శేషేంద్ర శ్వాస, ధ్యాస

                                                                                                             -డా.జె.సీతాపతి రావు

            గొరిల్లా లా కవిత్వ గర్జన చేసిన విప్లవ భాషా విధాత, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, నెమలి నేస్తగాడు, అమరపురికేగిన గుంటూరు శేషేంద్రశర్మ ఆధునిక భారతాన్ని ఆవిర్భవింపజేసి ప్రజలకు అందించిన ప్రసిద్ధమైనకవి. కవిసేనతో కవిత్వ బాణికి కొత్తసృష్టిని, కవితానికి మెస్మరిజాన్ని కలబోసిన కవితా ఉద్దండుడు. కవిత్వం, జర్నలిజం, విమర్శ, సైన్సు సంబంధి విషయాల్లో అనేక రచనలు చేసిన శేషేంద్ర స్ఫురద్రూపి కూడా. శేషేంద్ర మే,30,2007న పరపదించారు. వారి స్మృత్యర్థం వారి మీద గౌరవంతో ఈ వ్యాసం రాస్తున్నాను. శేషేంద్ర రాసిన ఆధునిక మహాభారతం ఆధారంగా శేషేంద్ర శ్వాస, ధ్యాసను విశ్లేషించడం ఈ వ్యాసోద్దేశం.


''ఏమని రాశేన్
నిన్ను గురించి ఓ శేషేన్ -
నీకు నిద్ర అంటే
రాత్రి శయ్యలోచేసే సాహస యాత్ర
నీకు కవిత అంటే
క్రూరజీవన రాస్తాల్లో ప్రవేశించిన పాత్ర '' అంటూ శేషేంద్ర తలపులతో ప్రారంభిస్తే...


ఈ శేషేన్ అని పిలిచేది శ్రీశ్రీ. ఇద్దరు మహా కవులను మిత్రులుగా ఆంధ్రమాత కన్నది. శ్రీ శ్రీ పీడిత, తాడిత ప్రజలకోసం కవిత్వం రాస్తే; ఆధునిక ప్రజకోసం, భూమికోసం శేషేంద్ర తన కవిత్వాన్ని రాసాడు. త్రికరణ శుద్ధిగా ఉన్న మనిషి కథగా శేషేంద్ర తన కథనే తాను రాసుకున్నట్లు భావించాడు.


''నా బాల్యాన్ని చెరువులమీద జామ చెట్లమీద
గుర్ర్రపు పిల్లలమీద వెదజల్లాను
స్త్రీలమీద పుస్తకాలమీద
కుమ్మరించాను యౌవనాన్ని
రక్తాన్ని పిండి త్రాచుల్లాంటి
వాక్యాలకు పోసి పెంచాను
ఇప్పుడు రాత్రివచ్చింది '' (ఆద్మీపర్వం. పుట.181) 

అంటూ కవి తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూనే రాత్రికి రావడం గుర్రపు పిల్లలమీద , చెరువులమీద , జామ చెట్లమీద బాల్యన్ని వెదజల్లడంలో ఇప్పటికీ తాను అనుభవించిన బాల్యం ఇంకా స్పష్టంగా రచయిత దర్శించ గలుగు తున్నాడు. ఆ బాల్యపు చేష్టలు ఎంత అనుభూతి ప్రధానమైనవో అని భావించడం కనిపిస్తోంది. బాల్యాన్ని గురించి ఆలోచించిన వాళ్ళే ఇప్పుడు తక్కువగా ఉన్నారు. ఆ చేష్టల్లో ఉన్న స్వేచ్ఛ ఇప్పటి పిల్లల్లో లేదని కవి ఆవేదన. ఇంతకీ ఆ స్వేచ్చతో ఏం చేద్దామని అనుకున్నారు? ఇది కవికి కలిగిన ప్రశ్న. దానికి ఆయనే సమాధానం చెప్పేస్తున్నాడు చూడండి.


'' స్వేచ్ఛ మనిషికి మొదటి శ్వాస, అది నీరక్తపు సజీవ భాష, భూమినించి నీవు నీ చివరి అడుగు తీసేవరకు నిలుపుకోవలసిన ఒకే ధ్యాస '' (పుట. 41) స్వేచ్ఛ లేనిదే మనిషిగా ఉండడం అనవసరం. అది ఒకరు ఇవ్వవలసిన అగత్యం లేదు. దానికి సవాలక్ష కారణాలు... జీవితం అంటూ ప్రారంభించి చెప్పవద్దు. '' నా బ్రతుకు వెయ్యివిధాలుగా నీవనే ఒక నాజూకు నూలు పోగులజాలంతో అల్లిన దుకూలం '' అంటారు.


               ఆధునిక మహా భారతం చదువుతున్న కొద్దీ ఆనందం వస్తూ ఉంటుంది. అయితే కవితావేశాన్ని పాఠకుడు అందుకోవాలి. స్పష్టతను గుర్తుంచుకోవాలి. అలా కాకుంటే మధ్యలో సంధానం ఇబ్బందికి గురైపోతుంది. అయితే శేషేంద్ర కవిత్వంలో పదును దశకుమార చరిత్ర కథలా, అంతర్వాహినిలా అలంకారాలు ప్రవహిస్తాయి.


                శేషేంద్రకు బాల్యం అంటే ఇష్టం. అతడి మనసు వెన్న. అలాగని ప్రతిసారి అలాగే కనబడడు. '' ఎక్కడ పసితనం కూడా బతకడానికి పని చెయ్యాలో అక్కడ నిజంగా తెగిపోయాయి నాచేతులు నిజంగా రాలిపోయాయి నా నాలిక పడిపోయింది. అక్కడ నేను ఝంఝా మారుతాన్ని కాను, ఆ పసివాడి కాళ్ళమీద, నా ఆత్మ లో ముత్యాల దండ తెగి అతడి మ్రోల పడిపొయింది, నా పద్యం అటువైపు చూడలేక ఏడ్చింది '' ఇది శేషేంద్ర మనసు. పసివాడి కాళ్ళముందు కడివెడు కన్నీళ్ళు పోశాను అనడం శేషేంద్రలోని అనుభూతి, బాల కార్మికులు పడే యాతనలను తట్టుకోలేని స్థితి. ఇదంతా బాలుర స్థితి, బాల్యపు సంగతులు.


''రైతు నాగలి మోస్తున్నాడు
క్రీస్తు శిలువ మోసినట్లు
ఈ దేశపు గర్భగుడిలో దేవుడి జీర్ణమై పోయాడు
ఆకలి వేస్తోంది మరో దేవుడి కోసం'' (పుట. 98) ,
'' ఇక్కడ దున్న తున్న ఓ అన్నా
నీవు ఒంటరి వాడివి కావు, నీవు కన్నీటి బొట్టుగా ఆగిపోవు '' (పుట 34)
మీరు నన్ను పిలిచారు, కానీ పిలవక పోయినా
మిమ్మల్ని వెతుక్కుంటూ నేనే వచ్చే వాడ్ని '' అంటూ రైతుకు తన మద్దతుని తెలుపుతున్నాడు. శ్రమించేవాడికోసం ఆయన ఎంతటి త్యాగాన్ని అయినా చేస్తాడు. ''నేను సత్యాగ్రాహి! సత్యం గుండెల్లో బ్రద్దలవుతున్న అగ్ని పర్వతం, నా గొంతులో గర్జిస్తున్న జలపాతం '' అంటూ యుద్ధోన్ముఖుడుగా శేషేంద్ర దర్శనమిస్తాడు.

ఇంకా...


''నా గొంతు నా ప్రజలకు దానం చేశాను. నా జాతే నా భాషకు ప్రాణవాయువు, నాదేశం నా శిల్పానికి ఆయువు, నేను రక్త ప్రవర్తను. ఈ ప్రయాణంలో ఆవిష్కరిద్దాం మనిషికి మృత్యువు లేదని, జీవితం ఎన్నటికీ చావదని, చాలా దూరం నడవాలి. సొంత గోడల్ని దాటి రండి ''. (పుట.39)అంటూ ప్రజను చైతన్య పరచడం గమనించదగిన అంశం. శేషేంద్ర అమృత తుల్యమైన జీవనం కోసంచాలా కష్టపడాల్సిన ఆవశ్యకతను విశదం చేసారు. ఈ వాక్యాలు మహాభారతంలోని పాండవులు హిమాలయాలగుండా స్వర్గం చేరుకునే దిశగా ప్రయాణం సాగించడాన్ని గుర్తుకుతెస్తోంది.


కేవలం ఊహల్లోనే కవిత్వం రాయడానికి శేషేంద్ర ఇష్టపడరు. ఆధునిక మహా భారతం ప్రారంభంలోనే ''లేస్తోంది ఉష : కాంతుల్లోనించి ఒక హస్తం '' అంటూ శ్రామిక కర్షక వర్గాలందర్నీ చైతన్య పరచడం గమనించదగినది. కవి తన కవిత్వ ధాటితో ప్రజను ఏకతాటిమీద నడిపించాలని ప్రయత్నం చేసాడు. శేషేంద్ర కవిత్వంలో '' నేను '' చాలాసార్లు కనబడుతుంది. ఆ నేను అనేది దేనికి ప్రతీకగా వాడుతున్నాడో తెలిస్తేగానీ విషం బోధపడదు. ఒకసారి శ్రామిక శక్తిగా, విప్లవ మూర్తిగా, అందమైన ప్రకృతిగా, చిన్న పిల్లాడిలా, సముద్రంలా చాలా రకాలుగా కనబడుతుంది.
శేషేంద్ర కవిత్వంలో వైదికాంశాలు ఉపనిషదంశాలు కనబడతాయి. వ్యక్తిగత జీవితంలో కూడా వాటిని ఆచరించాడు.


'' నేను మానవ జీవిత పొలాలన్నీ దున్నుతా, ఈ చేత్తో నేను ఏఅందాన్ని సృష్టించలేదు? నా బ్రతుకొక సున్న కానీ నడుస్తున్నా... ''
''పూర్ణ మద : పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణమదచ్చుతే
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవావిశిష్యతే'' అంటూ సమస్తం పూర్ణం నుంచే వచ్చింది అనే వేద మంత్రాన్ని స్ఫురించేలా సూచించారు.


                  శేషేంద్ర ఉదయ కాలంలో స్నానం చేసాక సూర్య నమస్కారం చేస్తారు. సూర్యుడు ప్రకృతి ప్రాసాదించిన వరంగాను, బతుకు సారధిగాను భావించేవారు. ఆ సూర్యుడే విజృంభిస్తే మండే సూర్యుడిగా మారుతాడని నిరూపించేదే మండే సూర్యుడు కవిత్వం. అదే సూర్య పర్వంగా ఆధునిక మహాభారతంలో చేర్చారు. సూర్యోదయం శ్రామికుడికి ప్రతీక గా పేర్కొన్నారు.
శేషేంద్ర కవిత్వంలో సింబాలిజం, ఆలంకారిత, పదచిత్రాలు మనం దర్శించవచ్చు. కవిత్వంలో కవిత్వపు పాలు ఉందా? ఉంటే అదే చిరకాలం నిలచి ఉంచేలా చేస్తుందని నమ్మే వ్యక్తి శేషేంద్ర.

లేస్తోంది హస్తం అన్నప్పుడు ఆ హస్తం శ్రామికుడికి, ఆ శ్రామికుడు సూర్యుడికి ప్రతీక. ఎర్ర కోరికను కనడం, విప్లవభావాన్ని వినూత్నంగా వ్యక్తీ కరించడం ఇతడికి అలవాటు. ఈ నేపథ్యాలలో అలంకారిత సహజంగానే వస్తుందీతనికి.
కర్షకుడు అంటే అమితమైన అభిమానం. ఇతని కవిత్వంలో కర్షక, దాని పర్యాయపదాలు చాలా కనబడతాయి. " నేను మానవ జీవిత పొలాలన్నీ దున్నుతా " అంటూ ఆకలిని తీరుస్తున్న కర్షకుడు లేనిదే మానవజీవితం లేదని కవి సందేశం.
శ్రామికుడు ఎప్పుడూ దోపిడీకి గురి అవుతునే ఉన్నాడు. అందుకే తిరగబడమని కవి చైతన్యపరుస్తూ ఉండాలని ఇతడి సిద్ధాంతం. కర్షకుడిని ఉద్దేశించి - '' కొండలతో సముద్రాలతో కలిసి బతికేవాడికి తుఫానులొక లెఖ్కా " అని తీర్మానిస్తాడు.

''కాలాన్ని నా కాగితం చేసుకుంటా - దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసి ఇస్తా '' అంటూ అందమైన స్వప్నంతో సమసమాజ స్థాపనకు నడుబిగించిన మేధావి శేషేంద్ర.
ఎంతటి వాడికైన కాలం తనలో కలుపుకుంటూనే ఉంటుంది. అయితే శేషేంద్రకు నిద్ర పట్టదు. ఆయన నిద్రలో గడిపిన రోజులు చాల తక్కువ. తన కవిత్వమే ఆయుధంగా నిలిచి ఒక విప్లవకవిగా గుర్తింపు పొందాడు. పైన ఉండే అధికారులకు, అపైన పెత్తనం చెలాయించేవారికి శేషేంద్ర ఒక సింహ స్వప్నం.


శేషేంద్రలో ప్రేమ విశ్వమానవ సమానతకు దారితీస్తుంది.
''ప్రేమ ప్రేమంటే మాటల్తో ప్రేమవుతుందా
రెండు పూటల్ నషాతో మా దాహం తీరుతుందా?
నీవు రాశీనవే పాడి దాసీ నయితి... '' (పుట. 247)అంటూ ప్రజలందరూ ప్రేమఉన్న చోట దాసీగా ఉన్నా ఇష్టపడతారని, అది అధికారంతో చెలాయిస్తే చేయడానికి ఇష్టపడరని విశ్వసిస్తాడు. శేషేంద్ర ప్రేమ పర్వంలో మరెన్నో అంశాలు గ్రహించవచ్చు. అయితే అవి ప్రేయసి, ప్రేమికులకు సంబంధించినవిగా, ప్రేమ తత్త్వాన్ని తెలియజేసేవిగా కూడా చూడవచ్చు.
''రండి, మా గుమ్మానికి తోరణాలుకండి
మానవ జీవితాన్నొక మహోత్సవం చేయండి
పిడికెడు వసంతాలు అందరికీ భిక్షపెట్టమంటావు
నీకుమాత్రం ప్రేమించే రెండు పెదవులు చాలునంటావు''
            అంటూ ఎర్రగా విరగబూచిన వనజ్వాలలో ఉన్న మిలియన్ల పూలు గొంతు విప్పి పాడడం, మానవజీతాన్ని అందమైన వసంతంతో పోల్చడం కవి అనుభూతికి మానవ సంబంధానికి ఒక ఉదాహరణ.
బాధలనే అగ్ని నుంచి కవి బయటపడి సువర్ణంగా మారతాడని శేషేంద్ర భావించారు. వాల్మీకి మొదట ఎన్నో పాపాలు చేసాడు, బాధలు అనుభవించాడు, కిరాతుడయ్యాడు. అవ్యక్తాన్ని వ్యక్తం చేసుకున్నాడు. అనుభవంతో ఒక అందని బిందువునందుకున్నాడు. ఇదంతా కవితా పరిణితిగా, వ్యక్తంనుంచి అవ్యక్త దశకు చేరుకోవాలని, ద్రష్టగా మారాలని బోధించారు. వేమనను రేంబోతో కలిసి దర్శించడం ఒక అనుభూతి. పరుసవేది సిద్ధించిందా? అని అడిగేలోపే ''హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజా '' అని రాయడాన్ని శేషేంద్ర చదివారు. ఇలా కవి ఎదుటవారి హృదయంలోని అంశాన్ని ముందుగానే కనిబెట్టాలని శేషేంద్ర భావన. రాసేభాషకు మాట్లాడే భాషకు తేడా అవసరం లేదని భావించినవాళ్ళలో శేషేంద్ర ఒకరు.


''నీవు ఇప్పుడు లే ఉ
కానీ వాలుతున్నావు ఒక కొండలా '' 
     ఇలాంటి వాక్యాలు శేషేంద్ర కవిత్వంలో మనకు కనిపిస్తాయి. ఆధునిక మహాభారతం చివరన భారతీయ కర్షకేతిహాసోపేత ఆధునిక మహాభారతాన్ని శేషేంద్ర రాసినట్లు తెల్పారు.
'' నే నెప్పుడు గొంతెత్తినా నా కోసం కాదు
యాభైకోట్లమంది కోసం గొంతెత్తుతాను ...
నేనంతా పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండాకున్న పొగరుంది'' ఇది శేషేంద్ర అంతరంగం. ప్రజకోసం కవిత్వాన్ని వినియోగించడంలో గర్వపడే స్వభావి శేషేంద్ర.
                ఆధునిక మహాభారతం వింటే, గులాం మనస్తత్వ కారణంగా వంగిపోయిన మోకాళ్లలో బలం వచ్చి, మనిషి కాళ్ళు నిటారుగా నిలుస్తాయి. నిర్భయత వచ్చి మనిషి మనిషిగా మారి భూగోళానికి ఇరుసుగా మారతాడని కవి సూచించారు. అదే ఫలప్రదంగా కీర్తిపొందుతుందని భావించాడు.


వర్గచేతన సిద్ధి, ఆత్మ గౌరవవృధ్ధి
జనవైరి నిర్మూలన, సమతా సమున్మీలన
సత్కాల వర్షళి, సస్య సంధ్యాకేళి
క్షామ రహిత గ్రామ ప్రభాత వాహ్యాళి
పశుపక్షి వృక్షాది ప్రాణికోట్లకు హాయి
పూర్ణ విగళితరుజ, దేశదేశప్రజ
ధన ధాన్య సమృధ్ధి, విద్యాన్న గృహ లబ్ధి
ఆబాలగోపాలమూ అన్యోన్య భూగోళమూ ''

ఇది విశ్వమానవ, జీవకోటి పట్ల కవికుండే శ్రేయోదృష్టి. అదే ఆధునిక మహాభారతానికి ఫలశ్రుతి. క్షామ రహిత గ్రామాలు, ధనధాన్యాదులతో విద్య భూగోళానికి అవసరంగా సూచించాడు. పైన వన్నీ అవి ఈ భారతాన్ని చదివి వంటపట్టించుకుంటే ఆయా ప్రజలద్వారా సాధ్యమౌతుందని చెప్పడం కవి ద్రష్టత్వానికి తార్కాణం.


          ఇలా శేషేంద్ర మన మధ్య లేకపోయినా, కవిగా, మేధావిగా ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందారు. రాష్ట్రేందు గా కీర్తి పొందారు. ఆయన కీర్తిశేషులైనప్పటికీ ఆతన పేరున ఆతని భార్య ఇందిరా ధనరాజ్ గిరి గారు, వారి కుమారులు శేషేంద్ర రచనలను పునర్ముద్రించి పాఠకులకు అందజేయడం శేషేంద్ర స్మృతికి సంబంధించి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు ఇప్పించడం ముదావహం. శేషేంద్ర జీవితం అంతా కవిత్వానికి, సాహిత్య సేవకు అంకితం చేస్తూనే తన వంతు పాత్రను పోషించారనడంలో అతిశయోక్తిలేదు. ఇప్పటివరకు పరిశోధనాత్మకంగా మూడు యం.ఫిల్., లు రెండు పిహెచ్.డి., లు ఆయన సాహిత్యం మీద వచ్చాయి. శేషేంద్ర కవిత్వాన్ని చదవి అర్థం చేసుకోడానికి కొంత పాండిత్యం అవసరం. చాలా దేశాలు శేషేంద్ర పర్యటన చేసారు. చాలామంది అభిమానులను సంపాదించారు. చాలా భాషల్లో ఈతని కవిత్వం అనువాదం పొందింది.