున్నే ఉంది. దాని స్థితి ఇంకా అధ్వాహ్నంగా ఉండడాన్ని కవి పాఠకుడి ఆలోచనలకు వదిలేస్తూనే, తార్కిక దృష్టికి, హేతుబద్ధతలను నిలదీశాడు.
1.2. కథానాయకుణ్ణి ఎంచుకోవడంలో నవ్యత:
ప్రాచీన మర్యాదలకు భిన్నంగా ఈ నాయకుడిని స్వీకరించడం. సుందరుడు, ఉత్తమ కుల౦లో పుట్టినవాడు, విద్యావంతుడు, సంపన్నుడు లాంటి లక్షణాలు ప్రాచీన కావ్య నాయకుడివి.
ఇక్కడ నాయకుడు చెప్పులు కుట్టి జీవనం చేయడం. చెప్పులు కుట్టడంలోనే శూద్రత్వాన్ని చూసే పెద్దమనుషులకు ఆ జీవనం చేసే వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తున్నాడు. వేద ప్రమాణమైన పురుష సూక్తంలో "...పద్మాభ్యాగు౦ శూద్రోజాతః.." విద్యావంతుడు కాకపోవడం. బక్కపలచగా ఉండే దేహం. పేలవంగా ఉండే శరీరం. కానీ నీతిమంతుడు.
ఆధునిక కవితా యుగంలో వచ్చిన మార్పులను గమనిస్తూనే నాయకుడిని ఎంపిక చేసుకోవడం. బాహ్య సౌందర్యం కన్నా, ఆత్మ సౌందర్య౦ మిన్న అనే సిద్ధాంతాన్ని లేదా దృక్పథాన్ని కలిగి ఉండడం ఆధునికమే.
"స్వార్థమున నిన్ను కొరముట్టు వలె గణింప/ కడుపునిండిన భాగ్యవంతుడను కాను
దోషములు సూపి నీకు నీతులు వచించి/ దొరతనము సేయగా మతస్థుడను కాను"(గబ్బిలం, 30)
స్వార్థంతో నిన్ను పనిముట్టులా లెక్కించడానికి నేను కడుపు నిండిన భాగ్యవంతుణ్ణి కాను. తప్పులు చూపి నీతులు చెప్పి, దొరతనం చేయడానికి మతావలంబిని కాను. నాకు ఏ మతంతో పని లేదు అని ఇక్కడ స్పష్ట౦గా చెప్పడం ద్వారా ఇది సందేశాత్మక కావ్యంగా చూడొచ్చు.
ఆధునిక కావ్యంగా అనుదాత్త వస్తువులను కావ్యంగా స్వీకరించడం కనిపిస్తుంది. శ్రీశ్రీ కుక్కపిల్ల, సబ్బుబిళ్ల... లా౦టి వాటిని కవితా దృష్టితో చూడొచ్చు అని చెప్పాడు. ఇక్కడ కూడా దళితుడు, సమాజానికి దూరంగా ఉండేవాడు. సమాజంలో హీనంగా పరిగణించేవాడు కథానాయకుడు. కవితా వస్తువులో గబ్బిలం కథను నడిపించే తీరులో కవి దళితుడికి ప్రతీకగా ఎన్నుకున్నాడు.
1.3. పద ప్రయోగంలో నవ్యత: ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలే , దయ్యపు పిల్ల, గబ్బిలాలరాణి, సహోదరి, పుణ్యురాలు, పక్షి సుందరి, పరోపకారిణి, పుల్గు పుణ్యాంగణ, ఖగ సన్యాసిని లాంటి పదాలతో సంబోధిస్తాడు. ఇవన్నీ గబ్బిలాన్ని సూచించేవే. అందులో నాయక పాత్ర కంటే నాయికి గా చూపడం మరో ఆధునిక కోణం.
1.4. సందేశాత్మకం: ఒక సందేశాన్ని ఇవ్వడానికి గాని దళిత తత్త్వానికి ప్రతీక గబ్బిలం. ఇందులో దూతగా వ్యవహరిస్తాడు. ప్రాచీన కావ్యాల్లో ప్రధానంగా నైషధంలో హర్షుడు నలదమయంతుల చరిత్రలో హంస, మేఘసందేశంలో మేఘుడు లాంటి ఉత్తమ జాతి దూతలు ఇక్కడ తీసుకోలేదు. కానీ దూత భావన మాత్రంగా స్వీకరించాడు. ఈ కావ్యానికి ప్రేరణ మాత్రం మేఘసందేశమే అని జాషువా చెప్పుకున్నాడు.
మేఘసందేశంలో విరహంతో ఉన్న బంధిగా ఉన్న ఒక వ్యక్తిని తన భార్యతో మాట్లాడే అవకాశం లేకపోవడంతో మేఘుడిని సందేశ కర్తగా కాళిదాసు వాడుకున్నాడు. అది అప్పటి సమాజం మెచ్చుకుంది. కానీ ఇక్కడ కథానాయకుడు దళితుడు. అతడి సందేశాన్ని శివుడికి అందజేయాలి. దానికి దూత గబ్బిలం.
మేఘసందేశంలో విరహ సందేశం. గబ్బిలంలో అశ్రుసందేశం. మేఘసందేశంలో అతడి శిక్షాకాలం ఒకసంవత్సరమే. కానీ గబ్బిలంలో కథానాయకుడికి జన్మ జన్మలనుంచి వస్తూనే ఉంది ఎప్పటికీ పోతుందో కూడా తెలియనంత స్థితి. దీనికి అవధి లేదు.
మేఘసందేశంలో మన్మథాగ్ని తప్తుడు, గబ్బిలంలో క్షుధాలన పీడితుడు.
అక్కడ సందేశకర్త ప్రణయోన్నత్తుడు (మేఘుడు) కాడు. గబ్బిలంలో సందేశ స్వీకర్త నాయిక కాదు, ఈశ్వరుడు. పైగా ఈశ్వరుడి నెపంతో సమాజంలో ఉన్న దళిత సమస్యలు, ప్రయాణంలో ఉన్న క్షేత్రాలు, కవి కాల్పనిత, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం, వాటి గతవైభవ స్ఫూర్తి గుర్తుకు తెచ్చేలా వర్ణించడం గబ్బిలంలో సాహిత్య, కళాత్మక, చారిత్రక సమ్మేళనంగా కనిపిస్తుంది.
1.5. కర్మ సిద్ధాంత దృక్పథ విమర్శ:
తరతరాలుగా భారతదేశంలో చతుర్వర్ణవ్యవస్థ ఉంది. దానిలో ఉపవర్ణాలు వచ్చాయి. ఉపకులాలు ఏర్పడ్డాయి. తర్వాత అది కులవ్యవస్థగా స్థిరపడింది. ఇది నిచ్చెన మెట్ల క్రమానుగ్రత శ్రేణి (hierarchy)/ సోపానక్రమంగా ఉంటుంది. వృత్తి సిద్ధాంతం, వర్ణ సిద్ధాంతాలు, శుచి- అశుచి లాంటి అంశాలు సిద్ధాంతాలుగా మారి ఊరికి దూరంగా నెట్టివేశారు. అలాంటి వ్యవస్థలో కాలక్రమంలో సామాజిక కళంక స్థితికి దళితులను చేర్చారు.
కర్మ సిద్ధాంతం, భారతీయ హైందవ ఛాందస వాద సిద్ధాంతాలు, వేదాంతం, మనుస్మృతి లాంటివి మరింత వివక్షకు గురిచేసి బలాన్ని ఇచ్చాయి. అదే దళితుడికి శాపంగా మారింది. నిమ్నకులాలు ఆర్థికంగా వెనుకబడి ఉండడం కూడా ఈ పరిస్థితికి కారణాలు. పురాణాలు, శ్రుతులు, స్మృతులు, శాస్త్రాలు మతపరమైన విధులు మొదలైన అగ్రవర్ణాలకు, అందులోనూ ద్విజులకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇవన్నీ వారి ఆధిక్యాన్ని సమాజంలో ద్విజులకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇవన్నీ వారి ఆధిక్యాన్ని సమాజంలో వ్యవస్థీకృతం చేశాయి.
నా కవితా వధూటి వదనం లాంటి పద్యాలు గబ్బిలంలోని నాయకుడి దినావస్థను సూచిస్తుంది.
ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే(గబ్బిలం, 19)
రాయి రప్పలకు, బొమ్మలకు పెండ్లి చేయడానికి వందలు వేలు ఖర్చు చేస్తారు. కానీ దుఃఖంతో బాధితులైన పేద ఫకీరుల గిన్నెల్లో ఒక్క మెతుకైనా వేయరు. ఇదీ భారతావని పరిస్థితి. ముప్పది మూడుకోట్ల దేవతలున్నా దేశంలోని పేదజనుల ఆకలి బాధలు తీరవు. అనవసర విషయాలకు ఎంతో ఖర్చు చేసేవాడు ఆకలిగా ఉన్నవాళ్లను పట్టించుకోరు.
1.6. చారిత్రక ప్రశస్తి:
“పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్/ప్రాపకమిచ్చినట్టి రఘునాథనృపాలకు డేలియున్న తం
జాపురి మండలంబునకు చక్కగ దక్షిణభాగ భూములన్/కాపురముండె నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై”
ఈ పద్యం చారిత్రాత్మికమైంది. రఘునాథ నాయకుడికి ఈ దళితుడికి ఉన్న సంబంధం ఏంటి?చిన్నవయసులో వలసపోయాడు. అంటే ఇక్కడ మాల దాసరి కుటుంబాలను సూచిస్తున్నాడు. ఆముక్త మాల్యదలో మాలదాసరి గురించి కృష్ణదేవరాయలు చెప్పాడు. ఆ తర్వాత ఆ కులానికి చెందిన ప్రజలు వలసపోయారు. ఎక్కడికి? తంజావూరు అక్కడ వాళ్ళకు పనేమిటి? చేతనైన పని ఒక్కటే, గానం చేయడం. తగిన విధంగా పాటను కూర్చడం. అప్పుడే యక్షగానాలు ముప్పలు తెప్పలుగా వచ్చాయి. రఘునాథనాయకుడు, విజయ రాఘవనాయకుడు కలం యక్షగానాలకు స్వర్ణయుగం. అందుకే ప్రాపకం ఇచ్చిన వాడు అని, నృపాలకుడు అని గౌరవవాచకాల ద్వారా రఘునాథుడు చేసిన దళితుల పట్ల పరోక్ష సేవను స్పురింపజేస్తున్నాడు. ఈ విషయానికి కొనసాగింపుగా:
“కృష్ణరాయలవారి యెడబాట్లు చీకట్లు, ముసరి దిక్కులలోన మసలువేళ
భూరి వాఙ్మయ లక్ష్మి దారిబత్తెముతోడ, తంజాపురము వంకదరులు వేళ
వేంకటకవి తెల్గు పంకేరుహాక్షికి, శ్లేషోక్తుల లవాటు సేయువేళ
బచ్చ పచ్చని ముద్దుపళని ముద్దులకైత, శృ౦గార రసము వర్షించువేళ
మువ్వగోపాల దేవుని పూజసేయ, ఘనుడు క్షేత్రయ కలమందుకొనినవేళ
నపర రాయలు రఘునాథ నృపతి విభుడు, కట్టుకొన్నాడు సత్కీర్తి కుట్టిమంబు”
రాక్షస తంగడి వచ్చాక చీకట్లు రాజ్యంతో పాటు, సాహిత్యానికీ ముసిరాయి. అందుకే ప్రజలు, సహజ సాహిత్యవేత్తలు తంజావూరు వెళ్లాల్సి వచ్చింది. చేమకూర వేంకట కవి ‘ప్రతిపద్య చమత్కారాన్ని’చూపాడు. ఆ కాలంలోనే ఆంధ్ర దేశాన్ని శ్లేషతో సాహిత్యానికో ఊపును అందించాడు. శృ౦గార రసరాజమై రాజ్యమేలినా క్షేత్రయ్య లాంటి వాళ్ళు తగిన విధంగా స్పందించారు. ఆ రకంగా రఘునాథుడు కాలంలో వేశ్యగా ఉన్న మధురవాణి లాంటి వాళ్ళను ఆదరించడం అతడిలో కవిత్వం పట్ల, మనుషులపట్ల ఉన్న అభిప్రాయాన్ని జాషువా కీర్తిస్తున్నాడు. క్షేత్రయ్య జీవితకాలం 1595-1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు ‘వరదయ్య’. ఇంటిపేరు ‘మొవ్వ’. క్షేత్రయ్య పదాలలోని ‘వరద’ అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు ‘వరదయ్య’గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ ఊరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.
జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని దగ్గర నాట్యం నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన “మోహనాంగి” అనే దేవదాసితో సన్నిహితుడైనాడు. తర్వాత మేనమామ కూతురు “రుక్మిణి”ని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట.
మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచ౦లోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడైన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్త్వంఅనేది వరదయ్యను అలుము కొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో చాలా పాటలు పాడాడు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట.ఇది ఇకృష్టమైన తాత్త్విక శక్తి. కేవలం మనిషిని మనిషిగా చూడలేని స్థితినుంచి ఒక దేవదాసీ సహపాఠిగా ఉన్న క్షేత్రయ్య జీవనం ఆ కాలం గొప్పదిగా ఆ సమాజాన్ని అప్పటి నాయకత్వాన్ని జాషువా అభినందిస్తున్నాడు. ఆ నేపథ్యంలో ఉన్న చారిత్రక అంశాల్ని స్పృశించారు.
మధురవాణి రఘునాథ నాయకుని ఆస్థాన౦లో విదుషీమణులలో ఒకరు. “శుకవాణి” ఈమె మొదటి పేరు. సంస్కృత౦లో సుందరకాండ వరకు రామాయణాన్ని రచించింది. ఇది సంపూర్ణంగా లభించలేదు. 1500 శ్లోకాలున్న 14 సర్గల గ్రంథము లభింస్తున్నది. రామాయణ సారా కావ్య తిలకము 9 సర్గాంత గద్యలలోమధురైక ధురంధరాంద్ర కవితా నిర్మాణ సమ్మాన్యయా అని ఈమె చెప్పుకు౦ది. ఈమె అరఘడియలో వంద శ్లోకాలు చెప్పగలదు అని,ఆరు భాషలలో కవిత్వం చెప్పగలదు అని,చిత్ర కవిత్వం ఆమెకు తెలుసునని ఆమెకు ఉన్న బిరుదుల్ని బట్టి తెలుస్తుంది. రఘునాథ నాయకునిచే కనకాభిషేకం పొందిన మహిళ. అంతేగాక సరస్వతీ మహల్(భాండాగారాన్ని) ని పండితవాగ్వాదంలో గెలిచి మధురనుండి తంజావూరుకు తెచ్చింది. ప్రధాన రచనలు: రామాయణ కావ్యతిలకము(సంస్కృత) కుమారసంభవం (సంస్కృత) నైషధం(సంస్కృత చంపూకావ్యం). అలాంటి విదూషీమణులకు ఆశ్రయం ఇచ్చినవాడుగా వారందరీ కీర్తించడంలో జాషువా కు ఉన్న చారిత్రక అవగాహన స్పష్టం.
1.6.1. ఆంధ్రచరిత్ర:
"అల బుస్సీదొర కొల్లగొట్టిన యనన్యంబైన మా వెల్మ వీ
రుల విఖ్యాత పరాక్రమజ్వలన మూర్పుల్ జిమ్ముచున్నట్టి బొ
బ్బిలి కోటం గని దాటిపొమ్ము చటులావేశంబు దేహంబునన్
మొలుచున్ బొల్చు కవోష్ణ వీర రుధిరంబున్ జీవనాళంబులన్" (గబ్బిలం, 68)
బుస్సీదొర కొల్లగొట్టిన అతిగొప్పదైన వెలమ వీరుల బొబ్బిలి కోటను దాటిపో అక్కడ పరాక్రమం వెల్లి విరుస్తుంది. రక్తం సలసల మరుగుతుంది. వీరత్వం జ్వలిస్తుంది. అక్కడికి వెళితే ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఆంధ్ర దేశ చరిత్రలో విశేషమైన యుద్ధం బొబ్బిలి యుద్ధం. విజయనగర పాలకుడు విజయరామరాజు బొబ్బిలి సంస్థానాన్ని నాశనం చేసే కుతంత్రంతో సాగిన ఈ చారిత్రక ఘట్టం స్వాతంత్ర రక్షణ కోసం బొబ్బిలి వీరులు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తు. ఫ్రెంచ్ సేనాని బుస్సీ దొరను పురిగొల్పి క్రీ.శ. 1757 (జనవరి, 26) న విజయ రామరాజు తన సైనికులతో, ఫ్రెంచి సైనికులతో, బొబ్బిలి కోటపై ముట్టడి చేయించాడు. కొన్ని గంటలలో బొబ్బిలికోట శత్రువుల వశం అయింది. తమకు పరాజయం తప్పదని గ్రహించిన బొబ్బిలి వీరుడు తాండ్ర పాపారాయుడు విజయరామరాజుని అర్ధరాత్రి పూట అతడి గుడారంలో వధించాడు. తాను ఆత్మహత్మ చేసుకున్నాడు. ఇక్కడ చారిత్రక యుద్ధాన్ని గుర్తు చేయడం కనిపిస్తుంది. "విఖ్యాత పరాక్రమజ్వలన మూర్పుల్" అని ప్రయోగించి భారతీయుడు కూడా శౌర్యాన్ని ప్రకటించాలని బోధించాడు. కవోష్ణ వీర రుధిరంబున్ లాంటి పదాల ద్వారా వీరరసంతో కర్తవ్యబోధ చేశాడు. చరిత్రలో ఇలాంటి ఘట్టాలు చారిత్రక స్పృహను, కవితా సైద్ధాంతికతను వెల్లడించాడు. మత్తేభ పద్యం బలానికి సూచిక.
1.7. తిరోగమన శక్తి(రివర్స్ ఎనర్జీ) జాషువా కవితా తత్త్వం:
మానసిక దైన్యాన్ని చెప్పడం ద్వారా రివర్స్ ఎనర్జీని సృష్టించే వైపు ప్రయాణం చేయడం జాషువా కవిత్వపు మరో తత్త్వం.“నీ నమస్కారముల నిక్కి నిక్కి నడువ/ బక్షిణీ నాకు నుద్యోగ బలము లేదు/ మెచ్చదగు నీ కళాశక్తి నుచ్చరింప/ ఖగసతీ! నాకు గులము లేదు”. నమస్కారం సంస్కారానికి నిదర్శనం. నమస్కరించినప్పుడు కాస్త వంగి చేస్తారు. దాన్ని నిక్కి నిక్కి అనడం, ఉద్యోగం లేనివాడికి బలం లేదు అనడం, కులం లేదు అనడం ఒక వైపు. ఇవన్నీ రివర్స్ గా ఉండే అంశాలు. అంటే వ్యతిరేకమైన భావనలు. నీ కళాశక్తి మెచ్చలేకపోవడం, ఉచ్చరించలేకపోవడం ఈ రెండు ఇంకో వైపు ... ఇవన్నీ వ్యతిరేక కోణాలు. అలాంటి సమూహానికి నిక్కి నిక్కి నమస్కరించాలా? అలా నమస్కరించి నడవాలా? అని ప్రశ్న. ఇక్కడ ఎక్కడా అనుకూలమైన పదాలు లేవు. కానీ నిక్కి అనడం లో ఉద్యోగ బలం కులయోగ్యత అనడంలో దీనత్వాన్ని చెప్పినట్లే ఉంటుంది. కానీ ఈ పద్యం చెప్పేటప్పుడు లేదా ఉచ్చరించేటప్పుడు “స్కా” ని సాగదీసి అనడం, నిక్కి, నిక్కి అన్నచోట "క్కి" ని బాగా ఊనికగా పలకడం చేస్తే ఆ వెటకారం తెలుస్తుంది. ఇది కవిత్వ మర్మం. రివర్స్ ఎనర్జీని,పోజిటివ్ ఎనర్జీ గా మార్చే నేర్పు.
“ధర్మమునకు బిరికితన మెన్నడును లేదు /సత్యవాక్యమునకు జావు లేదు
వెఱవ నేల నీకు విశ్వనాథుని మ్రోల/ సృష్టి కర్త తాను సృష్టి వీవు”
ధర్మం అన్ని చోట్లా విజయాన్ని ఇస్తుంది అని ఆర్యోక్తి. ఇందులో మూడు ఉపమానాంశాలు చెప్పి అది ఒక వస్తువుతో పోల్చడం ప్రత్యేకత. ధర్మానికి, సత్యానికి, విశ్వనాథుడికి బిరికితనం, చావు,వెఱువ(భయం) ల పట్ల ఎలాంటి ఇబ్బంది లేదు. పైగానిన్ను సృష్టి కర్త(బ్రహ్మ) సృష్టించాడు. అందుకే భయం, పిరికితనం లాంటి వాటికి ఇబ్బంది పడకు. సృష్టికర్తకు లేని సృష్టి పొందిన వాడికెందుకు? అంటూ రివర్స్ యాక్షన్ గా కనబడే కోణం ఇది. అంటే కులం తక్కువ, పనికి మాలిన వాడో అని తిట్టే కుహనా వ్యక్తుల గురించి ఆలోచి౦చకుండా ముందుకు సాగమని. దళితేతరులను కవిత్వంద్వారా ఆలోచింపజేస్తున్నాడు. భగవంతుడి దృష్టిలో లేని వాటిని పిరికితనాన్ని, చావు గురించి ఆలోచించకండి అంటూ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలని తెల్పుతున్నాడు. ఈ దళితేతరుల్ని ఇంకా బాగా ఆలోచింప జేసే ధోరణికి నడుం కట్టాడు కవి.
“సాత్త్వికాహారిణి తపశ్చర్య కతన/ నీ మనంబు జాలివెన్నెల రహించు
నాదు కన్నీటి కథ సమన్వయము సేయు / నార్ద్ర హృదయంబు గూడ కొంతవసరంబు”
ఇక్కడ సాత్త్వికాహారిణి పదం గబ్బిలమే అయినా అగ్రవర్ణంగా సమాజంలో ఉన్న శాకాహారులు, బ్రాహ్మణులు.కతన(= కారణం చేత)రహించు(= ఒప్పు, వర్ధిల్లు అని అర్థాలు)వల్ల కన్నీటి కథను అర్థం చేసుకోడానికే ఆర్ద్రహృదయం అవసరం అన్నాడు. ఇక్కడ ఏ బ్రాహ్మణుడిని దూషించలేదు. పైగా మీరు తపస్సు చేస్తారు. మీ మనస్సు జాలితో వెన్నెలతో వర్ధిల్లుతుంది అని ప్రశంసించడం గమనించాలి. ఇక్కడ నన్నయ చెప్పిన నిండుమనంబు నవ్య నవనీత సమానం బ్రాహ్మణుల మనసు అని ఉపమానం చెప్తే అలాంటిదే జాలి వెన్నెల అనడం. ఆర్ద్ర తడిసింది,నక్షత్రం అని అర్థాలు.ఇక్కడ హృదయానికి ఆర్ద్రత అంటే జాలి కలగడం ఆది దేనివల్ల వస్తుంది, తపశ్చర్య, సాత్వికాహారం కాబట్టి మా గురించి కాస్త ఆలోచించమని అభ్యర్థన కూడా. ఇది అనుకూల దృక్పథానికి తార్కాణం.
“నిండిన దోరవెన్నెలల నిక్కిన పచ్చిక మేసి చాందినీ/కొండబయళ్ళలో తిరుగు గోపతి నీ కగుపించు నందు వే
దండవిరోధి దాల్చిన జటులాటవి పూచిన పూవు చంద్రమా/ఖండము గోచరించు నెఱుకల్గల నీ కెరిగింప నేటికిన్”
“విలు నమ్ముల్ ధరియించి చెంచులు తదాభీలాటవీ మధ్య భూ/ముల కన్పట్టిన నంజలింపుము మహాత్ముండైన భర్గుండు భ
క్తుల కిష్టార్థము లీయగోరిన గణస్తోమంబుతో మాయ పం/దుల వేటాడుచు భిల్లుడై నరుల కన్నుల్ గప్పి క్రీడించెడిన్”
ఈ రెండు పద్యాలు శివ తత్త్వానికి ప్రతీకలు. ఎఱుక అనే పదానికి తెలివి, పరిచయం, సోదే, గుఱుతు జోస్యము అని అర్థాలు. మొదటి పద్యంలో నందీశ్వరుడిని (గోపతి) స్తుతి. అందులో ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు. ఎఱుక పదం లో ఉన్న జ్ఞానం అనే అర్థం, ఎఱుకల జాతి ప్రజలను సూచిస్తుంది. పూచిన పూవు, చంద్రమా ఖండం కనిపిస్తుంది అంటూ గుర్తులు చెప్పి, నీకు తెలియకపోవడం ఏంటి?అని సాధారణీకరిస్తున్నాడు. భర్గుడు అంటే శివుడు. నరుడి కన్నుల్ కప్పి క్రీడిస్తాడు అనడంలో కిరాతార్జునీయ సంఘటన స్ఫురిస్తుంది. శివుడులాంటి వాడు, ఇష్టార్థాలు ఇవ్వగలిగే వాడుసమూహాలుగా ఉంటారని ఇటు శివుడిని అడవిలో ఉండే గిరిజనుల్ని పోల్చాడు. భక్తులలో ఉన్న తిన్నడు, కన్నప్ప లాంటి వాళ్ళకు ఉద్ధరించేవాడిగా శివుడిని పరిచయం చేయడంలో జాషువా వ్యక్తిత్వం, శివుడి పట్ల ఉండే సహృద్భావం వ్యక్తమౌతుంది.ఇది చక్కటి కాల్పనికత(చక్కటి ఊహాతో కూడిన వర్ణన).
1.8. భావకవిత్వ విమర్శ:
ప్రణయకవి ఒకడు(నండూరి సుబ్బారావు)- ఎంకి పాటలు రాశాడు. పాషాణ కవి- (విశ్వనాథ సత్యనారాయణ) - రామాయణ కల్పవృక్షం, ఏడ్చుకవి(కృష్ణశాస్త్రి)- కృష్ణపక్షం) అని భావకవుల్ని విమర్శించడం.
ఇందులో 1. వస్తువు-దళిత సమస్యలు(అభ్యుదయం); 2. రూపం- పద్యం(సంప్రదాయం), 3. ప్రక్రియ- సందేశాత్మకం (ప్రాచీనమైంది). ఇలా సమాహారంతో రచన గబ్బిలం. సామాజిక కావ్యంగా ఒక విషాద గంభీర కావ్యం. కరుణ, వీరాల సమ్మేళనం, దళితుల వేదన, అగ్రవర్ణాల వ్యవస్థలమీద నిరసన. ఉదారవాద దళిత తాత్త్వికతను కలిగిన కావ్యంగా గబ్బిలం కనిపిస్తుంది. ప్రతీకలున్నాయి. ఆధునిక జీవనం మనిషి మానవత్వం పొందేవరకు జాషువా కవిత్వం వారి వారి జీవితాల వెనుక ఉన్న బాధల్ని అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం.
ఆధారాలు
1. ఆంధ్ర మహాభారత శైలీ పరిశీలనం- పరిమి రామనరసింహం
2. గబ్బిలం - జాషువ
3. గబ్బిలం జాషువా తాత్త్విక స్వప్నం - కాలువ మల్లయ్య, తెలుగు అకాడమీ సంకలనం
4. శబ్ద రత్నాకరము- బహుజన పల్లి సీతారామాచార్యులు
5. జాషువా కృతులు- సంప్రదాయం- నవ్యత : డా. గుదిమెల్ల భావనారాయణాచార్యులు(పరిశోధన గ్రంథం), తెలుగు అకాడమీ
No comments:
Post a Comment