Friday, June 16, 2017

శేషేంద్ర పద్య కావ్యం సొరాబు


శేషేంద్ర పద్య కావ్యం సొరాబు లోంచి ఒక పద్యం మచ్చుకు- 
                                                                          
*క్షోణీ చక్రము ఘూర్ణిలంగ నతడక్షు ద్రార్భటీ సైన్యుడై
నానా సంగర రంగముల్ దిరుగు చుండ న్నొక్కచో శారికా
వాణిం, జారు కళా విలాస నళినీ పాణిన్, మహాబంధుర
శ్రోణిం, భావజు రాణి, బోని విలస ద్రోలంబు వేణిం గనెన్.                                 4
అన్వయం:- క్షోణీ చక్రము ఘూర్ణిలంగ-అతడు భూమి సంచలించు చుండగా, అక్షుద్ర ఆర్భటీ సైన్యుడు- అనల్పమైన పరాక్రమము కల సైన్యంతో కూడినవాడై, నానా సంగర రంగముల్- చాలా యుద్ధభూములను తిరుగుచుండగా, ఒక్కచోట గోరువంకల ధ్వనిలాంటి(శారికావాణిన్) మధురమైన పలుకులు కలిగిన దానిని, చారు కళా విలాస నళినీ పాణిన్- అందమైన కళా విలాసాలు కల పద్మాల్లాంటి చేతులను కల్గినదానిని; మహాబంధుర శ్రోణిన్- విశాలమైన పిరుదులు కలదానిని; భావజు రాణిన్ + పోని- మన్మథుని భార్య రతీదేవికి తీసిపోని దానిని; విలసత్+రోలంబు వేణిన్- నల్లని కాంతితో విలసిల్లే తుమ్మెదల సమూహం లాంటి జడను కలిగిన దానిని; కనెన్- చూచెను.
భావం:- చాలా ఎక్కువ సైన్యంతో చాలా  ప్రాంతాలలో యుద్ధాలు చేస్తూ తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూశాడు.
వ్యాఖ్య:- అంత్యాను ప్రాసాలంకారంతో ప్రబంధ శైలిని జ్ఞప్తికి తెచ్చే రచనా విన్యాసం ఇక్కడ మనం చూడొచ్చు... వాణిన్- పాణిన్- శ్రోణిన్- వేణిన్. 
“కడుహెచ్చు కొప్పు దానిన్ /గడవన్ జనుదోయి హెచ్చు, కటి యన్నిటికిన్
కడుహెచ్చు, హెచ్చు లన్నియు/నడుమే పసలేదుగాని నారీమణికిన్!”(విజయ విలాసంలోని 1-104) అనే పద్యాన్ని స్ఫురించేలా ఉంది. ఇందులో ఉండే హెచ్చులు చూపును మళ్ళింపలేకుండా ఉండేలా చేయడం గమనించదగింది. మన్మథుడు అందగాడు, అతని భార్యా అందగత్తే, భర్తకోసం ఏదైనా చేయగల అందగత్తే అని సూచన. శివుడు భస్మం చేస్తే తనకు కనబడేలా వరాన్ని పొందింది. జడ తుమ్మెదల బారులా ఉంది అనడం కవిసమయం. అయితే అది తేనె టీగలు లాంటివి. వాటిలో పోల్చడం ఆపై సమూహం అనడం ఆమె స్వచ్ఛమైన ఆరోగ్య తత్త్వాన్ని సుస్థిర పరుస్తున్నాయి. ఇలా వర్ణన చేస్తూ స్త్రీకి సహజ అలంకారాలను అంతే సహజంగా చెప్పడం ద్వారా ఏదో జరగబోతున్నది అని సూచించడం పాఠకుడికి ఉత్కంఠను  రేపుతున్నది.

క్షోణీ తలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి జంచరీక చయ సుందర వేణికి రక్షి తానత(తామర)
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామా శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్(శ్రీ మహాభాగవతము, ప్రథమ స్కంధము, 6 పద్యం) వాణీస్తుతిని, “అవనీ చక్రము సంచలింపఁగ, దివం బల్లాడ, నాశాచయం
బవధూతంబుగ గోత్రశైల నికరం బాకంపముం బొంద,
ర్ణవముల్ ఘూర్జన మొందఁ గ్రోధము గృతార్ధత్వంబు నొందించి, చి
త్రవధ ప్రౌఢి వహించి సూతునకు రౌద్రంబేర్పడం జూపుదున్ ! (– విరాట పర్వం, భారతము) లో కీచకుడి స్థితిని సూచిస్తున్నది. కోపతీవ్రత మానసిక దౌర్బల్యానికి కారణాలు.
{‘‘భూమండలం కంపించే విధంగా, ఆకాశం అల్లల్లాడి పోయే లాగా, దిక్కులు పిక్కటిల్లేలా, కుల పర్వతాలు వణికి పోయే తెరగున, సముద్రాలు కల్లోలమై పోయేటట్లు, నా క్రోధం సఫల మయచ్యే విధంగా చిత్రవధ చేసే నా నేర్పుని చూపిస్తూ ఆ కీచకుడిని అంతం చేస్తాను!’’ అనుసరిస్తున్నట్లుగా అనిపిస్తున్నది}

                                                        -డా. జాడ సీతాపతిరావు,

No comments: