-డా. జాడ సీతాపతిరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్,
రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం(ట్రిబుల్ ఐటి),
నూజివీడు ప్రాంగణం,
ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9951171299.
Email: seethuphd@gmail.com
----------------------------------------------
key words: స్త్రీ ప్రాచీనదృష్టి కోణం- వేదకాలం- తల్లిగా- భార్యగా- వేశ్యా వ్యవస్థ- సంస్కరణ - ఎదిరించే స్థితి- విద్యావంతం- తత్ఫలితం.
1. ఉపోద్ఘాతం:
"యత్రనార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః.." అని స్త్రీని పూజించే తత్త్వం భారతదేశానిది. ‘నారి’ అంటే జ్ఞానవతి. ప్రపంచానికి ఆదిశక్తిగా సంసారవతి, సంస్కారవతి స్త్రీ స్వరూపం. ‘ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్’ కవులు వారి వారి కావ్యాల్లో స్త్రీ ఔన్నత్యాన్ని తెల్పారు.
పంచభూతాలలో నీరు, భూమి ఈ రెండింటినీ స్త్రీస్వరూపాలుగానే భారతీయ సమాజం భావించింది. భూమాత, నదీ మాత అని పిలుచుకుంది. భారతీయ సంప్రదాయం స్త్రీకి పెద్దపీట వేసి౦ది, గౌరవించింది. స్త్రీలు వేదాలు చదవాలని చెప్పింది. బ్రహ్మచర్యంలో ఉన్న యువతి పట్టా పుచ్చుకుని, తనకు సరైన వరుణ్ణి ఎంచుకోవాలని అధర్వ వేదం తెల్చేసింది. వరుడిని ఎంచుకునే హక్కు వధువుదే. అందుకే స్వయంవరం. అది రాజులవరకు పరిమితమైంది. మిగతా వారి విషయాల్ని ఎవరూ ఎక్కడా ప్రకటించలేదు. కానీ యథా రాజా తథా ప్రజా అనే భావనను అనుసరించి మిగతావారి విషయాలలో కూడా కొంత ఉండి ఉండొచ్చు.
2. వ్యాస పరిధి:
స్త్రీలను ప్రాచీనులు ఎలా చూశారు. ఆధునికులు ఎలా చూశారో చెప్పడం ఈ వ్యాస ఉద్దేశం. అందుకు ఉదాహరణలుగా పోతన, గురజాడ అను అనుశీలిస్తూ నేటి రాజ్యాంగ సమన్వయంతో విశ్లేషించే ప్రయత్నం ఈ వ్యాస పరిధి.
3. భాగవతంలో పోతన దృష్టి:
3.1. క్షీరసాగర మథనవేళ భయంకర మైన అగ్నిజ్వాలల హాలాహల౦ పుట్టింది. దీన్ని ఎవరు అపకారం లేకుండా ఎవరు స్వీకరిస్తారో తెలియక శివుడికి దేవతలు కోరారు. పార్వతి మింగమంటే మింగేస్తాను అన్నాడట, శివుడు. పార్వతి లోకోద్ధారణ కోసం ఆపని చేయమందట. లోకానికి మేలుకలుగుతుందని శివుడు ’సరే’ అన్నాడనుకో! భయంతో కూడిన దేవతలు “స్వామి! మ్రింగండి” అని అన్నారనుకో! బ్రహ్మాదులు “మమ్ము రక్షింపుము. లెమ్ము” అని ప్రార్థించారనుకో! పార్వతీదేవి కన్నులారా ఆ హాలాహలాన్ని చూస్తూ భయంకరమైన ఆ అగ్ని జ్వాలను మింగమని ప్రాణకాంతునితో ఎలా పార్వతి చెప్పిందో పోతన ఊహించారు.
‘మ్రింగెడువాడు విభుం డని,
మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ,
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో’(8 స్కంద౦, 241ప)
ఇక్కడ బిడ్డలు ముఖ్యమా, భర్త ముఖ్యమా అని ఆలోచన చేసింది పార్వతి. పైగా తన మాంగల్యంమీద విశ్వాసమెంతో కదా అంటారు పోతన. అక్కడనుంచే సతుల పాపట బొట్టు నిత్యసుమంగళమైన పార్వతిగా ప్రసిద్ధికెక్కిందట.
3.2. అమ్మలకు పిల్లలంటే అమితమైన ప్రేమ. అందుకే ప్రపంచంలో ప్రేమంతా మూర్తీభవిస్తే అమ్మవుతుంది.
చిన్ననాట పిల్లల అందాలను చూచి మురిసిపోతూ తల్లులు పారవశ్వం అంతా ఇంతాకాదు. అమ్మ గొంతు ఎలా ఉన్నా అది గాంధర్వ రాగమే ఆ శిశువుకు. పోతన మాతృ మూర్తిని దర్శింపజేశాడు. చిన్న కందంలో అమ్మ అమృతత్త్వాన్ని చూపాడు.
జోజో కమలదళేక్షణ।
జోజో మృగరాజమధ్య।జోజో కృష్ణా।
జోజో పల్లవకర పద।
జోజో పూర్ణేందు వదన। జోజో కృష్ణా। (10.1-190ప).
ఇలా మనం చూసుకుంటూ వెళ్ళే ఎన్నో అంశాలను చూడవచ్చు. ఇది పోతన చూసిన 16 శతాబ్దికి ముందటి అంశాలు. ఇంతవరకు స్త్రీలు అంటే ఎక్కువగా దేవతామూర్తులుగానే చూపే ప్రయత్నం జరిగింది. లేదా ఏ రాజకుమార్తెలో ఉన్నత వంశం వారో కనిపిస్తూ ఉంటారు.
4. ఆధునిక భారతదేశంలో స్త్రీలు:
4.1 విద్యావిధానం: ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలో అడుగు పెట్టిన తర్వాత, పాలకులుగా బ్రిటీష్ వారు మారారు. వారితో పాటే వారి సాహిత్యం వెంట వచ్చింది. ఆంగ్ల విద్య అనివార్యమైంది. భారతీయ సంస్కృతి విద్యా విధానమే అని గుర్తించి దానిమీద నిఘా పెట్టారు. ఆంగ్లేయులు. ఆ నేపథ్యమే మెకాలే విద్యావిద్యానం.
4.2. పురుషుడిలో మార్పు: చదువుకున్న యువకులు ఆంగ్ల సాహిత్యాన్ని భారతీయ దేశ సాహిత్యాన్ని తులనాత్మకంగా చూడడం సామాన్యమైంది. అక్కడ స్త్రీలు, ఇక్కడ ఉండే స్త్రీలకు ప్రాచీన స్త్రీలకు మధ్య ఉన్న చాలా అంతరాలను గుర్తించారు. ఇక్కడి స్త్రీలు ఇలా అవడానికి కారణాలను కవిత్వంలో చూపారు. కొన్ని చోట్ల పరిష్కారాలు చూపారు. అధిక్షేపించారు, అవసరమైన చోట ధిక్కరించారు. మొత్తానికి పురుషుడిలో మానసిక మార్పు రావాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు.
గురజాడ నాటి కాలానికి ఆంగ్ల విద్యా ప్రభావం వల్ల కొంత మార్పులు స్త్రీవిషయంలో రావాల్సిన అవసరాన్ని గుర్తించారు. అందులో ముఖ్యంగా సతీసహగమనం, బాల్య వివాహాలు, వేశ్యా సమస్య, దేవదాసీ విధానం లాంటివి.
వీటికన్నా భిన్నంగా గురజాడ స్త్రీలను తీర్చిదిద్దిన వైనం అప్పటికి ఆధునికం.
4.3. ప్రాచీన ఆధునిక కావ్యాల్లో స్త్రీ:
ప్రాచీన కావ్యాలలోని ఇతివృత్తం ప్రఖ్యాతం, పాత్రలు ఉన్నత స్థితిలో ఉండే దేవతలు, దేవతాస్త్రీలు, రాజ కుమార్తెలు. వారి చుట్టూనే గుణసంపత్తి, కథాకథనం తిరిగింది అని గురజాడ గుర్తించారు. దానికంటే భిన్నమైన సామాజిక స్థితిని కళ్ళారా చూస్తున్నారు. అందుకే అప్పటి సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా ఎన్నుకొని కథానికలు రాశారు. ఇవే అతడి పరిశీలనా శక్తికి స్త్రీ ని చూసే కోణాల్ని అప్పటి పురుషులను, స్త్రీలను ఆలోచింపజేశాయి.
5. గురజాడ కథానికలు: గురజాడ రాసిన కథానికలు కేవలం 5. దిద్దుబాటు, సంస్కర్త హృదయం, మెటిల్డా, మతము: విమతము, మీ పేరేమిటి. ఇందులో మతము విమతము తప్ప అన్నీ స్త్రీ కోణాల్ని స్పుశించినవే.
5.1. "దేవుళ్ళారా మీ పేరేమిటి?" కథలో నాంచారమ్మ చదువుకున్న స్త్రీ. సంస్కృతం తెలుగు భాషలు ఆవిడకు వచ్చు. గొంతెత్తి ఎంతో కమ్మగా పురాణాలు చెప్తుంది. ఆయ్యవారింటికి ఆమె వెలుగు. ఇద్దరు పిల్లల తల్లి ఇటు రూపమూ అటు గుణమూ రెండింటికి మేళవింపుతో దక్షతతో ఇంటిని దేవాలయాన్ని నడుపుకుంటున్న దిట్ట. మొగుడు విశేష ప్రయోజకుడు కాకపోయినా, తాను ఆయన కన్నా గట్టిదే అయినా మొగుణ్ణి గౌరవించడంలో సమయస్ఫూర్తి ఉంది. ఇబ్బందులు వచ్చినపుడు బెదరదు, నిబ్బరంతో చొరవ తీసుకోగలదు. సాహసించగలదు.
మత మౌఢ్యంతోనూ స్వలాభాపేక్షతోనూ వైష్ణవులు శైవులని పెద్ద అయ్యవార్ల చేత గుండం తొక్కించబోతారు. తన పెనిమిటి భయంతో అటకెక్కి దాక్కు౦టే నాంచారమ్మ ఉగ్రరూపం దాల్చి రాత్రి పూటఒక చేత దీపం రెండో చేతితో బాకు పట్టుకుని రంగంలోకి వస్తుంది. దుష్టులారా, ఈ పరమ పవిత్రమైన బ్రాహ్మణ్ణి వదుల్తారా బాకుకి బలి ఇచ్చేదా? అని హుంకరింస్తుంది. హఠాత్ పరిణామానికి అందరికి అందరూ నా వెంట రాగలిగిన వైష్ణవులేవరైనా ఉంటే ఎదుటికి రండి అని సవాల్ చేస్తుంది. తన యుక్తి ఉపాయంతో చక్రం అడ్డు వేసి సమస్యని పరిష్కరిస్తుంది. పీరుసాహెబ్ తో గుండం తొక్కించి గండం నుంచి గట్టెక్కిస్తుంది.
పీరు శ్రీస్వామి వారి తిరునామమే అని చెబుతుంది. ఈ వైష్ణవులు ఎవరు? తురకలే అనీ చెప్తుంది. నాంచారమ్మ చాకచక్య బుద్ధి కుశలతలు పరిష్కారాన్ని చూపెట్టాయి, మతాల గుట్టు రట్టు చేశాయి. ఇది మతం పట్ల ఉన్న గురజాడ మానసిక దృక్పథం. మతం అనే పదానికి అర్థం అభిప్రాయం. దాన్ని అలానే తీసుకోవాలి తప్ప తగాదాల కోసం కాదని ఈ కథలో గ్రహించాలి.
5.2. భర్త నైజాన్ని సహించలేక అతడి చెడు తిరుగుళ్లను మాన్పి౦చాలని సక్రమ మార్గంలో నడిపించాలని భావించిన ఇల్లాలి గాథే "దిద్దుబాటు". కమలినీ, గోపాలరావులు భార్యాభర్తలు. ఇద్దరూ చదువుకున్న వాళ్లే. కమలిని భర్త వేశ్య దగ్గరకు వెళ్తుంటాడు. భర్త ప్రవర్తన కమలిని సహించలేకపోతుంది. భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పి తప్పుడు నడత నుంచి మార్చాలని భావించింది. అనుకున్నదే తడవుగా పుట్టింటికి వెళ్తున్నానని ఒక రోజు రాత్రి ఉత్తర౦ రాసి పెడుతుంది. కానీ ఇంట్లోనే భర్తకు కనబడకుండా ఉంటుంది. చెడు తిరుగుళ్లు తిరిగి గోపాలరావు ఉత్తరం చూడగానే భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని బాధపడతాడు. నౌకరు రాముణ్ణి పిలిచి మామయ్య గారింటికి వెళ్ళి కమలిని తీసుకురమ్మని అంటాడు. ఆడదానితో చులకనగా మాట్లాడినా రాముతో "భగవంతుడి సృష్టిలో కల్లా ఉత్కృష్ణమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే. శివుడు పార్వతికి సగం దేహం పంచి ఇచ్చాడు. ఇంగ్లీషు వాడు భార్యను బెటర్ హాఫ్ అన్నాడు. పెళ్ళాము మొగుడుకన్నా దొడ్డది" అని చెప్పాడు. మంచం కింద దాక్కున్న కమలిని భర్త మాటలు వింటుంది. కథ ముగిసింది.
వివాహ బాంధవ్య గొప్పదనాన్ని నిరూపించుకునే ఇల్లాలి గాథ మెటిల్డా కథలో చిత్రించారు. మెటిల్డా అందగత్తె. ఆమె భర్త వయస్సు మళ్లినవాడు. దాంతో ఆమెపై అందరి మగవాళ్ళు కన్నుంటుందని అతనికి అనుమానం. దాంతో మగవాళ్ళు ఎవరు అటుగా వెళ్ళిన అనుమానపడేవాడు.
5.3. మెటిల్డా(Matilda): ఈ కథను పేరుపెట్టడమే ఒక ఆధునిక దృష్టి. మటిల్డా అనేది జర్మన్ స్త్రీ శీర్షిక మహిల్దిస్(Mahthildis) అనే పేరుకు ఆంగ్లీకరించిన రూపం. "యుద్ధంలో పరాక్రమం" అని అర్థం. ఒక యోధుడికి సరిపోయే పేరు, మటిల్డా/ మెటిల్డా అందంగా అమాయకంగా కనిపిస్తుంది, కానీ దాని అర్థం ఒక హెచ్చరిక కథను చెబుతుంది. ఈ పేరును ఆంగ్ల సాహిత్యం ఆధారంగా గురజాడ స్వీకరించారు. 1988లో Matilda పేరుతో ఒక చిన్నపిల్లల పేరుతో Roald Dahl అనే ఆంగ్ల రచయిత నవలను రాశారు. క్వెంటిన్ బ్లేక్ దీన్ని చిత్రరూపంలోకి తెచ్చారు.
మెటిల్డా బయటికి వెళ్లకూడదన్నది ఆమె భర్త శాసనం. బయటివారు ఎవరూ ఆ ఇంట్లోకి వెళ్లకూడదు. ఆ ఇంటి గుండా ఓ కళాశాల విద్యార్థి దారిన పోతున్న క్రమంలో అనుకోకుండా వారి ఇంటి ముందు ఆగడం జరుగుతుంది. అది చూసిన మెటిల్డా ముసలి భర్త ఆ కుర్రాడితో తన భార్యను కుర్రాణ్ణి ఆ వైపుగా రావొద్దని బతిమాలుతూ ఉత్తరం రాస్తుంది. తర్వాత నెమ్మదిగా మెటిల్డా భర్త ఆమె గొప్పదనాన్ని అర్థంచేసుకుంటాడు. తన భార్యను అనుమానిస్తున్నందుకు సిగ్గుపడ్డాడు. ఆ క్రమంలో ఆ కుర్రాణ్ణి ఇంటికి పిలిచి ఆ కుర్రాడితో "మీ మాటల వల్లా, చేష్టలవల్లా నా భార్య యోగ్యురాలని తెలుసుకున్నాను. ఆలోచించుకోగా ఆనాటి నుంచి కళ్ళెం వదిలేశాను. నా పెళ్ళాం బహుబుద్ధి మంతురాలు. ఇచ్చిన స్వేచ్ఛనైనా పుచ్చుకోలేదు. ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్లమన్నాను. ఎవరిని కావలిస్తే వారిన్ని చూడమన్నాను. ఎక్కడికి వెళ్ళకోరలేదు. ఎవర్నీ చూడకోరలేదు. నాకు నీతో లోకం. మరి ఎవరితో ఏం పనుంది" అని మెల్లగా మెటిల్డా అనడంలో గురజాడ చూపిన నేర్పు ఆదర్శనీయం. స్త్రీ అంతరంగిక సౌందర్యానికి చిహ్నం.
వయసు మళ్లిన భర్త. అందగత్తె భార్య. అయినా తప్పు చేయకున్నా భర్త అవమానాల్ని, అనుమానాల్ని భరిస్తుంది. అమాయకత్వంతో, నోరు మెదపకుండానే భరించి చివరికి తన నిజాయితిని భర్త చేతే మెప్పించుకొన్న మెటిల్డా కథను చదివితే ఆమె కున్న ఓర్పుకు ఎలాంటి తప్పు చేయని ఆమె ప్రవర్తన భారతీయ దృక్పథం స్పష్టం.
5.4. సంఘసంస్కరణోద్యమాన్ని సమర్థిస్తూ సంస్కర్తల అశాస్త్రీయ ధోరణులను, ముఖ్యంగా వేశ్యా సమస్యల పట్ల అప్పటి సంస్కర్తలకున్న అమానవీయ దృక్పథాన్ని ఎండగట్టే తలంపుతో చిత్రించిన నేపథ్యమే "సంస్కర్త హృదయం" కథాంశం. వేశ్యాల్లో కూడా మానవత్వం ఉంటుందని, వారు మనుషులే అని అర్థం చేసుకోలేని వారిని సంస్కర్త హృదయం ఒక సమాధానం.
6. భారత రాజ్యాంగంలో స్త్రీలకోసం చట్టవ్యవస్థ:
6.1. మహిళలకు కనీస వేతన చట్టం(1948): లింగ వివక్ష ఆధారంగా స్త్రీలకు కనీస వేతనాన్ని పురుషుడి కంటే తక్కువ నిర్దేశించరాదు.
6.2 భారత రాజ్యాంగంలో వ్యభిచార నిరోధక చట్టం (The Prostitution Prohibition Act), 1956 వచ్చింది. సంస్కర్త హృదయంలో ప్రొఫెసర్ హృదయ వ్యాఖ్యానంగా ఈ చట్టాన్ని చూడొచ్చు.
6.3: కుటుంబ న్యాయస్థానాల చట్టం (The Family Courts Act), 1984 : కుటుంబ తగాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు
6.4. మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం (The Indecent Representation of Women (Prohibition) Act), 1986
మహిళలను కించపరిచేవిధంగా అడ్వైర్టెజ్‌మెంట్, బొమ్మలు, రాతలు, నగ్న చిత్రాలు మొదలైనవి ఈ చట్టం ద్వారా నిరోధించారు.
6.5. సతి నిరోధక చట్టం (The Sati Prohibition Act), 1987: భర్త మరణిస్తే అతడి భౌతికకాయంతో పాటు భార్యను బలవంతంగా చితిపై దహనం చేసే అనాగరిక చర్య నుంచి మహిళలకు ఇది రక్షణ కల్పిస్తుంది.
6.6. 1987, వరకట్న నిషేధ చట్టం (The Dowry Prohibition Act), 1961. వివాహానికి ముందుకాని, వివాహం తర్వాత కాని, మరెప్పుడైనా కాని వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది.
6.7. లీగల్ సర్వీసెస్ ఆథారిటీ చట్టం (The Legal Services Authorities Act), 1987
మహిళ చట్టం ద్వారా రాజ్యం స్త్రీలకు ఉచిత న్యాయ సలహా అందిస్తుంది.
6.8. గృహ హింస నిరోధక చట్టం (The Domestic Violence Prohibition Act), 2005
ఎవరైనా కుటుంబసభ్యులు స్త్రీల పట్ల లైంగిక వేధింపులు, శారీరక, మానసిక, మాటల ద్వారా వేధిస్తే ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
6.9. విడాకులు పొందిన ముస్లిం మహిళ రక్షణ చట్టం, 1939 దీని ద్వారా విడాకులు పొంది మరో వ్యక్తిని స్త్రీ వివాహం చేసుకునే స్వేచ్ఛను పొందింది. ఇలా ఎన్నో చట్టాలను భారత రాజ్యాంగం, దాని సవరణలు ద్వారా స్త్రీలను బాలికలను రక్షించే బాధ్యతను వహిస్తోంది.
7. సింహావలోకనం:
ప్రకృతి స్త్రీలకు పురుషులకంటే మరింత బాధ్యతనిచ్చింది. ఒక బిడ్డని కనడం, పసితనంలో ఆ బిడ్డ జీవితంపై ఎంతో ప్రభావం చూపించగలగడం లాంటివి ఎన్నో. కేవలం పునరుత్పత్తి గురించి మాత్రమే ఆలోచించకూడదు. అందరం అమ్మనుంచే పుట్టాం. కానీ కొంతమంది ఎక్కడినుంచో ఊడిపడ్డాం అనుకుంటుంటారు. ప్రతి ఒక్కరి జీవితాలు ఒక స్త్రీ శరీరంనుంచే మొదలౌతాయి. ఈ రోజున మనం పురుషుడు, స్త్రీ అనే చిన్న విభిన్నతలని పెద్దదిగా చేసి చూడడం అనవసరం. నేడు స్త్రీలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలను ఇస్తోంది. త్వరలో 28 సంవత్సరాలనుంచి నానుతున్న మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు త్వరలో చట్టం అవుతుందని ఆశిద్దాం. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీత్వాన్ని పూజించకపోతే, ఆ ఇల్లు కూడా ఒక సంతలా అవుతుంది.
ఆధారాలు:
1. అప్పారావు, గురజాడ: దిద్దుబాటు కథానికలు: 2015: ప్రజాశక్తి బుక్ హస్, విజయవాడ.
2. కిరణ్ బాబు, తాటితోటి: 2007: భాషా సాహిత్య విమర్శకుడిగా గురజాడ: సాయి తిరుమల ప్రింటర్స్, హైదరాబాదు.
3. పోతన: 2010: పోతన భాగవతము: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ
4. ప్రకాశిక గురజాడ సమగ్ర సాహిత్య వ్యాస సంకలనం: 2018: ప్రధాన సంపాదకులు: డా.టి. సత్యనారాయణ తదితరులు: రోషన్ పబ్లికేషన్స్, విశాఖపట్నం.
5. రామారెడ్డి పడాల: భారత రాజ్యాంగం2015: పంచాయత్ పబ్లికేషన్స్
No comments:
Post a Comment