Monday, May 29, 2023

అమ్మ ఉన్నవాడు అన్నీ ఉన్నవాడే

 

- డా. జె. సీతాపతి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,

ఏ. పి. ఐ. ఐ. ఐ. టి, నూజివీడు,

ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్;

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

సంచారవాణి: 9951171299

 

"అమ్మ" రెండక్షరాల అనంత రంగస్థలం

"అమ్మ చెంగు" హంగుల రంగుల హరివిల్లు

ఊసులాడే వయసులో ఊరంతా తిప్పి

ముద్దుల ముద్దలతో కాకమ్మ కథలతో

కాలాన్ని కదిలించిన కారుణ్య మూర్తి అమ్మ.

 

పిల్లాడి బాగుకై దూరాన్ని పెట్టి

బాధను భరించిన మౌన దేవత అమ్మ

ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో

కన్నపేగులో ప్రేమను ఆకాశ మార్గంగా

అందించిన ఆధునిక అవనీమతల్లి అమ్మ

 

పుస్తకం చదవకపోతే కళ్ళు చింతనిప్పులే

అనారోగ్యం వస్తే ఆమె దగ్గర ఉండే ధన్వంతరి

పిల్లాడు ఎక్కడో అల్లాడినా కన్నపేగుతో పిలిచేది

అమ్మ ఎక్కడున్నా, అంతరంగం అమ్మదే

అమ్మే మమకారానికి ఓం కారానికి వారధి

 

అమ్మ కన్నీరు, లోకాలకు కంటకాలు

అమ్మతనం లోకానికి అదృష్టపుహారతి

"అమ్మా!" అంటేనే సగం కష్టాన్ని లాగేస్తుంది

అమ్మే గుండే చప్పుడు, నిస్సహాయకాలపు ఆసరా

ఏదీ లేకున్నా, అమ్మ ఉన్నవాడు అన్నీ ఉన్నవాడే

No comments: