Tuesday, May 30, 2023

అప్పుడే జీవితాలు భద్రం - లేదంటే ఛిద్రం

 

-డా. జె. సీతాపతి రావు, సహాయకాచార్యులు,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,

ఏ. పి. ఐ.  ఐ. ఐ. టి., నూజివీడు,

కృష్ణా జిల్లా, 521202. ఆం. ప్ర.

Email: seethuphd@gmail.com

సంచారవాణి: 9951171299.

 

1.0. ప్రకృతిలోని పరమార్థం:-       

          ప్రకృతి అంటే ప్రత్యయము రాకముందున్న శబ్ద రూపము; ఉపదాన కారణం; ఒక ఛందస్సు; సత్యాధి గుణ సామ్యావస్థ; స్వభావం; స్వామ్యాది (సప్త కృతులు - స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గం, బలం); అవ్యక్తము (అష్ట ప్రకృతులు- అవ్యక్త, బుద్ధి, అహంకార, పంచ తన్మాత్రలు) అని శబ్ద రత్నాకరం ప్రకృతిని గురించి నానార్థాలిస్తుంది. ప్ర + కృతి అని విడదీస్తే విశేషమైన కృతి అని అర్థం. కృతి అంటే చేయుట; ప్రబంధం; ఒక ఛందస్సు; నొప్పించుట మొదలైన అర్థాలున్నాయి. బాగా చేయడం అని అర్థం తీసుకున్నప్పుడు ఇబ్బంది లేదు. బాగా నొప్పించుట అని అర్థం తీసుకున్నప్పుడే ప్రమాదం ప్రారంభమౌతుంది. ప్రబంధం అనే అర్థం తీసుకున్నప్పుడు కావ్య పరిమళాన్ని శోభిస్తుంది.

          ఒక్క మాటలో చెప్పాలంటే మన దృష్టి మనకు సృష్టిలోకి నడిపిస్తుంది. అంటే లో చూపు కలిగిన స్థితి ఉన్నట్లైతే ప్రకృతిని దేవతలా దర్శించవచ్చు, చిన్న పిల్లల్లా ఆడుకోనూ వచ్చు. బ్రహ్మమయంగానూ చూడవచ్చు. వారి వారి ఉద్దేశ ఉపాసనల ఆధారంగా ప్రకృతి భావాన్ని వ్యక్తీకరిస్తారు. నిజానికి ఉన్నది ఒకటే ప్రకృతి. దాన్ని వికృతంగా మారిస్తే విలయ తాండవమై వినాశనానికి విందు చేస్తుంది.

2.0. ప్రకృతిమయంగా విరాట పర్వం:-

            నేపాల్ ను మహాభారతంలో మత్స్య దేశంగా భావించేవారు. దానికి రాజు విరాటుడు. వి+ రాట్ = చాలా రకాల ఆకారాలతో ప్రకాశించేవాడని శబ్దాన్ని అనుసరించి చెప్పవచ్చు. ఈ విరాటుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించుకుంటే మత్ + స్య = అహంకార మమకారాలను నశింపచేసే సాధనా స్థలంలో ఉన్నాడు. అంటే క్రాంతదర్శి అయిన ధర్మరాజుకు ఉపాసన స్థితి వల్ల విరాటుడు విరాట్ స్వరూపంతో (ప్రకృతి స్వరూపంతో) కనిపించాడు. దానిని ఆసరాగా చేసుకొని భీష్మాచార్యులు తరవాత కాలంలో ఎక్కడైతే పాండవులుంటారో అక్కడ ప్రకృతి పరవశించి పోతుంది అంటాడు. ముక్కారు పంటలు, గో వృద్ధి ఉంటుంది అంటాడు. ఇది ముక్తి సాధనమైన సాత్త్విక శక్తికి ఒక సాధనం.

3.0. శమీ వృక్షంలోని రహస్యాలు:-

          ఆయుధాలు అన్నీ ప్రకృతి నుంచే వస్తాయి. అదే ప్రకృతిలో లీనమౌతాయి. పాండవులు అజ్ఞాత వాస సమయంలో శమీ వృక్షం మీద ఆయుధాలను దాచారనడం గమనించాలి. శమీ అంటే ఇంద్రియ నిగ్రహం. ఆయుధాలు అంటే తామసిక ప్రవృత్తులు. మనలో ఉండే నిగ్రహించుకోలేని వాటిని బలంగా అనుకోవడం ద్వారా గుప్తంగా ఉంచుకోగలుగుతాం. ఈ స్థితే శమీ వృక్షానికి ఉంది. దీనికి చీకటి చెట్టు అని పేరు. తనను తాను ఎదుగుతూ చీకటిని ఆశ్రయించడం ద్వారా ఎక్కడ ఏది దాచాలో దానికి అనుకూలంగా ఉంచగలిగే శక్తి దీనిది. అందుకే శమీ వృక్షాన్ని ఎంచుకున్నారు. శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ Prosopis) ఫాబేసి కుటుంబానికి చెందినది. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని ఆరణీఅనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని ఆరణిఅని అర్థం. విజయదశమిరోజు సాయంత్రం

                             ‘‘శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా

                             ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ

                             కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా

                             తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే అని అమ్మవారి కృపను పొందాలని చూస్తారు. శమీ శమయతే పాపం అని ఆర్యోక్తి. పాపాలను పోగొట్టుకోవడం అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. ఇది వృక్ష ధర్మం. మనిషిలో ప్రకృతి ధర్మం. ఇంద్రియాలు అరిషడ్వర్గాలకు అనుకూలంగా ఉండాలా? ప్రతి కూలంగా ఉండాలా? అనేది ఆ వ్యక్తి ఇష్టం. మొత్తం మీద శమీ వృక్షం ఇంద్రియ నిగ్రహం ద్వారా విజయకేతనాన్ని ఎగరవేయించగలదు.

3.1. ఆయుర్వేదంలో శమీ వృక్షం:-  

          కుష్టు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి ఆకులను ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు చెట్టు బెరెడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే దీనికి ‘సురభి బంగారం’ అని పేరు.

4.0. విరాట పర్వంలో అజ్ఞాతం :-  

          జ్ఞాతం అంటే తెలుసుకోవడం. అజ్ఞాతం అంటే తెలుసుకోకపోవడం. అంటే తనను తాను తెలుసుకుంటూ ఎదుట వాళ్లకి తెలియకపోవడం. గొప్ప వీరులైన పాండవులు సేవా వృత్తిని స్వీకరించడం ఏమిటి? అంటే ముక్తి సాధనకు రాజస వృత్తులను దూరంగా ఉంచాలి. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అంటే దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు.

          మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్త్వానికి ప్రతీకలు. అష్ట వసువులు - ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు. (ధర = భూమి, అనిల= అగ్ని, అనల = జటరాగ్ని, ఆహ= పగలు, ప్రత్యూష = ప్రభాతం, వేకువ, సోమ = చంద్రుడు, ధృవ = ముయ్యాకు చెట్టు పొన్న (త్రిదళాలు కల చెట్టు.  మారేడు మొదలైనవి)). ఈ తత్త్వాలను వ్రతంగా కలిగి ధరించడమే దేవవ్రతుడు. గంగా దేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు. ప్రతివారికి ప్రకృతి సాయం చేస్తుందని ప్రతిజ్ఞ చేయడమే భీషణ ప్రతిజ్ఞ. తద్వారా భీష్మోదయంగా మారింది. అతని పైకి పరశువు(గండ్ర గొడ్డలి) తో యుద్ధానికి వచ్చినవాడు పరశురాముడు. ప్రకృతిని నరకాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. తద్వారా ప్రకృతి ప్రళయంగా మారలేదు. తనంతట తాను నశించే వరకూ ఉండేదే ఇచ్ఛా మరణం. 

5.0. ప్రకృతిలో హేతువాదం :-  

          ప్రకృతి అపార, అనంత, అమేయ శక్తి ముందు మనం త్రస రేణువులం. అలా అని న్యూనతా భావంతో క్రుంగిపోవాల్సిన పనిలేదు. ఒకప్పుడీ ప్రకృతిని చూసి ఆశ్చర్యపడి, భయపడిన మన ప్రాచీనులు క్రమంగా ప్రకృతి రహస్యాలను ఒక్కొక్కటిగా కనిపెడుతూ ప్రకృతి శక్తులపై క్రమంగా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. ఏనుగు ఎంతో శక్తికలది. అలాంటి దాన్ని మానవుడు దాన్ని మచ్చిక చేసుకుని ఊడిగం చేయించడం లేదా? విద్యుత్తునూ, గాలినీ, ఉష్ణ శక్తినీ ఇలా ఒకటేమిటి? అన్ని ప్రకృతి శక్తులనూ మానవుడు తెలివిగా లోబరచుకుని సమాజ కల్యాణానికి వాడుకుంటున్నాడు. ప్రకృతి ముందు నేనెంత అని భయపడి, బిడియపడి కూర్చుంటే ఇవన్నీ మానవుడు సాధించగలిగేవాడా? ‘ఏమిటి?’, ‘ఎందుకు?’ అని ప్రశ్నించే తత్త్వమే మానవుడి అభివృద్ధికి మూలం. ఆ హేతుదృష్టి కారణంగానే మానవుడు పలు ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కనుక మానవుడి శక్తి యుక్తులను, అతడి విజయాలను  న్యూనతపరచి ఎవరు మాట్లాడినా అది బాధ్యతారాహిత్యమే అవుతుంది.

          కోత కోసే ముందు చేనును చూసి ఈ పంటంతా నేనేప్పటికి కోస్తాను అని కుంగి పోయి కూలబడతాడా రైతు?. లేదు ఒక పక్కనుంచీ మొదలుపెట్టి ఏకబిగిన కోసుకుంటూ పోతాడు. ఎంత సాధించినా ఇంకా సాధించాల్సింది చాలా ఉంటుందని తెలిసినప్పటికీ ముందే బెంగపడి అసలేమీ చేయకుండా నిష్క్రియాపరత్వంతో ఊరికే కూర్చోవడం లేదు. తాను కనుగొన్న ప్రకృతి రహస్యాలను పలు శాస్త్రాలుగా అభివృద్దిచేసి అందరికీ అందిస్తున్నాడు మానవుడు. దీంతో సమాజమంతటికీ విజ్ఞాన ఫలాలు అందుబాటు లోకి వచ్చి సామాజిక ప్రగతి ఊపందుకుంది. ఇలా విజ్ఞాన ఫలాలు, అభివృద్ధి ఫలితాలు సమాజంలో అందరికీ చేరుతుండడం  సనాతనవాదులకు ఇష్టముండదు.

6.0. ప్రశ్నలతోనే ప్రకృతి సాక్షాత్కరిస్తుంది :-

          సమాజంలో వారు ఎప్పుడూ తాము అగ్రభాగాన కొనసాగే  యథాతథ స్థితినే (Status quo ante) కోరుకుంటారు. అందుకే వారు ఎప్పుడూ మానవుడి శక్తియుక్తులను ప్రకృతి శక్తులతో పోల్చి  కించపరచి మాట్లాడుతుంటారు. మానవుడి విజయాలన్నింటికీ అతడి హేతుదృష్టి, తన సామర్థ్యంపట్ల తనకుగల నమ్మకమే మూల కారణం. మానవుడిలో హేతుదృష్టి పెంపొందడం ఇష్టం లేకనే సనాతనవాదులు మానవుడి విజయాలను ఎప్పుడూ కించపరచి మాట్లాడుతూనే ఉంటారు. కోడలితో అన్ని సేవలూ పొందుతూ కూడా ఆరళ్లు పెట్టే అత్తలా అన్ని అభివృద్ధి ఫలాలనూ అనుభవిస్తూ కూడా ఇది చెయ్యండి చూద్దాం?’, ‘అది చెయ్యడం మీ సైన్సు వల్ల ఏమౌతుంది?’ అంటూ సతాయిస్తూనే ఉంటారు.    ప్రపంచంలోకెల్లా మొదటి వ్యోమగామి సోవియట్ యూనియన్ కి చెందిన యూరీ గగారిన్.  భూమండలాన్ని రాకెట్లో చుట్టివచ్చినప్పుడు, ‘ఈ శాస్త్రజ్ఞులకు చేతనైతే చంద్రమండలం మీదికి రాకెట్ పంపమనండి చూద్దాం’, అని నసుగుతూ సవాళ్లు విసరారు. వాళ్ళ నోళ్ళు అమెరికన్ వ్యోమగాములు నీల్ ఆమ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ లు చంద్రమండలం పై కాలుమోపగానే మూతపడ్డాయి. వైద్యరంగం లో మానవుడు అపార విజయాలను సాధిస్తున్నాడు. గుండె మార్పిడి, కాలేయం, మూత్రపిండాల మార్పిడితో సహా మానవ శరీరంలోని దాదాపు అన్ని అవయవాలనూ మార్చగలిగే స్థితికి చేరుకున్నాడు మానవుడు. అయినా కొందరు ఆధ్యాత్మికవాదులు ఈ అభివృద్ధిని బేఖాతరు చేస్తూ చేతనైతే చనిపోయిన మనిషిని బతికించండి. అది మీ వల్ల కాదు. ఆపని భగవంతుడు ఒక్కడి వల్లే అవుతుందంటారు. ప్రార్థనల ద్వారా, ఉపదేశాల ద్వారా రోగులకు స్వస్థత (Faith Healing) చేస్తున్నామని బడాయిలు పోతూ, దైవ ప్రతినిధులమని చెప్పుకునే మత పెద్దలు తమకు ఏ కాస్త  చిన్న అస్వస్థత వచ్చినా ఆధునిక వైద్యుడి దగ్గరకు పరుగెత్తడం మనకి తెలిసిందే. హేతువాదులు విమర్శించారని బాధ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ విమర్శ లో ఉన్న ప్రశ్నలే ప్రకృతి శాస్త్ర నిరూపణకి ఆయుధాలు.           

7.0. ఆధ్యాత్మిక వాదంలో పకృతి :-     

          ఆధ్యాత్మికవాదులు ప్రకృతిలో ప్రతీదాన్నీ ఆరాధించినా తప్పులేదంటారు. ప్రపంచంలో ఒకప్పుడు అన్నింటినీ పూజించే (Pan-Theism) అలవాటు ఉండేది. ప్రకృతి మన ఉనికికి అవసరమైన సకల వస్తు సంచయాన్నీ అందిస్తుంది. కాబట్టి ప్రకృతి పట్ల కృతజ్ఞతాభావం తో ఉండడంలో తప్పేమీ లేదు. ప్రకృతిని ప్రేమించడం, పరిరక్షించుకొనడం ఎంతో ముదావహం. అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్రకృతి శక్తుల్ని ఆరాధించడంలో ఎంత మేరకు శాస్త్రీయత ఉన్నదో పరిశీలిద్దాం.

          ఇంతక ముందు చెప్పుకున్నట్లే మనకు కావలసిన సమస్తం సమకూరుస్తున్న ప్రకృతిని ఎవరైనా ప్రేమించే తీరాలి. ప్రకృతిని పరిరక్షించుకోక పోతే మనకి మనుగడే లేదని గ్రహించాలి. ఉపయోగితా విలువలున్న వృక్ష జాతులు నశించిపోకుండా కాపాడుకోవడం, మానవ జాతికి ఎంతో మేలు చేసే అటవీ సంపదను పరిరక్షించుకోవడం, మొక్కలు విరివిగా పెంచుతూ, జల, వాయు కాలుష్యాల నియంత్రణకు కృషిచేయడం, జీవ వైవిధ్యం లో అంతర్భాగాలైన వివిధ వృక్ష, జంతు, పక్షి జాతులను కాపాడుకోవడం ద్వారా పర్యావరణ సమతౌల్యాన్ని పరిరక్షించడంలో మన వంతు పాత్ర పోషిస్తూ, మన భవిష్య తరాలవారికి ఈ ప్రకృతిని ఉన్నది ఉన్నట్లు వారసత్వ సంపదగా అందజేయాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరి కర్తవ్యాలు.  

8.0. శక్తివంతమైన ప్రకృతి :-

          ప్రాచీనులు ప్రకృతి శక్తుల్ని చూసి అబ్బురపడ్డారు. భయపడ్డారు కూడా. ఆకలేసిన  ఒక పులి తనకు దొరికిన మనిషిని చంపి తింటుంది. తనకు అపకారం తలపెడతాడని భయపడి ఒక పాము మనిషిని కరుస్తుంది. తాను చంపుతున్నది ఒక పాపినా, పుణ్యాత్ముడినా అనే చైతన్యం పులికిగానీ, పాముకిగానీ ఉండదు. అలా మరణించే వారిలో చెడ్దవారూ, మంచివారూ కూడా ఉంటారు. అయితే ఈ సందర్భాలలో ప్రకృతి శక్తులు చెడ్డవారిని శిక్షిస్తున్నాయని నమ్మారు మన ప్రాచీనులు. కానీ ఈ ఆలోచన తప్పు. నలభై ఐదు  ఏళ్ళ క్రిందట ఒక పాత మిద్దె ఇంట్లో మూడు నెలల పసికందు ఉయ్యాలలోకి పై నుంచి పడిన ఒక తాచుపాము కసిగా ఇరవై సార్లకు పైగా కాట్లు వేసి ఆ పసికందును చంపింది. మరి ఆ పసికందు ఏమైనా పాపం చేసిందా? ఉయ్యాలలోకి పడిన పాముకు మొదట ఏదో ఒత్తిడి తగిలి అది ఆ శిశువును కాటేసి ఉంటుంది. ఆ తరువాత ఇక ఏడుస్తూ బాధతో కొట్టుకుంటున్న శిశువును మరిన్ని సార్లు అది కాటేసి ఉంటుంది. ప్రతి మనిషీ జీవితంలో ఏవో తప్పులు చేయకుండా ఉండడు. ఆ తప్పులకు ప్రతిఫలం గానే ప్రకృతి శక్తులు తమను శిక్షించాయని భావించేవారు.

          ప్రాచీన మానవులు ప్రకృతికి తాము చేసే పాపాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగే అతీంద్రియ శక్తులున్నాయని నమ్మడం మొదలెట్టారు. లేక కర్మఫల దాత అయిన భగవంతుడు తన ప్రతినిధులైన ప్రకృతి శక్తుల చేత దుష్ట సంహారం చేయిస్తున్నాడని నమ్మడం కూడా మొదలెట్టారు. దాంతో తాము సురక్షితంగా ఉండాలంటే ప్రకృతి శక్తుల్ని ఆరాధించాలని వారు భావించారు.

9.0. ప్రకృతిలోని మూఢనమ్మకాలు :-

          ప్రత్యేకించి దండకారణ్యంలోని, నైమిశారణ్యం లోని పుట్టల అడుగు భాగం నుంచి, నదుల అడుగు భాగాల నుంచీ, పద్నాలుగు లోకాలలోనూ అట్టడుగునున్న పాతాళలోకానికి దారులున్నాయనీ, పాతాళం లేక నాగలోకం సర్పాలకు నెలవనీ వారు అశాస్త్రీయమైన అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు. కౌరవులు భీముడికి విషాహారం తినిపించి నదిలో పారేస్తే ఆ నది అడుగు భాగం నుంచి ఉన్న మార్గాల ద్వారా పాతాళం చేరుకున్న భీముడిని నాగరాజు కాపాడి విషదోషాన్ని పోగొట్టి తిరిగి భూమి పైకి సురక్షితంగా చేర్చాడని మహాభారతంలో ఉంది. పాములు పగబట్టడం అనేది ఎట్టి ఆధారాలూ లేని అంధ విశ్వాసమని  శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో నిరూపితమైంది.

          భూగోళానికి అట్టడుగున అంటే భూకేంద్రంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతకు పాములేకాదు అసలు  జీవులేవీ బతకడం సాధ్యం కాదనీ, రాళ్ళూ రప్పలూ కూడా ఆ వేడికి  మండే వాయువుల రూపం లోనే ఉంటాయనీ శాస్త్రజ్ఞులు తేల్చారు.

          మనుషులకూ, పశువులకూ సూక్ష్మక్రిముల కారణంగా సంక్రమించే వ్యాధులు తడపర, ఆటలమ్మ, ప్లేగు, మశూచికము, కలరా మొదలైనవి. ఈ వ్యాధులను భూభారం తగ్గించడానికి భూదేవి చెల్లెళ్ళు మానవజాతిపై క్రోధం పూనిన కారణంగానే వస్తున్నాయని నమ్ముతూ, ఆదిమ మానవులు ఆ వ్యాధిలన్నింటికీ అమ్మవార్ల పేర్లే పెట్టేవారు. ఆ అమ్మవార్ల శాంతి కోసం జంతు బలులు సమర్పించేవారు. ఈ వ్యాధులు పాపిష్టి వాళ్ళను సంహరిస్తాయని వాళ్ళు నమ్మేవారు. ఈనాడు శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఆ అంటు వ్యాధుల నివారణకు వాక్సిన్ లు కనుగొన్నారు.

          టీకాలు వేయించుకున్న ఎంతటి పాపిష్టివాడినైనా ఈ అమ్మవార్లు ఏమీ చెయ్యలేకపోతున్నారు. ఎట్టి వైద్య సదుపాయాలూ లేని మారుమూల గ్రామాలలోని పుణ్యాత్ములు సైతం వ్యాధి నిరోధక టీకాలు వేయించు కోకపోతే ఈ వ్యాధుల పాలవుతున్నారు. శాస్త్ర విజ్ఞాన పురోగతి ఆదిమ మానవుల అంధ విశ్వాసాలను ఎలా పటాపంచలు చేసిందో తెలిపే చక్కటి ఉదాహరణ ఇది. కాబట్టి ఆదిమ మానవులు ప్రకృతి శక్తులపట్ల భయంతో ఏర్పరుచుకున్న అందవిశ్వాసాలివి. ఇది అజ్ఞానం అని శాస్త్రజ్ఞులంటారు.

10.0. మహా భారతంలో ప్రకృతి దర్శనం:-

          ప్రకృతిలో ఉన్న అన్ని జీవ జాతులలోనూ వక్రీభవనాలు(Aberrations) ఉన్నాయి. వీటినే Recalcitrancies of Nature అంటారు. ప్రతి వృక్ష జాతి పూర్తిగా  అదే రంగుపూలో లేదా అదే రకం పూలో పూయక పోవడం కూడా ఉంది. కుంటి పూలు (గుడ్డి పూలు) అని పిలిచే పూలు అన్ని జాతుల వృక్షాలూ పూస్తాయి. మొక్కలు వెర్రి తలలు వేయడమూ ఉంది. కుక్కమూతి పిందెలు కాయడమూ ఉంది. మన దృష్టిలో తప్పుకు అతీతుడైనట్టి (Infallible) భగవంతుడే కనుక వీటన్నింటినీ వెనకాల ఉండి అంతా ఒక క్రమపద్ధతిలో నడుపుతూ ఉంటే ఇటువంటి వక్రీభవనాలు ఉండనే కూడదు కదా. ఒక్క శాతం కూడా అతడు తప్పు చేయకూడదు కదా. అలా తప్పు చేయని వాడే ధర్మరాజు. ఇతడే స్వర్గానికి వెళ్లగలిగిన శక్తి యుక్తి సంపన్నుడు. ఇదే మహాభారతంలో ప్రకృతిమయంగా చూడదగ్గ అంశం. 

          మహా భారత కాలంలోని ప్రకృతి పచ్చదనాన్ని, పంట పొలాలను చూసి ఆనందించేవారు. పారిజాత వృక్షం కుంతీ మాత చితా భస్మం నుంచి పుట్టిందని ఒక కథ. స్వర్గం నుంచి భూలోకానికి అర్జునుడు తెచ్చాడని కుంతీ దేవి ప్రతి రోజూ దానికి అలంకరించి అర్చనాలు చేసేదని చెప్తారు. ఏది ఏమైనా పారిజాతం మహాభారత కాలం నాటికి విలువైన మొక్కగా చూడవచ్చు.

          మొత్తం మీద మహా భారతం ప్రకృతి పురుష సంయోగం. అణ్వాయుధాలతో అల్లకల్లోలం చేయడం కాదు, ప్రకృతిని పరిపూర్ణంగా ఉంచడం. అదే శాస్త్రవేత్తలు, సాంకేతిక విద్యావేత్తలు ప్రతి మనిషి చేయాల్సిన ధర్మం. అప్పుడే జీవితాలు భద్రం. లేదంటే ఛిద్రం.   

ఆధారాలు:-

1.      వికీపీడియా

2.      శ్రీ మదాంధ్ర మహా భారతం – తిరుమల తిరుపతి దేవస్థానం

3.      శబ్దరత్నాకరం – బహుజన పల్లి సీతారామయ్య

4.      శ్రీమద్రాయణం- వాల్మీకి

(రోషన్ పబ్లికేషన్స్, విశాఖ పట్నం: డిసెంబర్ 2019: Nature and  Environmental conservation  in Ancient and Modern Indian Literature లో, వారి email: roshanpublications@gmail.com: ముద్రణ. పుటలు: 164-166, ISBN:978-81-942990-9-7)

No comments: