Monday, April 10, 2017

సాంకేతిక కాలుష్యంతో... స్వాగతం!

-డా. జె. సీతాపతిరావు, తెలుగు ఉపన్యాసకులు,
                                                 రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజివీడు,
చరవాణి:9951171299
(ఉగాది సందర్భంగా నూజివీడు స్థాయిలో ఉత్తమ కవితగా ఎంపికై నగదు బహుమతి పొందింది)
మావి చిగుర్లను వదలి, జియో బాట పట్టిన కుర్ర కోకిల!
పుస్తకాన్ని మస్తకంలో నుంచి ముఖ పుస్తకాన్ని(ఫేస్ బుక్) హత్తుకుంటూ...
మూడు లైకులూ(likes) ఆరు వాట్సప్లూ,  ఫోర్ జీ లు, టాబ్స్ లా మారిన మెదడు

ఇంటర్నెట్ ఉంటేనే ఇల్లు, వైఫై (Wi-fi) ఉంటేనే వైఫ్(wife)
భుక్తి కన్నా ఫేస్ బుక్ లే మిన్న
ఏం చెప్పను?....  చరవాణులు(మొబైల్స్), ఉత్తరాలను మాడ్చేస్తే
జియోలు , ఫోర్ జీ లు మనుషుల్ని మర మనుషుల్ని చేసేస్తున్నాయ్
కాలంతో కదల లేక, బ్రతుకు బండిని ఈడ్చలేక
మోజుల వలలో పావులై, ఉద్యోగాలు ఎప్పుడు తీసేస్తారో తెలియక
బిక్కు బిక్కు మంటున్న... బరువైన జీవితాలు...

నవతా భవితా ఆశాలత ఆకాశంపై ఆరబోస్తున్న అందాల వనిత
భువికి దిగమన్నా.... దిగిరాని దేవులపల్లి భావకవిత
‘విలువ’లు సరసాలుగా మారి.... ఏటో వలస పోయిన ఘనత

కంఠస్థం రాదు, కాన్సెప్ట్ అర్థం కాదు
వీడియోలు, ఆడియోల మోత... మెదడు మాత్రం శూన్యం
తత్త్వ వేత్తలు చెప్పిన శూన్యం ఇదేనేమో?
యూ ట్యూబ్, యూ పోరన్, ట్రిబుల్ ఎక్స్.... సంస్కారం...
ఉస్సురనే సాగే పెద్దల నిట్టూర్పు...
మరలని కుర్రకారు‘లో’చూపు

ఊరగాయీ లేదూ ఊసుబోని మనిషి లేడు
యంత్రమే మంత్రమై, మనుషుల సంబంధం బంధమై
ప్రేమలు చాటు(chat) లై , మాటలు మౌనాలై
దినాలు గడుస్తున్న జగాన, టెక్ ల హైటెక్కుల మోసాలై
సాంకేతిక కాలుష్య కోరల మధ్య... హె హేవలంబి!
విలంబించక మానవత్వం కల మనిషినివ్వు!
జాతిఖ్యాతిని విఖ్యాతమై వెదజల్లే భవిత నివ్వు!
ప్లాస్టిక్ పువ్వులు, తోరణాలతో నిత్య నూతనంగా ఇదే స్వాగతం....!