-డా. జాడ సీతాపతి రావు, తెలుగు శాఖాధిపతి,
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,
ఏ. పి. ఐ. ఐ. ఐ. టి., నూజివీడు,
కృష్ణా జిల్లా, 521202. ఆం. ప్ర.
సంచరవాణి:
9951171299.
1.0. కావ్యారంభానికి
నాంది:-
‘కావ్యాతీతి కవిః తస్య
కర్మ కావ్యం’ అన్న నిర్వచనాన్ని ఆలంబనగా చేసుకొని కావ్యానికి
కథా బలాన్ని, కవితా శక్తిని మేళవించి చిన్న చిన్న కావ్యాలని
గేయ కవిత్వంలో రాయడం ఆధునికుల మార్గం. గురజాడ లవణ రాజు కల,
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, తల్లావజ్జల శివశంకర శాస్త్రి వకుళ
మాలిక, విశ్వనాథ
సత్యనారాయణ కిన్నెరసాని పాటలు, పుట్టపర్తి నారాయణాచార్యులు
శివతాండవం మొదలైనవి. సి.నా.రె వీటన్నింటినీ గమనించి వస్తువులో, అభివ్యక్తిలో బిగువైన బంధాన్ని ఏర్పరచి గేయ ప్రబంధాలుగా మలిచారు.
నాగార్జున సాగరం, స్వప్న భంగం, కర్పూర
వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, ఋతు
చక్రం, జాతి రత్నం, మొదలైనవి
కనిపిస్తాయి.
2.0. రెడ్డి రాజుల చరిత్ర :-
రెడ్డి రాజుల యుగంలో
ప్రసిద్ధుడైన కుమార గిరి రెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉంది. ఆ నేపథ్యంతో మల్లంపల్లి సోమ శేఖర శర్మ అందించిన
వివరాలను ఆధారంగా సి.నా.రె కమనీయ కల్పనా గేయ ప్రబంధం కర్పూర వసంతరాయలు. కాకతీయ
రాజ్య పతనానంతరం దానిని ఆశ్రయించుకొని ఉన్న సామంతులు, సేనా నాయకులు
స్వతంత్ర రాజ్యాలను స్థాపించుకున్నారు. వాటిలో కమ్మ, రెడ్డి, వెలమ రాజ్యాలు ముఖ్యమైనవి. అదే రాజ్యంలో సమాంతరంగా విజయనగర సామ్రాజ్యం
ఏర్పడింది. రెడ్డి రాజులు ప్రధానంగా అద్దంకి, కొండవీడు, రాజమహేంద్రవరం, కందుకూరు ప్రాంతాలలో క్రీ.శ 1324
నుంచి సుమారుగా 1425 వరకు రాజ్యాన్ని ఏలారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా నుంచి
విశాఖపట్నం వరకు, దక్షిణాన నెల్లూరు వరకు విస్తరించి ఉండేది.
కొండవీడు కృష్ణా జిల్లాలో ప్రసిద్ధమైన దుర్గం. శత్రు దుర్భేద్యమైన కోట, వీరి వాస్తు నైపుణ్యానికి నిదర్శనం.
రెడ్డి రాజులు నాట్య
కళ ఆరాధన, పోషకులు. కాకతీయ రాజ్యంలో చివరివాడైన ప్రతాప రుద్రుడి దగ్గర కోమటి ప్రోలయ
రెడ్డి సేనానిగా ఉండి, తర్వాత రెడ్డి రాజ్యాన్ని స్థాపించి, అద్దంకిని రాజధానిగా 1324 లో స్థాపించాడు. తర్వాత వాడు ప్రోలయ
వేమారెడ్డి. పరాక్రమానికి పతాకం లాంటి వాడు. కవి పండితులను పోషించి ప్రశంసించి
సన్మానించేవాడు. ఒంగోలు దగ్గర చదలవాడకి చెందిన ఎర్రా ప్రగడ ఈయన ఆస్థాన కవి. 1350
వరకు ప్రోలయ వేమారెడ్డి పాలించాడు. తర్వాత వాడు అనపోతా రెడ్డి. 16 సంవత్సరాలు
పాలనలో బ్రాహ్మణులకు దానాలు, చాలా శాసనాలు వేయించాడు. తర్వాత
అతని కుమారుడు ప్రస్తుత నాయకుడు కుమారగిరి రెడ్డి. మొత్తం మీద రెడ్డి రాజుల కాలంలో
సామాన్య జనులు దొమ్మరి సానుల ప్రదర్శనలని, వీధి భాగోతాలని
చూసి ఆనందించడం పరిపాటి. సాతానులు, ఏక తారలని చేతిలో
పట్టుకొని శ్రావ్యంగా పాటలు పాడుతూ ప్రతిరోజూ గ్రామాల్లో యాచిస్తూ
జీవించేవారు.
ప్రాచీన
కవులు జక్కుల పురంద్రీకులని వర్ణించిన కామేశ్వరీ దేవతని కొలిచిన జౌలవ జాతి వారు
ఉండేవారు. కోలాటం, చిరతలను మ్రోగిస్తూ చిందులు తొక్కుతూ పాడే గుండ్లి ఆడే కుండలాకర నృత్యం ఈ
కాలం నాటివే ఇప్పుడు ఇవి తెలంగాణలో బతుకమ్మ, బొడ్డేమ్మ
పాటల్లా కనిపిస్తున్నాయి.
3.0. వసంతరాయలు అలియాస్ ‘కుమార గిరి రెడ్డి’ :-
కొండవీటి రెడ్డిరాజులలో
చివరిరాజు కుమార గిరి రెడ్డి. క్రీ.శ. 1386 –1402 వరకు
ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రసిక ప్రభువు. ఇతడే ధర్మ వేముడు. కవుల కవిత్వానికి
మెచ్చి పారితోషికాలు ఇచ్చేవాడు. కుమారగిరికి వసంత రాయలని, కర్పూర
వసంత రాయలని రెండు బిరుదులు. కుమార గిరి స్వయంగా పండితుడు. సంగీత
నాట్య శాస్త్రాల్లో ప్రవీణుడు. వసంత రాజీయం అనే నాట్య శాస్త్ర గ్రంథం రాసినట్లు
కాటమ వేమారెడ్డి రచించిన శాకుంతల వ్యాఖ్య ఆధారం.
“మునీనాం భరతాదీనా భోజాదీనాంచ భూభూజాం/ శాస్త్రాణి సమ్య గాలోచ్య నాట్య
వేదార్థవేవినా
ప్రోక్తం వసంత అరాజే కుమారగిరి భూభూజా/నామ్నా వసంతరాజీయ నాట్యశాస్త్రం
యదుత్తమం”
ఈ వసంత రాజీయం మనకు వెతకదగింది.
కుమార గిరి రెడ్డికి ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరపడం ఆనవాయితి. మహార్నవమి[i] రోజున వసంత మండపంలో
వసంతోత్సవాలు వైభవంగా జరిగేవి. దీనిని చేయడం వల్లనే ఈయనకి వసంతరాయలు, కర్పూర వసంతరాయలు
బిరుదులు వచ్చాయి.
4.0. కర్పూర వసంతరాయలు కావ్య ప్రస్థానం :-
కర్పూర వసంత రాయలు కావ్యం
ఐదు ఆశ్వాసాలతో అలరారుతుంది. ఒకటవ ఆశ్వాసం మదనోత్సవంతో (రత్నావళి నాటకంలాగ
ప్రారంభమౌతుంది) ఆరంభమౌతుంది. ఉద్యాన వనంలో మదనుడి పూజ, లకుమా అనే నాట్య కత్తే నృత్య ప్రదర్శన ఉంటాయి. లకుమను
రాయలు ప్రత్యేకంగా ఆహ్వానించి కంఠహారాన్ని బహూకరిస్తాడు. రెండో ఆశ్వాసంలో లకుమ వసంతరాయలు ఒకరికొకరు ప్రేమలో పడటం, ఆమెని చూడాలని వసంతరాయలు ఆమెకు రాజ
నర్తకిగా పదవిని ఇస్తాడు. లకుమ సంతోషం మహారాణికి సంతాపమౌతుంది. మూడో ఆశ్వాసంలో లకుమ, రాయలు తీర్థ యాత్రలు చేస్తారు. ఆమె నాట్య కళలో రాయలు అనుభవించిన ఆనందహేల
ఒక వైపు, అంతఃపురంలో మహారాణికి పీడ కలలు ఇంకో వైపు.
నాలుగో ఆశ్వాసంలో లకుమ
కోసం విలాస మందిరాన్ని నిర్మించడం, కాటయ వేముడి దండయాత్ర,
లకుమ నాట్యానికి పరవశించిన రాయలు వసంత రాజీయం అనే నాట్య శాస్త్రాన్ని రాయడం, రాచకార్యాల నుంచి ఆమెను బహిష్కరించమని కాటయవేముడు[ii] అభ్యర్థించడం.
ఐదో ఆశ్వాసంలో కాటయ వేముడు
అభ్యర్థన పై కుమారగిరి సభకు రావడం, లకుమ కాలుబెణికిందని అక్కడి నుంచి వెళ్ళడం, ప్రజలు గుసగుస లాడుకోవడం, మహా రాజ్ఞి బాధతో లకుమ
మందిరానికి స్వయంగా వెళ్లింది. వ్యక్తి గత స్వార్థం కోసం కాక దేశ స్వార్థం కోసం
రాయలు పై ఉన్న ప్రేమను త్యాగం చేయమని అభ్యర్థిస్తుంది. దాంతో రాయల్లో కర్తవ్య
దీక్ష ఆరంభమైనట్లు సి.నా.రె. ప్రకటిస్తారు.
5.0. కావ్యారంభం :-
రాజు రావాలంటే వంది
మాగదుల జయ జయ ధ్వానాలు అనివార్యం. అక్కడి నుంచి ఆరంభమౌతుంది కావ్య రచన. “జయ జయ
సమగ్రాంధ్ర / సర్వం సహా భార/ సంభరణ శేషాహి రూప / జయ జయ కళాదుగ్ధ/
సాగర మనోముగ్ధ / సంపూర్ణ చంద్ర మూర్తీ/ పరిపంథి
నృపతి దో / ర్బలకంధి మంథనా / పర మందరాద్రి స్వరూపా/ సురసరి న్మందార/ సుమగరు
న్నీహార పరిహస న్మంజుకీర్తి ................” అంటూ సంస్కృత సమాస భూయిష్టంగా రచన
చేయడం రత్నావళి నాటకాన్ని మరిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ‘జయము
జయము’ అంటూనే భూభారాన్ని మోసే ఆదిశేషుడితో పోల్చడం ఈయన పాండిత్యానికి, శక్తి తత్త్వానికి సూచన. పరిపంథి అనే పదానికి శత్రువు, తెరువాటి దొంగ(దారిదోపిడి దొంగ) అని అర్థాలు. దోర్బలకంది అంటే గొప్పదైన
బలంలో సముద్రుడంతటి వాడు అని అర్థం. మంథనం అంటే కవ్వం. మంధరం కవ్వపు కొండ, మందారమనే కల్ప వృక్షం అని అర్థాలు. శత్రువు సముద్రుడంతటి వాడైనా, వాడిని ఎదిరించగలిగిన మందారమనే కల్ప వృక్షం లాంటివాడు అనడంలో కుమారగిరి బాహుబలానికి
సూచన. కావ్య కళామృతాన్ని తయారుచేయడంలో కవి గారి ప్రతిభ
కనిపిస్తున్నాయి.
‘జయ జయ కళాదుగ్ధ/
సాగర మనోముగ్ధ/ సంపూర్ణ చంద్ర’ అనడంలో మానసిక స్వచ్ఛత, అదే కళా బలహీనతగా ముగ్ధ, దుగ్ధ పదాలు
సూచిస్తున్నాయి. సంపూర్ణ చంద్ర మూర్తిత్వానికి మధ్యలో ఏదో జరిగింది అనే ఒక
ఉత్కంఠకు దారి తీస్తుంది. అదే పట్టపు రాణి లకుమ దగ్గరకి వెళ్ళి కుమారగిరిని త్యాగం
చేయమని అడగడం. అప్పుడే సంపూర్ణ చంద్ర మూర్తిత్త్వాన్ని కుమార గిరి పొందుతాడు.
కావ్య నాయకత్వాన్ని, దేశ రక్షణ బాధ్యతను నిర్వహించగలడు అనే
సూచనలను గమనించాలి.
6.0. యవ్వనాకర్షణ + పరిహాసాల పరిమళం :-
సురసరి న్మందార/
సుమగరు న్నీహార/ పరిహస న్మంజుకీర్తి – దేవతలకు సమానమైన మందార కల్ప వృక్షం
లాంటివాడు, చందన వాసనలిచ్చే మంచుపర్వతం లాంటి వాడు,
పరిహాసానికి, మాటకారితనానికి మనోహరమైన కీర్తి కలవాడు అనడంలో
దేవతలతో సమానమన్న భావనాని స్ఫురింపజేస్తున్నాడు. అంటే కార్యనిష్టను వహించడంలో
కర్తవ్యుడిగా నిలబడటం ఇతని వ్యక్తిత్త్వం. ఇంత అందంగా రాయడానికి కవి ఎంచుకున్న కమనీయ భాష
సంస్కృతం. ఇది పాతికేళ్ళ ప్రాయనికే వంటపట్టడం సి.నా.రె సొగసు.
యువకుడైనందువల్ల
ఆకర్షణ శక్తి, ఉత్సాహం ఉరకలు వేయడం సహజం. చారిత్రక శకలాన్ని ఇతివృత్తంగా తీసుకున్న
యువతీ, యువకుల ఆకర్షణీయతను వర్ణించడంలో వెనుకాడలేదు. పరిహాసాల
పరిమళాన్ని పగడ్బంధీగా పట్టాడు.
“ఏ మొగమ్మున చూపు నిల్చిన/ ఇగురువోసెడు కాంతివల్లులు/ ఏ సిగను పరికించి
చూచిన / ఏటవాలుగా నవ్వు మల్లెలు” కాంతి వల్లులు అనడంలో యువకుల మనోభావాలకి
తగినట్లుగా నవ్వు మల్లెలు దొరికాయట. ఇగురువోసెడి అనడంలో ఇంకిన కాంతికల్గిన అంటే
తేజస్సు రూపంగా ఉన్న మగవారు అని ఒక అర్థం. ఇగురు అనే దానికి చిగురు అని అర్థం
చెప్పినపుడు చిగురుతో కూడిన కాంతి కల్గిన ఆడవారు. వారు ధరించిన జడలలో ఏటవాలుగా
నవ్వుతున్న మల్లెపువ్వులు కనిపించడం యవ్వనాకర్షణ దృష్టిని, వసంతరాయలను
చూడటానికి వచ్చిన ఆడవాళ్ళ బాహ్య సౌందర్యాన్ని ప్రకటిస్తున్నాయి. దాంతో మన్మథుడు
ఊరుకుంటాడా? ఇదే సమయంలో బావ కాటయ వేముడి పరిహాస సౌందర్యాన్ని
చూడవచ్చు.
“మృడుని మూడవ కంటి
చిచ్చున / బడి శరీరము విడిన మరునికి / మిమ్ము బోటి రసజ్ఞులే రూ/ పమ్ము నిల్పినవ
వారు సుమ్మా”
శివుడి మూడవ కంటి
బారిన పడిన మన్మథుడుకి మీలాంటి వాళ్ళే రూపాన్నిచ్చారు కదా బావగారు అన్నాడు. దానికి
సమాధానంగా -
“ఈ లలితా సల్లాపమునకు మ/ హీశు డల్లన నవ్వి రాజ్ఞీ/ వామ భుజమును దువ్వి
కాటయ / వేమునితో నీ పోల్కి పలికెను/ కాళిదాసు శకుంతలకు పా/ ఠాలు నేర్పెడు బావగారూ/
మీ రసజ్ఞత మదన దేవ స/ మీప వర్తిని కాదనెదరా ”
వసంతరాయలు నవ్వి ఎడమ
భుజాన్ని ఒకసారి దువ్వి, కాళిదాసు, శకుంతలకి పాఠాలు నేర్పెడి బావగారూ అని
వెటాకారం చేస్తూ, తండ్రి లేని సమయంలో శకుంతల మన్మథుని బారిన
పడలేదా? కాళిదాసు లాంటి కణ్వ మహర్షి నేర్పిన పాఠాలు మన్మథుడి
దగ్గర రసజ్ఞతను మరోలా పొందుతాయి. అంటే వీళ్ళందరూ నీకు అక్కలు లాంటి వారు. నాలాంటి
మన్మథుడికి సమీపంగానే సంచరిస్తారు అన్న సూచన ధ్వనిస్తుంది.
ఇది గాలి విసురుకి
సిగలోని మల్లెపూలు నిటారుగా కాక, ఏటవాలుగా ఎగరడం వేగంగా నడుస్తున్న నయనాభిరామ
సౌందర్యానికి యువతుల నడకలు హంసను పోలి ఉన్నట్లు అక్షరబద్ధం చేశాడు.
7.0. గిరి, లకుమల ప్రేమాయణం:-
లకుమ కుమార గిరుల అనురక్తి
వ్యామోహానికి సంబంధించనది కాదని, అది సహృదయానికి సంబంధించిన రాగ బంధమని గుర్తించాలి.
“నా దేవర! నా గుండియ/ పాదున రతనాల మొల్క / నా మనసే పంజరమ్ము/ గా మెలిగిన
రామచిల్క” - 79
లకుమ కుమార గిరిని తన
గుండెలాగా, దానిలోపల శ్రేష్టమైన రత్నంగా, ఆమె మనసు పంజరంగా అందులో ఉంటున్న చిలక కుమారగిరిగా వర్ణించడంలో ధ్వని
కనిపిస్తుంది. రాజే గుండె లోపల శ్రేష్టమైన రాయిలా ప్రాణాలని పోగొట్టుకోవడం పంజరంలో
బంధించిన రామచిలక ఎగిరిపోవడం రెండువైపులా నుంచి కోల్పోయిన మకిల(మురికి, నలుపు) లకుమ. నిజానికి దేశం వైపు నుంచి చూస్తే లకుమ మక్కువతో కూడిన
మకుటం.
“లకుమయే గానమ్ము లకుమయే ప్రాణమ్ము / లకుమయే నాద బిందు కళానిధానమ్ము /
లకుమకు తోచేను రాయడు/ ప్రకృతికి పురుషుని పోలిక/ వారిరువురి సాంగత్యము /
వాగర్థమ్ముకేలిక” -90
వసంతరాయలకి లకుమయే
గానం,
ప్రాణం, ప్రకృతి, వాక్కు. అప్పటికీ
తనివి తీరా అనుభవించిన పురుషుడైన వసంతరాయలు ఏలికగా, వాక్కును
విడిచిన అర్థంలా నిలబడతాడేమోన్న భావన స్ఫురిస్తుంది.
8.0. విరహం +నృత్యకళాతత్త్వం- దూరము = వసంతరాజీయము :-
“ఆమె కరాంభోజాతము/లందు రాయడర్పించెను / అభినయ శాస్త్ర శిరోమణి /
నాత్మకృత గ్రంథమ్మును/ రాయని బంగరు గంటపు రాయిడిచే రవణిల్లెడు / గ్రంథ రత్నమును
వెంటనె / కనులకద్దుకొనెను లకుమ” - 94
ఆమె అందానికి ఏలిక అయిన
రాయలు ఒక పెద్ద గ్రంథాన్నే అర్పించాడు. అపురూపంగా కన్నులకు అడ్డుకోవడం లకుమకుండే
ఆత్మ సౌందర్యం. అయితే తనకి ఇవ్వాల్సిన స్థాయిని దాటి వసంతరాయలు ప్రవర్తించడం లోపల
ఆనందమైన ఏదో విషాదాన్ని అంతర్మథనాన్ని కవి చూపిస్తూనే ఉన్నాడు. కాలి ధూళి
ఏనాటికైనా గంధపు పొడి అవుతుందా? అని లకుమతో అనిపిస్తాడు.
అంతేకాదు
“నీవొక నాగస్వరమవు/ నేనో నాగిని మాత్రము / ఇరువురు బంధించి వేసె/ నేదో
అంతస్సూత్రము” // “నీవు నిండు చందురుడవు/ నేనో కల్వల చెల్వను/ పరిమళ సోపాన పంక్తి
/ ఇరువురినేకము చేసెను”// “నీ పాదపరాగము నా / పాపట సిందూరముగా కై సేసెడు
భాగ్యమున్న కావలసినదేమ్మున్నది” – 96
రాజును నాగస్వరంతోనూ, లకుమను నాగు
పాముతోనూ ఒకసారి, రాజుని నిండు చంద్రుడితోను, లకుమను కలువతోనూ మరోసారి పోలుస్తాడు. రాజు పాదధూళిని పాపట సింధూరంగా చేసుకోవడం
కంటే భాగ్యమేముంటుందని అనిపిస్తాడు. నాగ స్వరం నాగినికి దూరం తప్పదు. వీరికి
ఎడబాటు తప్పదు. చంద్రుడికి కలువకూ అంతే. పాద ధూళికి, పాపిట
సింధూరానికి కూడా దూరమూ ఎడబాటే. అంతస్సూత్రం పరిమళం భాగ్యం. దీన్ని నోచుకున్నది
ఆత్మ త్యాగం. ఆమె నృత్య తత్త్వాన్నే భాసించేలా భావించిన కళే వసంతరాజీవం.
9.0. కుమార గిరి ‘ప్రేమ దేవత- లకుమ’ :-
“ఈ పాదములే కాదా / భూపాలుడ నైన నన్ను / అనంత రసరాజ్యమ్మున / కధీశ్వరునిగా
జేసెను”
– (కర్పూర వసంతరాయలు, పుట. 110) అనడం ఆమె అంతర్మథనానికి, అనంత ఆనంద రసానికి అంత్యము ఆరంభం.
“నన్ను ప్రాణము కన్న మిన్నగా / నమ్ముకొని యున్నాడు రాయడు / న
న్నపరదైవమ్ముగా మది నెన్నుకొని యున్నాడు రాయడు” “రేడు నా లోకన్నులను వె / ల్గించిన
రసానందదీపము / నేను రాయని విడిన మరునిమి/ షాన లోకము నరకకూపము” - (కర్పూర వసంతరాయలు, పుట. 128)
లకుమ రాజుకి ప్రాణం
కాదు. కానీ అపర దేవతగా భావించాడు. అతన్ని లకుమ వదిలి వెళితే బెంబేలు పడి తిరిగాడు.
కుమారగిరి నాలో నన్ను చూసుకోవడానికి వెలిగించిన రసానంద దీపం. నేను రాయల్ని వదిలిన
నిమిషమే అతడికి ఈ లోకమే నరకం అని భావించడంలో పిచ్చి ప్రేమను వ్యక్తం చేస్తాడు.
“నా గుండె దోచుకున్న దొరా! నిజమ్ము మన / బ్రతుకులో నే డపూర్వమ్మైన
దినమ్మురా” – (కర్పూర వసంతరాయలు, పుట. 131)
తనను ఇంతలా
అభిమానించిన రాజుకి ఏమివ్వగలదు? తన నాట్యకళను ఇంతకు ముందే ధారపోసింది. అందుకే
ఇంకేమివ్వగలదు? గుండెనే ఇచ్చేసింది.
“ ఆనాడు లకుమ రమ్య శరీరమున చండి/ కాభయద సౌందర్య కాంతులు పిసాలించే”
ఇక్కడ పిసాలించే అనే
పదానికి వికాసం, పరిహాసం, దొంగయెత్తు, వ్యాపనం, ప్రకాశం అనే అర్థాలున్నాయి. దేవత అని ఇంతకు ముందు చెప్పిన ఆమె చండిక అనే
దేవత. సౌందర్య కాంతులు దేవతా పరంగా అర్థం చెపితే వికాసం చెందాయి అని చెప్పాలి. లకుమ
పరంగా చెపితే దొంగయెత్తులు వేశాయి. అంటే సౌందర్య కాంతులు నశించాయని అర్థం.
చివరిగా కొండవీటిని
పాదుకున్నట్టి మట్టిలో సైతమ్ము కర్పూర సౌరభములు వీచు అని సి. నా.రె ముగించారు.
మట్టి లకుమ, కర్పూర సౌరభం రాయలు. ఒకరిని ఒకరు వాగర్థాల్లా కలిసి విడిపోయిన వైనం వెరసి
వ్యక్తి త్యాగం, దేశ స్వార్థం. ఇలా లలనా లకుమ ‘వ్యక్తి స్వార్థం
నుంచి దేశ స్వార్థం’గా, కర్పూరంలా తనను
తాను హరించుకు పోయి దేశశక్తిగా ఎదిగిందని చెప్పవచ్చు.
[i] . వసంతోత్సవం ఋతు సంబంధమైన
పండుగ. మన్మథుడి ఉత్సవం ఇది. వాత్సాయనుడి కామ సూత్రాలు, శ్రీ హర్షుని
రత్నావళి నాటకం, కాళీ దాసుని మాళవికాగ్ని మిత్ర నాటకాలో ఈ
వర్ణన ఉంది.
ఆంధ్ర
దేశంలో దీన్ని ఈ మదనోత్సవం,
వసంతోత్సవం, కాముని పండగనీ పిలుస్తారు. ఇది పాల్గుణ
శుద్ధ పూర్ణిమరోజున వస్తుంది. పూర్వం ఈ వసంత్గోత్సవాలు ఏ విధంగా జరిగేవో తగిన ఆధారాలు
లేవు. కొండ వీటి రెడ్డి రాజుల కాలం నుంచి
వసంతోత్సవాలను తెలుసుకోవడానికి శ్రీ నాథుని భీమేశ్వర పురాణం, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక సహకరిస్తాయి.
ఈ
ఉత్సవం సమయంలో రాజుకు,
సామంత రాజులూ, మండలేశ్వరులూ మొదలైన వారు కానుకలు, పన్నులు చెల్లిస్తారు. విదూషకులు
వినోద గోష్ఠి, సుందరీ మణులు ఉయ్యాల,
యాల జాతర పాటలతో నృత్యం చేస్తుంటారు. రాజుతో కలిసి మన్మథుడిని పూజిస్తారు. చివరకు
బ్రాహ్మణ దంపతులకు కర్పూర తాంబూలాలు ఇస్తారు.
రాజు
చందనం, సుగంద ద్రవ్యాలు, కర్పూరం
మొదలైన సుగంధ ద్రవ్యాలను ప్రారంభానికి గుర్తుగా జనం మీదకి జల్లెవారు. ఆ తర్వాత
ఒకరి పై ఒకరు వసంతాన్ని జల్లుకొని వావి వరసలు లేకుండా చెరువుల్లో జలక్రీడ
చేసేవారు. ఇప్పటి హోళీ పండుగ లాంటిది.
[ii]. కుమారగిరి రేచెర్ల ప్రభువులతోటి,
కళింగ రాజులతోటి ఎన్నో యుద్ధాలు చేసాడు. తూర్పు ప్రాంత విజయ యాత్రకై
యువరాజు అనపోతా రెడ్డికి, సేనాధిపతి కాటయ వేముని తోడిచ్చి
పంపాడు. ఈ విజయాలతో ఉత్తరాన సింహాచలం వరకు రాజ్య విస్తరణ జరిగింది. కొత్తగా
ఆక్రమించిన రాజ్యానికి తూర్పు రాజ్యం అని, రాజమహేంద్ర రాజ్యం
అని పేరు పెట్టారు. యువరాజు అనపోతా రెడ్డి రాజమహేంద్రవరం రాజధానిగా ఈ ప్రాంతాన్ని
పాలించాడు. 1395లో అతడు అకాల మరణం పాలయినప్పుడు కుమారగిరికి బావ, సేనాధిపతీ అయిన కాటయ వేముడు రాజమహేంద్ర రాజ్యానికి రాజయ్యాడు.
*****
ఆధార గ్రంథాలు :-
1. అంతర్జాలం
2. ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం
ప్రతాపరెడ్డి
3. కర్పూర వసంతరాయలు – సి. నా.రె
4. శబ్ద రత్నాకరము – బహుజనపల్లి
సీతారామాచార్యులు
No comments:
Post a Comment