Tuesday, May 30, 2023

కాంతారావు కథల్లో అతుకుల బతుకులు

 

-డా. జాడ సీతాపతి రావు,  తెలుగు ఉపన్యాసకులు

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,

ఏ. పి. ఐ. ఐ. ఐ. టి; నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. 521202

చరవాణి: 9951171299

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

1.0.      బలివాడ కథా వీచిక:-

మానవజీవన వెతల్లో ఎలుగెత్తి చూపడానికి కథా సాహిత్యం ఒక వాహిక. ఉత్తరాంధ్ర ప్రాంతంనుంచి ఉత్తర భారతదేశం వరకు ఒక సాగిన జీవనయానంలో పరిచయాలు, సంఘనలు ఉత్సాహం కలిగించే శైలితో కథనరంగంలోకి కార్యశూలులైనవారిలో బలివాడ ఒకరు.

 మనసు కదిలితే మౌనగీతాలు వస్తాయ్...’ ఒక్కో భావనాశక్తి, కథన శక్తితో కలసి కథాగమనం లోకి ఒదుగుతుంది. కాదేదీ కథకనర్హం... అన్నట్లు, ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలు సాధనాలు ఉంటూ లోకాన్ని విలోకనం చేయడం చాలా మంది సాధ్యం కాదు. ఎక్కడకు వెళ్ళినా ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్న భావనను సార్ధకం చేసుకోవడం చెప్పినంత సులువూ కాదు. ‘మగవాడు తిరక్క చెడిపోతాడు’ అన్న పెద్దల మాటల్ని లోకజ్ఞానంతో కలిపి సూక్తులు, జాతీయాలు, పలుకుబడులను ఇమిడిపోయేలా కథనం చేయడం ఏ శ్రీపాదకో, తిలక్ లాంటి వారికో సాధ్యమయింది. అలాంటి పటుత్వం, మాటల ఒడుపుల్ని పొదుపుగా వాడిన వారిలో ఒకరు బలివాడ. ‘ముంగిస కథ’ అయినా ‘మనో వైకల్యం’ అయినా... ‘గులాబీ’ అయినా, ‘గేటు’ అయినా; ‘మేషం’ అయినా, ‘మనో వైకల్యం’ అయినా రచయితకు అందులో భావనాశక్తులు భద్రంగా ‘బానిసౌ’తాయ్.   

1.1. గుర్తుంచుకునే పార్శ్వాలు:-

            బలివాడ వారి కథల్లో కొన్ని పరిచయాలు కనిపిస్తాయ్. అంతేకాదు మానవ హృదయాల్ని, చాలా అంశాలను పదిలంగా గుర్తుండిపోయేలా చేయడం కూడా.

1.1.1. కాంతారావు గారి ఊరిలో మహాభారత గాథలు చెప్పే గొల్ల రామస్వామి.

1.1.2. చిన్నప్పుడు వీధిలో జరిగిన గొడవలో తప్పొప్పులు బేరీజు వేసి, తీర్పు చెప్పాలంటే దూరంగా ఉంటూ గమనించడం

1.1.3. ఆఫీసు పెద్ద తన క్రింద సబార్డినేటు గురించి రాసిన రిపోర్టు- అడ్మినిస్ట్రేషనుకు, లేబరుకు మధ్య యితను సంధాన కర్తలా ఉన్న ఘటన.

1.1.4. బంధుత్వాలలో ఉన్న లేదా జరిగిన సంఘటనలను కథారూపంలో చూపడం.

1.1.5. మానవ సంబంధాలను కొంతమంది విభిన్న తత్త్వాలతో ప్రవర్తించి కలంకితులుగా మిగలడం

1.1.6. వ్యక్తుల్ని అంచనా వేయడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనుకునే తత్త్వాన్ని జీవితంలో భాగంగా అధ్యయనం చేయవలసిన అవసరాన్ని గుర్తెరిగి ప్రవర్తించడం.

1.2. బలివాడ జీవన గమనాలు:- 

ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా, మడపాంలో జూలై 3, 1927న బలివాడ కాంతారావు పుట్టారు. తండ్రి సూర్యనారాయణగారి ద్వారా మొదలు పెట్టిన విద్యాభ్యాసం, పోలుమహంతి సూర్యనారాయణ గారి దగ్గర ఇంగ్లీషుతో, తాతయ్య రామమూర్తి దగ్గర రామాయణ, మహాభారత కథలతో లోకజ్ఞానాన్ని ఔపోశన పట్టారు. విశాఖపట్నంలో ఐదో తరగతిలో చేరారు. వారి అత్తయ్య, అమ్మాయమ్మ దగ్గర భేతాళ, విక్రమార్క కథలు, పంచతంత్రం కథలే కథకు ప్రాణం పోశాయి. పాఠశాలలో స్కూలు మ్యాగజేన్ కు సంపాదకుడిగా కూడా చేశాడు. పదిహేనో ఏట విశాఖపట్నం ఆర్డినెన్స్ లో చేరాడు. బదిలీకి ఒప్పుకోక ఉద్యోగాన్ని మానేశాడు. తర్వాత నౌకాదళంలో చేరి వివిధ విభాగాల్లో పని చేశారు. ఆయా ఉద్యోగాల్లో కొన్ని సన్ని వేశాలను కథలుగా గుర్చారు. ఆయా ప్రదేశాలు, అనుభవాలు వీరి కథాభాగాలుగా ఒదిగాయి.

1.3. కథన ప్రస్థానం:-

సంఘటనలు మనసుపై ముద్ర వేస్తాయ్. అదే రచయిత/ కవికి ప్రేరణను కలిగింపజేస్తాయ్. వర్ణనలు అందులో భాగమైన అది కలిసిపోయిన చక్కటి బిగువును ఇస్తుంది. ఆ కథావస్తువుకు కవితాశక్తి తోడై ‘వాహ్వ్’ అనిపించేలానో, కన్నీటిని కురిపించేలానో ఇలా ఎన్నో విధాలుగా రచయిత చేయిస్తాడు. అలాంటి వారిలో ముంగిసను సైతం మానవతా వాదంతో ముడివేయగల కథకుడు, కాంతారావు. మనిషికుండే స్వార్థశక్తి ముందు ఉపకారం చేసిన జీవికి కూడా దారుణంగా బలైపోవడం కథలోని అంశం.

13.1. ‘బయ్యన్నా రా!’ అని పిలవగానే వచ్చే ముంగిస, దానిపట్ల డాక్టర్ కుటుంబం పెంచుకున్న మమకారం, చివరకు పక్క ఇంటి ఆయన దారుణంగా చంపడం పాఠకుడికి కన్నీళ్ళు తెప్పిస్తుంది. మానవత్వం అనే మాటకు మనిషే నిలువెత్తు ద్రోహిగా ఇక్కడ భైరవయ్య కనిపిస్తాడు. ఇతడే బానయ్యను (ముంగిస) చంపినవాడు. ముంగిస ‘తను చెయ్యలేదు’ అని చెప్పడాన్ని కథకుడు వర్ణించిన తీరులో మానవత్వపు అంశాలు కన్నీరును తెప్పిస్తాయ్.

1.3.1.1. పంచతంత్ర కథలోని ‘ముంగిస, పిల్లాడిని కరవబోయిన పామును చంపి, యజమానికి కనబడటంతో పిల్లాడిని ముంగిస చంపింది’ అని భావించి ఆ ముంగిసను యజమాని చంపేసి, తర్వాత నిజం తెలుసుకొని దుఃఖిస్తారు. దాని కంటే కొంచెం భిన్నం అనిపించిన యదార్థగాథ ఇది. ముంగిసయొక్క తల్లి, తండ్రి ముంగిసలు కనబడడం వాటి దగ్గరికి వెళ్లకపోవడం ఇవన్నీ కథనంలో నిజాలను చూస్తున్నట్లు అనిపిస్తుంది పాఠకుడికి. “ముంగిస కథ”- బలివాడ వారు తన మేనమామ ఇంటికి వెళ్లినప్పుడు మువ్వల శబ్దంతో తిరుగుతున్న ముంగిసను చూశారు. దానిమీద కూడా కథ రాస్తావా అని వారి అత్తయ్య సరదాకు అన్నది. అదే కథగా మలచారు.

ముంగిసను పట్టితెచ్చిన విధానం దాన్ని కుటుంబ సభ్యుడిగా పెంచిన వైనం ఇతడి కథనానికి కలికితురాయి. కానీ కాంతారావు కథ రాసి వినిపిస్తే వారి అత్తయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయట. ఇది బలివాడ కాలానికి ఉన్న కవనశక్తి.

1.3.2. మనిషి-పశువు కథ- ఒక ప్రత్యేకమైనది. బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక త్రాగుబోతు డ్రైవరకు ఛార్జిషీటు ఇచ్చాడు. మళ్లీ కాంతారావు తిరుగు బదిలీ అవుతుంటే అతను కన్నీరు కార్చాడు. ఆ సంఘటనే ఈ కథకు ప్రేరణ. ఒక్కో కథకు ఒక్కో నేపథ్యాన్ని చక్కగా వాడుకోవడంలో, కథనంలోకి ఇమిడ్చడంలో దిట్ట కాంతారావు.

1.4. కథల పరంపర:-

1998లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన బలివాడ కాంతారావు కలం నుండి వెలువడిన మరికొన్ని ఆణిముత్యాలు! బలివాడ కాంతారావు కథలు’. ఈ పుస్తకంలో అశాంతి, తిరుపతి, కనకపు సింహాసనం, కదలిక, బాధ్యత[1] మొదలైన 29 కథలు, ‘రాతి బొమ్మలు’ నవలిక ఉన్నాయి.

1.4.1. పి. రాజేశ్వర రావు సంకలనం చేసిన బలివాడ కాంతారావు కథా కలశం 133 కథలు, 5 కథానికలతో వచ్చింది. ఇది సార్థక నామధేయాన్ని సంతరించుకుంది.

1.4.2. జీవితంలో చాల పార్శ్వాలను తరచి చూడడం కథన శక్తి తోడవడం ద్వారా వీరి ప్రతిభను అన్ని కథలు నిలపక పోయినా, జీవితంలో చాలా సంఘటనల పుర్వాపరాలను క్రోడించి 300 పైచిలుకు కథలు రాసిన కథకులలో ఒకరుగా నిలిచారు.

1.5. స్వీయ వ్యక్తిత్వం:-

బలివాడ కాంతారావుగారు అభిప్రాయంలో - ‘‘ఎందరో రచయితల ఊహల్ని పంచుకోవడం వల్ల రచయిత ఎదుగుతాడు. ఏదో ఒక ఆదర్శం వెంట నడవనిదే రచయిత మనగలగలేడు. ముందు తరాలు మన కథలు చదవాలి. ఈ తరం నాడిని వైద్యునిలాగా పరీక్షించగలగాలి’’. మరో ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగోని జ్ఞప్తికి తెచ్చుకుంటూ తన తరం కోసమే రచయిత రాస్తే నేను నా కలాన్ని విరిచి పారేస్తానుఅన్నారు. అలా చెప్పడంలోని రచయితగా ఉండాల్సిన ఔచిత్యం, నిబద్ధత మనకు తెలుస్తుంది. బలివాడ కాంతారావుది ఉదాత్త స్వభావం, ఆ వయసులోనే కనపడే అణుకువ, నమ్రత, ఎవ్వరినైనా ఒక్కలాగనే ఆదరించడం, వారిలో కనిపించే చిన్న నవ్వే ఆ సుగుణం. 

1.6. సంఘం- సంతృప్తి:-

బలివాడ కాంతారావు 1949-50 సంవత్సరాల మధ్యకాలంలో విశాఖ రచయితల సంఘం ఏర్పాటులో కొంతమంది సాహితీ మిత్రులతో ఏర్పడింది[2]. నిరాడంబరంగా, నిష్కల్మష హృదయంతో అందరి మన్ననలు పొంది, సభ్యుడిగా చేరి ఆకట్టుకున్నారు. వార, మాస పత్రికల్లో వీరి రచనలు ముద్రించటం ఒకవైపు; ఆహ్వానాలు మరో వైపు. అప్పటికే పేరు సంపాదించుకున్న పాలగుమ్మి పద్మరాజుగారు లాంటి వారు బలివాడ కాంతారావు ఇంటిని వచ్చి ఆత్మీయ సంభాషణ జరిపి, తనకు సమయం వెచ్చించినందుకు జీవితంలో అదొక మరపురాని ఘడియగా భావించడం వీరి వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం.

1.7. చదువు చర్చలు:-

చిన్నతనంలోనే చదువుకోసం పక్క గ్రామాలకు వెళ్లవలసి వచ్చింది. హైస్కూలు చదువు పూర్తిచేసిన అనంతరం విశాఖపట్నంలోని నేవల్ ఆర్మమెంట్ డిపోలో ఉద్యోగిగా చేరారు. అంచెలంచెలుగా పదోన్నతి పొంది, ఉన్నత అధికారిగా అనేక ప్రాంతాలలో పనిచేసి అపారమైన అనుభవం సంపాదించారు. అందుకు వారి రచనలే తార్కాణం. ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో నివసించినప్పుడు ఉదయం ఆరింటికి బయలుదేరిన వ్యక్తి సాయంత్రం ఆరింటికి ఇంటికి చేరి ఎటువంటి విరామం తీసుకోకుండా సాహితీమిత్రుల కొలువులో గడిపేవారు. ఆర్.కె.బీచ్‌లో కూర్చొని గంటల కొద్దీ సాహితీ చర్చలలో మునిగేవారు.

1.8. భవిష్య దర్శనం:-

తన కథల ద్వారా సంఘం కుళ్ళును తుడిచిపెట్టాలని, అట్టడుగు వర్గాల జీవితాల్ని సరిదిద్దాలని తపన వీరి వ్యక్తిత్వానికి మెరుగులు. ఆ నేపథ్యంలో రచించిన కథ వదినచదివిన వారి కళ్లు కరిగి కన్నీళ్ళుగా మారిపోతాయ్.

1.9. బహుముఖ ప్రజ్ఞ - వారసత్వం:-

మత్స్యగంధి నవలను వీరి కుమార్తె ఆంగ్లంలోకి అనువదించారు. ఇలా కవితా వారసత్వాన్ని అంది పుచ్చు కోవడం కొసమెరుపు. సాహిత్యాన్ని ఒక చేత్తో, మరో చేత్తో జ్యోతిషం’ ‘హస్త సాముద్రికం లో కూడా పటిష్ఠమైన అవగాహన ఇతని సవ్యసాచిగా నిరూపిస్తాయ్.

1.9.1. అవార్దులు- అనువాదాలు:- వీరి నవల పుణ్యభూమికి సాహిత్య పురస్కారం లభించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు దగాపడిన తమ్ముడునవలను అనేక భారతీయ భాషల్లోకి అనువదించారు. 1998లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.  ఇదే నరకం - ఇదే స్వర్గంహిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదం జరిగి అందరి ప్రశంసలు పొందింది. సంపంగినవల అటు కన్నడం, ఇటు హిందీలోకి తర్జుమా జరిగింది.

 అడవి మనిషిఆకాశవాణిలో ప్రసారం చేసినా, కావిడికుండలు, అంతరాత్మ, ఢిల్లీ మజిలీలు, బలివాడ కాంతారావు కథలూ వచ్చాయి. శోధన’, ‘గోపురంకథలకు భారతీయ జ్ఞానపీఠ్, న్యూఢిల్లీవారు ఋషికేష్ కా పత్తర్అనే సంకలనంలో (హిందీ)కి తీసుకున్నారు. మన్ను తిన్న మనిషికన్నడంలోకి కొత్తనీరుగా అనువాదం పొందింది. “దేవుళ్ల దేశం”, “మదనిక” కూడా కన్నడంలోకి వెళ్లాయి.

1.10. సిక్కోలు సిరి:-

ఒకమారు వారు రాసిన గోడమీద బొమ్మవరుసగా కొన్ని రోజులు మిత్రులకు చదివి వినిపించి లోటుపాట్లు సరిదిద్దుకున్నారు. కళింగాంధ్ర జనం గుండె చప్పుళ్ళను కైవసం చేసుకున్నారు. వీరు వందకుపైగా చిన్నా పెద్ద నవలలు, దాదాపు ఐదు వందలకుపైగా కథలు, కొన్ని నాటకాలు, వ్యాసాలు రాస్తూ నిరంతర సాహితీ వ్యాసంగంలో తలమునకలయ్యేవారు. ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా వ్యవహరించారు. ఇలా సిక్కోలుకు కథా సిరిలో ఒకరిగా భావించవచ్చు.

1.11. హితం:-

సాహిత్యానికి ఉన్న ప్రయోజనాలను జాగ్రత్తగా ఆయా కథల్లో అమరికగా చెప్పడం కాంతారావు ప్రత్యేకల్లో ఒకటి.

1.11.1. భాస్కరాచార్య, గార్గేయ, పరాశర జ్యోతిషం చెబుతాడని అతని దగ్గరి శిష్యరికం కోసం చాలా మంది విద్యార్థులు చేరుతారు. భాస్కరాచార్య ఎలక్ట్రాన్ ఇంజనీరు. చంద్ర మామ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు అని ఏడిచే వాడట. ఇది ఒక ఆలోచనకు బీజం. గార్గేయ ప్రేవేట్ డిటెక్టివ్. జ్యోతిష శాస్త్రంలో దొరికిన ఆధారాలను కూడా సమన్వయం చేసి అన్వేషించడానికట. పైగా గార్గేయ విదేశాలలో చాలా మంది “అమెరికాలో జ్యోతిషులకు లైసెన్సు ఉండేదట” అనడం గుర్తించదగినది. పరాశర ఆరు భాషలు నేర్చుకున్నాడు. పైగా జ్యోతిషం నేర్చుకొని దాని అంతుచూడాలనే పట్టుదల ఉన్నవాడు. ఇలా అందరు శిష్యులై ఎలాంటి ఆపేక్షా లేకుండా జ్యోతిష జ్ఞానం మనవసేవకు ఉపయోగిద్దాం అనడం వీరిలో ఉండే లోకోపకార శక్తి, సాహిత్యం చేసే హితం రెండిటినీ గుర్తుకు తెస్తున్నాయ్.   

1.11.2. ఇబ్బందులలో ఉన్న వారి దగ్గర నుంచి డబ్బు తీసుకోకూడదు అనడం శాస్త్రం మీద ఉండాల్సిన నిబద్ధతను తెలుపుతుంది. కృత్తికా నక్షత్రంలో మంచి రూపు, తిండి, గౌరవ మర్యాదలు ఉంటాయ్. ఇలా నక్షత్రాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం, అవగాహన కలగేలా చేయడం కథలో అంతర్భాగంగా మేషం నుంచి మీనం వరకు అనిపిస్తుంది.

1.12. కథానికలో వస్తు తత్త్వం:-

“రక్త స్పర్శ” కథానిక ఒక కుటుంబ జీవితపు లోతుల్ని పాఠకుడికి చూపిస్తుంది. త్రాగుబోతు భర్త, సుగుణవంతురాలైన భార్య, కోపగించుకునే మామగారు (భార్య తండ్రి) వీరి మధ్య జరిగిన కథ ఇది. త్రాగుబోతులు మాట్లాడే మాటలు, నిలుపుకోలేని నిస్సహాయత, త్రాగుడుకు బానిసగా ఉన్నప్పటికీ భర్త పట్ల భార్య చూపిన ప్రేమకు పరాకాష్ట ఈ కథానిక. మనిషిలోని ఉద్వేగాలను ఒడిసి పట్టుకొని ఆలోచింపజేయడం, అసహాయత, ప్రేమ ఉన్నా దాన్ని సక్రమంగా మలచుకోని, అంతరంగంలో బాధపడే భర్త, అభిమానించే భార్యతో పయనించిన సంసార సాగరం. రెండు వైపులా ఆలోచించి ఒక సక్రమ స్థితి వైపు జీవితాన్ని మలచుకోవాలి అనే సందేశాన్ని ఇవ్వడం ఈ కథలో లోతైన అనుశీలన, అంతర్లయ కూడా.

కాంతాన్ని వర్ణిస్తూ “కాంతం మాట్లాడదు. గంభీరమైన ముఖ కాంతిలో జాలికూడా మిళితమైంది. చిత్తస్థైర్యంలో పురుషునకు స్త్రీ తీసిపోదు. స్త్రీది సాధారణంగా జాలి గుండె అవటం వల్ల వేగంగా కళ్ళలో నీరు తిప్పివేయగలదు”. ఇది స్త్రీల హృదయం. ఇలాంటి స్త్రీకి త్రాగుబోతు భర్త. ఇది పాఠకుడికి కన్నీరు పెట్టించక మానదు. “రామావధాన్లు రామాయణం చదువుతున్నాడు” అంటూ ప్రారంభమైన కథానిక రక్త స్పర్శ. ఇక్కడ రామాయణానికి, రక్త స్పర్శకు ఉన్న సంబంధం ఏమిటో తెలియక పాఠకుడి ఉత్కంఠ మొదలు అవుతుంది. ఒక మనిషి మానవత్వం కలిగి ఉన్న తీరు అరిషడ్వర్గాలు కలబోతగా ఉన్న తీరు, రామావధాన్ల ప్రథమకోపంతో మనకు తెలుస్తుంది. ఇతని అల్లుడు వెంకట్రావు. సహజంగా మంచి వాడే, కాస్త త్రాగుడు. ఆ గుర్రం ఎక్కినప్పుడు ఏం చేస్తాడో అతడికే తెలియదు. ఓర్పుకు మారు పేరు కాంత. సాక్షాత్తు రామావధాన్ల కుమార్తె.

ఇంట రామాయణం మొదలైంది. తిట్ల పర్వం ఎత్తాడు రామావధాన్లు. ‘మీతో తిట్టించు కోడానికి రాలేదు. మీ ఆమ్మాయి వ్రాసిన ఉత్తరం చూసి వచ్చాను’. అనడంతో రామావధాన్ల నోట మాట రాలేదు. విషయం తెలుసుకొని ఆ వెధవకు ఎందుకు ఉత్తరాలు వ్రాసేవే?  నా కడుపును కాల్చావే. నా పరువు ప్రతిష్ఠను గంగలో కలిపావే.... అంటూ ఇక ... వీధిగుమ్మంలో వీరంగం వేశాడు. ఇవన్నీ ఒక వైపు, “ఒళ్ళు హూనం చేసిన వాడిని ఆదరిస్తున్నావే? పిచ్చి దానవే?” అంటూ వెంకట్రావు అనడం ఇలాంటి మాటలెన్నో....

ఇలా కాంతం భర్త వెంకట్రావ్ దొంగతనం చేసి జైలు వెళ్తే భార్య సుఖంగా ఉంటుంది అనుకోవడం అతడు రాసిన ఉత్తరం కంట తడిని పెడుతూనే వ్యసనానికి బానిస అయిన వాడి స్థితిని తెలుపుతుంది. మాటాడితే పిచ్చి దానా అని సంబోధించే వెంకట్రావ్ పిచ్చిదాన్ని చూడలేకపోయాడు... ఇలా కథలో ఉత్తమ ఇల్లాలు, త్రాగుడుకు బానిసైన భర్త స్థితులను చూపిస్తూ వ్యసనాల జోలికి పోకూదని హెచ్చరించడం ధ్వని.

1.13. బలివాడ పోలికలు సూక్తులు:-

ఉక్తి అంటే మాట అని సూక్తి అంటే మంచి మాట అని అర్థం. బలివాడ వారు తమ రచనలలో వాడే పోలికలు కథాగమనంలో ఒక్కొకసారి వెనుదిరిగి చదివించేలా చేస్తుంది. కొన్ని -

1. 14.1. “నేను సివంగిని, నువ్వు నక్క వన్నట్లు”(‘నైజర్ తేనె’[3] కథ)దీని సందర్భం చూస్తే- పర్బంతి అందం ఈ కథకుడిని ఆకర్షించింది. నాగరితా ప్రపంచం లేనప్పుడు చెప్పిన ఉపమానం ఇది. పర్బతి నక్కతో పోల్చాడు. అప్పటికి ఆమె ఉత్తమ మైనది. కాని భవిష్య దర్శనం నిజంగా ఆమె స్వభావం అలా అవడం కల్తీ తనాన్ని గిరిజనులపై దాడి చేయడాన్ని స్ఫురింపజేస్తున్నది.

1.14.2. “పేరుకి గంగా భవాని, తాగబోతే నీటి చుక్క లేదని” పేరు చెప్పమని అడిగితే ఇలా మాట్లాడాడు. “నువ్వు పెట్టిన నమస్కారం వాళ్ళు అందుకోలేరు”.(ప్రతీక్ష కథ)ఇద్దరూ చనిపోయారు అనే సందర్భాన్ని చెప్పవలసిన సమయంలో ఈ విధంగా చెప్పించారు రచయిత. కథల్లో ఉండే కాస్త సొగసు, భావనాపటిమ, గొప్ప పద్ధతిని వాడుకున్నట్లు అనిపిస్తుంది.

1.14.3. “నాను మొగోన్ని. తుమ్మెదతో సమానం”.(అంతులేని శోకం) ఇక్కడ గొడవలో ఆడదాన్ని చాల మంది మధ్యలోకి తెచ్చి నిజం చెప్పమని బలవంతం చేస్తారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఈ మాటలు అంటాడు. ఆడవారిని పది మందిలోకి తెచ్చి ఇబ్బందికరంగా అడగడం సరైన విధానం కాదని, భారతంలోని ద్రౌపది స్ఫురణకు వచ్చేలా ఉంది.

1.14.4. “అప్పయ్య దీన్ని వీపుకు కట్టుకుంటే, అది అల్లుడ్ని కొప్పులో పెట్టుకున్న సందంగా వుంది” (అంతులేని శోకం) అత్తకి అల్లుడికి అక్రమ సంబంధం గురించిన విషయం రచ్చబండలో నిజం తేల్చమని సాక్షాత్తు మామగారే తగువు పెట్టడం. దానికి వచ్చిన వారిలో ఒకడు ఇలా అనడం. లోకులు కాకులై మానవబంధాలను ఎంత సులువుగా అనడం పట్ల రచయిత నిశితంగా విమర్శించడం ఇక్కడ చూడొచ్చు.

1.15. సింహవలోకం:-

మార్స్కిజాన్ని మరామత్తు చేసి, తాతల నాటి కథలను తవ్విపోస్తూ, భావోద్వేగాలకు భాష్యం చెబుతూ, నిజంగా జీవితాల్లోని అన్నీ తానై కనిపిస్తారు, బలివాడ. 2000 మే 26వ తేదీన దూరమైనా బతుకు బడిలో, పాఠకుడి హృదిలో నిలిచిన కథల సిరి యితడు. మానవాజీవన పయనంలో బడి ప్రముఖ పాత్ర వహిస్తుంది. బలివాడ కథలు జీవితంలో చాలా అంశాలను ఒడిసి పట్టుకొని ఒక అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడిగా, గుణపాఠాల వారధిగా కనిపిస్తాడు. కుంటుంబంలోని బాధల్ని అర్థం చేసుకోవడమే వాటికి తగిన పరిష్కారాలను సూచించడం వీరి ప్రత్యేకతల్లో ఒకటిగా భావించాలి. స్పందించే హృదయం కథల్ని ప్రతిభా శక్తితో నదిపిస్తూ పాఠక హృదయాల్లో స్థానాన్ని పొంది వాడ వాడల గాథల్ని ఒకబాట పట్టించిన బరువైన కథక బాటసారి బలివాడ.

ఆధారాలు: -

‘కళింగాంధ్ర కథల వారధి బలివాడ’(వ్యాసం)- అడపా రామకృష్ణ: ఆంధ్రభూమి ఆదివారం, 26 జూన్, 2016

పంచతంత్ర కథలు

బలివాడ కాంతారావు “కథాకలశం” : సంపాదకులు: పి. రాజేశ్వర రావు

బలివాడ కాంతారావు కథలు

(వివిధ భాషా సాహిత్యాలు- సాంస్కృతిక పరివర్తన, భావవీణ ప్రత్యేక సంచిక vol:13 issue no: 8 ఆగస్ట్ 2017, ISSN: 2456-4702 లో ముద్రణ. పుటలు: 68 నుంచి71వరకు)

 



[1] ఇంకా ఉన్న కథలు- గేటు, బానిస బ్రతుకులు, మహానుభావులు, అంతులేని శోకం, లయ, అదృష్టం తెచ్చిన ఇల్లు, కిటికీ, అద్దం, ప్రతిఘటన, పెళ్ళి పందాలు, ప్రతిబింబం, రాతిలోని నీరు, వేడుక, వెలుగుతున్న వీరుడు, అద్దం చెప్పిన కథ, రహస్యం, వీరులూ - ధీరులూ, ఆరాధన, మారుతున్న వ్యవస్థ, చెక్కిన చక్కదనం, సాలెగూడు, గీత, రెక్కలు కత్తిరించిన పక్షులు, మామిడి మ సేను

[2] మసూనా, ఎం.జి.కె.మూర్తి, శ్రీనివాసుల శ్రీరామమూర్తి, అంగర సూర్యారావు ఒక సమావేశంగా ఏర్పడినపుడు బలివాడ కాంతారావుగారి వయసు పాతికేళ్లు మాత్రమే.

[3] పసుపు పచ్చని నైజరు పూల నుంచి సృష్టించిన తేనె.

No comments: