-డా.జె. సీతాపతి రావు, తెలుగు ఉపన్యాసకులు,
ఆర్. జి. యూ. కే. టి., ఏ. పి. ఐ. ఐ. ఐ. టి.,
నూజివీడు, కృష్ణాజిల్లా-521202.
విద్యులేఖ: seethuphd@gmail.com
సంచారవాణి: 9951171299
సాహిత్యానువాదాలను ప్రయోజన దృష్టితో కాక సౌందర్య దృష్టితో ఎక్కువగా తీసుకుంటారు. సాహిత్యానువాదాలు మూల భాషా సాహిత్యానికి మూల రచయితకూ ఉపకరించడంతో పాటు లక్ష్యభాషా సాహిత్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనివల్ల లక్ష్యభాషలో కొత్తకొత్త ప్రయోగాలు, ప్రక్రియలు, నూత్న వస్తువులు, కొత్త శైలి పుట్టడానికి అవకాశం ఎక్కువ. తులనాత్మక అధ్యయనానికి రాచబాటగా ఉంటుంది. అనువాదకుడు సాహిత్యానువాదంలో ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని అనువాదం చేయాల్సి ఉంటుంది. పాఠకుడు స్థాయి? భాష ఔపచారికమ్ (formal)/ అనౌపాచారికం(ఇన్ఫార్మల్) గా ఉండాలా? అనువాదం సరళ/క్లిష్టంగా ఉండాలనే అనే విషయాన్ని మూల రచనా ఆధారంగా నిర్ణయించుకోవాలి.
సాహిత్యానువాదంలో ముఖ్యంగా కవిత్వానువాదంలో ఏ పదానికైనా నిర్దిష్టమైన అర్థం చెప్పడానికి వీలు తక్కువ. పద్యంలో ఉండే పరీధీకృత శూన్యప్రదేశ(circumscribed empty space) మాత్రమేనని, ఈ ఖాలిని చాలమంది చాలా రకాలుగా నింపే అవకాశం ఉందని నిర్మాణవాదులు(structurallists) భావన. దీని ప్రకారం ఒకే పద్యానికి భిన్న భాష్యాలుంటాయి. ఒకటి మూల భావాన్ని గ్రహించడం, రెండోది ఆ భావాన్ని తిరిగి లక్ష్య భాషలో పునర్ణించడం. భిన్న అర్థాలనివ్వగలిగే ప్రత్యేక లక్షణం కవిత్వానికి ఉండటం వల్ల అనువాదంలో సమస్య ఏర్పడుతుంది.
భాషా సమస్యలు భాషేతర సమస్యలను అర్థం చేసుకోని అనువాదం చేయాలి. భాషా సమస్యలు:
1. మూల భాషలో ఉన్న పదాలకు లక్ష్యభాషలో సమానార్థకాలు లేకపోడం.
2. మూల భాషలో ఉన్న నానార్థకాలకు సమానంగా లక్ష్యభాషలో ఉండకపోవడం.
3. మూల భాషలో పదబంధానికి, నుడికారానికి సమార్థకాలు లక్ష్యభాషలో ఉండకపోవడం.
4. మూల భాషకూ, లక్ష్యభాషకు కాల బోధకత, లింగ, వచన బోధకతలలో (number, gender, tense)ల్లో తేడాలుండటం.
5. ఒక వాక్యంలోకి పదక్రమం, వాక్య నిర్మాణం, వాక్యాల నిడివిలలో, భావాన్ని వ్యక్తపరిచే విధానంలో మూల, లక్ష్య భాషల్లో తేడాలుండటం.
6. తెలుగు- ఆంగ్ల భాషల్లో పదాల అనువాదంలో వచ్చే సమస్యలు-
6.1 సర్వనామాలు:
ఆంగ్లంలో singular 1st person -I: తెలుగులో నేను
2nd - you: నువ్వు/మీరు
3rd- He, She, It- అతడు,ఆయన, వాడు, ఈయన, ఇతను, వీడు, అది, ఇది మొ.
ఈ క్రమాన్ని చూస్తే ఆంగ్లం ,తెలుగుకు మధ్య సర్వనామాల్లో ఏకరూపనిష్పత్తి లేదు. దీనివల్ల అనువాద సమస్యలు వస్తాయి.
6.2. you కు తెలుగులో నువ్వు/మీరు అనేవి. మీరు గౌరవ సూచకం, నువ్వు చనువును చెప్పేది/ అమర్యాదను చెప్పేది. ఆ విషయ సందర్భంలో వ్యవహర్తకు, శ్రోతకు మధ్య ఉన్న సంబంధంలో ఏది వాడాలో అది మాత్రమే వాడాలి.
6.3. ఆంగ్లంలో ప్రథమ పురుష (3rd person) he, she, it అనే వాటికి మాట్లాడుతున్న వ్యక్తికి సూచితవ్యక్తికి ఉన్న సంబంధాన్ని బట్టి దూరంగా ఉన్నాడా? దగ్గరా అనే విషయాన్ని అనుసరించి అనువాదం చేయాలి.
we అనేదానికి మేము/మనం అనే రెండు అర్థాలు తెలుగులో ఉన్నై. ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నపుడు we మనం(inclusive) లేదా మేము(exclusive) అని వాడటం స్పష్టతనిస్తుంది.
6.4. రూపాత్మక(formal equivalent) సమానార్థకం, ప్రమేయ సమానార్థకాలు(functional equivalent) ఉన్నై.
My father - నా నాన్న(రూపాత్మక)- మా నాన్న(ప్రమేయాత్మక
your father- నీ నాన్న- మీ నాన్న
6.5. తెలుగులో బంధు వాచక పదాలను వాడేటపుడు వాటి ముందు బహువచన సర్వనామాలనే వాడతారు. ఏకవచనాన్ని వాడితే అసభ్యంగా , ఒక్కోసారి బూతుగా మారుతుంది. నీ అమ్మ, నీ తల్లి మొ.
బంధు బోధక వాచకాలు(kinship terms) : తెలుగు ఆంగ్లానికి ఏకరూప నిష్పత్తి లేదు. అక్క- చెల్లి, అన్న-తమ్ముడు లాంటి వర్గీకరణ ఆంగ్లంలో లేదు. అలానే aunt, uncle మధ్య ఆంగ్ల పదాలకు తెలుగులో చాలా సమానార్థకాలున్నై. ఉదా: అక్కను sister అని అనువాదం చేస్తే ఆమె అతనికంటే పెద్దదో చిన్నదో తెలీదు.
7. జాతి వాచకాలు(common nouns)
ఆంగ్లంలో కొన్ని జాతి వాచకాలు లింగ విభజనను కలిగి ఉండవు. ఉదా: friend, cousin, devotee, worker. beggar, child, servant, cook మొ. మూలంలో అది పురుష/ స్త్రీ లింగమో చెప్పాల్సి ఉంటుంది.
8. అననువాదనీయత(untranslatability)
పదబంధాలు, నుడికారాలు, జాతీయాలు మూల భాషా సంస్కృతికి మాత్రమే పరిమితమైన విషయాలు అనువాదానికి లొంగవు. కవిత్వం, వివిధ ప్రకటనలు, ప్రభుత్వ నినాదాలు చాలా వరకు శబ్ద సారూప్యత, ప్రాస, యతి లాంటి వాటిమీద ఆధారపడి ఉంటుంది.
ఉదా: Save as you shave. మీరు షేవ్ చేసినట్లు సేవ్ చేయండి అని పదాను వాదం చేస్తే ఆంగ్లానికి సరిపడేలా తెలుగుకు ఒదగలేదు. save, shave ల కనిష్ట పద జంటకుండే ఆకర్షణ అలాంటిది.
9. Allusions: దీన్ని ప్రస్తావనలు, పూర్వకథలు, సూచితాలు గా గూగుల్ అనువాదం. ఒక సాహిత్య రచనలో పురాణ, ఇతిహాసాలకు, లేదా వ్యక్తి, ప్రదేశానికి ఉన్న సంబంధం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉండొచ్చు. ఇవి ముఖ్యంగా రచయిత గ్రంథ పఠనం(private reading) , స్వంత అనుభవాలమీద ఆధారపడి ఉంటై. ఇలియట్ అద్దం ముందు కూర్చుని అలంకరించుకున్న స్త్రీని - the chair she sat in, like burnished throne, Glowed on the marble అని ఆధునికంగా వర్ణించాడు. ఇక్కడ కూర్చిని వర్ణిస్తున్నాడా, ఆమె అందం వల్ల కుర్చీకి అందం వచ్చిందా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆమె కూర్చున్న కుర్చీ, కాలిన ముల్లులా, పాలరాతిపై మెరుస్తోంది. ఇక్కడ రెండూ అందమైనవే. ఇవి రచయిత పాఠకుడి ఊహాకే వదిలేస్తూ ఉంటాడు.
10. ఇలాంటి సమస్యలను అధిమించడానికి:
10. 1. అనువాద గ్రంథాలకు లక్ష్యభాషా సాహిత్యంలో ఎలాంటి స్థానం ఉంది? అవి ఆ భాషలో వెలువడే మూల రచనలతో సమానస్థాయి ఉందా లేదా?
10. 2. ఒక మూల భాషా సాహిత్యం నుంచి ఏయే లక్ష్యభాషల్లోకి అనువాదాలు వెలుతున్నై? కారణం ఏంటి?
10. 3. సాహిత్యానువాదాలకు మార్కెట్ ఉంది?
10. 4. సాహిత్యానువాదాకుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది?
10. 5. అనువాదంలో అనువాదకుడికి ఆత్మాశ్రయత ఉంటుందా? ఎంతవరకు దాని పరిధి.
ఈ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని తెలుగు భాషాసాహిత్యానికీ అనువర్తించి అధ్యయనం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
No comments:
Post a Comment