-డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు,
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,
నూజివీడు ప్రాంగణం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విద్యుల్లేఖ: seethuphd@gmail.com
సంచారవాణి: 9951171299
1.0. ఉపోద్ఘాతం:
కాళీపట్నం రామారావు గారి వృత్తి లెక్కల మాష్టారు. ప్రవృత్తి కథాకర్షకుడు. కథల్ని కవనంతో కరిగించి కళ్ళకు కట్టించి ఆలోచించేలా చేసే కథానిలయుడు కాళీపట్నం రామారావు. కథకు కళింగాంధ్రనుంచి గురజాడ జాడ వేస్తే రామారావు రాచబాట వేసి నిలిపారు. యజ్ఞంతో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు.
కథలు రెండు రకాలు. ఒకటి ఇష్టమైనవి. రెండు చాతనైనవి. అధ్యయనం కథకు రాచబాట. పరిశీలనాశక్తి, ప్రాపంచిక దృష్టి కారా కథలకు నెలవు. ఆర్తి, చావు, హింస, నో రూమ్, భయం, జీవధార, యజ్ఞం, శాంతి, వీరుడు మహావీరుడు, కుట్ర లాంటి కథలు మేథోమథన మైలు రాళ్ళు. 'యజ్ఞం' కథ దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించాడు.
2. కథకో లెక్క:
కారా మాష్టారి దృష్టిలో కథ రాయాలంటే ఒక లెక్కుంది: మన స్వభావం జీవితంలో మంచిచెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి. అనుభవాలనో, ఆవేశాలనో లేక అభిప్రాయాలనో ఇతరులతో పంచుకునే స్వభావం ఉందాలి. సాహిత్యం ద్వారా ఆ పని జరుగుతుందన్న నమ్మకం, చేయగల శక్తీ ఉండాలి. ఆదిలో ఆ శక్తి లేకున్నా ఫరవాలేదు. ప్రయత్నించి దాన్ని సంపాదించవచ్చు అని వీరి కథల్లో కనిపించే లెక్కలు.
3. గుర్తింపు ఇచ్చిన కథ:
1943లో ఆయన మొదటి కథ ‘ప్లాట్‌ఫారమో?’ అచ్చయ్యింది. 1964లో ‘తీర్పు’ కథతో అసలైన కాళీపట్నం రామారావు తెలుగు పాఠకలోకానికి తెలిశారు. 1966లో ఆయన రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు సాహిత్యానికి చూపు, ఊపుల్నిచ్చింది.
4. కథాతత్త్వం:
గ్రామీణ జీవితంతో కాళీపట్నం రామారావుకున్న అనుబంధం, అవగాహన, అనుశీలన పాత్రల్లో పరవళ్ళు తొక్కుతుంటాయి. వీరి కథల్లోని నీతి అంతస్సూత్రం. అవకాశాల్ని అరమరికలు లేకుండా తీసుకుని సిద్ధాంతాల్నీ ప్రకటించి ఒప్పించగలిగే తత్త్వం కారా కథల వ్యక్తిత్వం. నీతి, అవినీతి మధ్యగల మర్మాన్ని తూర్పారబట్టి తాత్త్వికతను అనుసంధానం చేసి క్రమ౦గా నిజ నిర్ధారణ చేయిస్తాడు. ఉద్వేగాలు లేని తత్త్వబోధ కథనశీలం వీరి కథా తత్త్వం.
5. కారా కథలు విశ్లేషణ:
వీరి కథల్ని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు:
1. వ్యతిరేక పద్ధతిలో శీర్షికలతో కథనం ఉన్న కథలు: ఉదా: చావు, భయం, బలహీనులు, అభిశప్తులు మొదలైనవి.
2. అనూకుల వైఖరితో కథా శీర్షకలున్న కథలు: ఉదా: ఆర్తి, కీర్తి కాముకుడు, మహదాశీర్వాదం, స్నేహం మొదలైనవి.
3. సమస్యలనుంచి పారిపోవాలనుకునే శీర్షికల కథలు: పలాయనం మొదలైనవి.
4. కుటుంబ అనుబంధాల ప్రధానంగా సాగే కథలు: అభిమానాలు, జీవధార మొదలైనవి.
5. 1. వ్యతిరేక పద్ధతిలో శీర్షికలతో కథనం ఉన్న కథలు:
5. 1.1 చావు కథ విశ్లేషణ: కారా కాలం సౌమ్యంగా ఉన్నా, ఆగ్రహావేశాలకు కథనం పుట్టినిల్లు. సామాజిక సంఘర్షణల్లో దోపిడీని రూపుమాపాలనుకుని కంకణం కట్టుకున్న కథలు చావు, భయం.
"చావు" కథలో మనిషి చనిపోవడం తథ్యం. కానీ భావోద్వేగాలతో ప్రతీకాలతో ఆ కథ ఆకట్టుకుంటుంది. తెల్లార్లూ... ఈ సలీ, సీకటి ఎప్పటికీ పోతాయి, ఎర్రగా పోద్దెప్పుడు పొడుస్తాదీ, ఎప్పుడెండలో సేరిపోతావు అనే వుంటాది. ఫ్యూడల్ చలినుంచి సమాజం బయటపడి, చైతన్యమై, జ్ఞాన మార్గంలో వెలుగుతూ నూత్న సమాజ ఆహ్వానాన్ని దర్శింపచేసేలా చెప్పడం ఈ కథలో అంతరార్థం. అట్టడుగు స్త్రీ పాత్రల్ని వారు ఎదుర్కొంటున్న సమస్యల్లో అణిచివేత, పీడన చుట్టూరా ఉన్నాయి. మగాడి జీవితంలో భార్యగా వచ్చిన స్త్రీని ఒక వస్తువుగా చూస్తే స్థితిని కళ్ళకు కట్టినల్టు చూపాడు. ఇందులో ముగ్గురు స్త్రీలు బలైన విధానాన్ని చూపాడు. నారెమ్మ భర్త ప్రవర్తనను అణిగి మణిగి ఓపికతో జీవించి మరణించింది.
రెండోది ముసలమ్మ పాత్ర 'అయ్యా నా నెప్పుడైనా యీ సలికే సచ్చిపోతాన్రా, ఈ సలి సంకటంతోనే సచ్చిపోతాను. శీతాకాలం, కర్ర లెక్కడా దొరకావు. కర్రలొదొరకవాని కప్పెట్టీకిమీ ఎక్కదేనా కొనో, కసింత అడుక్కొనో, సివరికి దొంగతనవేసేసినా సరే, నన్ను కాల్చీయాల' ఇది చలినుంచి విముక్తి కోసం ముసలమ్మ కోరిక. ఈ విముక్తే స్త్రీల చైతన్య జ్వాలగా సూచన. ఇక్కడ సివరికి, కప్పెట్టీకిమీ, కసింత, సలి లాంటి కళింగాంధ్ర మాండలికాలతో సహజత్వాన్ని కలిగించేలా వర్ణించాడు.
మూడో స్త్రీ ముసలమ్మ కూతుర్లలో చివరమ్మాయి. ఆమె భర్త తాగుబోతు. వాడి పెట్టే బాధల్ని తట్టుకోలేక వేరేవాడితో లేచిపోయి, ఆమె సాహసంతో తన బాటుకును పునర్మించుకుంది. ఈమె నిర్ణయం తల్లికి నచ్చకపోయినా జీవితాన్ని సుఖమయం చేసుకోడానికి అదో మార్గంగా చూపాడు. కేవలం స్త్రీ కట్టుబాసిన కాదని, ఆమెకూ ఒక మనసు ఉంటుందన్న స్ఫృహను స్త్రీకోణంలోనుంచి పురుషుడు ఆలోచించాలనే తత్త్వాన్ని ఇక్కడ పాఠకుడికి చూపాడు.
5. 1.2. బలహీనులు కథా తత్త్వం:
"బలహీనులు" కథలో కథానాయిక ఒక అందగత్తె, నర్స్. 'నాకు దేవుడిమీద నమ్మకం వుంది అంటూ కథను మొదలుపెట్టి దేవుడు యిది నాకిచ్చిన శిక్షయోమోనని అనుమానం కలుగుతుంటుంది' అని ముగించాడు. ఇక్కడ ఏ పాత్రకూ పేరు లేదు. అందులో ఉన్న అమ్మాయిని వర్ణిస్తూ 'లోకంలోని సౌందర్య ధనులలో నేను ఒక్కర్తిని. రంగు నల్లనైనా అందులో నైగనిగ్యం వుంది. తీర్చిదిద్దిన వంపులతోడి నా సుందరమైన నల్లని కాంతుల శరీరానికి నల్లని వెడల్పాటి బోర్దారులతోటి తెల్లని చీర కడితే నా రూపం ఆరి తేరిన చిత్రకారుడితో చిత్రించిన బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ చింతలోని ఆకర్షణ ఉండేది. ఎదురైన వ్యక్తల్లా నా వైపు రెండవసారి చూడకుండా నడచిపోవడం ఆ నా పద్దెనిమిదేళ్ళలో ఎప్పుడూ యెరగను'. శీర్షికలో బలహీనులు అని ఆడవారి పట్ల మగవారు ఎలా ఉంటారో చెబుతూనే ఇందులో ఆ నర్స్ అతడి అభిప్రాయాన్ని తెలిసి కూడా పట్టించుకోక పోవడం ఆమె కన్నులో రంధ్రం పడడంతో చూపిస్తాడు. ఇది విభిన్నమైన ముగింపు.
5. 1.3. "అభిశప్తులు" కథలో అభిశాపము= ఊరక మోపిన నింద. బ్రాహ్మడితో లేచిపోయిన వచ్చిన రాఘవమ్మ అనే స్త్రీ జీవితం ఇందులో ప్రధానాంశం. ఆమె పడిన అగచాట్లు, కూతుర్ల పెళ్లి, ఇవన్నీ పంచాయితీలో తగువుకు వస్తాయి. ఇవే ఆమె ముసలతనంలో అభిశప్తత. కులం, భర్తలేని స్త్రీ జీవితం సమాజంలో చిన్నచూపు. 'నేనేం మడులు కోరలేదే. మాన్యాలు కోరలేదే? పప్పన్నాలు పాయసాలూ కోరలేదే. కట్టేందుకి చుట్టు చెంగాయి చీరలూ అలంకరించుకుందుకి ఆభరణాలూ కోరలేదే. ఏం కోరాను? పిడికెడు మెతుకులు. వాడి కంచం దగ్గర, వాడి పిల్లల కంచం దగ్గర, వాడి పెళ్ళాం కంచం దగ్గర రాలేపాటి పిడికెడు మెతుకులు కోరాను. వాడి పెళ్ళాం కుడిచేత్తో వేసినా, ఎడంచేతో పారేసినా, మలకలో పోసినా మొహాన విసిరినా మహాభాగ్యమని అందుకుంటానన్నాను. అది నన్ను లంజా అని తిట్టినా, ముండా అని తిట్టినా పడతా నన్నాను. తలంతా బొప్పెలు కట్టేటట్టు మొట్టికాయలు మొట్టిన పెదవి కదపనన్నాను' ఇది రాఘవమ్మ జీవిత అంతిమ దశ, వృద్ధాప్యం. చిన్న చిన్న వాక్యాల్లో అంతులేని బాధను దైన్యాన్ని కళ్ళకు కట్టించి కంటతడిని పెట్టి౦చాడు.
5. 2. అనూకుల వైఖరితో కథా శీర్షకలున్న కథలు
5.2.1. "ఆర్తి" కథలో పైడయ్య గంగమ్మతో తనలోని మానసిక స్థితిని వ్యక్తంచేసే సందర్భంలో “నానార్నెల్లయి, ఆడ మనిషి కోసం ఉపాస వున్నాను. ఇయ్యాల ఇంటికొస్తె మాయమ్మా అత్తా కుమ్ములాడుకొని మమ్మల్నిడదీసినారు. నిన్నరాతిరి దాన్ని తవిటప్ప ఇంటికి రమ్మన్నాను. దానికీ నా బాధ అర్థవైనట్టు నేదు. కావాలంటే, పట్టంలో నా యిష్టవొచ్చినట్టే ననుండగల్దును. నాతోటోల్లంత యెలాగో తంటాలుపడతన్నారో నాను సూస్తునే వున్నాను. అన్నిట్లో అల్లాగుండొచ్చు గాని, ఆడ దాన్దగ్గిర అలాగుండాలంటే మనసొప్పుకోడంలేదు. ఇరుగమ్మకో పొరుగమ్మో పాటుపడితే ఇల్లిరగతియాల; కన్నెపిల్లని సెరిపితే, కలకాలం దానుసురు తగుల్తాది. మరింక రోడ్డోరమనుసులున్నారు. ఆల జోలికెల్తె, ఆసుపత్రికి పోవడం సరేసరి- పన్లో కెల్లకండ పదిరోజులుంటే కూల్డబ్బుల మాటేమిటి? అందుకే నా బాధ నాకు తెలియాల; ఆ దేవుడికి తెలియాలన్నాను.”ఇక్కడ శ్రామిక జీవన విధానం, వారి ఆర్థిక స్థితిని ఒక ఆడ మనిషి కోసం ఉపవాసం ఉండడం, ఇంట్లో తగాదాలు, పట్నంలో నా వ్యక్తిగతమైన ఇష్టాలు ఉంటాయి. పల్లెలో అలా ఉండడానికి అవకాశం లేని పరిస్థితి. వారి మానసిక స్థితి విలక్షణం. మాండలికపదాలతో గ్రామీణజీవితాన్ని చూపారు. ఇది బలహీనుల కథకు విభిన్నమైన తత్త్వం.
"ఆర్తి"కథ సంభాషణ సహజంగా సాగుతుంది. నడక (flow) విషయంలో రాతకీ మాటకీ తేడా కనిపిస్తుంది. రాస్తున్నప్పుడు కట్టుదిట్టంగా పదం తరవాత పదం, వాక్యంతరవాత వాక్యం తర్కంతో నడుస్తుంది. ”గొప్పవాళ్లలో గొప్పవాళ్లూ, చాలాగొప్పవాళ్లూ, అతిగొప్పవాళ్లూ ఉన్నట్టే పేదవాళ్లలో కడుపేదలు, నిరుపేదలు ఉంటారు” అని వాక్యం. ఇది చదవగానే నాకు తోచిన మొదటి ఆలోచన పేదవాళ్లలో రెండే వర్గాలని. కానీ ఆ తర్వాత కథకుడు ఎర్రెమ్మ ఆస్తి లెక్కగట్టి “ఆమె నిరుపేద, … కడుపేదల కోవలోకి చేర్చరాదు” అంటారు. “ఆమెతో తైపారువేస్తే, బంగారి వొత్తి పేదరాలు మాత్రమే అవుతుంది”. పేదరాలు వర్గం, నిరుపేద, కడుపేద కాక మరొక వర్గం అంటూ సూక్ష్మ విభజన చేస్తాడు. కొంతవరకూ ఈ కథలో కథనం stream of consciousnessను పోలి ఉంటుంది.
5.2.2. "కీర్తి కాముడు" కథకు పేరుపెట్టడంలోనే కథలో అంతరార్థాన్ని చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. కొంత పొలం వ్యవసాయం చేయాలనుకునే వెంకయ్య నాయుడు అనే రైతు ఎలా చితికిపోయాడో కథనం ద్వారా చూపించారు. దేశానికి వెన్నెముక రైతు. పైగా అలా కీర్తి కాముకుడు కాడానికి పురాణ సాహిత్యమే కరణంగా రంతిదేవుడు, హరిశ్చంద్రుడు లాంటి కథలు ఎవరి ప్రయోజన౦ కోసం అనే ప్రశ్నించడం ద్వారా సమ సమాజ కాంక్ష కనిపిస్తుంది. గోదాన, భూదాన, హిరణ్య దానాల వల్ల కీర్తి ఎవరికి వస్తుంది? లాభం ఎవరికి? ఇవన్నీ లోకంలో ఉన్న విభిన్న అంశాలు వాటి వెనుక ఉన్న లోతైన భావాల్ని గ్రహించే ప్రయత్నం చేయించడం ఈ కథలో నేర్పు.
5.2.3. "మహదాశీర్వచనం" కథలో కుటుంబంలోని స్త్రీ, పురుషుల సంబంధాలతోపాటు దేశంలోని ఆర్ధిక పతనం, రూపాయి విలువ పడిపోవడం లాంటి విషయాలున్నై. ఆర్థిక మాంద్యంలో ఒక మధ్యతరగతి కుటుంబం స్థితి, మధ్యతరగతి స్త్రీలపై మాంద్యం ప్రభావం, బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, కుటుంబ వ్యవస్థపై విమర్శలు, రక్షణ లేని జీవితం అంశాలపై మహదాశీర్వచనం కథ చెబుతోంది.
5. 3. సమస్యలనుంచి పారిపోవాలనుకునే శీర్షికల కథలు:
5.3.1. "పలాయితుడు" కథలో సమస్యలనుంచి పారిపోయిన రాజశేఖరాన్ని చూపారు. డిగ్రీ చదువుకున్నా ఆ చదువుకు కారణమైన మేనమామ, ఇష్టంలేని అతడి తత్త్వానికి ఏమాత్రం పొసగని మేనమామ కూతురుతో పెళ్లి, స్నేహితులు, చుట్టాలకు పెట్టేన ఖర్చులు, ఖర్చులకు చాలని జీతం...ఇలా ఎన్నో ఆర్థిక కష్టాలను ఆలంబనంగా సాగిన కథనమిది. పోట్లాడి స్నేహితులెలా కావచ్చో చూపిన పాత్ర రాజశేఖరం.
సినిమా హాల్లో సీటుమీద కర్చీఫ్ వేసి ఆపిన సీట్లో మరొకరు వచ్చి కూర్చోగా ఆరంభమైన చిన్నపాటి తగాదా నేపథ్యంలో కొంతవరకు సాగిన ప్రస్థానం రాజశేఖర్ గదివరకు వచ్చి, ఇబ్బంది పడిన క్షణం వరకు విచిత్రమైన మనిషి అనుకుంటూనే టూకీగా కథ సాగింది. పైగా మీరింకా సినిమా హాలు సంఘటన మరిచిపోలేదనుకుంటాను అనడం సాధారణమైన సంభాషణగానే సాగింది. 'ఒక్కసారిగా మీకు స్వీట్లూ, హట్లూ కాదు కదా ఒట్టి కాఫీ కూడా నేను పోయదలచుకోలేదు. నా జేబులో చాలా డబ్బులున్నాయి. కానీ మీకు ఒక్క దమ్మిదీ అయినా యీయను. దయచేసి మీరు నన్ను వేధించకండి. ఇంతకు ముందు నిత్యం మిరిట్లా నా గదికి వచ్చి నా కిబ్బంది కలిగించడం నేను భరించను. మీరింక నా గదికి రాకండి' అనడం కథకు మరో మలుపు.
'నాకా మనిషి కృతజ్ఞత చూపించిన విధం చూస్తే జాలీ, అందులో వ్యక్తమైన నాతోడి ఆయన స్నేహం తలచుకుంటే మహదానందం కలిగాయి' అంటూ కథకుడి మానసిక స్థితిని చెప్పే ప్రయత్నం చేశాడు. విన్నావా బాబూ! పిల్లదాని వంటి మీద బంగారం అంతా అమ్మేశాడు. నాలుగు తులాల గొలుసు, రెండు తులాల పుస్తెలనాను, తులంన్నర ఎత్తు గాజుల జత, సమస్తం అమ్మేశాడు. ముక్కువీ, చెవివీ మాత్రం యింకా ముట్టుకోలేదు. మంగళసూత్రం జోలికి పోలేదు. సర్వగుటకాయస్వాహా' అంటూ రాజశేఖరం మేనమామ చెప్పడంతో రాజశేఖర్ మిత్రులకు చుట్టాలకు ఎలా ఖర్చులకోసం డబ్బులు వాడుతున్నాడో తెలుస్తుంది. ఇద్దరు మిత్రులు ఒకరికొకరు ఉత్తరాలు రాయడం ఉండేది. కాకపోతే రాజశేఖర్ ఒకే సారి ఉత్తరం రాశాడు. మూడేళ్ళ తర్వాత. మానవుడి సామాజిక జీవి అని, అతడి కష్ట సుఖాలు, ఆనంద విషాదాలు, లక్ష్యాలు సాధించడం, సాధించకపోవడం, అతని ప్రయత్నం ఒక్కదానిమీదే ఆధారపడి ఉండవనీ, ఎవడి జీవిత పగ్గాలు వాని చేతులోనే ఉన్నట్టు కనిపించినా నిజానీకవి అతడి చేతులలో లేవని, బహుశా మీరు గ్రహించగలిగి ఉండరు. అందుకు కారణం మీ రిప్పుడు మళ్ళా పొరపడుతున్నట్లు. మీ ప్రయాణం లోపం ఒక్కటే కాదు, మీ పుట్టుక, మీ పుట్టుకకు ముందే మీకై ఏర్పడిపోయిన జీవన పథ ప్రమేయం కూడా చాలా ఉంది. అంటూ సుదీర్ఘ జీవితానుభవగీతను బోధిస్తున్నట్లు ఒక వేగంతో కథనాన్ని నడిపించారు. ఇండతా అనుభవంలో తను సంపాదించిన సత్యాలు. ఇలా చైతన్య స్రవంతి ధోరణిలో సాగుతుంది లేఖావ్యాసంగం. చివరికి 'ఈ ఇంద్రజాలానికంతటికీ కారణం ఇపుడు మానవుడానుసరిస్తున్న ఆర్థిక విధానం' అంటూ ఆర్థిక సంబంధాల స్థితిలోకి తీసుకువస్తాడు. తనదైన వ్యక్తిత్వాన్ని చంపుకుంటూనే ఎన్నో ఉద్యోగాలు చేసిన కచ్చితత్త్వాన్ని వదలనివాడు, చివరికి కుటుంబం నుంచి పలాయనం చిత్తగించడమే ఈ పలాయితుడు.
5. 4. కుటుంబ అనుబంధాల ప్రధానంగా సాగే కథలు:
5.4.1. "అభిమానాలు" కథ సుదీర్ఘమైంది. 18 సంఘటనల సమాహారం. చలపతి అనే చిన్నపిల్లాడి పట్ల భాస్కర౦ అనే చిన్నాన్న పాత్ర ఎలా ప్రవర్తించాడు, ఆలోచించాడు లాంటి విషయాలు ఉన్నై.
5.4.2. జీవధార: ఈ కథలో మానవ విలువల చర్చి ఉంది. అందరూ సమృద్ధిగా సంతోషంగా ఉండాలనే మానవ లక్ష్యాన్ని చూపారు. నీళ్ల కోసం స్త్రీలు పడే బాధను బాగా వర్ణించారు. స్త్రీలను వ్యక్తిగా, శ్రమజీవిగా చూడడ౦ ఈ కథలో ప్రత్యేకం.
6. సింహావలోకనం:
కళింగాధ్ర కథావాహికలో కారా మాష్టారు దళిత, పేద జీవితాల్లోకి తరచి చూసి వారి మాండలిక భాషను వాడి, ప్రతి భావన మరోసారి ఆలోచన చేయమనే చెప్పేంత హత్తుకుంటై. 'పురాతన చరిత్రకోశం భూమి పొరల్ని తవ్వే ఆర్కియాలజిష్టులా పొరపొరా విడదీసి చూపేదాకా చరిత్ర సమాచారం ఆవిష్కారం కానట్లు కారా కథల్ని ప్రతి పోరా జాగ్రత్తగా విప్పితేగాని బోధపడద'ని వెల్చేరు నారాయణ రావు గారి మాటల్నిబట్టి లోతైన అభివ్యక్తి కారా వారిది. కొడవటి గంటి కుటుంబరావు గారిదగ్గర కథా శైలిని, కథను ఎలా రాయకూడదో, లోపాల్ని ఎలా సర్దుకోవాలో రావి శాస్త్రి గారి దగ్గర తెలుసుకున్న కారా సమాజాన్ని వినూత్నంగా దర్శించి కృతకృత్యులయ్యారు.
ఉపనిషత్ అనే పదానికి వేదాంతం, ధర్మం, ఏకాంతం అనే మూడు అర్థాలున్నై. వాటిని కాళీపట్నం రామారావు కథల్లో పాఠకులకు చూపించారు. ప్రజాభాషను ప్రత్యేకంగా మాండలిక పదాల్ని ఎంపికచేసుకొని కథను రాయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజాసాహిత్యాన్ని వాడినట్లై౦ది. బుగత అంటే యజమాని/ భూస్వామి/ పెద్దకులం వాళ్ళు అనే అర్థంలో బ్రాహ్మణ వ్యక్తుల్ని అనడం పరిపాటి. ఇక్కడ కేవలం కులవాచి కాకుండా పదజాలాన్ని నిర్మించడంలో బుగతగా చూస్తే ఉత్తరాంధ్ర ప్రజాసాహిత్యపు బుగతగా, ఉత్తరాంధ్ర కథోపనిషత్ కారా కనిపిస్తారు.
ఆధారాలు:
పొద్దు- అంతర్జాల తెలుగు పత్రిక
కాళీపట్నం ... నవాతీతరణం
నవ్య నీరాజనం - సంపాదకుడు జగన్నాథ శర్మ
సాహిత్య ప్రస్థానం, జూన్ 2021(సాహిత్య పత్రిక)
వ్యాస వారథి (సాహిత్య వ్యాసాలు)- డా. తుర్లపాటి రాజేశ్వరి.
ఆంధ్ర పత్రిక జయ సంవత్సరాది సంచిక.
ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక: మార్చి 1953
అక్షరాలా ‘కథా’నాయకుడు, ఈ టీవి ఆంధ్రప్రదేశ్, జూన్, 4, 2021 ఇంటర్యూ
(6, 7 డిసెంబర్, 2022 తేదీలలో జరిగిన జాతీయ సదస్సు, జె.యం. జె. కళాశాల, తెనాలి లో పత్ర సమర్పణ )
No comments:
Post a Comment