Monday, May 29, 2023

శూన్యం నుంచి పరిపూర్ణం లోకి

 

-డా. జె. సీతాపతి రావు, సహాయకాచార్యులు, (డి‌ఎన్‌ఆర్ బ్యాచ్ 1998-2000)

తెలుగుశాఖ, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం, నూజివీడు,

ఏలూరు జిల్లా, సంచారవాణి: 9951171299

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

తరగతిగదిలోకి గురువు వస్తే నిలబడితే గౌరవమా?

గంట నిలబడ్డ గురువు ఎవరిని గౌరవించినట్లు?

విద్యార్థిగా నిమిషం ఇస్తే, తన కాలాన్ని

కర్పూరమై కరిగి వెలుగిచ్చే జ్ఞాన జ్యోతి గురువు.   

 

విద్యార్థి లఘువు, విద్యార్థుల జ్ఞాన సంధానం గురువు

ఛందస్సులో సున్న, పొల్లుతో సంయుక్త రానికి ముందు

ఆవరమై వెంటనే తనకు తానుగా దూరంగా ఉన్నా

అనుక్షణం అనుమాన వస్తే ప్రత్యక్షమయ్యేది గురువు.

 

గురువు అక్షరాల్లో సున్న, జ్ఞానంలో మిన్న

సంగణన యంత్రపు బైనరీ థీరీలో పూర్ణ మూర్తి

గణిత శాస్త్రం సాధకుడు, మార్గ నిర్దేశకుడు,

వేదాంతంలో తాత్త్వికుడు గురువే.  

 

గురువు సైన్స్ లో ప్రత్యక్షం, గురుత్వాకర్షణగా.

పరిశోధనలో పరమ మూలం గురుత్వం.

గురుబ్రహ్మ అంటే సృజనశీలుడని

కొత్త అంశాల్ని తెలుసుకున్నపుడు తెల్సి౦ది

 

గురువు సర్వ సాక్షి, గురువు సర్వవ్యాపి

శిష్యా జిత్యేత్పరాజయం అనుకునే ఉదారమూర్తి

శూన్యం నుంచే పరిపూర్ణంలోకి తెచ్చేది గురువే

అందుకే గురువే మూలం ఇదం జగత్.

No comments: