Wednesday, May 31, 2023

“రంధి”మార్పుకు, నేర్పుకు నాంది

 

-డా.జాడ సీతాపతి రావు, తెలుగు శాఖాధ్యక్షులు,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతికవిశ్వవిద్యాలయం,

నూజివీడు, కృష్ణాజిల్లా, ఆం.ప్ర.

సంచారవాణి: 9951171299.

seethuphd@gmail.com

1.0. మార్పు – అవసరం:-

భయం మనిషి భవిష్యత్తుని శాసిస్తుంది. మార్పు అభివృద్ధిని ఆకాంక్షిస్తుంది. భయం కూడా ఒక్కోసారి సాధనంగా మారి మార్పుకు కారణం కావచ్చు. ఎలాగైనా మార్పు రాకపోతే, ఎప్పటికీ అభివృద్ధికి ఆస్కారం ఉండదు. అభివృద్ధి వ్యక్తిగతమా, వ్యవస్థాగతమా అనే ప్రశ్న తర్వాత వరసలో ఉంటుంది. వ్యక్తిగతాభివృద్ధే తర్వాత వ్యవస్థాగత వృద్ధి. ఆదిమానవ కాలం నుంచి ఎన్నో వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. ఒక్కో వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఒక్కో పేరుతో స్థిరపడ్డాయి. అలా ఏర్పడినదే చాతుర్వర్ణ్య వ్యవస్థ. అభివృద్ధి చెందినవాళ్ళు క్షత్రియులుగా, బ్రాహ్మణులుగా, వైశ్యులుగా ఉంటే, అభివృద్ధిని కాంక్షించే వ్యవస్థగా శూద్రులు మిగిలారు. వారే తర్వాత కాలంలో పేరు మార్చుకొని దళితులయ్యారు.

పేరులో మార్పు వచ్చింది కానీ, వ్యవస్థలో మొదలుకాలేదు. ఆ మార్పు రావాలంటే చైనా నుండో అమెరికా నుండో రాదు. మనలోనే మొదలవ్వాలి. జాతి మొత్తం చైతన్యం పొందాలి. అలా చైతన్య పరచడానికి గుర్రం జాషువా పూనుకున్నారు. ఆవేదన చెందారు, ఆక్రోశించారు. ఇప్పుడు కొలకలూరి ఇనాక్ గారు ఆ వారససత్వం. దళిత వర్గంలో చైతన్యం కోసం చాలా రచనలు చేసారు. ఒక్కో రచనది ఒక్కో మెట్టు. ఆ ప్రస్థానంలోనే రంధి నవల కొన్ని కొత్త సూచనల్ని, అభివృద్ధి మార్గాల్ని సూచిస్తుంది. జగమెరిగిన జంధ్యాన్ని పరిచయం చేయడం అనవసరం. రంధి నవలాకర్త, కొలకలూరి ఇనాక్ బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి సూచనల్ని, మార్గాల్ని అన్వేషిద్దాం.

2.0. దళిత స్వభావం – మనస్తత్వం:-

            సాధారణంగా ఏదైనా నవలలో పాత్రల మనస్తత్త్వాలు కనిపిస్తాయి. కానీ రంధిలో వ్యవస్థ మనస్తత్వం ప్రతిబింబం. అదే ఇనాక్ గారి కలం గొప్పదనం.  వివిధ సందర్భాలలో దళితులూ ఎలా ఉంటారో సూటిగా చెప్తూ, సంస్కృతి పరిచయం అంతర్వాహిని. అందరికీ అంటరాని వాళ్ళ౦టే అలుసు. అంటరాని మాల మాదిగలకు, మిగతా ఏభై ఏడు మాల మాదిగ ఆశ్రిత కులాలు అలుసు. మాలలకు మాదిగలు అలుసు. మాదిగలకు జీతగాళ్ళు అలుసు. అసలు లోకంలో ఎవరో ఒకరు తమకంటే తక్కువ వాళ్ళు ఉండటం జనానికి ఆనందం. ఎక్కువ వాళ్ళు ఉండటం కోపం. భారతదేశంలో ఒకరికి ఒకరు లోకువుగా, అలుసుగా, తక్కువుగా చూచే పరిస్థితికి పరాకాష్ఠగా సంస్కృతి, నాగరికత విలసిల్లుతున్నాయి. ఈ సంస్కృతిలో కొందరు అందలాలెక్కితే, నేల మీద పడిపోయిన తరగతి ఒకటి ఉంది. ఆ తరగతి వారసులే దళితులు.

            మాదిగలు ఇద్దరి మనుషుల మధ్య ఏ సంబంధం లేకుండా స్నేహంగా ఉండటం సాధ్యమని తెలిసినా, మనుషుల మధ్య బంధుత్వాలు కోరే స్వభావం, దూరీకృత మానవ సమాజానికి చేరువ కావాలన్న కాంక్షతో అందరితోను స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. దూరమవుతున్న మనుషుల్ని దగ్గర చేసుకోవాలని  ఉబలాట వీరి రచనకు రహదారి. వీరికి మనుషులందరూ బంధువులే. కానీ, కొందరిని దూరం చేసుకోవడం కొందరి అవసరం. దూరం కాకుండా ఉండటం ఇంకొందరికి ఇష్టం. ఈ దగ్గర దూరం మధ్య సంఘర్షణ వల్ల మాదిగలు ఊరుకి దూరంగా పల్లెలో జీవనం సాగిస్తున్నారు.

            “మీతో నాకేం పనిరా గాడిద కొడకల్లారా” అని మాదిగల్ని ఊరి వాళ్ళు దూరంగా ఉంచినా, దొరగారు, దొరసానిగారు అని పిలుస్తూ, బంధువుల్ని, మిత్రుల్ని, ఆత్మీయుల్ని, దేవుళ్ళను చూసినట్లు జీవిస్తుంటారు. మాదిగల ప్రేమ, అంటుకోని ఊరిని కూడా సపర్యలు చేస్తుంది. అన్ని అవసరాలు తీరుస్తుంది. నిష్కామ కర్మం వీరి వ్యక్తిత్వం.

            సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను ఒకడికి చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదుగుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతంలోని కవిత్వపు మాటలు మాదిగ కులస్థుల విషయంలో అన్వయించవచ్చు. మాదిగలు సాధారణంగా ఎవరి కాళ్ళు పట్టుకోరు. పేదరికం రానీ, ఆకలి చంపనీ, అవస్థలు ఏమైనా ఎవరి కాళ్ళు పట్టుకోరు. కృతజ్ఞతతోనే, దీవించమనో కూడా ఎవరి కాళ్ళు పట్టుకోరు. మాదిగ సంస్కృతిలో పాద పూజ లేదు. కానీ పాదాలు దగ్గర పడుంటారు. చెప్పులు కుట్టడం కూడా వృత్తిగా చేస్తారు. అది వాళ్ళు సేవగా భావించడం కొసమెరుపు. అందుకే జాషువా అప్పువడ్డది సుమీ వీరి సేవకున్ అని వీరి సేవను గుర్తించమని, హీనంగా చూడొద్దని, ఇంకోరకంగా హెచ్చరిక చేస్తాడు.

            రాజ్యాంగంలో ఆర్టికల్‌ 17 ప్రకారం అంటరానితనం నిషేధం. దీనికి అనుగుణంగా పార్లమెంట్‌ 1995లో అంటరానితనం నిషేధ చట్టం రూపొందించింది. ఈ చట్టాన్ని 1976లో పౌరహక్కుల చట్టంగా మార్చారు. అంటరానితనం అమానుషం అన్నారు. శిక్షలు, జరిమానాలున్నాయ్. వాస్తవాలు మాత్రం నామమాత్రం.

ఊరివాళ్లు ప్రేమించకపోయినా, పల్లెవాళ్ళు, ఊరివాళ్ళను ప్రేమిస్తూనే ఉంటారు. ఈ ప్రేమలోనే తమ ఆత్మానందం, ఆత్మానుబంధం, ఆత్మానురాగాన్ని చూపే నిస్వార్థ యోగులు మాదిగలు. ఈ భావన వల్ల మాదిగలు ఏమన్నా, తిట్టినా, కొట్టినా, చంపినా పడి ఉంటారులే అనే దృష్టి కొందరికి, కొన్ని సందర్భాల్లో ఊరుల్లో ఉంటుంది. కానీ, వాస్తవానికి ప్రేమలేకపోతే శాంతిలేదు. సుఖంలేదు. సహజీవనం లేదు. పల్లె లేదు. ఊరు లేదు. మనుషుల్లేరు.  

3.0. అవసరాల్లో అంటరానితనం :-

            ఊరుకి పల్లె దూరం. కానీ పల్లె మనుషులు కాదు. ఇల్లు తుడవడం నుండి మరుగు దొడ్లు కడగడం వరకు అన్నీ దళితులే.  ప్రతి పనికి వీళ్ళే ఆసరా. కానీ అవసరాల్లో లేని  అంటరానితనం, మనుష్యుల్ని చూసేప్పుడే వస్తుంది? మనిషిగా కూడా చూడనివాళ్లు మనీషిగా చూస్తారా? అలా చూడాలంటే ఇనాక్ జీవితాన్ని, అతని పాండిత్యాన్ని చూడాలి. విద్య అంతంత్య అవసరం అని చెప్పడానికి ఇనాక్ గారి చదువే నిరూపణం. ఈ నవలలో రచయిత అందంగా అంటరానితనాన్ని అవసరంగా తీర్చిదిద్దారు.

            “ఎడ్ల బండి బురదలో కూరుకుపోయింది. బండి నిండా మినుముల బస్తాలున్నాయి. రెండు చక్రాలు, కదిపితే ఇంకా బురదలోకి కూరుకుపోతున్నాయి. రైతు ఎడ్లను బిడ్డల్లా చూసుకోకుండా మూర్ఖంగా కొట్టాడు. అవి కూలబడ్డాయి. ....  అప్పుడు భేష్ అన్నాడు నాంచారయ్య” (పుట.91)

            బురదలో కూరుకుపోయిన ఎడ్లను బయటకి తీయడానికి రైతు చందిరి చేతులు పట్టుకున్నాడు. అప్పుడు అతనికి అవసరం తప్ప, అంటరానితనం గుర్తు రాలేదు. మగాడిలా ఎడ్లను బయటికి తీసిన చందిరిని చూసి భేష్ అని సంక్రాంతికి పట్టు బట్టలు ఇచ్చిన నాంచారయ్యకు కూడా అది మర్చిపోయాడు. ఎవరితోనైనా చేతులు కలిపే సామర్థ్యం ఒక్క అవసరానికే ఉంది. అవసరాలు అగ్రకులాలవి. తీర్చేది మాత్రం నిమ్నకులాల వారే, అంటరాని వారే. ఆ హక్కు, శక్తి వాళ్ళకే ఉంది. రెండు విభిన్న ఆర్ధిక, సామాజిక తత్త్వాల మధ్య ఓర్పుతో ఉన్నా అంతర్యుద్ధం.

            నాంచారయ్య కొడుకు రాముడు చనిపోతే నా కులం అన్నవాళ్లు ఎవరూ శవాన్ని మోయడానికి రాలేదు.

“నాంచారయ్య దిగులు తగ్గింది. ఎవరో నులక మంచం తెచ్చారు. దుప్పటి పరిచారు. రాముడి శవాన్ని పండుకో పెట్టారు...  ఆ నలుగురూ మాదిగలే! కూలీలే”. నా కులం, నా మతం అని విర్రవీగిన నాంచారయ్య లాంటి వారికి ఈ సందర్భం చెంపపెట్టు. కొడుకు చనిపోతే శవాన్ని శ్మశానానికి తీసుకు వెళ్ళడానికి ఒక్కరూ రాలేదు. ఆ నలుగురు కూడా మిగలలేదు. అందుకే నలుగురు సంపాదించుకోమని చెప్తారు. నా కొరకు చెమ్మగిల్లు నయనమ్ముఉండాలని ప్రతి మనిషీ కోరుకున్నట్టే, సానుభూతి ఆశిస్తాడు. దేవులపల్లిని గుర్తుచేస్తారు. లేదంటే ఇదిగో ఇక్కడ నాంచారయ్యలా అంటరాని వాళ్ళ పైనే ఆధారపడాలి. అప్పుడు అంటరానివాళ్ళు, మా కులం వాళ్ళు కాదు అని మారాం చేస్తే ఏం ఒరగదు. కులప్రాతిపదికన ఓ వర్గం ఎదుర్కొన్న రకరకాల అక్రోశాల, బాధల, అన్యాయాల, తిరుగుబాటు వివరణల్ని చిత్రీకరించిన నవల అంటరాని వసంతం. దీన్ని జి. కళ్యాణరావు రాశారు.

            రూతు జ్ఞాపకంగా, రూబేను జీవితంగా ఆరంభమైన నవల, అంటరాని వసంతం. తరతరాల్ని తడుముతుంది. దాదాపు ఎనిమిది తరాల్లోని జీవితానికి జీవిక అంటరాని వసంతం. ఎందరెందరి జీవిత అవసరాలకో నిత్యం ఆరాటపడే నిమ్న వర్గాలవారికి, కళ పట్ల ఆసక్తి, అభినివేశం ఉండడమే అబ్బురం. అటువంటిది దానికోసం ప్రాణాలనైనా లెక్కచేయకపోవడం మరీ అద్భుతమంటారు ఈ కథాంశాన్ని విశ్లేషిస్తూ నవలా హృదయంలో వి. రాజారామమోహనరావు. అంటరాని వసంతంలో ప్రధానంగా ఈ అంశం కదులుతూ వారి జీవన నేపథ్యం ఆవిష్కరించింది. ఏడెనిమిది తరాల కథను చెప్పినా, వారి జీవితంతో పాటు ఈ అంశాన్ని జమిలిగా ముడిపెట్టారు. పేర్లు వేరైనా వ్యవస్థలోని అవస్థల సారం ఒకటే, అణగదొక్కడం. అంటరాని వసంతం మలకులస్థులదైతే, ఇది దళితుల జీవికా సమయం.

            ప్రతి పనికి అంటరాని వాళ్ళు అవసరం అయినపుడు, ఊర్లో ఉండటానికి వీళ్ళు ఎందుకు అర్హులు కారని రచయిత తన సున్నిత ప్రశ్న ఈ నవల ద్వారా సంధించాడు. ఆ ప్రశ్నకు సమాధానమే చైతన్యంగా మారుతుంది. అదే అభివృద్ధికి బాటలు పరుస్తుంది.    

4.0. 'రంధి' మాటల ప్రదర్శనల బండి :- మాటల స్రష్ట. అక్షరాల ద్రష్ట. ఈ విశేషణాలకు పేరే ఇనాక్. ఆయన చిన్న చిన్న వాక్యాల్లో అద్భుత సందేశాల్ని సంధించారు. చిన్న వాక్యమే రచనకు అందం. అదే ఆభరణమూ. వాటికి మూల స్థానం ఇనాక్ గారి కలం. ఒకే విషయం చెప్పడానికి చాలా అర్థవంతమైన పదాలు వాడతారు. ఆ పదాలు కూడా మొదట అక్షర ఒకటే అయి ఉండటం ఇంకో విశేషం. అలాంటి అక్షరాల పూలతోట రంధిలో విరబూసింది. నిజానికి రంది తెలుగు పదం. కాని కావాలనే రచయిత రంధి అన్న సంస్కృత పదాన్ని శీర్షికగా పెట్టారు. దీనివల్ల ఆగ్రహాన్ని చెప్పడం ఒక ఎత్తు. ఇనాక్ పాండిత్యం మరో ఎత్తు. ధి అనేది అతి ప్రాచీనమైన రతి ప్రక్రియ ప్రతీక అని చెప్పడం వీరి పరిశోధన.

లలనా! యుడుగుము నీ యే / డ్పుల కొలఁదియె కురునృపాల పుత్త్ర కళత్రం

బుల యేడ్పు; లింక వానిం / గలకల నవ్వుచు వినంగఁ గాలం బయ్యెన్‌.(ఉద్యోగ. 3121)

            దుష్టచతుష్టయం కలకల నవ్వుతూ పాండవుల్ని అవహేళన చేసిన దృశ్యాన్ని మరపించేటట్లు ఈ పద్యం నిర్వహించారు. కౌరవుల కళత్రాలు బావురుమని ఏడుస్తుంటే ఆ శోకనాదానికి ప్రతీక ద్రౌపది నవ్వుతూ కసితీర్చుకోనే ఒక భావచిత్రాన్ని కళ్ళముందు రూపుకట్టించి కమనీయ పద్యం శిల్పవిష్కారం చేశాడు. గాంగేయుడు కలకల నవ్వడంతో ముగిసినట్లు చిత్రించడం కావ్యకళాశిల్పం. కర్ణుడు పాండవ సేనాసాగరాన్ని తన పరాక్రమ ప్రతాపంతో ఐదు రోజుల్లో ఇంకింప జేస్తానని శపథం చేసినపుడు భీష్ముడు కలకల నవ్వాడు. 'వట్టి మాటలు పలకటం కాదు గాండీవ గుణధ్వనికి ఎదురు నిల్చి పరాక్రమాన్ని ప్రదర్శించు' అని అపహస్య౦ చేశాడు. అంటే భీష్ముడి నవ్వు భావికతార్థ సూచన. పాండవ విజయ సంకేతం. ఇలా రంధి నవలలో భీష్ముడి పాత్రను పోషిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇనాక్ రచనా సౌష్టవం నాటి తిక్కను మరపిస్తుంది. ఒక ద్రౌపదికి జరిగిన అవమానం ఇక్కడ జాతికి జరుగుతుంటే ఎంతకాలం చూస్తూ ఉంటారు అనే ప్రశ్న హృదయాల్ని పురుగులా దొలిచేస్తూ ఉంటుంది. ఒకసారి వాటిని చూసి తరించే ప్రయత్నం చేద్దాం.             

4.1. “కోర్కె తీరక పోతే గొడవే! సమస్యే! తలనొప్పే! అస్తవ్యస్తమే! అయోమయమే! ప్రమాదమే” (పుట. 15).

ఒక మనిషికి కోర్కె తీరక పోతే సంభవించే పరిణామాలు వరుసను పదాల్లా పరిచి చూపించారు. ఇదొక్కటే కాదు ఇలాంటివి చాలానే ఉన్నాయి. అవన్నీ ఒక దగ్గర పెట్టి చూద్దాం. 

4.2. “రాముడుకి ఎందుకు ఇంత తీపరం, తీ౦డ్రం, తిక్క, తిమ్మిరి?”(పుట. 57)(తీపరం= ఆగడం; తీండ్ర= ప్రకాశం, చురుకు; తిక్క= ఉన్మాదం; తిమ్మిరి=స్పర్శ తెలియని వ్యాధి విశేషం.)

4.3. “బూదికి ఒక పక్క సంతోషం, మరో పక్క సందేశం ఉక్కిరి బిక్కిరి చేసాయి”(పుట. 59)

4.4. “అంతుపట్టనిది, గుర్తుకు రానిది రాముడి పీడ, క్రీనీడ”(పుట. 69)(క్రీనీడ= పరిహసించే నీడ)

4.5. ఈ ఊర్లో ఉంటే ఇబ్బందే! ఏ ఊరయినా ఇబ్బందే(పుట. 69)

4.6. “వాస్తవానికి ప్రేమలేకపోతే శాంతిలేదు. సుఖంలేదు. సహజీవనం లేదు. పల్లె లేదు. ఊరు లేదు. మనుషుల్లేరు” (పుట. 77)

4.7. “భైరాగి అప్రకటిత ఆశ, అవకాశం, అండ”(–పుట. 78)

4.8. “ప్రేమలో అర్పణ, అర్పణలో ఆనందం, ఆనందంలో సేవ, సేవలో సంతృప్తి, మనిషి పొందిన అద్భుత అదృష్టాలు.”(పుట. 80)

4.9. “ఏడ్పు శాశ్వతం. ఏడ్పు నిరంతరం. ఏడ్పు మాదిగల జన్మ హక్కు”(–పుట. 112)

4.10. “భైరాగివి తక్కువ మాటలు. ఎక్కువ చేతలు. చందిరివి శూన్య వాక్కులు. సంపూర్ణ చేష్టలు”(–పుట. 120)

4.11. “పెదాలను పళ్ళు అదిమి పెడితే, కోపాన్ని గుండెలు దాచిపెడితే, తలవంచుకొని, నిలువునా, నిటారుగా, నిట్రాడిలా నిలబడింది సువ్వి”(–పుట. 184)

4.12. “కవి మాటల మూట. మౌని నిశ్శబ్దపు ఊట. శబ్దం, నిశ్శబ్దం మధ్య భూగోళం తిరుగుతుంది. విశ్వరహస్యం దాగి ఉంది”–(పుట. 229)

4.13. “రైలు బండి ఆగదు. అది కాలం. రాముడు లేవడు. అది నిర్ణయం. ప్రశాంతత అరవదు. అది నియమం” (పుట. 248)

4.14. “మామూలు శవం కాదు. మాయ శవం. బతుకు మాయ మాయని శవం. ఇదే భూతం. ఇదే ప్రేతం. ఇదే పిశాచం”( పుట. 267)

            ఇలాంటి పదాల కూర్పు ఇనాక్ గారికే సొంతం. అల్పాక్షర మసందిగ్ధం సారవ ద్విశ్వతోముఖమ్, అస్తోభ మనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః. తక్కువ అక్షరాలతో; అసందిగ్ధ అర్థంతో; సారవంతమైన వాక్యాన్ని వాడడం సూత్ర లక్షణమైనా, ఈ నవలలో ఇనాక్ గారి పాండిత్యఝరీ లక్షణం. నవలలో ప్రతి పేజీలో ఇలాంటి పదాలకు అలవాలమే.

5. పదబంధాల అనుబంధాలు:- వికసించిన పూరేకుల సౌరభాన్ని గంథవహుడు విస్తరింపజేసినట్టుగా, భావానికి అనుకూలమైన పలుకులుఏరుకోటం, ఆ పలుకులను ఒకదానితో ఒకటి చేర్చటంలాంటి నేర్పుకలిగిన కవి ఉండాలి. పలుకులపొందులేకుండా రసభంగంచేస్తూ, పాతబడ్డమాటలైనా తననేర్పుతో మనస్సు అలరింపచేసేవాడు’, ఎవరూ తొక్కని మార్గమే తన మార్గమని చెప్పకుండా సున్నితంగా సాగే పదబంధాల్ని అనుబంధాలకు ముడి వేసి చెప్పడం ఇనాక్ స్వంతం. అర్థానికి సరిపడే మాటలనే ఏరుకోవాలి. అనవసరపు మాటల్ని పులిమి పుచ్చకూడదు. తెలుగు విశేషణాలు సంస్కృత శబ్దాల కంటే భిన్నమైన మాండలిక పదాలు మణిహారాలుగా అమరాయి. వీలైనంతవరకు సంస్కృత విశేషణాలు పరిహరించటంఇనాక్ ఉద్దేశం. ఇది వీరికి మాటలమీద తూటాల్ని నిలబెట్టగల గంభీరత.

            పరిణితి ఉన్న కవి సరసులైనవాళ్ళు మెచ్చుకొంటేనేగాని తన కవిత్వం గొప్పదని భావించడు. ‘జాత్యము గాని సంస్కృతం కేవలం అందంగా ఉంటుందని వాడను (ఇక్కడ జాత్యం అంటే సందర్భశుద్ధి గలిగి ఉండటం), శ్రుత్యానురూపంగా ఉందని వేరువేరు అక్షరాలకు ప్రాస వేస్తాడు. అలతి అలతితునకలతో కాహళ సంధించినట్టు లలిత పదాలతో, హృద్యపద్యాలతో కథ ఘటిత పూర్వాపరమై ఉండేట్టు అమరుస్తాను’(నిర్వచనోత్తర రామాయణం). అన్న తిక్కన భావన ‘రంధి’ నవలకి అన్వయించవచ్చు.

5.1. ఎవుడు ఎవుడికాడయినా ఊడిగం జెట్టాడు, కూడు పెడితే, గుడ్డిత్తే, గూడిత్తే, కోటి మాట ఘాటుగా ఉంది(పుట 86) ఇక్కడ గుడ్డిత్తే, గూడిత్తే లాంటి బంధాలు అనుబంధాల్ని అవసరాల్ని సూచిస్తున్నాయి.

5.2. ఛీ, నీ బతుకుమండ! మొగుడితో కాపరం సేసిన ఆడదాన్ని సెరిసెమీ, సెరవకేమి? అని తుస్కారించి మాట్లాడాడు కానీ, రాముడి గుండెల్లో మంట రేగింది(పుట 96). ఇక్కడ ఛీత్కారంతో కూడిన తిరస్కార బంధాలు.

6. పదచిత్రాల వచనాఝరి:- “పైన చంద్రుడు/ మబ్బుతునక వేలు పట్టుకుని

    నడిపించుకుని పోతున్నాడు/ కింద నా జీవిక నిశ్శబ్దంగా కురిసే వెన్నెట్లో

    నిశ్చలంగా తడిసే అడవిలా నుల్చోనుంది” అన్న శేషేంద్ర శర్మ కవిత్వం చూస్తే అప్పటి దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్తారు. మబ్బుతునక వేలు పట్టుకుని సాగిపోయే జాబిలి, అది కురిపించే వెన్నెలా ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే,అలాంటి ప్రకృతి రమణీయకతకి దూరమైన మన జీవితాలు ఎలా అడవికాచిన వెన్నెలై పోతున్నాయో మనకి స్పష్టంగా అనుభవానికి వస్తుంది.

“దిక్కుల చివర లేత నీలిరంగు ఆకసపు వెలుగులో/బద్ధకంతో నెమ్మదిగా వెనక్కి మరలుతున్న

కెరటాల అంచున/ఓడల నీడలు తేలియాడుతున్నాయి”.కార్ల్ సాండ్బర్గ్ అనే అమెరికన్ కవి పదచిత్రానికి స్వేచ్ఛానువాదం. ఇందులో ఓడలు వెళ్ళడం వాస్తవం. మిగతా అంతా కవిభావనాశక్తి.

            ఇలాంటి భావనే శక్తినే వాస్తవిక కోణం నుంచి చూడడం, చూపించడం, భావనా పరంపరకు భాషే వాహిక.   పుట ఐదులో ఇనాక్ చూపిస్తారు. “వెళ్ళేముందు, వెళుతున్నానని అప్పగింతలు చెప్పినట్లు కుయ్ కుయ్యీ మని, రైల్వేస్టేషన్ ఫ్లాటుఫారానికి చెప్పి, బెంచీలకి, చెట్టు చేమలకు, ఫెన్సింగుకు అడ్డమొచ్చే గొడ్డుకు, గొడ్డుదోలే గొడ్డకాడ బుడ్డోళ్ళకు అరచి చెప్పి, గుంటూరు తోవబట్టింది పాలబండి అనబడే రైలుబండి” ఇందులో రైలు మన ఎదురుగుండా వెళ్తున్నట్లు, అక్కడే మిగిలిన బెంచీలు, చెట్లు, గొడ్లు మొదలైనవి కళ్ళముందు కదులుతూ ఉంటాయ్. ఇది వచనకవిత్వంలో ఉన్న మచ్చుకు చెప్పిన ఒక పద చిత్రం. ఇలాంటివి అడుగు అడుగునా పాఠకుణ్ణి నిలిపేస్తాయ్. ఆలోచింపజేస్తాయ్. ఆవేశింప జేస్తాయ్. మానవజీతాలల్లో మలినమైన దుర్మార్గపు జాడ్యాన్ని జాడించేలా చేస్తాయ్.

7.0. దళితుల్లో ఐకమత్యం:- ఐకమత్యమే మహా బలం. దాన్ని రుజువు చేసిందే రంధి నవల. తన సందేశాన్ని పంపించడానికి ఇనాక్  కుక్కలను, పందులను ప్రతీకలుగా వాడారు. నవలా ప్రారంభంలో...

“కుక్కలు తమిరితే పందులు పారిపోతాయి. దొరలు తిడితే, కొడితే, చంపితే మాదిగలు పడతారు. భరిస్తారు. గతిస్తారు.పది కుక్కలు వెంట పడితే ఒక పంది చచ్చిపోతుంది. పది మంది వేటాడితే ఒక మనిషి చచ్చి ఊరుకుంటాడు. చచ్చిన పందిని, ఊర కుక్కలు, పల్లె కుక్కలు, బలాదూరు కుక్కలు పీక్కు తింటాయి. చచ్చిన మనిషిని ఎవరూ తినరు. పందులు కుక్కను చంపగలవా? చంపలేవు. పది పందులు ఒక కుక్కను తరమ గలవు. పది మంది మాదిగలు ఏకమై ఊరి వాళ్ళ నుంచి న్యాయం పొందగలరా? పొందవచ్చు. కానీ మాదిగలు ఏకం కావటం ఎప్పటి మాట” (పుట. 14.) అంటూ మాదిగల్లో ఐకమత్యం ఎప్పుడు వస్తుందో అని ఆలోచనలో పడ్డారు. కానీ చరిత్రలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.

7.1. 16వ శతాబ్దంలో విజయప్పారావు బిరుదున్న అప్పన్న గొల్లపల్లి దుర్గం నుంచి వేటకై బయలుదేరి పోతుండగా ఒకచోట నూవు చేలల్లో ఒక మేక తోడేల్ని ఎదిరించుట చూచి ఆశ్చర్యపడి, బంధువులను పిలిపించి, ఆ చేలలోనే సమావేశం ఏర్పరచి, ఆ ప్రదేశం శౌర్యనిలయంగా గుర్తించాడు. అక్కడ 50 ఎకరాల స్థలంలో నూజివీడు కోటను నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాడు. నువ్వుచేల ప్రదేశం అప్పుడు దానిని నూజేలవీడుగా నామకరణం చేశారు. కాలక్రమేణా నూజివీడుగా ప్రసిద్ధి. నూజివీడు మూడు శతాబ్దాల పాటు రాజధాని. సంస్థానం స్థాపించడానికి కారణమైన శౌర్యంగల మేక కాబట్టి ఈ రాజులకు 'మేకా' ఇంటిపేరు వాడుకలోకి వచ్చి౦ది.

ఈ రకంగా చూస్తే భవిష్యత్తుచూసే ద్రష్టగా ఇనాక్ కనిపిస్తారు. కలిసి ఉంటే వచ్చే లాభాల్ని చిన్న సన్నివేశం ద్వారా అద్భుతంగా చిత్రీకరించారు. తమ కుల అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి మాదిగ పెద్దలందరూ ఒకటయ్యేలా చేస్తాడు. వాళ్ళ ఐకమత్యం చూసి, “మీరంతా కలిసి ఒక్కమాట మీదకు వచ్చే ఐకమత్యం మీకు ఎట్టా వచ్చింది రా? ఆశ్చర్యంగా ఉందే! ఆడటు లాగితే, ఈడిటు లాగితే, మధ్యలో తాడు తెగాలి గానీ గట్టిగా ఒక్కటిగా ఉందంటే అద్భుతమేరా! పంచాయితీలో పెడతారంటారుగా, పెట్టండి, నేయం జరిగేట్టు సూస్తా’ అంటూ కరణం చమత్కారంగా భరోసా ఇచ్చాడు.”(పుట. 153). కానీ చమత్కారంలో నిగూఢ భయం రచయిత సూచన.

“కాదురా కాలం మారింది. మనుషులు మారారు. ఆళ్లిప్పుడు మునుపటి బానిసలు కారు. తిరగ బడుతున్నారు.” (పుట. 131) అందరూ కలిసి ఒకే మాటపై ఉంటే దాని వల్ల కలిగే లాభాల్ని చెప్తూ, రాముడు స్నేహితుడి పాత్ర ద్వారా అగ్ర కులాల అభిప్రాయాన్ని ఈ సన్నివేశం ద్వారా చూపించాడు. ఇక్కడ రాముడు పాత్ర మార్పుకు ప్రతీక. నిజానికి మార్పు కేవలం సువ్విని ప్రేమించడం వరకే. కానీ పరిస్థితులు తద్భిన్నం. చంద్రి సువ్విని పెళ్లిచేసుకోవడం కొస మెరుపు. న్యాయం కోసం ఆరాటం. పెద్దమనుషుల దురాగతాలుఎన్నో...

8. 0. తిరగబాటు జెండా ఎజెండాగా:- బైరాగి మరో సహాయపాత్ర. చిట్కాద్వారా విజయాన్ని సాధించడం మరో మలుపు. రాముడు రైలు కింద పడి చనిపోవడం పరాకాష్ట. దళితులు వచ్చి సహాయం చేయడం పతాక స్థాయి. నాంచారయ్య మార్పుకు మంగళగీతం.

8.1.“రైలు బండి వచ్చింది. పంది గమనించింది. తప్పుకోవటానికి ప్రయత్నించింది. ఒక్కపక్కకు దూకింది... తెలివి ఏ జాతి సొత్తు కాదు. ఐకమత్యం కుక్కల హక్కే కాదు. పందులూ, ఒంటరిగానే కాదు. ఐకమత్యంతోనూ ఆత్మరక్షణ చేసుకోగలవు. అవసరమైతే ఆత్మహానీ  చేయగలవు.”(పుట. 297).

            నవలలో మాదిగలకు ప్రతీక పందులు. అగ్రకులాలకు చిహ్నం కుక్క. మొదట్లో పందులు కుక్కలపై తిరగబడేది ఎప్పుడులే. అది అసలు జరిగే పనా! అని నిట్టురుస్తాడు రచయిత. కానీ నవల ముగింపులో ఒంటరిగా తిరగబడలేక పోవచ్చు, కానీ పది మంది కలిస్తే సాధ్యమౌతుందని ప్రతీకలు ద్వారా చూపిస్తాడు. అదే అభ్యుదయ చైతన్యం. రచయిత దళితుల్లో కోరుకున్నది కూడా ఈ చైతన్యమే. కోతులు గుంపు ఒక వ్యక్తిని తరుముతుంటే అతడు భయపడుతూ పరుగెత్తు తున్నాడు. కోతులు రెచ్చిపోయి తరుముతున్నాయ్. నిస్సహాయ స్థితికి వచ్చేముందు శక్తిని అంతా కూడగట్టుకొని, ఆగి, శక్తిని కూడగట్టుకొని ధైర్యంగా  ఒక్కసారి గట్టిగా అరిచాడు.  ప్రతి కోతికి ఒక్కో మనిషిలా కనిపించాడు. కోతులు తోకముడిచాయ్. మనిషి సేఫ్. భయ పడింది చాలు. ధైర్యం నీ ఆయుధం కావాలనే బోధ ధ్వనిస్తూనే ఉంటుంది.

9. 0. ఊరబావి = రంధి ==> దళిత చైతన్యం:- లింగం, కులం, వర్ణం అనే మూడు దళిత స్త్రీలకి అవమాన ఆభరణాలు. వాటిని ప్రతి ఘటించిన వైనం ‘ఊరబావి’ కథ. కథాంశం దళితుల నీటి సమస్య. ఈ సమస్య పరిష్కారాన్ని ఆనాటి సాహిత్య పరిస్థితుల దృష్ట్యా రచయిత సంస్కరణ లేదా ఉద్ధరణ మార్గం. కానీ ఇనాక్ ఒక మాదిగ స్త్రీ చైతన్యమే మార్గంగా చూపడం నేర్పు.

9.1. ఈ కథలో అన్యాయానికి గురయ్యే పాత్రలు మూడు. ఒకరు చిదంబరం తండ్రి రాముడు. ఇతడు ఏమాత్రం చైతన్యం లేని వ్యక్తి. రెండు చిదంబరం. ఇతడు సమస్యకు సానుకూల పరిష్కారాన్ని కోరుకుంటాడు. మూడు చిదంబరం భార్య. బావి దగ్గర జరిగిన అవమానానికి అతడ్ని కొట్టడం. పల్లెనీటి సమస్య తీర్చడానికి ఎద్దుదట్టేన్ని బావిలో వేయడం.. రైల్వేస్టేషన్లో భర్త చిదంబరాన్ని కొట్టడానికి చెయ్యెత్తిన ఊరి అతడ్ని ఆపి, దబాయించడం.. మామను, భర్తను కొట్టిన మునసబును మంచానికి కట్టేసి కొట్టడం.. మునసబు ఆస్తి సావిడి, వాములు తగలబెట్టడం.. చివరకి ఎవరి వల్లా కాని ఎద్దుదట్టేన్ని బావిలోంచి తీయడం.. ఇవన్నీ మాదిగ స్త్రీ చైతన్యాన్ని తెలియజేసే సంఘటనలే.

9.2. ఊరబావి కథ ద్వారా వ్యక్తి చైతన్యాన్ని చెప్తే, రంధి నవల ద్వారా వ్యవస్థా చైతన్యాన్ని చెప్పారు రచయిత. వ్యక్తి చైతన్యమే వ్యవస్థాగత చైతన్యంగా మారుతుంది. ఒక వ్యక్తి చైతన్యవంతుడైతే ఇళ్ళు మాత్రమే అభివృద్ధి చెందుతుంది. సమస్యల చిక్కుల నుండి బయటకి వస్తుంది. అదే ఆ వ్యక్తే వ్యవస్థగా మారితే ఒక వర్గం అభివృద్ధి చెందుతుంది. విశ్వమానవ సమానత్వానికి బాటలు వేస్తుంది. రంధి నవల ద్వారా రచయిత కావాలనుకున్న ఆశ, ఆకాంక్ష, కోరిక కూడా అదే. 

10. ఐకమత్యమే అవసరంగా:- నేటి ఆలోచన రేపటికి అవకాశంగా మారుతుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. పోయిన దాని గురించి పట్టించుకోకూడదు. ధైర్యంగా ఎదురు తిరగాలి. మనలోని ధైర్యమే రేపటి బంగారు భవితకు బాట. ఆత్మన్యూనతా భావాన్ని వదిలి, అగ్రవర్ణాలతో సమానమే భావన దళితుల్లో కలగాలి. అదే వారి విజయానికి మొదటి మెట్టు. అణచివేతలపై ప్రతిఘటించాలి. అది ఒక్కరి వల్ల కాకపోవచ్చు. వర్గం మొత్తం ఒక తాటిపైకి వస్తే అవ్వదనే ప్రశ్నే లేదు. దానికి ప్రతిరూపంగానే రంధి నవల మనకి కనిపిస్తుంది. చిన్న సమస్య. భయపడి వదిలేస్తే నాంచారయ్య లాంటి మోతుబరులు ఎప్పటికీ మారరు. తిరగబడాలి. న్యాయం కోసం పోరాడాలి. దానికై జాతి మొత్తం ఏకం కావాలి. న్యాయం డబ్బున్నోడికి బానిస. అది ఒకప్పటి మాట. ఆ మాటకి మరో రూపం ఇవ్వాలి. ఆ సంకల్పంతోనే ఒక వర్గం మొత్తం పోరాడింది. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. చివరికి విజయం సాధించింది. ఇలా అన్యాయానికి, న్యాయానికి మధ్యజరుగుతున్న రంధిలో ఐకమత్యమే అవసరం. 

11. నాంచారయ్య మార్పు ‘రంధి’ లో నేర్పు, కూర్పు:-    నాంచారయ్య అగ్ర వర్ణం వాడు. మొదట్లో కొడుకు రాముణ్ణి రెచ్చగొడతాడు. గొడవలు పెట్టిస్తాడు. కానీతన కొడుకుఆత్మహత్మ చేసుకున్నాడు. అప్పుడు మరుగున పడిన మానవత్వం మనిషిగా మారింది. తన తప్పును తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం చెందాడు. అక్కడతో ఆగలేదు. తన కొడుకు స్థానంలో మూగవాడైన చంద్రిని తీసుకున్నాడు. తన కొడుకు ప్రేమించిన సువ్విని కోడలుగా చేసుకుని తన ఆస్తిని వారికి ఇచ్చేలా మారతాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు.  ఇది రచయిత ఆశించిన మార్పు.

12. సింహావలోకనం:- వచనమూ, కవిత్వమూ వీరికి రెండూ ఇష్టమే. వచనం ఇనాక్ గారి మాట వింటుంది. కవనం మాట వారు వింటారు. వచనానికి వాహికగా భాష, దానివెంట భావం రైలుబండిలా సాగుతూనే ఉంటాయ్. కవిత్వం వారిచేత రాయించుకుంటుంది. దళిత జనుల తరపున అది చచ్చు వచనంలా కాకుండా, తొడలు విరిచేస్తాననీ, గుండెలు చీల్చి నెత్తురు తాగుతాననీ, కృద్ధ వృకోదరుడు కురు సభలో పాడిన పద్యాల్లా కాకుండా సూటిగా సుతిమెత్తని మన్మథ బాణంగా గుచ్చుకుంటుంది. నిజానికి ఇది మరోగుణం కలిగింది. అది మానవీయం. ఐకమత్యం, మనీషి తత్త్వం. ఇలా రంధి మార్పును నేర్పుగా చూపుతుంది. మానవ సమానత్వాన్ని ఆక్రోశిస్తుంది. ఆలోచించేలా చేస్తుంది.

*****

ఆధార గ్రంథాలు:-

1.      అంతర్జాలం

2.      అంటరాని వసంతం- జి. కళ్యాణరావు,

3.      ఆధునిక మహా భారతం – గుంటూరు శేషేంద్ర శర్మ

4.      ఊరబావి కథ - ఆచార్య కొలకలూరి ఇనాక్

5.      నిర్వచనోత్తర రామాయణం- తిక్కన

6.      పద చిత్రాలు - కార్ల్ సాండ్బర్గ్, అమెరికన్ రచయిత

7.      మహా భారతం – టి టి డి ప్రచురణలు

8.      రంధి నవల – ఆచార్య కొలకలూరి ఇనాక్

9.      శబ్ద రత్నాకరం –బహుజన పల్లి సీతారామాచార్యులు

(రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి పొందిన వ్యాసం, నిర్వహణ: బి. రవీంద్రబాబు, సహాయకాచార్యులు, ఆంధ్రప్రదేశ్  కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురం. Aug, 2020)

 

 

 

 

 

 

No comments: