Monday, May 29, 2023

నాన్నతో....

 

- డా. జె. సీతాపతి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,

ఏ. పి. ఐ. ఐ. ఐ. టి, నూజివీడు,

ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్;

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

సంచారవాణి: 9951171299

 

నాన్న నమ్మకామో జ్ఞాపకామో తెలీదు

కానీ,

చింతరివ్వతో

వీపు చిట్లించిన జ్ఞాపకం.

 

నాన్న వస్తున్నాడని తెలిస్తే

పుస్తకాలతో ఆస్కారు నటన

నాన్న ఎత్తుకొని ముద్దాడితే

మీసాల ముళ్ళు, ఇనుప కండల తాకిడి.

 

నాన్న పెట్టిన  గోరుముద్దలు వెన్న ముద్దలై వెలిసేవి

తనకున్న జ్ఞానపు వలను

నా కోసం పకోడిగానో

రస్కులు గానో మార్చిన ఫ్యాక్టరీ నాన్న

 

నాన్న ఊరు దాటితే

 భావకవిత్వపు రెక్కలు వచ్చేవి

నాన్న లోకాన్ని దాటి వెళ్తే,

కళ్ళు నదులయ్యాయి

 

నాన్న జ్ఞాపకమా, నాన్న నడిచే యంత్రమో,

నా కర్థం కాలేదు.

నా చేతిలో బుల్లి నాన్నై

నాన్నా! అంటే బోసినవ్వులతో ప్రత్యక్షం.

 

నా మీసాల ముళ్ళు ఇబ్బంది కల్గ కూడదని శుద్ధ క్షౌరం

ఇనుప కండలు ఒత్తకూడదని మొత్తటి దుస్తులతో కౌగిలి

నాన్నను గుర్తుంచుకుంటూనే నాన్న అయ్యాక తెలిసింది

నాన్న అంటే నవ్యంగా ఎత్తుకు ఎగబాగించే ఎవరెస్ట్ అని.

 

నా బుల్లిగా అవతరించిన

మా నాన్నకు ఏమివ్వగలను?

నా జ్ఞానపు నాలుగు కాసులు

నా ఊపురిలో శ్వాస తప్ప.

No comments: