Wednesday, May 31, 2023

నాటి “అసురుడు” నేటి అనువర్తనాలు

 

-డా. జె. సీతాపతి రావు, సహాయకాచార్యులు,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,

ఏ. పి. ఐ.  ఐ. ఐ. టి., నూజివీడు,

కృష్ణా జిల్లా, 521202. ఆం. ప్ర.

                                                                                                Email: seethuphd@gmail.com

 

1.0. పరిచయం:-

రావణాసురుడి జీవితం విజయాలతో సాగిన పయనం. ఒక్క పరాజయం అతని ప్రజల్ని, అనుయాయుల్ని తుద ముట్టించింది. ఈ కోణాలు జీవన మరణ సమరాలు. నాటి గాథను నేటి దృష్టితో విలోకించిన, వివేచించిన నవలే అసురుడు’. నవలా కర్త ఆనంద నీలకంఠన్. అనువాదం ఆర్. శాంత కుమారి.

1.1. భద్ర గవాక్షం:-

            కోణ్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్, కశ్చవీర్యవాన్, ధర్మజ్ఞుశ్చ, కృతజ్ఞశ్చ, సత్య వాక్యో దృఢ వ్రతః” అంటూ పదహారు గుణాలు కలిగిన వాడిని గురించి వాల్మీకి రామాయణం చెపుతుంది. అంతవరకు ఏ రకమైన సందేహం లేదు. ప్రతి నాయకుడిగా ఉన్న రావణాసురుడు కూడా అంత ధీమంతుడిగా కనిపించినప్పటికీ, అతణ్ణి హీనగుణుడుగా చూపించడంలో అంతరార్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బలమైన రాజ్యం, శక్తివంతమైన సోదరులు, ధార్మిక సంపద శైవభక్తి కలిగిన రావణాసురుణ్ణి ఎలా చూడాలి? స్వర్ణ లంకగా ప్రసిద్ధి పొందించిన రాజు రావణుడు. ఇది మరో పార్శ్వం.   

            రామాయణం శోక రసార్ణవం. అలా అని ఏడిపించేది కాదు. ఏడుపులో ఉన్నవారికి గుండె నిబ్బరాన్ని ఇచ్చేది. కష్టాలలో ఉన్న వారికి కార్య సాధన చేయిస్తుంది. చుట్టూ సహజ కవచమైన సముద్రం లంకకు శ్రీకారం. సంపదలకు అదే నిలయం. శత్రు దుర్భేద్యం. మూడు సహస్రాబ్దాల నుంచి ఆసియా అంతటా వెయ్యి రకాలుగా చెప్పుకుంటూ వస్తున్న రామాయణ గాథకి, జరిగిన చారిత్రక అంశాలకి సంఘర్షణ సహజం. ఆ నేపథ్యాల నుంచి బలమైన ఘన సముదాయాన్ని చెప్పవలసిన అవసరాన్ని కలల రూపంలో కలిసి నడిచిన నవలా కర్త, ఆనంద నీలకంఠన్. వాల్మీకి రామాయణానికి లభ్యమైన చారిత్రక, భౌగోళిక ఆధారాల్ని ఆకరాలుగా చేసుకొని సాగిన సృజన అసురుడు నవల.

            రామాయణంలో అంతగా ప్రాముఖ్యం లేని పాత్రలు కూడా తమ గురించి రాయమని రచయితని కోరినట్లుగా తెలిపారు. రావణుడి నాయకత్వాన్ని అంగీకరించి, అతన్ని చివరి వరకు అనుసరించి మోసపోయిన ఒక సామాన్య రాక్షసుడు భద్రుడు. ఆ పాత్ర గవాక్షంలోంచి చూపే వైనం, పరాజితుల గాథ అసురుడు.   

1.2. అసురుడి కథా పరిచయం:-

          ముగింపు నుంచి ప్రారంభమై ఆరంభంతో అంతమవడం ఈ కథలోని కథనం. శంభుకుడి మరణం తర్వాత అయోధ్యలో అలగా జనంగా మారారు శూద్రులు. నిరాశ నిస్పృహలు వారికి తోడు. బాధల్ని తట్టుకోలేక మద్యానికి బానిసవడం, నిరాశ నిస్పృహల్ని అణచుకోలేక భార్యల్ని బాదేవారు. లంకలో వేశ్యలా ఎంత మంది విటులతో సంబంధం పెట్టుకుందో అని వాడవాడలా వినేలా భార్యని వీధిలోకి ఈడ్చాడు. మచ్చ పడ్డ భార్యని ఏలుకోవడానికి నేను రాముడిని, రావణుడిని కాను. నీతి గౌరవం నాకు అన్నిటికన్నా ముఖ్యం అంటూ మళ్ళీ పానశాల వైపు పయనం.

            రాముడు ముఖం చిట్లిస్తూ భద్రుణ్ణి ప్రశ్నించమని మంత్రులలో ఒకరికి సైగ చేసాడు. ఒక నల్ల బ్రాహ్మణుడు ముందుకొచ్చి అస్పృశ్యుడికి ఎంతదూరంలో నిలబడాలో నిలబడి ప్రశ్నల వర్షం కురిపించాడు. పాతివ్రత్యం కోల్పోయిన భార్యని రాముడిలా నేను ఏలుకోలేనని చెప్పాడు. రాముడి ముఖం అవమానంతో ఎర్రపడింది. ఏ శిక్ష వేయకుండా వదిలేయడం ఆశ్చర్యం వేసింది. ఈ భద్రుడి పాత్రను ఈ సంఘటన వరకే వాల్మీకి చిత్రించాడు. ఈ నవలలో భద్రుడి పాత్ర చాలా చోట్ల వస్తుంది. తాగుబోతు నిజాలే చెపుతాడు. తాగుబోతుతో తగువూ లేదు. కాబట్టి రాముడు అతణ్ణి ఏమీ చేయలేదు, సీతను వదిలేయడం తప్ప.      

            ఈ నవలలో కథ “రేపు నాకు అంత్యక్రియలు జరుగుతాయి. నన్ను ఒక గజ్జి కుక్కని పూడ్చి పెట్టినట్టు పూడ్చిపెడతారు” అంటూ రావణుడు పలికిన మాటల నుంచి “ఏదో ఒకసారి ఈ లోకంలోకి నేను మళ్ళీ వచ్చినపుడు ఆ అద్భుతమైన పాటలోని మాటల్లో నిజం తెలుసుకుంటానేమో, ఎవరికి తెలుసు!” అంటూ భద్రుడు చెప్పిన మాటల వరకు చాలా ఆహ్లాదంగా సాగుతుంది. బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఒక అసురజాతి బాలుడు తనని తాను మహారాజుగా ఎలా మార్చుకున్నాడు. దానికోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మందిని ఎదుర్కొన్నాడు. ఇవన్నీ చాలా రసవత్తరంగా చెప్పాడు రచయిత. అత్యాశ, అహంకారం, అతి ప్రేమతో ఉన్న మహారాజుకి కుళ్ళు కుతంత్రాలు, నమ్మకద్రోహాలతో చుట్టూ వున్నవారు చితి పేర్చి, మరణ శయ్యపై కూర్చోబెట్టిన తీరు పాఠకుడికి కన్నీరు తెప్పించడం ఖాయం.  

1.3. శాస్త్రం + సాంకేతికత  =  అసురుడు :-

            “ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేత కృతకేన వా/ పుంసాంయేనోపదిశ్యేత తచ్ఛాస్త్రమభిధీయతే” మంచి గుణాలకి రాముడిని, ఎలా ఉండకూడదో చెప్పడానికి రావణాసురుడుని ఉదాహరణగా చెప్పాడు. శాస్త్రం ఎలా ప్రవర్తించాలో లేదా ప్రయోగంలో ఎలా వస్తుందో, తప్పులు చేస్తే ఎలా వ్యతిరేకంగా ఫలితం వస్తుందో చెబుతుంది. ఈ ప్రమాణాన్ని రామాయణంలో అనుసరించాడు. అయితే వ్యతిరేక ఫలితాలలో ప్రయోగాలు పూర్తి వ్యతిరేకం కాదని, దానిలో కూడా ఉపయోగాలు ఉంటాయని చూపించిన ఇంజినీర్ ఆనంద నీలకంఠన్.

            రావణాసురుడిలో రాముడుకి ఉన్న అన్ని గుణాలు ఉన్నాయని కాదు. కేవలం సీత విషయంలోను, అంతక ముందు రంభ విషయంలోనూ ఆకర్షణ పొందటం ఆయనకి అపవాదు తెచ్చింది. దేవతలని జయించడంలో గాని, వాలితో ఓడిపోవడంలో గాని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బలి చక్రవర్తి మాట తప్పని మహనీయుడు. అతన్ని విష్ణువు (వామన రూపంలో) అణచివేశాడు. విష్ణు ద్వేషమే[1] కారణం. 

            కైకేసి[2] (కైకసి) పుత్రులు, కుబేరుని సవతి తమ్ముళ్ళు రావణ, కుంభకర్ణ, విభీషుణులు. రావణాసుడు దుస్థితిలో ఉన్న బలి చక్రవర్తి గృహానికి వెళ్ళాడు. అక్కడ ఓ వృద్ధుడు రావణాసురుడికి చాలా విషయాలు చెప్పాడు. అసుర సామ్రాజ్యాలకు ఉన్న గొప్పతనం ఇంతా అంతా కాదు. హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు లాంటి ప్రసిద్ధి పొందిన కవలలు తమ పరాక్రమంతో సామ్రాజ్యాన్ని సంపాదించారు. ఆ తర్వాత హిరణ్యాక్షున్ని అడవిపంది కొమ్ముతో పొడిచి చంపేసింది. హిరణ్యకశిపుడిని అతని కొడుకే (ప్రహ్లాదుడు) దేవతల రాజైన ఇంద్రుడితో కలిసి కుట్ర చేసి చంపించాడు.

            ఇందులో ఒకటవ అంశం హిరణ్యాక్షుడిని అడవి పంది చంపడం. దీనికి శాస్త్రీయ దృక్పథం అవసరం. ఒక బలవంతుడైన మనిషిని సాధారణమైన పంది చంపలేదు. దీన్ని సాధించడానికి ఒక హేతు వాద దృక్పథం అవసరం. అదే ఆక్సమ్స్ రేజర్[3]. సామాన్యంగా లేదా ఆర్థిక కోణాలు లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఊహించిన అంశాలు సుమారుగా నాలుగైదు ఉన్నాయనుకోండి. అందులో ఏ సంఘటన లేదా ఏ అంశం ఆ విషయానికి దగ్గరగా ఉంటుందో దాన్ని ఎన్నుకోవడం. అదే ఇక్కడ ఆనంద నీలకంఠన్ చేశాడు. పందిని అడవి పందిగా మార్చి హిరణ్యాక్షుడు చనిపోవడానికి కారణంగా చెప్పాడు. దీని వల్ల ప్రయోజనం శాస్త్రీయ ప్రమాణం. లేదా సావకాశ ప్రమాణం.

            విజ్ఞాన శాస్త్రంలో ఆక్సమ్ రేజర్ పరిశోధనాత్మక మార్గదర్శకాలను అభివృద్ధి చేయడంలో ఉపయోగించవచ్చు. శాస్త్రవేత్తలకు ప్రచురించిన నమూనాలకు మధ్యవర్తిగా సహకరిస్తుంది. ఉదాహరణకు క్వాంటమ్ మెకానిక్స్ - ప్రకృతిలో ఉన్న చిన్న చిన్న అణువులు, పరమాణువుల శక్తి స్థాయిలను వివరించేది. ఈ కోవ లోకే వస్తుంది ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం[4] (స్పెషల్ రిలిటివిటీ). ఒక సాంకేతిక పట్టభద్రుడుగా దీనిని అనుసరించే సాహిత్యంలో వినూత్న ఒరవడులు సృష్టించాలనుకున్నాడు, ఆనంద నీలకంఠన్. 

            బానిసలు ఎప్పుడు బ్రతుకు తెరువుకై ప్రయాణిస్తుంటారు. అలానే భద్రుడు కూడా. ఎక్కడో మూల గ్రామం నుంచి వలస వచ్చాడు. రావణాసురుడుకి రాజ్య పట్టాభిషేకంలో ఇతనిదే ప్రధాన పాత్ర. కాని భద్రుడు అంటే రావణాసురుడికి ఎప్పుడూ చిన్న చూపే. రామాయణ ప్రయాణం అంతా సీత కష్టాల చుట్టూనే తిరుగుతుంటుంది. ఆ కష్టాలకు కారణం భద్రుడు అనే చాకలి. అదే పాత్రను తీసుకొని అసురాయణం నడిపించాడు రచయిత. ఒక సాంకేతికత పట్ట భద్రుడు రచనాకౌశలం ఈ నవలలో చూడొచ్చు. సైన్స్ కి మూలం భాష. దానికి సాంకేతికత అనువర్తనం  (Application). తద్వారా కొత్త సృష్టి వస్తుంది. శాస్త్రీయతకు అనువర్తనం తోడైతే కొత్త సృష్టి జరుగుతుంది. అదే నవల ద్వార నిరూపించాడు రచయిత.

             బలి చక్రవర్తి గొప్పదాన శీలి. అలాంటి బలికే సహాయం చేశాడు కాబట్టి శుక్రాచార్యుడిని మహా బలి అని పేరుపెట్టాడు. ఆ మహా బలి శిష్యుడు రావణాసురుడు. ఇక్కడ మహా బలి అని సూచించడంలో రావణాసురుడి గొప్పదనం తెలియజేయడం రచయిత ఉద్దేశం.            

1.4. రావణాసురుడి యుద్ధ కౌశలం:-

            ఏ కథలోనైనా కథానాయుకుడి వీరత్వాన్నే చూపిస్తారు. ప్రతి నాయికుడిని వదిలేయడం సహజం. అసలు కథానాయకుడి యుద్ధ నైపుణ్యం తెలిసేది ప్రతినాయకుడి వలనే. ప్రతి నాయకుడే సరైన యుద్ధ నిపుణుడు కాకపోతే ఇంకా కథానాయకుడి విలువ ఉండదు. అందుకే  ప్రతినాయకుడిని యుద్ధ వీరుడుని చేసి నవలను రసవత్తరం చేశాడు రచయిత. ఈ నవలలో దెయ్యం దాడి (6), పరాజితుల సంప్రదాయాలు (7), సముద్రపు దొంగల బెడద (13), మృత్యువు మళ్ళీ తలుపు తట్టింది (37), నేను కోరుకున్నది నీ చావునే (47) అనే శీర్షికతో ఉన్న అంశాలు ఇందుకు నిదర్శనాలు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అసుర వీరులందరూ నేల రాలుతున్నారు. అయిన అసురరాజు ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. మొక్కవోని దీక్షతో కదన రంగంలోకి కాలు కదిపాడు. రక్తపు మడుగుల్లో అడుగులు పడలేదు. హృదయం చలించింది. అవన్నీ చూసాక ఒక రాజుగా నేను వైఫల్యం చెందానా? అనే స్థితి చేరాడు అసుర రాజు. ఇంతమంది బలిగొన్న ఆ అన్నదమ్ముల్ని మట్టికరిపిస్తా అని శపథం పూనుతాడు. యుద్ధ రంగంలో అలుపెరుగని పోరాటం చేస్తాడు. చివరికి ప్రాణాలు కోల్పోతాడు. మరణపుటంచుల్లో కూడా పెదవి పై చిరునవ్వు, శత్రువుని చంపాలనే కసి, రావణాసురిడి పగకి పతాకాంశాలు.

1.5. రావణ సుత - రమణీయ సీత :-

వాల్మీకి రామాయణంలో రావణాసురుడికి ఒక ముసలం పుట్టింది. అది అతని వినాశనానికి హేతువు అవుతుందని జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్పారు. అందుకు ఆ ముసలాన్ని సముద్రంలో నూరేసి పారేయమని చెప్పారు. అందులో చిన్న ముక్కఅయింది. విసుగుతో పారేశారు. ఆ ముక్కే సీత అని ఒక కథనం.. కాని దానికి భిన్నంగా అంటే శాస్త్రీయంగా సీత పుట్టుకను రచయిత కల్పించాడు.  

          రావణాసురుడికి మండోదరికి ఒక ఆడ బిడ్డ పుట్టింది. ఆ పాపంటే రావణాసురుడికి  ప్రాణం. ఆ పిల్లని ఒక్క క్షణం కూడా వదిలి ఉండేవాడు కాదు. అమ్మాయి జననం రావణాసురుడికి మరణం అనీ ఎవరో జ్యోతిషశాస్త్రవేత్త చెప్పాడు. రావణ మంత్రి వర్గంలోని కొందరు ఆ పాపని అతను లేని సమయంలో భద్రుడికిచ్చి చంపేయమన్నారు. భద్రుడు ఆ పిల్లని ఒక బురద గుంటలో పడేశాడు. అప్పుడు జనక మహారాజు ఆ పిల్లని నాగలి సహాయంతో పైకి తీశాడు. ఆ పాపకి సీత (సీత అంటే నాగటి చాలు అని అర్థం) అని పేరుపెట్టాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచిపోషించాడు. ఆ చిన్న పిల్లని వదలలేని రావణుడు జనక రాజ్యంలో వార్తాహరులని పెట్టి తన కూతురి యోగ క్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. కొన్ని రోజులకి తన కూతురికి స్వయంవరం అని తెలిసి వెళ్ళి తన కూతురిని తన రాజ్యానికి తెచ్చేయాలనుకున్నాడు. కాని సీత రాముల పరిణయం చూసి ఒక పక్క బాధపడుతూనే మరో పక్క  ఆనంద ఉన్నట్లు నటిస్తూ అక్కడి నుంచి వచ్చేశాడు. కాని తన కూతురిని తన రాజ్యానికి తెచ్చేయాలన్న కాంక్ష మాత్రం పోలేదు.

            కన్న కూతురిని అల్లారు ముద్దుగా చూసుకోవాలనే కోరిక తీరలేదు. కాని కూతురే తనకు పంచ ప్రాణాలు. నిత్యం కూతురి యోగ క్షేమాలు తెలుసుకునేవాడు. కూతురిని తన భర్త సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో అని నిత్యం బాధపడుతూ ఉండేవాడు. అందుకే కూతురిని తన స్వర్ణలంకకి తీసుకొచ్చేసాడు. కూతురి కోసం సర్వస్వాన్నే కోల్పోయాడు. ఈ వ్యక్తిత్వ చిత్రణద్వారా కవి నేటి సమాజంలోని తండ్రులకు సందేశాన్ని ఇస్తూ గుణపాఠం నేర్పిస్తున్నాడు. అతి సర్వత్ర వర్జయేత్ కదా.  ఈ నవలలో నాయకుడికి కూతురు పై అతి ప్రేమ వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయాడు.

1.6. రాల్లెత్తిన కూలీలెవరు?:-

            అణచివేత నుండే అభివృద్ధి బయటకి వస్తుంది. తండ్రి బ్రాహ్మణుడు. తల్లి ఊరు పేరు లేని అసుర జాతి స్త్రీ. తండ్రి తన పాండిత్యాన్ని చూసుకున్నాడే గాని ఏనాడూ పిల్లల బాగోగులు పట్టించుకోలేదు. రావణ సోదరులు వేశ్య పిల్లల్లా పెరిగారు. తన సంపదనంతా కుబేరుడికి ఇచ్చేశాడు. ఇక చేసేది లేక ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. అప్పుడే మొదలైంది రాజ్య కాంక్ష బీజం రావణుడి మదిలో. ఎలాగైనా ఈ లంకకు రాజు కావాలని దీక్ష పునాడు. చివరికి అనుకున్నది సాధించాడు.

            ఆ పసి పిల్లాడు పిడుగులా పెరిగాడు. మహా బలి చేతిలో రాటుదేలాడు. సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. లంకా రాజ్యంపై దండెత్తి వచ్చాడు. మొదటి ప్రయత్నంలో ఓడిపోయాడు. రెండవ సారి ప్రయత్నించాడు. మళ్ళీ మామూలే. ఈ సారి సరైన ప్రణాళికతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ సమయంలో దేవతల దాడి వల్ల సర్వస్వం కోల్పోయిన భద్రుడు రావణ చెంత చేరాడు. రావణాసురుడుకి రాజుని చేశాడు. ఈ అస్పృశ్యుడే రాజుగా మారి లంకని స్వర్ణ లంకగా మారాడు.

            తాజ్ మహల్ కట్టించింది ఎవరు అంటే షాజహాన్ అని అందరికీ తెలుసు. దండ యాత్రలలో ప్రాణాలు కోల్పోయేది సైనికులే. కాని రాజరికం మాత్రం ప్రభువులదే. ఇక్కడ అసురుడులో కూడా  భద్రుడు లంకా నగర నిర్మాణ కూలి. యుద్ధంలో సైనికుడు. కాని అతని పాత్ర రామాయణంలో ఓ చాకలి. అదీ రెండు డైలాగుల పాత్ర. అందుకే పరాజితుల గాథలో రచయిత భద్రుడ్ని నవలా సారథిగా చూపించాడు. ఇదే రచయిత కల్పించిన కొత్తదనం.

1.7. రావణ తంత్రం:-

          “ప్రేమ సంకెళ్లలాంటిది. అది నిన్ను ఊహా లోకం అనే గుదిబండకి కట్టేస్తుంది. ఒక యోధుడు కేవలం విజయం మీద మాత్రమే దృష్టి సారించాలి. నీ ధర్మం, నీ కర్తవ్యం అదొక్కటే. మీ వాళ్ళకి, తల్లిదండ్రులకి, భార్యలకి, బద్ధుడవై కర్తవ్యం నిర్వహించు. కాని ఎప్పుడూ వాళ్ళని ప్రేమించవద్దు. ప్రేమ నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది. విజయం, ఓటమి అంటే త్రాసులో ఉన్న కీలకమైన పరిస్థితుల్లో ప్రేమ అనేది నిన్ను కనబడని తాళ్ళతో కట్టేసి ఓటమి అనే అగాథంలోకి తోసేస్తుంది. ప్రేమని చూసి భయపడు” ఇది రావణాసురుడికి తన గురువు చెప్పిన రహస్య బోధ. అన్ని విషయాలలో అసురుడు అలానే ఉన్నాడు. కాని తన కూతురు సీత విషయంలో అలా ఉండలేక పోయాడు. అతిగా ప్రేమించాడు. తన కూతురిని తిరిగి సంపాదించడానికి శూర్పణక, మారీచుడు, వాలి లాంటి ఎందరినో అడ్డు పెట్టుకున్నాడు. ఆఖరికి సీతని బలవంతంగా తీసుకు వచ్చాడు.

            ఇక్కడ మనం గమనించాల్సింది- ఒకటి సీతని తేవడం. రెండు తనకన్నా వీరుడైన రాముడుని చంపాలనుకోవడం. అందుకే ఇదంతా చేశాడు. తాను వీరుడు అని నిరూపించుకోవాలంటే రాముడే సరి జోడీ. అందుకే కాలుదువ్వాడు. కష్టాల పాలయ్యాడు.

1.8. వర్ణ వ్యవస్థ లేని స్వర్ణ పాలన:-  

          అగ్రవర్ణాలు ఆగడాలు చెలాయిస్తున్న రోజులవి. ఆ కాలంలో ఒక అసుర జాతీయుడు రాజైయ్యాడు. అగ్రవర్ణాల చేతిలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చివరకు ఛీత్కారాలు కూడా పొందాడు. అందుకే లంకా నగరంలో వర్ణ వ్యవస్థ లేకుండా చేశాడు. ధనిక, పేద రెండు వర్గాలు మాత్రమే ఉండేవి. మధ్యలో విభీషుణుడు బ్రాహ్మణ కులాలను ప్రోత్సహించిన దానిని కూడా అణచి వేశాడు. ఇలా రాజ్యం అంతా అసుర జాతి. దొంగతనాలు, దోపిడీలకు కళ్ళెం వేశాడు. ప్రజలందరితో సాగు పనులు చేపించాడు. ప్రతి వ్యక్తి పని చేయాలనే నిబంధనను తీసుకొచ్చాడు. పన్నులు లేవు. పండించినవాడిదే పంట. ఇలా లంకను స్వర్ణ లంక చేశాడు. 

            ప్రస్తుత భారత రాజ్యాంగం 7%, 14% రిజర్వేషన్ కల్పించినా అది కొంత మందికే చేరుతున్నాయి. చేరిన వారికే మళ్ళీ మళ్ళీ అందుతున్నాయి. అసలు ఈ రిజర్వేషన్ అనేది కుల, మత ప్రాతిపదికగా కాకుండా ఆర్థిక స్థితి ఆధారంగా ఇవ్వాలి. మొదట్లో అలానే ఇచ్చారు. పది సంవత్సరాలలో ఈ వ్యవస్థ మొత్తం మార్చాలి అని రాజ్యాంగంలో సూచించారు. కాని రాజ్యాంగ ఆశయం సిద్ధించలేదు. ఓట్లు కోసం రిజర్వేషన్ లను వాడుకుంటున్నారు. అణగారిన వర్గాల (ఆర్థిక స్థితిని అనుసరించి) ప్రజలను అభివృద్ధిలోకి తీసుకు వచ్చి  సరైన అవకాశాలు కల్పించాలి. అప్పుడే భారత దేశం స్వర్ణ లంక అవుతుంది. లేదంటే తిరుగుబాటు ఏదో ఒక రోజు తప్పక వస్తుంది. అదే రావణాసురుడి పాత్ర ద్వారా రచయిత చెప్పదలచుకున్నాడు. 

1.9. పునరావలోకనం:-

             మానవ సమాజానికి మంచి చెడులు రెండూ అవసరం. గెలుపోటములూ అంతే. కష్ట సుఖాలు కావడి కుండలు. సురులు అంటే దేవతలు. అమృతం తాగినవారు. ఆరోగ్యవంతులు. రావణాసురుడిలో కూడా ఈ గుణాలు ఉన్నాయని చూపించడం ఈ నవలా లక్ష్యం. ప్రతి మనిషిలోను చెడ్డ గుణాలు ఉంటాయి. వాటిని వారి దృష్టితో చూసినపుడు మంచి గుణాలే. ఈ కోణంలో అన్వేషణే అసురుడు. ప్రజాస్వామ్యంలో పౌరుడికి వాక్ స్వాతంత్ర్య హక్కు ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకొని భద్రుడు పలికిన మాటలే సీతా త్యాగం. ఇది రాముడికి వ్యక్తిగతంగా జరిగిన నష్టం. భద్రుడే కీలకం. అలాంటి భద్రుడిని ఆసరాగా చేసుకొని పరాజితుడైన రావణాసురుడికి జరిగిన అవమానాలకు ఇబ్బందులకు ప్రతీకగా సామ్యవాద కోణం నుంచి ప్రజాస్వామ్యం వరకు సాగే సమరమే అసురుడు.

 

ఆధారాలు:-  

1.      అంతర్జాలం

2.      అసురుడు – ఆనంద నీలకంఠన్, అనువాదం ఆర్. శాంత కుమారి

3.      పూర్వ గాథాలహరి – వేమూరి శ్రీనివాస రావు

4.      వాల్మీకి రామాయణం  - అనువాదం కె. యస్ . రంగసాయి

5.      రామాయణంలో విశేషాలు – డా. జి.వి. పూర్ణచంద్

(ప్రాచీన తెలుగు సాహిత్యం ఆధునికుల పునర్మూల్యాంకనం అంతర్జాతీయ సదస్సు తేదీ 27&28ఫిబ్రవరి,2019, స్నేహ క్లబ్, మహాబోధి సాహ్త్య వేదిక, శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం, అనంతరపురం, ISBN:978-93-5321-978-1: ఎడిటెడ్& పబ్లిషిడ్స్: ఆచార్య జి. బాలసుబ్రహ్మణ్యం గారి పుస్తకంలో ముద్రణ: పుటలు 23-27)



[1]  కృశధ్వజుడు మాలావతుల కూతురి వేదవతి. వేదం పటిస్తున్నప్పుడు ఈమె పుట్టింది. అందుకే వేదవతి అన్నారు. విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు తండ్రి ఒక రాక్షసుడు వచ్చి వేదవతిని కామించాడు. కుశధ్వజుడు ఆమెను ఇవ్వనందుకు కోపంతో ఆ రాక్షసుడు కుశధ్వజుడిని చంపేశాడు. భర్త పోయిన బాధతో భార్య మరణించింది. వేదవతి తపస్సు చేయడం మొదలపెట్టింది. రావణాసురుడు ఈమె సౌందర్యాన్ని చూసి మొహంతో ముద్దు పెట్టాలనుకున్నాడు. నా మనస్సు నిజంగా హరిపై ఉంటే నేను అయోనిజగా పుట్టి, విష్ణు మూర్తిని పెళ్లి చేసుకొని నీ వంశాన్ని నాశనం చేస్తానని పలికింది. అగ్ని దూకి దగ్ధమైంది. ఆమె లంకలో ఒక పద్మంగా పుట్టింది. జోతిష్యులు ఆమె జన్మ అరిష్టం అని చెప్పారు. ఆమెను పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేశారు. ఆమె మిథిలా నగరం చేరింది. ఆమె సీత. (బ్రహ్మ వైవర్త పురాణం)      

[2]  సుమాలి కూతురు. ఈమె విశ్రవసుడి ఆశ్రమానికి తండ్రి పంపగా వెళుతుంది. విశ్రవసుడితో పుత్రార్ధిగా వచ్చానంటుంది. నీవు ఎన్ని సార్లు ఋతి మతివైయ్యాయో అందరి పుత్రాలను ఇస్తాను అంటాడు విశ్రవసువు. కాని ఒక పుత్రుడు ఒక పుత్రిక చాలు అంటుంది.విశ్రవసుడి మాట వల్ల 10 తలలు ఉన్న రావణాసురుడు, శూర్పణక పుడతారు.  (విచిత్ర రామాయణం, ఉత్తర రామాయణంలో ఈ అంశం ఉంది)   

[3]   Definition of OCCAM'S RAZOR:- a scientific and philosophic rule that entities should not be multiplied unnecessarily which is interpreted as requiring that the simplest of competing theories be preferred to the more complex or that explanations of unknown phenomena be sought first in terms of known quantities. దీన్ని అతిమానుష స్వభావంగా అంటారు.

[4]  శూన్యాకాశం (space), కాలం మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. కాంతి కంటే వేగంగా ఏదీ ప్రయాణించలేదు. వేగాలతో సంబంధం లేకుండా కాంతి వేగం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. కాంతి వేగం – 2.98 X 10^8 m/s

ఏ వస్తువు నిశ్చలంగా ఉందో, ఏ వస్తువు కదులుతూ ఉందో చెప్పడానికి వీలుకాదు. అది సాపేక్షం. ఐన్ స్టీన్ 1915 లో సామాన్య సాధారణ సాపేక్ష సిద్ధాంతాలని ప్రతిపాదించాడు.

No comments: