Tuesday, May 30, 2023

రామాయణాన్వేషణ- రమణీయత- లోకానువర్తనాలు

 


 

-డా. జె. సీతాపతి రావు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సంకేత విశ్వవిద్యాలయం, నూజివీడు,

చరవాణి: 9951171299,

విద్యుల్లేఖ: seethuphd@gmail.com.

 

ఉపోద్ఘాతం

          రామాయణం పేరు పెట్టడంలో ఒక వినూత్న సందేశం ఉంది. రామ- రమ్ ధాతువు నుంచి వచ్చింది. రమించడం, ఆనందపడడం, ఆనందపెట్టడం, హాయనివ్వడం అని అర్థాలు. ఆయన శబ్దం ఇ అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే కదులుట, నడచుట, పయనించడం అని అర్థాలు. అంటే రాముడి కదలిక. రామ శబ్దం లోని రమణీయతకు ఆయన శబ్దం కమనీయమైన గమనాన్ని, వేగాన్ని కలిగి ఉంటుంది. భౌతిక శక్తులైన స్థితిజ(potential), గతిజ(kinetic) సమ్మేళనం అని స్పురిస్తుంది. తదేజతి, తన్నైజతి – అది చలిస్తుంది, చలించదు అనే ఉపనిషత్సూక్తి రామ శబ్ద ధ్వని. రాముడు పుట్టింది మొదలు పట్టాభిషేకం వరకు ఈ అయనత్వం, నిరంతర, నిర్విరామ నియమనిష్ఠ ఉంది. ఆ తర్వాత క్రూర రాక్షస సంహారం, అడవులు, నానాబాధలు, అయినా చలించని ధైర్యం రాముని వ్యక్తిత్వం. ఇది అసలు ఉండాల్సిన స్థితి.

అర్థ వివరణ- వాల్మీకి భావనాశక్తి:-

          రామాయణం కేవలం రాముని అయనమే కాదు. రామ (సీత) అయనం కూడా. రామస్య అయనం, రామయః అయనం అని రెండు రకాలు. విడదీస్తే రామ + అయనం = రామాయణం. రామ అన్నప్పుడు సీతాదేవి అని అర్థం.

బాలే రమతే సీతా బాలచంద్ర నిభాననా,

రామా రామే హ్యాదీనాత్మ విజనేపి వనే సతీ - (రామాయణం 2-60-1 )బాలచంద్రుని లాంటి  ముఖంతో ప్రకాశిస్తున్న సీత (బాలా త్రిపుర సుందరిగా) పసిపిల్లలా మహారణ్యాన్ని కూడా మధువనంగా భావిస్తూ విహరిస్తున్నదట. ఇది దశరథ మహా రాజుకు సుమంతుడు చెప్తున్న మాటలివి. రామ రాముడుంటే దిగులెందుకు అన్న భావన వాల్మీకిది.

          “రామా యన చపలాక్షుల పేరు, రామా యన బ్రహ్మమునకు పేరు” అన్న త్యాగయ్య కీర్తనలో కూడా రామా శబ్దం అందమైన స్త్రీ అనే అర్థంలో వాడటం గమనించవచ్చు. సామాన్యంగా తల్లీ పిల్లలు తండ్రి బిడ్డలు అన్నదమ్ములు అక్కాచెల్లెలు మేనమామ పిల్లలు మేనత్త పిల్లలు ఒకే రూపున ఉండటం సహజం. కానీ భార్య భర్తలు ఒకే రూపంలో ఉండటం తగదు. ఇది అన్యోన్యతకు ఒక నిదర్శనం. ఆంజనేయుడు సీతను చూసి...  

          అస్యా దేవ్యా యథారూపం – అంగ ప్రత్యంగా సౌష్ఠవమ్

          రామస్య చ యథా రూపం తస్యేయ మసితేక్షణా”  (రామాయణం 5- 15-51)

          ప్రతి అవయవం ఒకదొకరికి ప్రతి రూపంలా కనిపిస్తుంది. ఇదే రామాయణంలో అద్వైత రససిద్ధి. అలంకార రీత్యా బింబ ప్రతిబింబ భావన, దృష్టాంతాలంకారం. దీని నుంచే రాముడికి సీత ఏమౌతుంది అన్న ప్రశ్న పుట్టింది. దీని నుంచి తెలుసుకోవల్సింది సీతారాముల మధ్య అన్యోన్య దాంపత్యానురాగం. శ్రీరాముడు పరమాత్మ అయితే, సీతాదేవి ఆ పరమాత్మలోని పరమ కళ. ఆ కళ ముల్లోకాలకు మూలాధారాన్ని ప్రసాదిస్తుంది.

దృష్టికోణాలు:-

          “రాజ్యం వా త్రిషు లొకేషు సీతా వా జనకాత్మజా

          త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్  కలామ్”  (5-16-14)

          నిజమైన ప్రేమకు పరీక్షలుంటాయి. నిప్పు చూపుతే గానీ బంగారం నిగనిగలాడదు. సీతారాముల దాంపత్యం ఇంతే. నిజానికి వనవాసం రాముడికే. కానీ రాముడ్ని బలవంతంగా బ్రతిమలాడి ఒప్పించి రాముడితో కూడిన అరణ్యమే మేలనుకుంది మైథిలి. చివరకు రామ విరహం తప్పలేదు. అశోక వనంలో శోక మూర్తిగా ఉన్న సీతకు రామ దూత హనుమతుడు ఆశాజ్యోతిగా కనిపిస్తాడు. హనుమంతుడు సీతా సౌందర్యాన్ని వాల్మీకి సహాయంతో అష్టోత్తర శత పంక్తులతో వర్ణిస్తాడు. అప్పటికి సీత ఆభరణాలు లేనిది. కృశించి ఉన్నది. అయితే అంత అందంగా ఉండటానికి కారణం నిశ్చల తపస్సు. జంకని ధైర్యం. ఇదే ముందు చెప్పిన బింబ ప్రతిబింబ భావన. హనుమంతుడిలో నిర్మలమైన మనోదృష్టి.

          అగ్ని ప్రవేశ సమయంలో సీతా దేవి లక్ష్మణుడు పేర్చిన చితిలో నిర్భయంగా ప్రవేశిస్తుంది. 

          యథామే హృదయం నిత్యం నాప సర్పతి రాఘవాత్  

          తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావకః   6-81

          నా హృదయంలో రాముడు తప్ప ఇంకెవరూ లేరు. దీనికి సాక్ష్యం నువ్వే (అగ్ని) పలికి నన్ను కాపాడుగాక అని ప్రవేశిస్తుంది. ఎంత  నిర్ధాక్ష్యణ్యంగా ప్రవర్తించిన భర్త మీద సీతకు గౌరవం అనురాగం తగ్గలేదు. భూ మాత ఒడిలో ఒదిగి పోయే సమయంలో కూడా-

“మనసా కర్మణా వాచ యథా రామం సమర్చయే,

తథా మే మాధవీ దేవీ వివరం దాతు మర్హతి”   (రామాయణం )

యథై తత్ సత్య ముక్తం మే వేద్మి రామాత్ పరం నచ

తధామే మాధవీ దేవి వివరం ధాతు మర్హతి  

          నేను త్రికరణ సిద్ధిగా శ్రీరాముడిని పూజిస్తున్నట్లైతే నేను రాముడ్ని తప్ప మరొకరిని ఎరగక పోయినట్లైతే నా తల్లి భూ దేవి నన్ను ఒడిలో చేర్చుకో గాక. ఇది సీతా చేసిన ప్రతిజ్ఞ. పతి మీద ఉన్న ఇష్టత.

రామ కౌగిలి:-

          అరణ్య కాండ వరకు చూస్తే రాముడ్ని కౌగిలించుకున్నది ముగ్గురు. గుహుడు, సుతీక్ష్ణుడు, జటాయువు. ఈ ముగ్గురూ రాముడికి బంధువులు కారు. కానీ హృదయ సంబంధులు. గుహుడు, కవయిత్రి మొల్ల చెప్పినట్లుగా ఏమగునో అని సంశయాత్ముడై పాదాలు కడిగి దగ్గరయ్యాడు. సుతీక్ష్ణుడు బ్రహ్మ లోకానికి వెళ్లవలసిన వాడు, రాముడ్ని చూడాలనే కోరికతో కౌగిలించకున్నాడు. ధర్మాన్ని చెప్పే మిషతో ధర్మం అర్థాన్ని సుఖాన్ని సమస్తాన్ని ఇస్తుందంటాడు. కామం మూడు అంశాలను కలిగిస్తుందని పేర్కొంటాడు. ఒకటి అసత్య వాక్యం. రెండు పర భార్య గమనం. మూడు శతృత్వం లేకుండా క్రూరంగా ప్రవర్తించడం. ఈ మూడో అంశంలోనే సుతీక్ష్ణుడు స్పష్టతనిచ్చాడు. జంతువుల మీద రాక్షసుల మీద మీ దగ్గర ఉన్న ఆయుధాలతో వారి పై విరుచుకుపడవలసి వస్తుంది. ఆయుధం దగ్గర ఉంటే మనో చాంచల్యం వస్తుంది. దండకారణ్యంలో ఋషులను రక్షించడానికి యుద్ధంలో రాక్షసులను సంహరించడం కామం వల్ల కలుగుతుంది.

నిశ్చల స్థితి:-

          జటాయువు విషయంలో అరణ్యకాండలో రాముడు పంచవటికి నివాసం కోసం వస్తుండగా తనని తాను పరిచయం చేసుకుంటుంది. దశరథ మహారాజుకి జటాయువుకు ఉన్న స్నేహ బంధాన్ని వివరిస్తుంది. అదే రాముడు కౌగిలించుకోవడానికి నిదర్శనం. ఈ మూడు అంశాలను విశ్లేషిస్తే సాధారణ శూద్ర వ్యక్తి గుహుడు. తపశ్శక్తి సంపన్నుడు సుతీక్ష్ణుడు. పక్షి జటాయువు. ఈ మూడు విభిన్న అంశాలలో స్థితప్రజ్ఞత రాముడిది. భేదాలు లేని నిశ్చల స్థితిని రాముడిలో ఇక్కడ చూడవచ్చు.

ధార్మిక దృష్టికోణం:-

          కంటికి కనిపించిందంతా లోకంగా భావిస్తాం. నాదీ నీదీ అనుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. ఆదర్శ తత్త్వం కలిగిన రాముడు లోక కల్యాణం కోసం అందరినీ సమానంగానే చూస్తాడు. సత్యమే సత్వ సంపదగా ధర్మమే పెట్టుబడిగా వీరి జీవనం ఉంటుంది.

          రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా

          రక్షితా స్వస్య ధర్మస్య స్వజస్య చ రక్షితా

          ప్రపంచానికి ఆధారమైన వాడు బ్రహ్మతో సమానం. శత్రువును నిర్మూలించి ధర్మాన్ని జీవలోకాన్ని పాలించి పోషించి రక్షిస్తాడు.

మనలో మనసు ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా వస్తాయి. అదే వినాశనం. ఒకే కక్ష్యలోకి వస్తే గ్రహణ సమయం. ఇదే భౌగోళిక ప్రాథమిక లక్షణం. జీవాలకు పుట్టుక, పోషణ, మరణం లాంటివి ఉంటాయి. అవి వికృత వేషాలైతే రాక్షసత్వంగా మారుతాయి. ఆ బ్యాలన్స్ ను కాపాడటమే ధర్మ రక్షణ. స్వధర్మానికి మించిందే లోక ధర్మం. తన వారిని బంధువులను రక్షించడం ప్రథమ కర్త్వవ్యం. ఎక్కువ ఇబ్బంది కలిగినపుడు తనవారిని వదిలి మిగతా వారిని రక్షించడం విశిష్ట ధర్మం.

విరాధుడు- పంచవటి – వైవిధ్యకోణాలు:-

          అరణ్య కాండలో విరాధుడు అనే రాక్షసుడు రామ లక్షణులను భుజాలపై ఎక్కించుకొని పారిపోతాడు. రాముడు లక్ష్మణుడిని ఉద్దేశించి కొత్త దారి చూపిస్తున్నాడులే అని చమత్కరిస్తాడు. ఇంకో వైపు సీత భయ పడుతూ ఉంటుంది. భావి కథనం ప్రకారం చూస్తే రాక్షసుడు ద్వారా సీతా రామ వియోగం అని సూచన. విరాధుడు కుబేరుడి సేవకుడు. అప్సరసలతో క్రీడిస్తూ సకాలంలో కుబేర సేవకు వెళ్ళడు. దానికి కోపించిన కుబేరుడు రాక్షసుడుగా మారమని శపిస్తాడు. తప్పును క్షమించమని కోరగా ఇక్ష్వాక వంశ రాజైన రాముని చేతులో శాపావసానం ఉంటుందని చెప్తాడు. విరాధుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఏ ఆయుధంతో ఖండించినా మరణం లేని వరాన్ని పొందుతాడు. ఈ విషయాన్ని విరాధుడే స్వయంగా రాముడుకి చెప్తాడు. విరాధుడి మెడ మీద రాముడు కాలు పెట్టి లక్ష్మణుడిని గొయ్యని తియ్యమంటాడు. విరాధుడిని అందులో పాతి పెట్టగా విరాధుడు శాపం పోయి గంధర్వుడౌతాడు. అతని పేరే తుంబురుడు. విరాధుని సూచన ప్రకారం శరభంగుడుని దర్శిస్తాడు. శరభంగుడిద్వారా సుతీక్ష్ణ ముని దగ్గరకు వెళతాడు. అక్కడ నుండి అగస్త్యాశ్రమానికి వెలట్టాడు. లోక రక్షణకు కావల్సిన ధనస్సు, అమ్ములపొది, బాణం, ఖడ్గం ఆగస్త్యుడిస్తాడు. ఇవే లోక రక్షణకు కావలసిన సంభారాలు. అక్కడ నుంచి పర్ణశాల వేసుకోవడానికి పంచవటికి వెళ్తాడు.

          ఇలా చూసుకుంటే అరణ్య వాసం ముందు అరణ్యవాసం తర్వాత ఎక్కడా తీరిక లేని ప్రయాణం రామాయణం. రావణాసురుడి విషయానికొస్తే రాముడిలో ఉన్న గుణాలన్నీ ఉంటాయి. ఒక్కటి తప్పా. అది సుతీక్షణుడు చెప్పిన రెండవ అంశం. పర భార్య గమనం. ఇదే అతని వినాశనానికి మాతృక. ఇదే మానవ జీవితంలో వైవిధ్యమైన సంఘర్షణల వలయాలుగా మారతాయి.           

రామ తత్త్వం:-  

శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత రాక్షసులతో రాముడికి యుద్ధం వస్తుంది. ఆ యుద్ధ సమయంలో ఖరుడి అనుచరుల్ని రాముడి చంపేస్తాడు. ఖరుడితో యూధం చేస్తున్న సమయంలో ఒక అవకాశం ఇవ్వడం గమనించదగిన అంశం-

“కర్మ లోకవిరుద్ధం తు కుర్వాణం క్షణదాచర/తీక్ష్ణం సర్వజనో హన్తి సర్పం దుష్టమివాగతమ్”(3.29.4)

“లోభాత్పాపాని కుర్వాణః కామాద్వా యోన బుధ్యతే/ భ్రష్టః పశ్యతి తస్యాన్తం బ్రాహ్మణీ కరకాదివ”(3.29.5)  ఓ రాక్షసుడా, లోకానికి విరుద్ధంగా ఉండే పని చేసే వాణ్ణి ప్రజలు తమ దగ్గరికి వచ్చిన దుష్ట సర్పంలా చంపేసేలాచంపేస్తారు. దురాశవల్ల, కామం వల్ల, పాపాల్ని చేస్తూ ఆ తప్పుల్ని గ్రహించని వాడు వడగల్లు తిన్న నలికెళ్ళ పాములా తాము చేసిన పనికి ఫలితాన్ని పొందకతప్పదు. సేవా వృత్తిలో ఉన్న బ్రాహ్మణుడు భ్రష్టుడై, దుఃఖాన్ని పొందినట్లుగా అని పాఠా౦తరం.

రాముడి ప్రతాపం గురించి చెప్పిన శూర్పణఖ:

రావణుడితో మాట్లాడుతూ సరైన గూఢచారుల్ని ఏర్పాటు చేసుకోలేదని, జనస్థానంలో పదివేల మంది వీరులైన రాక్షసులు మరణించారని అది రాజుగా ఇంతవరకు నీకు తెలియకపోవడం విచారణీయం అంటుంది.

ప్రేషణం సంధి పాలత్వం ప్రతాపో మిత్ర సంగ్రహః/ఉపజాపః సుహృద్భేదో దణ్ద గుఢాతిసారణామ్

బంధు రత్నా పహరణం చారజ్ఞానం పరాక్రమః/సమాధి మోక్షో దూతస్య కర్మయోగస్య చాశ్రయః(అర్థ శాస్త్రం, 1-16-68)వార్తల్ని పంపడం, ఇతర రాజులతో అవసరమైన సంధి చేసుకోవడం, తన గొప్పదనాన్ని చాటడం, మిత్రుల్ని సంపాదించడం, గూఢచారుల్ని శత్రు రాజ్యాల్లోకి ప్రవేశపెట్టడం, మొదలైన వెన్నో చేయాలి. ఇలాంటి నీతులు చెప్పడంలో శూర్పణఖ నేర్పరిగా కనిపిస్తుంది.

నీవు భోగాల్ని అనుభవిస్తూ , ఏది మంచో, ఏది చెడ్డో నిర్ణయించలేని బుద్ధితో ప్రవర్తిస్తున్నావు. అతి శ్రీఘ్రంగా నీ రాజ్యం నశిస్తుంది. ఇలా గైతే చిక్కుల్లో పడతావు. (శ్రీమద్రామాయణం, 3-36-23). ఇలా తన దోషాల్ని ఎందుకు చెబుతుందో అని రావణుడు ఆలోచనలో పడ్డాడు. ఇది శూర్పణఖ తత్త్వం. ఒక వ్యక్తిని తమ దారికి తీసుకురావడంలో శూర్పణఖ నేర్పరితాన్ని ఇక్కడ గమనించాలి. చెడును కాక మంచిని శక్తిగా యుక్తిగా మార్చుకోవాలని గమనించాలి.

మానవ సంస్కృతి ప్రాథమిక భావనలు:-

అరణ్య సంస్కృతి లేనిదే మనిషికి సంస్కృతే లేదని రామాయణం నిరూపించింది. అరణ్యవాసం జీవన వికాసంలో  అనివార్యమైన భాగం. ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని గుర్తించాల్సిందే.

“ఇట చిత్రకూటమున/అనువణువును శ్రీరామ చంద్రుని జయియించు చుండె/ వృక్షములు శ్రీరామ, శ్రీరామ యనుచుండె / పక్షి సంకులమెల్ల శ్రీరామ యనుచుండె” అని ఎం. వీరప్ప మెయిలీ రాయడంలో రామచంద్రుడు అంటే వ్యక్తిత్వంగా మనం గమనించాలి.

ధర్మకామం- వ్యక్తినిష్ట:-

ధర్మంలో భాగంగా కామం ఉండవచ్చు. రావణాసురుడికి సీతా దేవి బోధలా కనిపించదు. సర్వ కాముకులకూ ఇది బోధే. కీర్తిని పొందాలంటే ఇలా చేయాలని నిష్కర్షగా చెప్పింది-

“ఇంద్రియములు ఆకలిగొని/కామన పీడించిన సంయమమును సాధింపుము

సర్వనాశమునకు హేతువు కామమది, కామవాహక/దుష్ట తంతువులనెల్ల పెరికి కత్తిరింపుము

మునిసుతుడవు నీవే ఎరిగి అడుగిడుము/కీర్తి భాజనుడవు కమ్ము వత్స”(పుట 539) ఇందులో వత్స అని సంబోధన గమనించదగింది. పరస్త్రీ వ్యామోహంలో పది తడిసి మునిగుట ఎందుకు? కామవాంఛతో చూస్తే అది నీ ఉనికికే మంచిది కాదు అని విశ్లేషణ. రామాయణాన్ని ఎన్నిమార్లు చదువుతూ అన్వేషిస్తే అన్ని రకాలు దర్శనం ఇస్తాయి. వాటిని జీవితానికి అన్వయం చేసుకుంటే అది మోక్షగామిత్వంగా మారుతుంది.

 

ఆధారాలు :-

1.      అంతర్జాలం 

2.      అనేక రామాయణాలు – సం. పౌలా రిచ్మన్ ,  తెలుగు అను. పి. సత్యవతి హైదరబాద్ బుక్ ట్రస్ట్ 2018

3.      రామాయణ పరమార్థం – డా ఇలపావులూరి పాండురంగారావు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి 1999

4.      వాల్మీకి రామాయణం సంబంధాలు – డా డి నరసింహారెడ్డి యస్ వి యూనివర్సిటీ తిరుపతి 2000

5.      శ్రీమద్రామాయణం – అరణ్య కాండ – వాల్మీకి – బాలానందినీ వ్యాఖ్య – ఆర్ష విజ్ఞాన ట్రస్టు హైదారాబాద్ 1993

6.      శ్రీరామాయణ మహాన్వేషణము- ఎం. వీరప్ప మొయిలి.

(యోగ్యతా పత్రిక:  అయోధ్యా రీసెర్చ్ సెంటర్& యుజిసి స్ప్రాన్సర్డ్, దక్షిణ భారత జీవనశైలి, కళలు, సాహిత్యంలో రామతత్త్వం సెమినార్ : VOL: 6: ISSN: 2348-4225, ప్రత్యేక సంచిక: అక్టోబర్- డిసెంబర్ 2019లో ముద్రించిన వ్యాసం )

No comments: