Tuesday, May 30, 2023

శ్రీశ్రీ సినీగీతాలు- సామ్యవాద దీపికలు

 


-డా. జె. సీతాపతి రావు, సహాయకాచార్యులు,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ౦,

నూజివీడు ప్రాంగణం,కృష్ణాజిల్లా, 521202, ఆంధ్రప్రదేశ్

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

సంచారవాణి: 9951171299

1. పరిచయం:

            శ్రీశ్రీ ఒక శబ్ద తరంగం. ఒక ఊత్తేజ కిరణం. ముందుకు పదండి అంటూ మహాప్రస్థానాన్ని ప్రజలకోసం అందించారు.  చెమట చుక్కల్ని సిరాగా మార్చి సామ్యవాద భూమికకు స్వరం పలికారు. ఆయన తెలుగు సాహిత్యానికే కాదు. సినీ గీతాలకు కొత్త నడకలు నేర్పారు. పాటలో ప్రణయరాగాలు,  ప్రళయ గర్జనలు ప్రకపించేలా చేయగలరు.  ప్రణయ మాధుర్యాన్ని పండిస్తూనే  హాస్యాన్ని తొణికించారు.  నిప్పులురిమే ఉద్యమ గీతాలను, ఉత్తేజాన్ని నింపే దేశభక్తి పాటలూ రాశారు.   నవరసాలను సరసంగా వాడిన సామ్యవాది శ్రీశ్రీ.

2. డబ్బింగ్ ద్వారా సినీ రంగ ప్రవేశం

1950 లో ఆహుతి సినిమాలో ఐదు పాటల్ని రాసి సినిమా పాటలలోకి కవిత్వాన్ని ఒలికించారు శ్రీశ్రీ.  "ఓ ప్రియబాలనురా నే మనజాలనురా..." అంటూ హిందీ చిత్రమైన "నీరా ఔర్ నందా" ఆధారంగా తెలుగులోకి అనువాదమైన తొలి డబ్బింగ్ సినిమా ఆహుతి. 

 శ్రీశ్రీ పాట జలపాతం. వర్షుకాభ్రముల ప్రళయ ఘోష. సినిమా పాట రాయడం శ్రీశ్రీ పాటకు ఆయన కట్టపెట్టిన గౌరవం మాత్రం అనంతం..ఆహుతి అనే డబ్బింగ్‌ చిత్రంలో సినీ రంగంలో అడుగు పెట్టినా అంతకు ముందెప్పుడో వచ్చిన కాలచక్రం అనే సినిమాలో మహా ప్రస్థానాన్ని వాడుకున్నారు. డబ్బింగ్‌ పాటల్లో ఆయనెక్కువగా సంస్కృత సమాసాలనే వాడారు. డబ్బింగ్‌ లో పెదాల కలయిక ప్రాధాన్యం, తద్వారానే పాటలు రాయాల్సి ఉంటుంది. ఆహుతి సినిమా కోసం ఆయన రాసిన మొదటి పాట "ప్రేమయే జనన మరణలీల" అనే పాటలో  మృత్యుపాశం, అమరబంధం, యువ ప్రాణులు, హృదయ సదనం, సుకృత జన్మం, మధుర మధురతనం లాంటి  పదాలను అవసరంగా భావించి వాడారు. అనువాద చిత్రాలకు పాటలు రాయడంలో మొదటివారు శ్రీశ్రీ! హిందీ, తమిళ భాషల నుంచి వచ్చే పాటలకు శ్రీశ్రీ కలం వారధిగా మారింది. డబ్బింగ్‌ చిత్రాలకు పాటలు రాస్తూ, ప ఫ బ భ మల విషయంలో జాగ్రత్తపాటించాలని తర్వాతి కవులకు సలహాలిచ్చారు. 

3. భారతీయత: దేశభక్తి

శ్రీశ్రీ పాట కొన్నిచోట్ల మర ఫిరంగిలా,  వీణకు తగిన గానాన్ని ఇవ్వగలదు. భార్యభర్తలు సినిమాలోని "ఏమని పాడెదనో ఈ వేళ" పాటలో వీణా మాధుర్య౦ ఉంది. దుక్కిపాటి కోసమే ప్రత్యేకంగా “మాంగల్యబలం”లో ఆణిముత్యలాంటి అయిదు పాటలు రాశారు. పిల్లలకు పనికొచ్చేలా, పెద్దవాళ్లకూ పనికొచ్చేలా  "హాయిగా ఆలూ మగలై కాలం" అంటూ తృప్తికరమైన జీవితం భారతీయత అని చూపగలిగారు.   మాంగల్య బలంలో "తలగడ మంత్రం...." అంటూ రాసిన శ్రీశ్రీ పాట చమత్కారానికి సొగసులు అందిస్తుంది. శ్రీశ్రీ కలం శబ్దాలను అలవోకగా జోరుగా హుషారుగా సాగే ప్రస్థానం. భార్యభర్తలు సినిమాలోని "జోరుగా హుషారుగా.." పాట ఇటు సామ్యవాదం, ఇటుకుటుంబ జీవితం సాగించే సౌరభం.  150 డబ్బింగ్ చిత్రాలకు పని చేసిన శ్రీశ్రీ అసిస్టెంట్, తర్వాత భార్యగా వచ్చిన సరోజా కొన్ని సవరణలు చెప్పేవారు. 

"వెలుగునీడలు" సినిమాలోని "పాడవోయి భారతీయుడా... పాడి ఆడవోయి..." పాటను రాయడానికి మాత్రం పదిహేను రోజులు పట్టింది. ప్రతీ భారతీయుడినీ సింహమ్లా గర్జించేలా చైతన్య పరుస్తూనే ఉన్నాడు. ఇది అఖండ కీర్తి ప్రతిష్టలనిచ్చింది. ఎప్పుడు పాడుకున్న నిత్యనూతనత్వాన్ని కలిగిస్తుంది.  తెలుగు పాటకు జాతీయ స్థాయి గౌరవాన్ని, అవార్డు స్థాయికి తేవడం అల్లూరి సీతారామరాజు సినిమాలోని "తెలుగువీర లేవరా, దీక్షపూని సాగరా... తోనే మొదలైంది. విప్లవ మూర్తి రూపంలో తెలుగు వాళ్ళను వీరులుగా చేసి తిరుగుబాటు చేయాల్సిన సందర్భాల్ని గుర్తుంచుకునేలా చేశారు. శ్రీశ్రీ దేశభక్తి పాటలు జాతిని చైతన్య గీతికలు.

శ్రీశ్రీ పాటలు ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల అనే పేరుతో 93 పాటల్ని  సరోజా శ్రీశ్రీ(శ్రీశ్రీ భార్య) సంకలనం చేశారు. నదురు బెదురు ఎదురు లేని ఉక్కు పిడికిలీ కోపగించి కోరుతుంది దుష్ట నరబలి....అంటూ సాగే చరిత చిత్రవారి ఉక్కుపిడికిలి లోనిది పాట. దీన్ని 30-1-1982లో రాశారు.  శ్రీశ్రీకి బాల్యం అన్నా, పిల్లలు అన్నా ప్రాణం. శ్రీశ్రీ తన పిల్లల్ని సైతం నువ్వు అని తండ్రిని పిలిచినా చనువుగా అనిపిస్తుందతనికి. చిన్న పిల్లలను ఉద్దేశించి "పసిడి మెరుగుల బాలల్లారా / పాలబుగ్గలా కూనల్లారా ఎవరో చెప్పండీ మీరు..." అంటూ పిల్లలతో మమేకం అవడం శ్రీశ్రీలో మరో ప్రత్యేకత.

4. కమ్యూనిజం:

ఆరాధన చిత్రంలో "నా హృదయంలో నిదురించే చెలి..." అంటూ రాసిన పాట శ్రీశ్రీ కవితాకన్య. అదే కమ్యూనిజం. కమ్యూనిజాన్ని మానవ జాతి ప్రభాత గీతంగా సంభవించారు. నాకు ప్రజలే దేవుళ్ళు, వీళ్ళకోసమే నా చరిత్ర, నా రచనలు. నీకు ఆకలి వేస్తే నీ నామాల దేవుడు అన్నం పెడతాడా అని ప్రశ్నించడం ఇతని వాస్తవ తత్త్వానికి నిదర్శనం.

5. బంధుత్వానికి సంబంధించి:

"మేనకోడలు" చిత్రంలోని "బతుకే చీకటాయె/ తనువే భారమాయె; ఎటుచూచినా. ఎటుపోయినా/ ఎదారి- లేకపోయె.." అంటూ మమకారాలు దూరమై మంచితనం నేరంగా భావించే సమాజాన్ని తూర్పారబట్టారు.

"ఒకే కుటుంబం" చిత్రంలోని  బాధలలోనే పయనించి/ స్వర్గధామం చేరాను/ స్వర్గంలోనే నరక యాతన పడే/ మాతృ దేవతను చూశాను అంటూ మానవ జీవితంలో బాధల స్థాయిని విశ్లేషించి, ఆలోచింపజేశారు.

6. ప్రణయ గీతాలు:

  ప్రణయగీతాల్లో శ్రీశ్రీ కొత్త ఒరవడిగా, నర్తనశాలలోని "ఎవ్వరి కోసం ఈ మందహాసం" అంటూ  ప్రశ్నించాడు.

. బలిపీఠం సినిమాలో "కలిసిపాడుదాం తెలుగుపాట.." "రాముడు భీముడు"లో "ఉందిలే మంచికాలం ముందు ముందునా...అందరూ బతకాలి నందనందనా"...  అనేవి ఈ కోవ క్రిందకు వస్తాయి.  

కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగిస్తే శ్రీశ్రీలా వెలిగిందన్నాడు పురిపండ.   ఓ శతాబ్దపు మహాకవి శ్రీశ్రీ. ఆయన పాటా, వెలుగులు గ్రక్కుతూ  నిశ్చేతనాత్వాన్ని కూడా చేతనత్వం చేస్తుంది. బొబ్బిలియుద్ధం సినిమాకు ఓ జావళి అవసరమైంది. నేను రాస్తానన్నారు శ్రీశ్రీమీరు రాయగలరా అని ప్రశ్నించారు సాలూరి మాస్టారు. గలనో లేనో చూడండి అంటూ నిమిషాల్లో "నిను చేర మనసాయరా... విడిదికి రమ్మని చాలా వేడితిరా.. " అంటూ భైరవి రాగంలో పాట రాసి నిరూపించారు.

7. వ్యక్తిత్వ వికాసం:

“వెలుగు నీడలు సినిమాలోని “కల కానిది విలువైనది బతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు..” అనే పాటలో వ్యక్తిత్వ వికాసానికి మూర్తి మత్వానికి పరాకాష్ఠ. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారికి సైతం మనసును మార్చుకుని దిశానిర్దేశం ఈ పాట చేస్తుంది. లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఏ డ్రీమ్‌ అని వివేకానందుడు చెప్పిన మాట ఈ పాటకు ప్రేరణ.

8. కొత్తదనం:

పదాలలో హిందూస్థానీ పదాల్ని వాడటం ద్వారా కొత్తదనం కలిగించడం మరో విశేషం. "దొంగా దొంగా దొరికేవులే పది/ లంగా లొంగావులే అంటూ రసరాజ్యమేలే సుల్తానా!” అవి చెప్పడంలో ప్రేమాను రాగాలకు భాష  ఒక వారధి అని చూపారు. గుడిలో మ్రోగింది జేగంట- చెలి వెన్నెల వెలిగింది నాయింట అంటూ ఈ పాట ప్రేమ, శృ౦గారం, కాస్త దైవభక్తిని మిళితం చేశారు.

“ఎవరు నీవు ఎవరు నేను అడిగేదెవరు ఎన్నళ్ళి పయనమో ఎవరికి తెలుసు...” అంటూ కానరాని దేవుడు నా ముందు నిలబడి మరో మేను నీ కిస్తా అని వరమిస్తే ఈ జన్మ చాలు అంటారట శ్రీశ్రీ. ఇందులో శ్రీశ్రీకి దేవుడు ఉన్నాడన్న భావానికి ఒక మచ్చుతునక.

లోకాన్ని దొంగల సంతతో పోలుస్తారు శ్రీశ్రీ. టక్కరు లంతా ఉన్నారని న్యాయానికి చోటే లేదు.  మోసాలకు లోటే లేదు అంటూ టక్కరి లోకాన్ని సరిగ్గా చూడానే భావనా స్పష్ట౦.

జీవితమే ఒక సెలయేరుతో పోలుస్తూ  “ఇల్లే స్వర్గం” చిత్రంలో పాటలో జీవితాన్ని చూసే కోణాల్ని విశ్లేషించాడు. వేగంగా ఉండడం, ఇలలో స్వర్గం సృష్టించడం, కలల్ని వాస్తవాల్ని చేయడం అంటూ.., చివరిగా బరువుగా బ్రతికే జీవచ్ఛవాలు మరణిస్తే మేలు అంటాడు. చివరి విరుపులో మెరుపు, ఆలోచనలు సహజంగా అందాన్ని అతడి లోతైన అవగాహనను పాఠకులకు, వినేవారికి అందిస్తారు.   

సామ్యవాదంలో ఎరుపు విప్లవానికి సంకేతం. దాన్ని ప్రేయసి చెక్కిలితో సంయోజనం చేయడం శ్రీశ్రీకి ఇష్టం. ఎరుపెక్కేను చక్కని నీ చెక్కిలి/ బరువెక్కెను నా యెదయే మిక్కిలి/ నా పెదవుల కదిలేను లే సిగ్గులు/ నా యెదయే వేసెను లే మొగ్గలు...” అంటూ "చిలకాగోరింక" సినిమాలో పాట రాశారు.  సాధారణంగా శ్రీ శ్రీ శబ్దాలంకార ప్రియుడు. ఇందులో చెక్కిలి, మిక్కిలి లాంటి పదాలను చివరలో వేస్తూ ఆ సౌందర్యాన్ని చూపిస్తాడు.

9. మహాప్రస్థాన గేయాలు సినీ గీతాలుగా:

            మహాప్రస్థానంలోని గీతాలు చలన చిత్రాల్లో చోటుచేసుకున్నాయి. ఉదా: కాల చక్రం (1940)లో మరో ప్రపంచం... , పల్లెటూరు (1952)లో పొలాలనన్నీ..., రణభేరి(1968) చిత్రంలో మరో ప్రపంచం, ఏ దేశ చరిత్ర చూసినా.... 1982 లో "మహాప్రస్థానం" అనే శీర్షికతో ఒక చలన చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంలో శ్రీశ్రీ ఒక అభ్యుదయ వివాహం చేయడానికి కార్యకర్తగా కూడా కనిపిస్తారు. ఇలా చాలా చిత్రాల్లో మహాప్రస్థాన గీతాల్ని కొంతవరకు వాడుకున్నారు. ఎక్కుగావగా నేనుసైతం అనే చరణం చాలా సందర్భాల్లో వాడడం శ్రీశ్రీ ముద్రగా చెప్పొచ్చు. నాస్తికుడైనా శ్రీశ్రీ భక్తి పాటలూ రాశారు. వృత్తి ధర్మం కొద్ది వాటికీ న్యాయం చేశారు. వీరరసాన్ని శ్రీశ్రీ పలికించారు.

            కురుక్షేత్రం సినిమాలో “ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం.....” పాట, “ఈ సమరం కలియుగ భారత సమరం, ఎన్నికల రణరంగాన ఎదిరించిన కురుపాండవ భీషణ సమరం అంటూ కలియుగ భారతం సినిమాలో రాశారు. ఎన్నికల కుతంత్రాలను ఎండగట్టే పాట ఇది. యమగోలలోని “సమరానికి నేడే ప్రారంభం....” పాట వింటే వీరరసం ఉట్టిపడతుంది.  “ఆకలిరాజ్యం..." శ్రీశ్రీలో ఉండే  ప్రశ్నించే గుణాన్ని, దేశ కర్తవ్యాన్ని గుర్తి౦చవచ్చు. ఆడది మగవాని చేతి ఆటవస్తువని ఏంచే పాతబడిన భావాలను లోతుగా పాతర వేసి కదలిరండి నవభారత నారీమణులారా అంటూ చైతన్యాన్ని నింపిన శక్తి శ్రీశ్రీ.  శ్రీశ్రీ కలలు కన్న సామ్యవాదమే కథావస్తువైన ఇందులో హీరో మహాప్రస్థానం కవితలనే పలుకుతుంటాడు.

10. వైవిధ్యం:

శ్రీశ్రీ పాటలల్లో నవరసాలు, వైరాగ్యమూ, వేదాంతమూ, సామ్యవాదాన్ని సుందరంగా, సందేశాత్మకంగాను తయారు చేసే కొత్తదనపు ఫ్రెంచ్ మద్యం.  "దేవత" సినిమాలోని "బొమ్మను చేసి ప్రాణము పోసి...  అనే పాటకు రాతిని కరిగించే అద్భుత ఆవిష్కారం. శోక రసాన్ని "మాంగల్యబలం" చిత్రంలో "పెను చీకటాయే లోకం చెలరేగేనాలో శోకం... అంటూ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించారు.  "మనుషులు మారాలి" సినిమాలోని "తూరుపు సిందూరపు మందారపు ...  అనే    మామూలు పుట్టిన రోజు పాటను మానవజాతి ఆవిర్భావాన్ని కీర్తించే స్థాయికి చేర్చడం అద్భుతం.   

11. సింహావలోకనం:

            బాల్యం నుంచి కష్టాల కడలిలో ఉండి ఆ కష్టాన్ని లేకుండా పోరాటం చేస్తూనే మహాకవిగా నిలిచారు. మార్పు ఏ రంగానికైనా తప్పదు. వాడుక భాష, కవిత్వపు భాషకు నడకలు, భాషతో పాటు భావాల బాణికి బాటలు వేశాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ ఒక జీవనది. చైతన్యం దాని ఊపిరి. తిరుగు బాటు దాని దారి. గిరులు సగరులు, కంకేళికా ముంఝరులు దాని సోదరులుగా అనితర సాధ్యంగా సాగిన ఆంధ్ర సాహితీ సినీ జగట్టుకు ఒక మరుత్తు శ్రీశ్రీ.  తెలుగు సినిమా సాహిత్యంలో చెరగని ఎరాతరగని సిరా శ్రీశ్రీ. మనిషన్నవాడు ఉన్నంత కాలం ఆయన పాటలు అక్షరాలై ఆవేశిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా పాటలకు ఆయాచిత వరం. ఆంధ్రుల అదృష్టమూనూ.

ఉపయుక్త గ్రంథాలు:

యుగకర్త శ్రీశ్రీ

శ్రీశ్రీ 101 విశేష సంచిక

శ్రీశ్రీ పాటలు : ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల

శ్రీశ్రీ బులెటిన్ 1, 2

(ఈ వ్యాసాన్ని పాటకు జేజే అనే తెలంగాణా సాహిత్య గోష్ఠిలో సమర్పించడమైంది.)

No comments: