Tuesday, March 17, 2020

చారిత్రక పొందు, కావ్య సీసాల విందు ‘ఆంధ్ర ప్రశస్తి’


-డా. జె. సీతాపతి రావు, సహాయకాచార్యులు,
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,
ఏ. పి. ఐ.  ఐ. ఐ. టి., నూజివీడు,
కృష్ణా జిల్లా, 521202. ఆం. ప్ర.


1.0. ఆంధ్ర ప్రశస్తి ప్రస్థానం:-
            ప్రశస్తి అంటే ప్రసిద్ధి, ఖ్యాతి, అలంకారం అని అర్ధాలు. ఆంధ్ర పదానికి దేశ, జాతి, భాషా పరంగా అర్థాలున్నాయి. ఆంధ్ర ప్రశస్తి 12 అంశాలతో, 163 పద్యాలతో ఉంది. దీన్ని విశ్వనాథ సత్యనారాయణ రచించారు. ముగ్గురు శాతవాహన రాజుల, పల్లవుల రాజధాని వేంగి క్షేత్రం. కళింగ, గాంగ వంశాలకు చెందిన ప్రాంతంగా ఉన్న శ్రీ ముఖలింగం, చారిత్రక క్షేత్రమాహాత్మ్యాన్ని తెలుపుతుంది. తూర్పు చాళుక్యులకు సంబంధించిన అంశాలను, నన్నయభట్టు రచనల్లో తెలుస్తుంది. చంద్రవంక యుద్ధం పల్నాడు చరిత్ర లోనిది. కాకతీయులకు సంబంధించిన ప్రోలరాజ వైభవాన్ని, అతనిని చంపిన విధానాన్ని రసవత్తరంగా వర్ణించారు కవి. బంగారు నాణేలు, మణులు వీధుల్లో పోసి, వైభవంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం తళ్ళికోట యుద్ధం, క్రీ.శ. 1565, జనవరి, 26 (రాక్షస తంగిడి/బన్నిహట్టి/భోగాపూర్ యుద్ధం అనిపేర్లు)పతనస్థితిని యమదంష్ట్రికలో వివరించారు విశ్వనాథ.
2.0. చారిత్రక కథల్లో కావ్య శోభ:-   
            ఇందులో ఏ కథకు ఆ కథే ఒక సంక్షిప్త  వివరణగా కనిపిస్తుంది. ఈ కావ్యం సంభాషణతో మొదలై చాలా నిర్వేదాలను మిళితం చేసుకుంటూ పరిమిత పద్యాలతో, అపరిమిత శిల్ప రమణీయతను కలిగి ఖండ కావ్యంలా కనిపిస్తుంది. ఆంధ్ర ప్రశస్తి అనగానే ఆంధ్రుల గొప్పదనాన్ని చెప్పేది అని అర్థం అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర మహావిష్ణువుతో ప్రారంభించి, యమదంష్ట్రిక తో ముగించిన గ్రంథం ఆంధ్రప్రశస్తి. ఇందులో 11 అంశాల్ని వర్ణిస్తూ విశ్లేషించడం ఒకటైతే,  చారిత్రిక నేపథ్యాల్లో కాస్త కావ్యశోభను రంగరిస్తూ కవి తన ప్రతిభశక్తిని చాటుకున్నారు.
            విశ్వనాథ వారు ఈ కావ్యాన్ని ప్రారంభిస్తూ తమ గురువులైన చెళ్ళపిళ్ల కవుల్ని నమస్కరిస్తూ........
            “పుడమిని పెక్కు సత్కవుల్ ............  రారిల దెల్గునాడనన్” (నతి, ఆంధ్ర ప్రశస్తి - విశ్వనాథ)
            అంటూ తన గురువుల గొప్పతనాన్ని వివరించాడు. ఆంధ్ర దేశంలో అవధాన విద్యతో  పద్యానికి పట్టంగట్టారు తిరుపతి వేంకట కవులు. ఇది భాషాభిమానానికి ఒక ప్రచార సాధనమైంది. భారత భాగవతాది అంశాలన్నీ పద్య రూపంలో రక్తికట్టాయి. ఉద్యోగ పర్వం కృష్ణరాయబార ఘట్టంలో “బావా ఎప్పుడు వచ్చితీవు......, చెల్లియో... చెల్లకో...., జెండా పై కపిరాజు” మొదలగునవి.  పద్యాలు, నాటక రంగం, పద్య పరిచయం ఉన్న తెలుగు వారికి ఇట్టే తెలుస్తుంది. అలా ఆంధ్రప్రశస్తి లో తన గురువులకు స్థానాన్ని కల్పించాడు. ఆంధ్రప్రశస్తిలోని అంశాలు ఎలా ఉంటాయో వివరిస్తూ -
            “మా పూర్వాంధ్ర ధరాధినాయక ...... ...... గళాంకమ్ముగన్ (నతి, ఆంధ్ర ప్రశస్తి - విశ్వనాథ)  
            పూర్వం ఆంధ్ర దేశాన్ని పరిపాలించన రాజుల్ని రత్నాల పెట్టెలోంచి రత్నాల్ని తీసినట్టుగా విశ్వనాథ వారు పద్యాలనే రత్నాల పెట్టేలోంచి రత్నాల్లాంటి (మరుగునపడిన) రాజులు ప్రాంతాలను, యుద్ధాలను ఒక హారంగా తయారు చేసి మహా ప్రబంధ రచనకు సౌందర్యాన్ని కలిగిస్తూ, తియ్యటి వాసనల్ని ప్రసరింపజేసేలా నైపుణ్యంతో ఆంధ్రులకు ఆంధ్రప్రశస్తిని అందిందలిచారు.
3.0. లలిత కళా శోభితుడు ఆంధ్ర మహా విష్ణువు :-
            ఆంధ్రవిష్ణువు మగధను జయించి నిశుంభుడు అనే రాజును చంపి శ్రీకాకుళాన్ని రాజధాని (ప్రస్తుతం ఇది ఉయ్యూరుకు దగ్గరగా కృష్ణాజిల్లాలో ఉంది)గా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించాడని పేర్కొన్నారు. ఇతని పేరువల్లే ఆంధ్రపదం ప్రాంత వాచకం వచ్చిందిని ఒక అభిప్రాయం. ఇతడే భీమేశ్వరం, కాళేశ్వరం, శ్రీశైలాల్ని కలుపుతూ పెద్దగోడ కట్టించారని ఒక భావన. కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం ఇతనికే అంకితం ఇచ్చాడు.
            చారిత్రకంగా చూస్తే ఆంధ్రదేశం నుంచి దక్షిణాపథం వరకూ పాలించిన శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం కావడం ఒక పెద్ద విశేషం. మీసాలున్న మహావిష్ణువు. స్థల పురాణాన్ని అనుసరించి చూస్తే - కలియుగంలో పాపాలు పెరిగి పోయాయి. దేవతలు, మునులు, మహర్షులు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారట. ఆయన వారి మొర ఆలకించాడు. పాపభార ప్రక్షాళనకు విష్ణువు సాక్షాత్కారమే శరణ్యమని శ్రీకాకుళ ప్రాంతానికి చేరుకుని ఘోర తపస్సు చేశాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, ఇక్కడే ఉంటూ భక్తుల పాపాలు హరిస్తానని మాట ఇచ్చాడట. అయితే ఈ తపస్సు సమయంలో బ్రహ్మ ఈ ప్రాంతాన్ని చూసి చాలా పులకించిపోయాడట. అక్కడనుంచి ఆ ప్రాంతానికిశ్రీఅంటే శోభాయకరమైన, ‘అంటే బ్రహ్మచే, ‘ఆకుళంఅంటే వ్యాపించినది అని అర్థం.
18వ శతాబ్దంలో చల్లపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన రాజా అంకినీడు బహద్దూర్‌ శ్రీకాకుళస్వామి మహాభక్తుడు. ఆయనకు ఆ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం లేకపోవడం వల్ల బాధ కలిగి అప్పటికే శ్రీకాకుళస్వామి మరో భక్తుడైన కాసుల పురుషోత్తముడనే కవిని ఆలయానికి తీసుకొచ్చి మూలవిరాట్టు భూమి లోపల ఉండవచ్చునని దానిని బయటకు వచ్చేలా చేయాలని కోరాడట. అప్పుడు  పురుషోత్తమ కవి అక్కడిక్కడే 108 పద్యాలతో శతకాన్ని భక్తియుక్తంగా చెప్పాడట. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అంగుళం చొప్పున భూమి లోపల నుంచి స్వామివారి విగ్రహం పైకి లేచిందని కొందరు అంటారు.
“శ్రీకృష్ణవేణీ గరిష్ఠపాధస్తరం .............. వేదకాలమునాఁటి ముత్తైదువట్లు ”. పూర్వుల జీవితాల్ని చిత్రించిన ఘంటశాల స్థితి, ఆంధ్రుల వీరోచిత గాథను బురుజులు పక్కనే ప్రవహిస్తున్న గంగమ్మను పోలిన వేదకాలం నాటి నుంచి ఉన్న ముత్తైదువ కృష్ణవేణి అంటూ పోల్చడం కృష్ణ నది మీద ఉండే మమకారాన్ని తెలుపుతుంది. ఆంధ్రవిష్ణువు జీవితపు చిత్రణతో పాటు అక్కడ ఉన్న లలిత కళావైభవం మరో విశేషం.
4.0. దక్షిణాపథ ధీరులు శాతవాహనులు :-
            శాతవాహనులు (క్రీ.శ 200-600) ఆంధ్ర ప్రాంతాన్ని పాలించారు. అందులో ప్రధానమైన వాడు గౌతమీపుత్ర శాతకర్ణి. మాతృదేవోభవ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం. ఆంధ్ర రాజ్యాన్ని ఆక్రమించిన మహాక్షేత్రవుడ్ని జయించి పూర్వ వైభవాన్ని, ఆంధ్ర పౌరుషాన్ని నిలిపినవాడు.
            “తెనుగున్‌ రాజుల ................. మహారాజుపై!”
అంటూ శాతవాహన రాజుల గొప్పదనాన్ని రాముడు వంశంతో పోల్చి చెప్పాడు విశ్వనాథ. దక్షిణాపథం నుండి దాదాపుగా ఉత్తర భారత దేశం వరకు తెలుగు వారి కీర్తి పతాకం రెపరెప లాడించిన ఘనత శాతవాహన వంశానిది. విశ్వనాథవారు రాముడు సంపాదించని కీర్తిని కూడా శాతవాహనులు సంపాదించారని పేర్కొన్నారు.
5.0. ధర్మాధర్మ విచక్షణుడు మాధవ వర్మ :-  
          విష్ణుకుండినులలో ప్రధానుడు మాధవ వర్మ. విష్ణుకుండినుల వంశ స్థాపకుడు  మొదటి మాధవ వర్మ. విష్ణు కుండినులు బ్రాహ్మణులు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్న వినుకొండకు సంస్కృతీకరణమే ఈ విష్ణుకుండి. ఆ ప్రాంతానికి వెళ్ళిన ఆంధ్రులు ఆ గ్రామం పేరునే తమ వంశం పేరుగా మార్చుకున్నారు. విశ్వనాథ వారు మాధవ వర్మ విషయంలో పూర్తిగా స్పష్టతను ఇవ్వలేదు. కాలాన్ని బట్టి చూస్తే చరిత్రలో కొంత అస్పష్టత ఉంది. పేరును బట్టి చూస్తే ముగ్గురు మాధవ వర్మలున్నారు. స్థాపకుణ్ణి బట్టి మొదటి మాధవ వర్మ అనిపిస్తుంది. పల్లవులతో జరిగిన యుద్ధంలో దిగజారిన విష్ణుకుండినుల పేరును పునఃప్రతిష్టించిన వాడు మాధవ వర్మ-2. ఇతనికి త్రికూటవలయాధిపతి అని బిరుదు ఉంది. 30 సంవత్సరాలు  పరిపాలించాడు.  విష్ణుకుండిన వంశంలో సుదీర్ఘంగా పరిపాలించిన వాడు మాధవ వర్మ-3. పసిబాలుడిగా మొదలుపెట్టి 65 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ ముగ్గురిని కొంతవరకు సృష్టించేలా విశ్వనాథ వారు మాధవ వర్మను తెలిపారు.
            మూడవ మాధవ వర్మ కళింగను పాలించిన తూర్పుగాంగ వంశీయుడు ఇంద్ర వర్మను ఓడించి, చంపి అతని కుమారుడ్ని సామంతునిగా చేసుకున్నాడు. ఈ విజయం తర్వాత ఇతన్ని ఓడించిన రాజు లేడు. మూడో మాధవ వర్మకు న్యాయపాలకుడిగా, ధర్మరక్షకుడిగా మంచి పేరుంది. ఈయన విజయవాడను పాలించేటప్పుడు  చింతకాయలమ్ముకునే ఒక స్త్రీ పుత్రున్ని  రాజకుమారుడు చంపేశాడు. ధర్మ సంరక్షణార్ధం ఆ రాజు తన కుమారుడ్ని వధించాడు. ఆ ధర్మ పాలనకు శ్రీ మల్లేశ్వర స్వామి ప్రీతి చెంది కనక వర్షాన్నికురిపించాడు. ఇద్దరి కుమారుల్ని బతికించాడు. విశ్వనాథ వారు విజయవాటికలో కనక వర్షాన్ని కురియడాన్ని ఇలా వర్ణించాడు-
                   “నట శివ సాయం ...................... వర్షము కురిసెన్.”శివుడు (మల్లికార్జునుడు) సాయంకాల సమయంలో కాళ్ళకు గజ్జెలు కట్టి మాధవ వర్మ చేసిన పనికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొందుతూ నాట్యం చేస్తే, చిట చిట అనే ధ్వని తో విజయవాడలో బంగారు వర్షం కురిసిందట. ఇలా మాధవ వర్మ ధర్మ ప్రతిష్టాపకునిగా, సత్యశీలునిగా కనిపిస్తాడు.
6.0. పెద్ద పులికి మారు పేరు వేగి క్షేత్రం :-  
          క్రీ.శ 300 నుంచి 1100 మధ్యకాలంలో తీరాంధ్ర ప్రాంతంలో నెలకొని ఉన్న రాజ్యమే వేంగి. దీనికే విజయ వేంగి అని పేరు.  ప్రస్తుతం ఇది పెదవేగి అనే చిన్న గ్రామంగా ఉంది. ఏలూరు కు 12కి.మీ. దూరంలో గోదావరి నదికి ఉత్తరంలో, మహేంద్ర గిరికి ఆగ్నేయం లో, కృష్ణానదికి దక్షిణంలో ఈ ప్రాంతం ఉంది. పల్లవులు, శాలంకాయనులు, బృహత్పాలాయనులు, తూర్పు చాళుక్యులు వివిధ కాలాల్లో వేంగీని ఏలారు. వీరి ప్రధాన రాజభాష తెలుగు.
            పూర్వం ఈ దేశాన్ని నాగులు పరిపాలించారు. దక్షిణ దేశంలో నాగవంశంలో అరవళాద్ ఒక తెగ. కాంచీపురానికి దక్షిణంగా ఉండే ఆ ప్రదేశం అరవనాడు అయింది. టాలెమీ అనే విదేశీ చరిత్రకారుడు మైసోలియా (కృష్ణా నది) దక్షిణ ప్రాంతాన్ని ఆశార్ నోరి (ఆర్ వాయ్ నాయ్) అని పేర్కొన్నాడు. శాలంకాయన గోత్రుడైన పల్లవరాజులో ఒకడు ఒక నూతన నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. పెద్దపులి అనే అర్ధం వచ్చేలా వేంగి అని పేరు పెట్టాడు. అక్కడ నుంచి వారందరూ వేంగి రాజులయ్యారు. పల్లవులు (క్రీ.శ 440 నుంచి 616 ) వీరి రాజధాని వినుకొండ. వీరి రాజ్యంలో ప్రధాన నగరం వేంగి. తూర్పు చాళక్యులు (క్రీ.శ 616 నుంచి 1160) పల్లవుల నుంచి వేంగి నగరాన్ని జయించుకున్న విష్ణువర్ధనుడు వేంగి రాజ్యాన్ని స్థాపించాడు. తెలుగును అధికార భాషగా స్వీకరించారు. కొన్ని యుద్ధాల కారణంగా తూర్పు చాళక్యుల చివరి రాజులు తమ రాజధాని రాజమహేంద్రికి మార్చారు. వీరి ముఖ్య ఆరాధ్య దైవం చిత్రరథ స్వామి.
           విశ్వనాథ వారు వేంగి వైభవాన్ని వర్ణిస్తూ చిత్రరధోత్సవ సమయంలో పిల్లలు సైతం కత్తులు తిప్పుతూ వారి యుద్ధ కళను ప్రదర్శించేవారని, అలాంటి చురుకైన ప్రాంతం నేడు జీవచ్ఛవంలా ఉందని కవి ఆవేదన చెందారు.
            “ఏ రాజు పంచెనో................. జీవచ్ఛవాంద్రజనులు”
            నాగుల చవితి రోజు నాగు పాముని చూసి శత్రువుకి కనిపించకుండా వెళ్లడానికుండే శౌర్యాన్ని ఎవరు పంచారు? పల్లవ రాణుల కాళ్ళకు పారాణులు పెట్టుకున్న చోటేది? ఇంద్రునికి రధోత్సవం చేసే సమయాల్లో తెలుగు పిల్లలు కత్తి తిప్పిన చోటేది? మధ్యాహ్న కాలంలో సూర్యుని వేడి వల్ల ఎక్కడ కాంతి వస్తుంది? వేంగి రాజులు నడిచిన పవిత్రమైన చోటేది? ఈ ప్రపంచ శ్రేయస్సును కాంక్షించిన రాజులు తిరిగిన చోటేది? వీటన్నిటికి సమాధానమే వేంగి క్షేత్రం. ప్రస్తుతం దయనీయమైన పరిస్థితుల్లో  బానిస బ్రతుకునీడీస్తున్నారు. అక్కడి ప్రజలు నాటి వైభవాన్ని స్మరించి స్పూర్తి పొందాలని విశ్వనాథ ఆకాంక్ష.
7.0. మధుకేశ్వరుని ముఖ లింగం :-         
            ఒకప్పుడు గంజాం మండలంలోని ఒక మహా క్షేత్రం. వంశధార నదీతీర క్షేత్రం. పూర్వం ఇది కళింగాంగులకి రాజధాని. వేములవాడ భీమకవి నివాస ప్రదేశం. అక్కడ మట్టి గడ్డలు కూడా బంగారం వాసన వేస్తాయట. తూర్పుదిక్కు అనే యువతి నుదుట దిద్దిన ఎర్రని కుంకుమ బొట్టుగా ఈ క్షేత్రం భాసిస్తున్నదని విశ్వనాథ వర్ణన.    
          శ్రీ ముఖలింగానికి సంబంధించిన పౌరాణిక ఇతివృత్తం కనిపిస్తుంది. ఒకప్పుడు హిమాలయాల మీద వైష్ణవ యాగం జరిగింది. ఆ యాగాన్ని చూడడానికి గంధర్వ రాజైన చిత్రగ్రీవుడు తన గణంతో వచ్చాడు. హిమాలయ ప్రాంతంలో ఉండే శభరకాంతలు కూడా యాగాన్ని చూడడానికి వచ్చారు. వారి అందానికి ఆకర్షితులైన గంధర్వులు కాముకులయ్యారు. ఆ విషయాన్ని గమనించిన వామదేవ మహర్షి కోపించి - సభామర్యాదను, పుణ్యప్రదేశమని తలచకుండా అతిక్రమించినందుకు మీరు శబరులుగా పుట్టండని శపించాడు. వారే శ్రీముఖలింగ ప్రాంతంలో ఉన్న శబరులుగా జన్మించారు. వారి నాయకుడు చిత్రగ్రీవుడు శబరి నాయకుడయ్యాడు. అతని భార్యలిద్దరూ ఛిత్తి, చీత్కళ గా జన్మించారు.
          ఒకసారి పెద్ద రాణి ఛిత్తి తమ ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకొమ్మని తమ భర్తను నిలదీసింది. పట్టపురాణిని వదులుకోలేకపోయాడు. చీత్కలను పిలిచి తన వాకిట్లో ఉన్న విప్ప (ఇప్ప) చెట్టు కొమ్మలను వంచి ఆ రాలిన పువ్వులని ఏరుకొని అమ్ముకొమ్మని వాటితోనే బతకమని చెప్పాడు. మహా సాధ్వి అయిన చీత్కళ భర్త ఆదేశాల్ని శిరసావహించింది. శివుని అనుగ్రహాన్ని పొందింది. రాలిన పువ్వులతో జీవనాన్ని సాగిస్తూ ఉంది. ఆ పువ్వులు బంగారంగా మారిపోయాయి. విషయం తెలిసిన ఛిత్తి అసూయతో గొడవకు దిగింది. శబరి నాయకుడు ఈ గొడవకు కారణం ఇప్పచెట్టే అని గ్రహించి దానిని నరకడానికి పూనుకున్నాడు. శివుడు రౌద్రాకారంతో చెట్టు మొదల్లో ప్రత్యక్షమయ్యాడు. అది చూసి నాయకుడు మూర్ఛపోగా దానికి కారణం చీత్కలే అని భావించి ఆమెను శబరులు చంపాలనుకున్నారు. శివుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళ శాపాల్ని పోగొట్టాడు. తిరిగి గంధర్వులైనారు. మధూకవృక్షం లో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడు. మధుకేశ్వరాలయానికే  శ్రీముఖలింగమని మరో పేరు. ఇక్కడ లింగం రాతితో కాక చెక్కతో రాపిడి జరిగి శివలింగమయ్యిందంటారు.                                      
            చారిత్రకంగా చూస్తే ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన తూర్పు గాంగ రాజులకు ఆరు శతాబ్దాలకు పైగా రాజధాని శ్రీముఖలింగం. తూర్పు గాంగ రాజులలో ప్రముఖుడైన అనంతవర్మ ఉత్కళను (ఒడిశా) జయించి  తన రాజధానిని క్రీ.శ.1135 ప్రాంతంలో కటక్ నగరానికి దగ్గరగా మార్చారు. అక్కడి నుంచి శ్రీముఖలింగానికి ప్రాధాన్యత తగ్గింది. దాన్ని చూసి కవి       
            “చిరుత తరంగముల్ .................. తెంగు నిప్పుకల్.” వంశధార నది తరంగాలతో కూడి అందమైన చీర కట్టిన అమ్మాయిలా కనిపించింది. తెలుగు కళింగులు పౌరుషంతో జైత్రయాత్రను చేశారు. కానీ ప్రస్తుతం అక్కడ గబ్బిలాలు తిరుగుతున్నాయని, పూర్వ వైభవం లేదని జీవత్వం పోయినట్లు కవి గారి ఆక్రందన. నదులలో ఉన్న చైతన్యం తెలుగు వారికి రావాలని, బానిసత్వ బతుకులను విడిచి బతకాలని కవి గారి భావన. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలంలో ఉంది. ఇక్కడ అర్చక స్వాములు, జంగాలు.
8.0. అభినవ వ్యాసుడు నన్నయ భట్టు :-
            విమలాదిత్యుని మరణానంతరం యువరాజైన రాజరాజు సింహాసనాన్ని ఎక్కాడు. కానీ అతని సవతి సోదరుడు విజయాదిత్యుడు కల్యాణి ప్రభువు రెండవ జయసింహ జగదేకమలుని సహాయంతో రాజరాజుని ఓడించి వేంగి సింహాసనాన్ని ఆక్రమించాడు. ఓడిపోయిన రాజరాజు తన మేనమామ రాజేంద్రుని చోళుని సహాయాన్ని  అర్థించాడు. రాజేంద్ర చోళుడు విజయాదిత్యుడిపై దండెత్తి ఓడించి, తన కుమార్తె అమ్మంగా దేవినిచ్చి పెళ్లి చేసి క్రీ శ 1022 లో పట్టాభిషేకం చేయించాడు. రాజరాజ నరేంద్రుడు 41 సంవత్సరాలు చేసినప్పటికి మధ్యమధ్యలో చాలా సార్లు శత్రువులధాటికి ఆగలేక పారిపోవలిసి వచ్చింది.
            నన్నయ నరేంద్రుని ఆస్థానకవి. రాజరాజుకు తన పూర్వీకుల చరిత్రను తెలుసుకోవాలనిపించి సంస్కృత భారతాన్ని అధ్యయనం చేశాడు. ఆనందించాడు. తెలుగు వారి కోసం, తన ప్రజల కోసం తన పూర్వీకుల చరిత్రను చెప్పించాలనుకున్నాడు. అప్పటికే గోదావరి తీరంలో తన పేరుతో రాజమహేంద్ర వరాన్ని నిర్మించాడు. అప్పటికే ఉన్న వేంగిని వదిలి రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకున్నాడు. రాజరాజు గొప్పతనాన్ని వివరిస్తూ, నన్నయ..
            ఇది యేనున్ ......... శశ్వత్సాధుసాంగత్యమున్(ఆంధ్ర మహాభారతం, అవతారిక, 12)” ఇందులో అయిదు అంశాలు చెప్పారు.  బ్రాహ్మణులకు దానాన్ని ఇవ్వడం, భారతాన్ని వినడం, శివుడిని అర్చించడం, ఉత్సవ సమయాల్లో దాన  శీలతను కలిగి ఉండటం, మంచివారిని రక్షించడం, ఒక రాజుకు ఉండాల్సిన దానగుణంతో పాటు, భారతాన్ని వినాలనే కోరిక తెలుగులోకి భారతాన్ని అనువాదానికి కారణాలు. సంస్కృతంలో వ్యాసుడు రాసిన జయసంహిత ఆధారంగా చాళుక్యరాజైన రాజరాజు కోరిక మేరకు నన్నయ భారత అనుసృజనకు పూనుకున్నాడు. “శ్రీవాణీ గిరిజాశ్చిరాయ...” అంటూ ఆంధ్ర మహా భారతాన్ని మొదలు పెట్టి తెలుగుకు పద్య విద్యను ప్రసాదించి, తెలుగుకవితకు అనుసృజనకర్తగా, తెలుగుతల్లికి శబ్దచింతామణిగా తలమానిమయ్యాడు, నన్నయ.
9.0. రాజనీతిజ్ఞుడు ప్రోల రాజు :-
            కాకతి అనే పేరున్న గ్రామాలు గంజామ్, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఉన్నాయి. మొదటి భేతరాజుకు కాకతీపురనాథ, అతని కొడుకుకు కాకతి వల్లభ అనేవి బిరుదులు.
          కాకతీయులు దుర్జయ వంశం వారని, వీరి మూల పురుషునిగా వెన్నరాజు కాకతిపురాన్ని పాలించడం వల్ల వీరు కాకతీయులయ్యారని భయ్యారం శాసనం వల్ల తెలుస్తుంది. కాకతీర్నామ దుర్గాభజంతి ఇతి కాకతీయః అని విద్యానాథుడు చెప్పడం వల్ల దుర్గాదేవికి కాకతీ అనే పేరుందని, ఆమెని ఆదరించడం వల్ల కాకతీయులయ్యారని మరోపేరు. కాకతి అంటే కూష్మాండం(గుమ్మడి). హనుమకొండ రాజకుమారిని కాకతీయ గుండన వివాహమాడాడు. ఆ రాజు కుటుంబీకులందరూ సిద్దేశ్వరభక్తులు. సిద్దేశ్వరునిని గుమ్మడి పూలతో పూజించి గుమ్మడి పూలవంటి కొడుకును కన్నాడని, ఆ వంశం రాజకుమారికి పుట్టిన సంతానాన్ని గుమ్మడిపండు సంతానమే కాకతీయులని చరిత్రకారుల ఊహ. శక, యవన, హూణుల దాడులవల్ల ఆంధ్రదేశం చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడింది. వేరే ప్రాంతం వాళ్ళు ఆంధ్రుల్ని జయించాలనుకున్నప్పుడు అందరు ఆంధ్రులు కలిసి రావాలని పోలరాజు భావనగా విశ్వనాథ వారు కల్పించారు.
           “పరులరుదెంచినన్ ................. ధరాస్థలిన్”. ప్రోలరాజును ఎదురించగలిగేవారు నాటి కాలంలో లేరనే చెప్పాలి. రాజనీతి, స్నేహ స్వభావం, వీరశైవమత గాఢత్వం, సైన్యంలో భక్తిని పెంపొందించడం, ఆంధ్రుల్ని ఏకం చేయటం ప్రోలరాజు పనిగా పెట్టుకున్నాడు. అలాంటి సమయంలో మంత్రకూట పురాధీశ్వరుడైన గుండరాజు ప్రోలరాజు పెట్టిన సభను భగ్నం చేశాడు. ప్రోలరాజు వెంటనే గుండరాజు తలను నరికి కోటగుమ్మానికి వ్రేలాడదీశాడు. దాంతో ఏ రాజైనా భయపడే స్థితికి తీసుకువచ్చాడు. కాకతీయ వంశంలో వీరశైవ పూజా విధానానికి ప్రతీకగా నిలిచినవాడు ప్రోలరాజు. జైత్రయాత్రల్లో శత్రువుల్ని జయించడంలో భీకరంగా ఉంటాడు. స్నేహితుల విషయంలో ప్రసన్నతను కలిగి ఉంటాడు. అలాంటి గొప్ప వీరుల్ని, నాయకుల్ని నడిపిన భూమి మన ఆంధ్రభూమి.

10.0. కొండవీటి పొగ మబ్బులు:-      
            కాకతీయుల పతనానంతరం సింహాచలం, నెల్లూరు తీరాంధ్ర ప్రాంతాన్ని సుమారు 150 సంవత్సరాలు పాలించినవారు రెడ్డిరాజులు. వీరి కాలంలో తెలుగు భాషా సంస్కృతులకు అశేషమైన  సేవ చేశారు. కొండవీటి వైభవాన్ని నెమరువేసుకొనే తెలుగువారి కాల్పనిక భావన మాధుర్యానికి పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి పొగమబ్బుల్ని ప్రతీకగా వాడారు, విశ్వనాథ.
          కొండవీడు కొండ కొమ్మలపై వ్యాపించిన పొగమబ్బుల్ని విశ్వనాథ వారు రెడ్డిరాజుల వంటింటి నుంచి వచ్చిన పొగలా ఉన్నదని ఉత్ప్రేక్షించాడు. అతిథులకు అన్నపానాల్ని ఇవ్వడంలో రెడ్డిరాజుల దాతృత్వం కనిపిస్తుంది. ముత్యాల అంచులు గల మేలి వస్త్రంలా, నడుము భాగం నుంచి జారిపడిన స్త్రీల వస్త్రాలలా, మొగలు పువ్వునుంచి రాలిన పుప్పొడిలా, రాత్రి వేలపు చుక్కల్లా ఈ పొగమబ్బులు ప్రకృతిలో కలిసి పోయాయట. పైగా అవి అలంకరణలుగా మారాయట. కుండిన ప్రభువు గరుడ ధ్వజంలా, గజపతుల గజబలం చిమ్మిన నీటి తుంపర్లులా, శ్రీనాథుని నైషధకావ్యంలోని దూతగా ఉన్న హంసకు రెక్కలా మహాగ్నిని సూచించేవిగా ఈ మబ్బులు వెలుగొందుతున్నాయి.
            రెడ్డిరాజులు వీరత్వం కలిగిన వారు. కొండకోనలపై, బురుజులపై, కొమ్మలపై రాలిపోతూ గాలిలో తేలిపోతూ ఊహల్లో గుండ్రంగా తిరుగుతూ ఈ పొగమబ్బుల్నే ఆవరించినట్లుగా నాటి వైభవాన్ని స్ఫురించేలా విశ్వనాథ వర్ణించాడు. తద్వారా దేశభక్తిని ప్రభోధించాడు.
11.0. చంద్రవంక యుద్ధం:-
            బ్రహ్మనాయుడు సోదరుడు బాదరాజుతో అలరాజు చంద్రవంక దిబ్బలమీద యుద్ధానికి దిగుతాడు. బాదరాజుపై ఉప్పెనలా ఎగిసిపడిన అలరాజు బ్రహ్మనాయుడు శాంతి వచనాల్ని మన్నించలేదు. పైగా బ్రహ్మనాయుడ్ని చిన్నబుచ్చే విధంగా మాట్లాడాడు. అలా రాజుపై బ్రహ్మనాయుడి మదిలో పగ ద్వేషం రావటానికి, పెరగటానికి ఈ సంఘటనే కారణం.
        మహాభారతానికి పల్నాటి వీర చరిత్రకు దగ్గరి పోలికలుండడం వలన పల్నాటి వీర చరిత్రను ఆంధ్రభారతం అంటారు. పల్నాటి[1] యుద్ధం12 వ శతాబ్దంలో ఆంధ్ర దేశ, సాంఘిక, మత మార్పిడులను దోహదం చేసింది. మరో వైపు చూస్తే తీరాంధ్ర ప్రాంతంలోని రాజవంశాలన్నింటిని బలహీనపరిచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు దారి తీసింది. పల్నాటి యుద్ధంలో ఓడిపోయిన బ్రహ్మనాయుడి అనుయాయులు ఓరుగల్లు  చేరి కాకతీయులతో చేరారు. ఇది పల్నాటి యుద్ధ శాసనాల్లో ఎక్కడా కనిపించదు. శ్రీనాథుని క్రీడాభిరామంలో ఉంది.
            బ్రహ్మనాయుడు వైష్ణవ భక్తుడు. భజన పరుడు. ప్రజలు ఆయన్ని గౌరవిస్తుంటారు. రాజబంధువుల్లో చాలా మంది ఆయన్ని అనుసరిస్తుంటారు. జయ చెన్నకేశవ అని బ్రహ్మనాయుడ్ని పొగుడుతారు. సర్వసమానత్వాన్ని హరిజనోద్ధరణను బోధించే బ్రహ్మనాయుడు దేవాలయాల్లో హరిజనుల్ని ప్రవేశపెట్టాడు. పంక్తి భోజనాల్ని ఏర్పాటు చేసేవాడు.                                  
            నలగామరాజు, అనుగురాజులకు పెంపుడుకొడుకు. అలరాజు నలగామ రాజుకు అల్లుడు. అందువల్ల బ్రహ్మనాయుడు బాదన్నలకు నలరాజునకు మామ అల్లుల్ల వరస. అలరాజుకు రాచమల్లు, అలరాచమల్లు అని కూడా పేరు. అలరాజు గుర్రం పేరు “సవరాల గోడిగ”. బాదన్న గుర్రం కారుభొల్లడు. బాదన్న, బ్రహ్మ నాయుడు వెలమలు. అలరాజు క్షత్రియులు. చంద్రవంక దిబ్బల ప్రదేశంలో గుర్రాలతో పందేలు వేసుకున్నారు. సాధారణంగా పల్నాడులో కోడిపందేలు, గుర్రపు పందేలాట సహజం. బ్రహ్మనాయుడు అది చూసి పౌరుషంతో తానే స్వయంగా కోడిపందేలలో పాల్గొని ఒక పుంజుని విడిచాడు. వట్టి పందెంతో లాభంలేదని, ఎవరి పక్షం వారి కోడి ఓడిపోతే వారు పన్నెండేళ్లు పరదేశంలో ఉండాలని, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఉండాలని పందెం కట్టారు. బ్రహ్మనాయుడి కోడి ఓడిపోయింది. నానా కష్టాలకు లోనైన బ్రహ్మనాయుడు సపరివార సమేతంగా వలస పోయాడు. గడువు పూర్తయిన తరువాత రాజ్యానికి వచ్చి మాచర్లను తనకి అప్పజెప్పమని రాజకుమారులు పక్షంగా గురజాలకు వర్తమానం పంపాడు. అక్కడి నాయకురాలు ఆ దూతను చంపింది. భాగం ఇవ్వలేదు. ఉభయ పక్షాలకు మధ్య నాగులేటి తీరంలో కారంపూడి దగ్గర భయంకర యుద్ధం వచ్చింది. యుద్ధరంగంలో (చంద్రవంక దిబ్బలు) అలరాజు, నలగామరాజు యుద్ధానికి సిద్ధపడినప్పుడు బ్రహ్మనాయుడు వారించే ప్రయత్నం చేస్తాడు.
           “అల్లుడా! ఆగరాదయ్య .................... నాయుడు వచించే
యుద్ధ రంగంలో మామ అల్లుల్ల మాటల్ని ఈ పద్యం సూచిస్తుంది. వయసులో పెద్దవాడైన మామ అల్లుడా ఆగవయ్యా  అంటూ అలరాజుని ఆపే ప్రయత్నం చేశాడు. మామ నాకత్తి ఒర నుంచి బయటకి రాగానే ఏదైనా బలి తీసుకుంటుంది. లేకపోతే మళ్ళీ ఒరలోకి వెళ్లలేదు అన్నాడు. దానికి బ్రహ్మనాయుడు అంత కసకు ఏల? (అంత పాపం ఎందుకు) అంటూ ఆవేశాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు. యుద్ధం ఆపే ప్రయత్నాన్ని  బ్రహ్మనాయుడు చేస్తుండగా ఇంకో వైపు నుండి సైన్యాధ్యక్షుడైన కన్నమ దాసుని అలరాజు కత్తికి బలి ఇవ్వడం కోసం అరటి గడ్డలను తీసుకురా అని వెటకారం ఆడుతాడు. కన్నమదాసు వాయువేగంతో పట్టణానికి వెళ్ళాడు. అప్పుడు తమ్ముడు దగ్గర అన్నగారు నిల్చారు.
            “అలరాజు దిగడు  .................... దిగి దుమ్మెగయాన్”
            అలరాజు గుర్రం దిగకుండా అటు ఇటూ దాన్ని పరుగెత్తిస్తున్నాడు. పచ్చగడ్డి అక్కడక్కడ ఉన్న మట్టిగడ్డలు తెల్లగా, పొడిగా అయి నేల గిట్టల శబ్దాలకి, వేగానికి దుమ్ము ఎగిరి ఆ ప్రాంతమంతా కప్పేస్తున్నట్లు అనిపిస్తుంది.
            కన్నమ దాసు వేగంగా వెళ్ళి అరటిదవ్వలు తెచ్చి అక్కడ పాతాడు. అల్లుడా వచ్చి నీ కత్తికి వీటిని బలివెయ్యు  అని చెప్పాడు. బ్రహ్మనాయుడి  కత్తి పేరు  సూర్యభేతాళ. అలరాజు కత్తి పేరు సూర్యధేక్కానం. సూర్యభేతాళంను విసురుగా కిందకి కొట్టాడు. అది పిడి వరకు దిగిపోయింది కిందకి. బాదన్న ముఖం ఎర్రగా పెట్టిన రేఖల్లాగా ఉన్నాయి. రాచమల్లు బ్రహ్మన్న ను చూసి మామా భేతాళం భూమిలోన దిగబడింది. తీసిపెట్టమని అడిగాడు. బ్రహ్మనాయుడు అవి రాజులు చేయించిన కత్తులు మాకు తీయడం రాదని చెప్పాడు. అలరాజు వెంటనే గుర్రాన్ని అటువైపు పోనిచ్చి ఎడమకాలుతో పైకి లేపాడు. కత్తిని లాగినపుడు ఆ ప్రాంతంలోని  భూమంతా పైకి లేచినట్లు అనిపిస్తూ, అందులో ఒక పెల్ల బ్రహ్మనాయుడి నుదుట తాకింది. ఎవరు ఎవరివంక చూడకుండానే ఒక నీలమైన రంగు గల పాము వచ్చి కాటు వేసినట్లుగా అలరాజు ప్రాణాలు పోయాయి.
12.0. యమలోక దూత యమదంష్ట్రిక:-
            ఆయుర్వేద శాస్త్రంలో కార్తీక పూర్ణిమ నుంచి మాఘ పూర్ణిమ వరకు ఉన్న 30 రోజుల్ని యమదంష్ట్రలు అంటారు. సాధారణంగా కార్తీక మాసం నుంచి మాఘ మాసం వరకు వాతావరణ మార్పుల వల్ల వైరస్ జీవుల్ని అనారోగ్యం  పాలు చేస్తుంది. ఈ కాలంలో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడని ఒక అభిప్రాయం. దంష్ట్రిక  అంటే కోర పంది అని అర్థం. తెలుగు నాట మార్గశిర పున్నమిని కోరల పున్నమి అంటారు. అళియ రామ రాయల ఖడ్గం యమదంష్ట్రికలా, ధూమకేతువులా, అరిష్ట ప్రదమ సూచన. శరదృతువులో యుద్ధాలు నిర్వహిస్తారు. ఆ కాలంలో యమదంష్ట్రులు నోరు తెరుచుకొని జనానికి నష్టం కలిగిస్తారు.
              తళ్ళికోట యుద్ధంలో బీజాపూర్ సుల్తాను చేతుల్లో విజయనగర సామ్రాజ్యం ఓటమి పాలైంది. రాక్షస, తంగిడి అనే రెండు గ్రామాల మధ్య ఉన్న మైదానంలో విజయనగర సైన్యం, సుల్తాను సైన్యం తళ్ళికోట వద్ద మోహరించారు. కృష్ణానదికి 25 మైళ్ళ దూరంలో తళ్ళికోట ఉంది. గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా, బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిర్షాలు కలిసి రామరాయలను ఓడించారు. అలియ రామరాయలు సైన్యానికి నెలరోజులైనా కళ్యాణ దుర్గాన్ని స్వాధీన పరుచుకోలేకపోయారు. అప్పుడు అలియరామరాయలు తన కరవాలన్ని తీసి కోట లోపల పడినట్లు గట్టిగా విసిరాడు.
            “తెలిలేవెన్నెల ....................... రాజద్ధూమ కేత్వాకృతిన్. ”సైన్యంలోని దండనాథులందరూ ఆశ్చర్యపడేలా రామరాయలు దూరంగా పడేంత వేగంతో వజ్రాలతో, మణులతో కూడిన, అందమైన, ఖరీదైన, గట్టిదైన తెలుగు ముని విద్యారణ్య స్వామి ఇచ్చిన కత్తిని కోటలోకి విసిరి యోధుడైనవాడు దాన్ని తెమ్మని ఆజ్ఞాపించాడు. అంతకు నెలరోజుల ముందే బీజాపూర్ ను గెలిచిన సదాశివరాయలు ఆ పనికి పూనుకున్నాడు. గజబలాన్ని రంగంలోకి దింపాడు. కోట తలుపుల్ని బ్రద్దలు గొట్టించాడు. కళ్యాణ దుర్గాన్ని స్వాధీన పరచుకున్నాడు. ఖడ్గాన్ని తెచ్చి సదాశివరాయలు రామరాయలకిచ్చాడు. గురువులిచ్చిన శక్తివంతమైన ఆ ఆయుధమే సదాశివరాయుల్ని సాహసోపేతంగా తేవడానికి అళియరామరాయలు చేసిన ప్రయత్నం ఫలించింది.
            “ఉదయాన వారణాంశుల....................  సదాశివనాయకుడిచ్చె రేణికిన్. ” అనుచరుల్లో ఉండాల్సిన పౌరుషాగ్నిని ఎలా నింపాలో, సమయస్ఫూర్తి ఎలా ఉండాలో ఈ ఖండిక సూచిస్తుంది. దేశ పౌరుషానికి గౌరవానికి చిహ్నాలుగా జాతీయ జెండాను కట్టడాలను ఆయుధాలను ఎలా చూడాలో సూచిస్తుంది. రాజైన వాడు వీర శౌర్యాలను కలిగించడం, కలిగిఉండటం  మరో అంశం. ఉన్న వనరుల్ని  వాడుకొని విజయకేతనం ఎగరేయడం ఒక సాహస కృత్యం. శత్రువుల బలాన్ని కనిపెట్టి దానికి తగినట్లుగా పథకాన్ని వేసుకొని విజయాన్ని పొందడం యమదంష్ట్రిక లోని అంశం.
13.0. రమణీయ వర్ణల సృష్టి ఆంధ్ర ప్రశస్తి :-  
            ఎంత గొప్ప ఉన్నత స్థాయిలకు వెళ్ళినా, మూలాలను మర్చిపోకూడదు అంటారు పెద్దలు. అదే తీరుగా ఉన్న ఊరు, భాషా సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను మర్చిపోకూడదు. అవి మనతో ఉండే నిత్య ఆభరణాలు లాంటివి. మనమేంటో తెలియాలంటే మన చుట్టు పక్కల ఉన్నవారిని చూసి చెప్పవచ్చు. అదే విధంగా మన పుట్టు పూర్వోత్తరాలు తెలియాలంటే మన చారిత్రక నేపథ్యాలు తెలుసుకోవాలి. ఎందరో గొప్ప గొప్ప వీరులు ఏలిన నేల మన ఆంధ్ర భూమి. భాషా సంస్కృతులకు పుట్టినిల్లు. అటు ఉత్తరాంధ్ర నుండి ఇటు రాయలసీమ వరకు ఎంతో ప్రశస్తి కలిగిన పుణ్యభూమి. అలాంటి గొప్ప మన చారిత్రక ఆధారాలు మట్టిలో కలిసిపోతుంటే చూసి తట్టుకోలేకపోయారు విశ్వనాథ. నాటి సాంస్కృతిక, చారిత్రక అంశాలను తర్వాత తరాలకు అందించాలని ఆహరహం కృషి చేశారు.
            ఈ ఆంధ్ర ప్రశస్తి లోని అంశాలు చారిత్రకం. కానీ అది లిఖించిన తీరు కవితాత్మకం. అది విశ్వనాథ వారికే సాధ్యం. ఇందులో చెప్పినవి 11 అంశాలే అయినా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను క్షుణ్ణంగా, రసవత్తరంగా తీర్చిదిద్దారు. ఈ పుస్తకం చదివిన అంతసేపు ఒక ఆంధ్రుడిగా పుట్టినందుకు ప్రతి పాఠకుడి ముఖంపై గర్వం చిందులేస్తుంది. ఇంకో వైపు ఈ అంశం వెనుక ఇంత చరిత్ర దాగి ఉందా? అనే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా నేటి యువతకి. విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి చదివితే అటు చారిత్రక పొందు, ఇటు కవితా విందుగల వ్యక్తిత్వం సొంతం. ఆ పై అన్వేషకులకు కావల్సినంత కావ్య సీసాల సౌభాగ్యం. ఆసాంతం చారిత్రక రామణీయకత.
ఆధార గ్రంథాలు:-
1. అంతర్జాలం
2. ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర చరిత్ర – పి వి కె ప్రసాద రావు
3. ఆంధ్ర ప్రశస్తి – విశ్వనాథ సత్యనారాయణ  
4. శ్రీమదాంధ్ర మహాభారతము(ఆది, సభా) - నన్నయభట్టు
4. A Forgotten Empire- Robert Sewell
5. The Forgotten Empire of Vizianagaram- రాబర్ట్ సీవెల్


[1] పల్నాడు శబ్ద వ్యుత్పత్తి:-  వెలనాడు, పోలనాడు, పలనాడు, వేగినాడు, ప్రోర్నాడు ఇలా ఆంధ్ర రాష్ట్ర భాషలో నాడులు (ప్రదేశాలు) వచ్చాయి. వెలనాడు అనే పదం వలనాడుగా, పలపలనాడుగా ఉంది.  పలపల నాడు అనే పదానికి తెల్లవారు అని అర్ధం. మేల్కొన్న ప్రదేశమని భావన. ఒక పల పోయి పలనాడుగా మిగిలి ఉండొచ్చు.

No comments: