-డా. జాడ సీతాపతి రావు, సహాయాకాచార్యులు,
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,
నూజివీడు ప్రాంగణం, కృష్ణా జిల్లా,
సంచార వాణి: 9951171299
విద్యుల్లేఖ: seethuphd@gmail.com
1. ఉపోద్ఘాతం:
దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు ఆధునికాంధ్ర సాహిత్యంలో పారిజాతనికుంజం. కృష్ణశాస్త్రి కవనం లలిత కోమల కాంత పదావళితో భారతీయ సాహిత్యంలో జయదేవుడి స్థాన౦ లాంటిది. ఆధునికాంధ్ర సాహిత్యంలో శిరీష కుసుమ పేశల సుధామయోక్తులతో కూడిన స్థానం కృష్ణశాస్త్రిది. భావ కవితా శతాబ్దంలో భావ కాల్పనిక కవితా ప్రస్థానం ప్రారంభించిన రాయప్రోలు, గురజాడల మార్గంలో ఒక భావుకతా శిఖరం నిర్మించిన కవి వతంసుడు కృష్ణశాస్త్రి `తలిరాకుజొంపముల సందుల త్రోవల నేలవ్రాలు తుహినకిరణ కోమలరేఖ'(అన్వేషణము 10)లా తెలుగు సాహిత్యంలో కృష్ణశాస్త్రి పద్యం వినూత్న అభివ్యక్తి లోకాలకు తలుపులు తెరచింది. కృష్ణ శాస్త్రిలో భావ కవితాంశాలను సమస్యా దృష్టికోణంతో చూడడం ఈ వ్యాస పరిధి. నిజానికి అవి సమస్యలు కావు. కవి హృదయ భంగ కవితా విన్యాసం. వీటిని పది రకాలుగా అవగాహన కోసం మాత్రమే విభాగాలుగా చూపాను.
1.2 . ప్రకృతి తాదాత్మ్య సమస్య:
ఆధునిక నాగరికతతో వ్యస్తమైన జీవనంలో సహజమైన ప్రకృతితోడి సామరస్యం గల జీవనం నుంచి, దూరంగా తొలగిపోయిన ఈనాటి మానవుడు మళ్ళీ ప్రకృతి తోడి తాదాత్మ్యాన్ని వాంఛిస్తున్నాడు. ఇది ప్రస్తుతం మరింత అవసరం. ఆధునిక దృక్పథం. ప్రకృతితో మమేకం కాలేకపోతే దాని విశృంఖలత్వాన్ని వరదలు, విపత్తుల రూపంలో చూడాల్సిందే. ఈ ప్రకృతి తాదాత్మ్యం కోసం ఈ సభ్యతల వలలో చిక్కుకుని పోయిన మిగిలిన వారికంటే తానొంటరితనాన్ని పొంది ప్రకృతి నిసర్గమైన సాన్నిధ్యంలోకి వెళ్లాలని ప్రయత్నం ప్రారంభించాడు. సమస్యల్ని సమస్యలోంచి చూడడం, సమస్యను దూరం నుంచి చూడడం రెండు రకాలు. కానీ దీని కంటే భిన్నమైనది కృష్ణ శాస్త్రిది. తానే ప్రకృతిగా పరివశి౦చే తత్త్వంతో కూడిన సమస్య. `ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ యడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా' అని ప్రశ్నించుకున్నాడు. తద్వారా ప్రకృతి తాదాత్మ్య సమస్యను అధిగమించే ప్రయత్నం చేయాలని సూచన.
1.3. భగవత్ తత్త్వ సమస్య:
భగవంతుడు ఎలా ఉంటాడో కవి అనుభవించి చెప్పే దశ కృష్ణశాస్త్రి కవితా తత్త్వాల్లో ఒకటి. ప్రకృతిలోంచి పరమాత్ముడిని దర్శించడం ఒక తాత్త్వికానుభూతి. ఆపై అప్పుడే వచ్చిన బ్రహ్మ సమాజ భావనల్ని వంటపట్టించుకున్నాడు కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి ఒక గీతంలో ‘ప్రసవ కోమల రమణీయ పథము బట్టి పోవుచుందువు లావణ్యమూర్తి నీవు ఏనొ దీనుడ, నే నీడనైన నొదిగి అడుగిడగ లేక నిట్టూర్పువిడువలేక పొరలు కన్నీటి కాల్వలు కురియలేక మ్రోడునై రాయినై నిల్చిపోదు నకట ఇక్కడ పరిణామానికి ముందు జీవుడు రాయిగా మ్రోడుగా నిలిచివున్న దశలను నీడలో నొదిగి ఉండటం’ గా భావిస్తాడు. ప్రకృతి పరిమితుల్లో దుఃఖమయజగత్తులో మిగిలి పోవటాన్ని సూచిస్తుంది. బ్రహ్మసమాజ భావన కృష్ణశాస్త్రి కవిత్వానికి ఒక ఆధార౦, విశిష్టాద్వైతంలోని సగుణోపాసన స్థానమే ఈశ్వరభావన నిలిపే బ్రహ్మభావన. ఈశ్వర శరణాగతి ఏ జీవుడికైనా నిష్కృతి తత్త్వాన్ని బోధిస్తుంది. ఈశ్వరుడు దోషభోగ్యుడు. ఇదే మనకు నిత్యసన్నిహితుణ్ణి చేస్తుంది. `మలినబాష్ప మౌక్తికమ్ము/ మిలమిల నీ కనుల నిలువ,/ తళతళమని తారలు నటి/ యించునురా పాపీ !'(పాపి -46).... `కురియుమురా కన్నీటి మరిమరి విలపింపుమురా సరముగూర్చి పరమేశుడె తాల్చునురా పాపీ' శరణాగతి అనన్య గతికత్వ౦ ఈ రెండు లక్షణాలే జీవుణ్ణి ఈశ్వరుని దగ్గరకు చేర్చే అంశాలు. పైగా వేదాల్లో చెప్పే అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం అనే భావనను గుర్తుచేస్తుంది. అప్పుడు జీవుని మలినాశ్రుధార పరమపావన జాహ్ననీ ప్రతిభ పొందుతుంది. "తావకీన పదసరోజ దళములందు/ నిలువ నిమ్మొక్క వేడి కన్నీటి చుక్క!/ కడల ప్రసరించు నెత్తావి కమ్మదనము/ త్రావనిమ్మో ప్రభూ ! దాని తనివి తీర(కన్నీరు- 47) ఈ జీవయాత్ర పరిమితిలో కృష్ణశాస్త్రి దుఃఖం సమష్టిజీవ దుఃఖమే కాని లౌకికమైన దుఃఖం కాదు. దానికి పరమమైన గమ్యం ఈశ్వర ప్రాప్తి.
1.4. స్వేచ్ఛా సమస్య:
‘క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య/శృంఖలములు తమంతనె చెదరిపోవ
గగనతలము మార్మోగగ కంఠమెత్తి/జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు’
కృష్ణశాస్త్రిగారి స్వేచ్ఛ ఆత్మ చైతన్యానుభూతిలోంచి పలికిన గానఝరి. భావకవులు వ్యక్తిస్వేచ్ఛకి ప్రాణమిచ్చారు. ప్రకృతిలో పక్షులూ, వాగులూ ఎలా స్వేచ్ఛగా ఉన్నాయో వ్యక్తి కూడా అంత స్వేచ్ఛగా ఉండాలని భావకవుల అభిలాష. లోకం నవ్వుతుందనే బెంగ లేదు వీరికి.
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు/ నా యిచ్ఛయేగాక నాకేటి వెరపు' (స్వేచ్ఛాగానం-2)అని అంటూ ‘తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతకూడి దోబూచి సరసాల నాడి’ అంటూ భావ స్వేచ్ఛకు ప్రకృతే సరిహద్దుగా చేస్తాడు. ఎక్కడైతే భయం లేదో అక్కడ స్వేచ్ఛకు అవకాశం ఉంటుంది. విశ్వకవి రబీంధ్రనాథ్ ఠాగూర్ where the mind is without fear కవితను గుర్తు చేస్తుంది. నవ్వి పోయినా అనడంలో లోకంలో హేళనతోకూడిన, తిరస్కారంతో కూడిన, ప్రశంసతో కూడిన ఎలాంటి నవ్వునైనా తనకు అనుకూలంగానే మార్చుకునే విశ్వాసం. అదే నిర్భయ తత్త్వం, స్వేచ్ఛకు అంకురం.
‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి/నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’ అని నినదిస్తారు. కృష్ణ పక్ష కవికుమారుని స్వేచ్ఛాగానంలో నవయౌవనంలోని ఉత్సాహపులకితమైన హృదయం ఉంది. ఈ దశలో లోకాన్ని గురించి ఎరుక అస్పష్టంగా ఉంది. ప్రపంచాన్నీ, ప్రపంచం ఆరాధించే దైవాన్నీ తృణీకరించే ధోరణిగా కనిపిస్తుంది. దైవాన్ని అనడంలో విగ్రహాలను తయారు చేసే కళాకారుడికి నిదర్శనం. కళాకారుడి కళా తత్త్వం. భువి అనడంలో దైవీతత్త్వం. అందుకే అనంతమైన తత్త్వంలో ఉండే సౌందర్య కళా తత్త్వ పిపాసిగా కనిపిస్తాడు కళాకారుడు, కవీనూ.
‘నా నివాసమ్ము తొలుత గంధర్వ లోక/ మధుర సుషుమ సుధాగాన మంజువాటి/ ఏనొక వియోగ గీతిక’ (కృష్ణపక్షం, 103) అని అంటారు. ‘వియోగ శాలినీ హృదయరాగ వేదనారేఖ’గా తనని చెప్పుకుంటూ అనంత విశ్వంలో పడి ‘సకల దిశాంతరాళం’లో ప్రతిధ్వనించేలా విరహ గీతాలు పాడి వేదనలో, వేదనతో రగిలే తత్త్వం కవిది. సుషుమ నాడీతత్త్వం. దేహంలో ఉన్న పంచభూతాత్మకమైన షట్చక్రాలలో మనుష్య దేహం నడుము భాగంలో వెన్ను ఎముక 72000 క్షేత్రాలుగా, 360 నదులుగా ఆధాత్మ భావన. అందులో 101వ ది నాడీ సుషుమ. కాశీ, కాశ్యత ఇతి కాశీ. స్వయం ప్రకాశమైంది. అన్నపూర్ణ భూతత్త్వం. విశాలాక్షి అదితి. అక్కడ సాక్షి గణపతి దేహానికి సాక్షి జీవుడు. ఇలా ఆధ్యాత్మిక భావనను చొప్పించాడు.
“ప్రేయసీ! శర్వరీ తమోవీథుల బడి/ చందురుడు రాడె పూర్ణతేజస్వి యగుచు?
అఘవిదూషిత మీ హృదయంబునందె/ ప్రేమ కోమలతమము పవిత్ర మయ్యె”. (17. నా ప్రేమ కవిత)
ప్రేమ కోమల తమ౦, పవిత్రత అనే రెండు అంశాలు. తమో వీధి బడికి అనడంలో ఆజ్ఞానాన్ని పోగొట్టే స్వభావాన్ని స్ఫురిస్తుంది. చంద్రుడిలో చల్లదనం, పూర్ణ తేజస్సు ప్రేమకు పవిత్రతకు నిదర్శనం. అది హృదయంలో నింపుకోవడం సూచన.
గురజాడ వారు కాసులు కవితలో చెప్పిన “ ప్రేమ, పెన్నిధి గాని, యింటను నేర్ప/ రీ కళ, ఒజ్జ లెవ్వరు లేరు/ శాస్త్రములిందు గూర్చి తాల్చె/ మౌనము” అనడం గమనించాలి. శాస్త్ర చర్చ కాదు కావాల్సింది. ఒక కళగా ప్రేమను ఆరాధించే మానసిక తత్త్వాన్ని చూడాలి. అలా చూడలేకపోతే ఆ ప్రేమ సమస్యగా మారిపోతుంది.
"సౌరభములేల చిమ్ము పుష్ప వ్రజంబు
చంద్రికల నేల వెదజల్లు చందమామ
ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్” అనడంలో ఆ సహత్వాన్ని రంగరించిన భావకవితా మూర్తిగా. సహజ ప్రేమ సందర్శకుడిగా కృష్ణశాస్త్రి నిలుస్తాడు.
1.5. తీవ్రమైన విరహ సమస్య:-
భావకవిత్వ విరహం విచిత్రం. విరహం వల్ల దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం ఆనంద స్థాయికి చేరుకుంటుంది. ప్రాణకాంత ఖండికలో ఈ దృశ్యాన్ని గమనించవచ్చు.
ప్రాణమునకు ప్రాణమౌ ప్రాణకాంత / యెడద శోధించి యశ్రులై పడిరె యిచట” అనడంలో అభివ్యక్తి విచిత్రం. కన్నీరుగా పడటం దుఃఖ తీవ్రత ప్రాణానికి ప్రాణమైన వారి పోవడం ద్వారా వచ్చిన కష్టాన్ని చిత్రించడం ఒక తీరని సమస్యగా కనిపిస్తుంది. అశ్రులు అనడంలో ఆ బాధలోని వెచ్చదనం, పడిపోయి మళ్ళీ అవి రాకపోవడం, మరో కన్నీరు రావడం సహజం అనే స్థితి.
“ఎంత బరువయ్యేనో గాని యెడదవెలికి/ తొలగి పారని దుఃఖాశ్రు జలమువలన
ప్రావ్వడంబోధర స్వామి! నీవు కూడా / నావలెనేజాలి వొడమ వాపోవుచుంటి” అని గాలి నీటివల్ల బరువు అవ్వడానికి కారణం దుఃఖాశ్రువులేనట. నువ్వు కూడా నాలా జీవన భార౦ వల్ల ఇలా అయ్యావని ఉపమిస్తున్నా... ఇందులో తీవ్రమైన విరహం, దాని ద్వారా వచ్చే దుఃఖం, అది అశ్రు పర్యంతం కావడం ద్వారా అది విరహ తీవ్రతను, బాధగా వ్యక్తం చేస్తున్నాడు. దుఃఖం కళాకారుల మనస్సుని నిశితం చేస్తుంది. ప్రకృతితో కలిసిపోవడం, మానవ బాధలకు శాశ్వతమైన కరుణ కోసం వెతికే తపనను కలిగేలా చేస్తుంది. అపుడు ఆ బాధ సహజంగా మారుతుంది.
1.6. ఒంటరితనపు సమస్య:
దుఃఖాన్ని భరించలేక ఒంటరి తనాన్ని కోరుకోవడం కనిపిస్తుంది. భావుకుడిగా, విఫల ప్రేమికుడిగా, స్వయంకృతాపరాధిగా మారిన మనసు ఎవరిని నిందిస్తుంది. ఎవరికి చెప్పుకున్నా తీరని బాధ. తన చుట్టూ ఉన్న వారు దాని గురించి మాట్లాడితే తట్టుకోలేని స్థితి. అపుడు ఒంటరిగా ఉంటూ తనకు తాను, తనలోనే ఏడ్చుకోవడం కవికి ఇష్టం. దాని ద్వారా బాధకు ఉపశమనంగా భావించడం. మనిషికి కొన్ని సార్లు ఒంటరితనం ఇబ్బందిగా ఉన్నా, తప్పనిపరిస్థితులు కొన్ని జీవితంలో ఉంటాయి.
మీరు మనసారగా నేడ్వనీరు నన్ను –
నన్ను విడువుడు ఒకసారి నన్ను విడిచి
నంత నేకాంత యవనికాభ్యంతరమున
వెక్కి వెక్కి రోదింతును(పుట. 62) వెక్కి వెక్కి అని నొక్కి చెప్పడం ద్వారా బాధ తీవ్రతను తెలియజేస్తున్నాడు.
అపుడు గొంతెత్తి యేడ్చినాను, అపుడు నన్ను/ కాంచగా నోపగా లేక కన్నులట్టె
యార్చికొనినవి తారకలు,/ ఏమి వేదన! ఆ వేదన చూడలేక తారకలే కన్నుల రెప్పలు వాలిపోయినవట. కాని తన వేదన చూడలేక చంద్రుడిప్పుడు కరిగినీరయిపోయాడంటున్నది ఎంకి. (ఎంకి పాటలో నండూరి సుబ్బారావు) అందుకని కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దని చెప్తున్నది చంద్రుడికి.
మనసారా ఒక్కపెట్టున ఎలుగెత్తి ఏడవాలన్నది యీ కవి తీరని కోరిక! ఈతని దుఃఖాన్ని చూసి సర్వప్రకృతీ కలత చెందుతుంది. "కోకిలమ్మ కోయని గొంతునెత్తి" యేడుస్తుంది. "దారి బోయెడు మందపవను డొకడు జాలిగ నొక్క నిట్టూర్పు" విసురుతాడు. కురిసే వాన కూడా యీ కవికి కన్నీరే! అందుకే "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ" అయ్యింది! అలా ఏడ్చి యేడ్చి అలసిపోయాడు.
1.7. ఆత్మావలోకన సమస్య:
అవలోకనం అంటే చూపుట, చూపు. కవి తనలోకి తాను చూసుకోవడం. తనను తాను అర్థం చేసుకోవాలి. కవి తనలోపల జరిగే మథనాన్ని పట్టుకోవడం రావాలి. దానికి తగిన పదబ౦ధాల్ని ఒడిసి పట్టుకోవాలి. కొత్త భావనా పరంపరతో ఆకట్టుకోవాలి. అది వాహ్వ్ అనిపించుకోవాలి. తనలోపల ఉండే తపనను అందిపుచ్చుకోవాలి. ఒక్కోసారి విమర్శకుడి పనిగాను, పాఠకుడికి సమస్యగాను కనిపిస్తుంది. తాదాత్మ్యంలో లోచూపు ఇది. కవితా మర్మం కూడా. తీయ తేనియ బరువులు, మరిగే వెన్నెలలు, సౌఖ్య జ్వాలలూ, మధురమైన వేదనలూ కలగలిపిన కన్నీటి భాషను ఎంచుకున్నాడు. కృష్ణ శాస్త్రి అందులోని సౌందర్యాన్ని చూపిస్తూనే ఆత్మావలోకనం చేసుకున్నాడు. ‘విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధి వాకిలేది చెల్లేలా’ అని రాధ చేత అడిగించాడు. వేదన దుఃఖానికి తారాస్థాయి. చివరకు అది అమేయమైన సౌందర్యంలో లయిస్తుంది. విషాదం, వియోగం, వేదన, దుఃఖం, పదం ఏదైనా, చివరకు సౌందర్యం లయించాల్సిందే. అదే కృష్ణశాస్త్రి తాత్త్వికత.
1.8. భక్తి, కీర్తనా సమస్యలు:
అనుతాపమూ, ప్రపత్తి భక్తికి అంగాలు. ఎట్లు నిన్నూహాసేయుటో యెరుగలేక వంగి వంగి శిరము వాంచి కృంగిపోదు అంటారు. ‘తారక రత్న భాసుర తరహర సుప్రభామాలికా జాల శోభితుడవు.., వీధి, వీధుల వాడల విపీనములను భిక్షుకుని బోలెతిరుగాడు పేదనోయి’ అని తన గురించి తాను చెపుకుంటాడు కృష్ణశాస్త్రి.
ఎట్లు ని న్నూహసేయుటో యెరుగలేక/ వంగి వంగి శిరము వాంచి క్రుంగిపోదు!
రాజరాజేశ్వర కిరీటరాజ ఘటిత / రత్న మాణిక్య కాంతినీరాజ నార్చి
తాంఘ్రి నీరేజ యుగళుడ వయ్య! చింపి / పాతలం గట్టికొని జీర్ణ పటకుటీర
పాళికా ప్రాంగణముల నివాస మేల? / శిథిలతర భాజనమ్ము నీ చేత బూని
తూలి సోలుచు నిరుపేద తోడ గూడి / యీవె దెసమాలి నటుల నింటింటి కేగ
నేల? దీనుడవై బిచ్చ మెత్త నేల? / చిత్రములు స్వామి, నీ వింత చేత లెల్ల!
ఎట్లు ని న్నూహసేయుటో యెరుగ లేక / వంగి వంగి శిరము వాంచి క్రుంగిపోదు!
కలుష బాష్ప కల్లోలినీ కణములందు / తళుకు తళు కని నాట్యాలుసలుపు నీ య
నంత రా గాంశుమాలికా కాంతి దేవ! / క్షామ దేవతా నిశ్వాస ధూమపటలి
చల్లగా వెల్లివిరియును స్వామి, నీదు / భవ్య కరు ణార్ద్రవీక్షణ పరిమళములు.
చండ మృత్యు గభీర గర్జారవముల / పల్లవింతువు నవ్య విపంచివోలె
మాధురుల జిమ్ము నీ కంఠ మంజురవము/ చిత్రములు స్వామి, నీ వింత చేత లెల్ల!
భక్తుడిగా భగవంతుడి లీలా విలాసాల్ని గమనించాడు. పరమేశ్వరి ఎదుట వినయంతో, అహంకార రహితంగా కన్నీరు కార్చడం గంగా స్నాన ఫలంగా భాసిస్తుందట. పెరియాళ్వారు ‘తీరా నీ వేతెంచిన ధారలైన అశ్రుల నీ రూపము తోచదేది స్వామి’ అని ఆశ్చర్యంతో వేడుకుంటాడు.
1.9. స్వేచ్ఛాహరణ సమస్య:
“పక్షినని పాడగలనని ప్రణయ వీధి / నిత్య లీలావిహారముల్ నెఱపుదునని
పక్షముల దూల్చి బంధించి పంజరాన/ గానమును బ్రాణము హరింప బూనినారు” అంటూ బాధపడతాడు. పక్షికి ఎలా స్వేచ్ఛాయుతమైన జీవనం ఉంటుందో మనిషికి అలా ఉండాలనే భావన కృష్ణ శాస్త్రిది. ఈ స్వేచ్ఛకు అడ్డు తగలడమే బాధకు బంధి అవడం, గానాన్ని హరించడం. “గల గల వీచు చిరుగాలి కెరటమై/ జలాజలా పారు సెలయేటి పాటలో తేటనై” ప్రకృతితో ఉండే స్వేచ్ఛా తత్త్వాన్ని హరించకూడదు. ప్రకృతిపట్ల కవికి ఉన్న ఆరాధన భావనా, కృతజ్ఞతకు ఈ పంక్తులు నిదర్శనం. ప్రకృతిలో ఉన్న సహజ తత్త్వాన్ని దర్శించడంలో పక్షులు కూడా అందులో భాగం. దానికుండే స్వేచ్ఛను పంజరాన బంధించడం ఎంతవరకు న్యాయం. ఇది సమాజానికి, తనను వ్యక్తిరేకించే వారికి సంధించిన కవితా బాణం.
1.10. మనో వైజ్ఞానిక సమస్య:
ప్రవాసంలో నాకుగాదులు లేవు, నాకుషస్సులు లేవు అంటూ తన చీకటి బతుకుకు ఆశాలతలు పుష్పంచకపోతే తన జీవితం మరింతగా దుర్భరం అవుతుంది. “నా మరణశయ్యను పరుచుకున్నాను నేను” అని నిరాశా వాదాన్ని కవిత్వీకరిస్తాడు. ఒక మనిషి తన మానసిక సమస్యల వలయంలో తాను చిక్కుబడి ఉన్నప్పుడు ఉండే నైరాశ్య భావనా మృత్యువుకు చేరువ కావాలనే కోరిక బలంగా కనిపిస్తుంది. అలాంటి సమయంలో రక్షక తంత్రాలు(defense mechanisms) అవసరమౌతారు. దమనం వ్యాకులత కలిగించే విషయాలను వ్యక్తి చేతనం నుంచి అచేతనానికి పంపి మరిచిపోవడం అనే రక్షక తంత్రం అవసరం అవుతుంది. అంతేకాని, మరణమే శరణం అని భావించడం కవి సూచన కాదు.
వ్యక్తిలోని అహం (ego)ని దెబ్బతినకుండా ఒత్తిడి, వ్యాకులత, కుంఠనం, సంఘర్షణ లకు గురైనపుడు ఒటమిని అంగీకరించకుండా పరిస్థితులనుంచి పారిపోకుండా మధ్యే మార్గాన్ని వ్యక్తి చేతనంగా గాని, అచేతనంగా గాని ఉపయోగించుకోవడానికి సహాయపడేవే రక్షక తంత్రాలు. ఇవి వ్యక్తి మూర్తిమత్వాన్ని (personality) భంగం కాకుండా కాపాడతాయని మనో విశ్లేషకులభిప్రాయం. వ్యక్తి అహాన్ని అగౌరవం నుంచి అపరాధ భావననుంచి తాత్కాలికంగా కాపాడతాయి. అంతమాత్రన వాస్తవాల్ని మార్చేస్తాయని అనుకోకూడదు. ఆ సమయంలో విపరీత ధోరణులను అదుపుచేస్తాయి. తద్వారా మనిషిని కాపాడగలవు, సహాయాన్ని అందజేస్తూ ఆలోచనకు సహకరిస్తాయని మాత్రం చెప్పొచ్చు.
1.11. సింహావలోకనం: పైకి సమస్యలుగా కనిపిస్తూన్నా అవి ఆధునిక కోణపు అభివ్యక్తులు. వీటిని ఇంకా విభాగాలు వాటి అంతర్గత విభాగాలు చేసుకోవచ్చు. ఏది ఏమైనా కృష్ణ శాస్త్రి కవిత ప్రపంచానికి ఇచ్చే సమస్యా సాధనా సోఫానాలు, అంతరంగ ఆలోచనలు, వెరసి కృష్ణశాస్త్రి బాధలనుంచి ఉద్ధరించుకొని నిలిచే కవితాశక్తులు. తీసుకునేవారికి తీసుకునేంత. ఆలోచించేవారికి వారి ఆలోచనలకు అవకాశమున్నంత.
ఆధారాలు:
ఆధునిక సాహిత్యంలో విభిన్న ధోరణులు(సంపాదకులు) – కె. కె రంగనాథా చార్యులు
కృష్ణపక్షం- కృష్ణశాస్త్రి
కృష్ణశాస్త్రి కవితా వైభవం- డా. కడియాల రామమోహన్ రాయ్
కృష్ణ శాస్త్రి సాహిత్యం సౌందర్య తత్త్వం- సూరి సీతారామయ్య(రామ సూరి)
మనసు గతినే మార్చిన ఫ్రాయిడ్ – అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, డా. కాకుమాని శ్రీనివాసరావు
నిత్య హరిత సాహితీ బృందావనం దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి- డా. నిడమర్తి నిర్మలా దేవి
(CSSR & SRRM Degree College సెమినార్ కోసం రాసిన పరిశోధన వ్యాసం, 2021)
No comments:
Post a Comment