Sunday, June 4, 2023

ఉత్తరాంధ్ర ప్రజాసాహిత్యపు బుగత, కథోపనిషత్ కారా

 

-డా. జాడ సీతాపతి రావు, సహాయకాచార్యులు,

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం,

నూజివీడు ప్రాంగణం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

విద్యుల్లేఖ: seethuphd@gmail.com

సంచారవాణి: 9951171299

1.0. ఉపోద్ఘాతం:

            కాళీపట్నం రామారావు గారి వృత్తి లెక్కల మాష్టారు. ప్రవృత్తి కథాకర్షకుడు. కథల్ని కవనంతో కరిగించి కళ్ళకు కట్టించి ఆలోచించేలా చేసే కథానిలయుడు కాళీపట్నం రామారావు. కథకు కళింగాంధ్రనుంచి గురజాడ జాడ వేస్తే రామారావు రాచబాట వేసి నిలిపారు. యజ్ఞంతో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు.

            కథలు రెండు రకాలు. ఒకటి ఇష్టమైనవి. రెండు చాతనైనవి. అధ్యయనం కథకు రాచబాట. పరిశీలనాశక్తి, ప్రాపంచిక దృష్టి కారా కథలకు నెలవు. ఆర్తి, చావు, హింస, నో రూమ్, భయం, జీవధార, యజ్ఞం, శాంతి, వీరుడు మహావీరుడు, కుట్ర లాంటి కథలు మేథోమథన మైలు రాళ్ళు. 'యజ్ఞం' కథ దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించాడు.

2. కథకో లెక్క:

కారా మాష్టారి దృష్టిలో కథ రాయాలంటే ఒక లెక్కుంది: మన స్వభావం జీవితంలో మంచిచెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి.  అనుభవాలనో, ఆవేశాలనో లేక అభిప్రాయాలనో ఇతరులతో పంచుకునే స్వభావం ఉందాలి.  సాహిత్యం ద్వారా ఆ పని జరుగుతుందన్న నమ్మకం, చేయగల శక్తీ ఉండాలి.  ఆదిలో ఆ శక్తి లేకున్నా ఫరవాలేదు. ప్రయత్నించి దాన్ని సంపాదించవచ్చు అని వీరి కథల్లో కనిపించే లెక్కలు.

3. గుర్తింపు ఇచ్చిన కథ:    

            1943లో ఆయన మొదటి కథ ప్లాట్‌ఫారమో?’ అచ్చయ్యింది. 1964లో తీర్పుకథతో అసలైన కాళీపట్నం రామారావు తెలుగు పాఠకలోకానికి తెలిశారు. 1966లో ఆయన రాసిన యజ్ఞంకథ తెలుగు సాహిత్యానికి చూపు, ఊపుల్నిచ్చింది.

4. కథాతత్త్వం:

            గ్రామీణ జీవితంతో కాళీపట్నం రామారావుకున్న అనుబంధం, అవగాహన, అనుశీలన పాత్రల్లో పరవళ్ళు తొక్కుతుంటాయి. వీరి కథల్లోని నీతి అంతస్సూత్రం. అవకాశాల్ని అరమరికలు లేకుండా తీసుకుని సిద్ధాంతాల్నీ ప్రకటించి ఒప్పించగలిగే తత్త్వం కారా కథల వ్యక్తిత్వం. నీతి, అవినీతి మధ్యగల మర్మాన్ని తూర్పారబట్టి తాత్త్వికతను అనుసంధానం చేసి క్రమ౦గా నిజ నిర్ధారణ చేయిస్తాడు. ఉద్వేగాలు లేని తత్త్వబోధ కథనశీలం వీరి కథా తత్త్వం. 

5. కారా కథలు విశ్లేషణ:

వీరి కథల్ని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు:

1. వ్యతిరేక పద్ధతిలో శీర్షికలతో కథనం ఉన్న కథలు: ఉదా: చావు, భయం, బలహీనులు, అభిశప్తులు మొదలైనవి.

2. అనూకుల వైఖరితో కథా శీర్షకలున్న కథలు: ఉదా: ఆర్తి, కీర్తి కాముకుడు, మహదాశీర్వాదం, స్నేహం మొదలైనవి.

3. సమస్యలనుంచి  పారిపోవాలనుకునే శీర్షికల కథలు: పలాయనం మొదలైనవి.

4. కుటుంబ అనుబంధాల ప్రధానంగా సాగే కథలు: అభిమానాలు, జీవధార మొదలైనవి.

5. 1. వ్యతిరేక పద్ధతిలో శీర్షికలతో కథనం ఉన్న కథలు:

5. 1.1 చావు కథ విశ్లేషణ:  కారా కాలం సౌమ్యంగా ఉన్నా, ఆగ్రహావేశాలకు కథనం పుట్టినిల్లు. సామాజిక సంఘర్షణల్లో దోపిడీని రూపుమాపాలనుకుని కంకణం కట్టుకున్న కథలు చావు, భయం.

            "చావు" కథలో మనిషి చనిపోవడం తథ్యం. కానీ భావోద్వేగాలతో ప్రతీకాలతో ఆ కథ ఆకట్టుకుంటుంది. తెల్లార్లూ... ఈ సలీ, సీకటి ఎప్పటికీ పోతాయి, ఎర్రగా పోద్దెప్పుడు పొడుస్తాదీ, ఎప్పుడెండలో సేరిపోతావు అనే వుంటాది. ఫ్యూడల్ చలినుంచి సమాజం బయటపడి, చైతన్యమై, జ్ఞాన మార్గంలో వెలుగుతూ నూత్న సమాజ ఆహ్వానాన్ని దర్శింపచేసేలా చెప్పడం ఈ కథలో అంతరార్థం. అట్టడుగు స్త్రీ పాత్రల్ని వారు ఎదుర్కొంటున్న సమస్యల్లో అణిచివేత, పీడన చుట్టూరా ఉన్నాయి. మగాడి జీవితంలో భార్యగా వచ్చిన స్త్రీని ఒక వస్తువుగా చూస్తే స్థితిని కళ్ళకు కట్టినల్టు చూపాడు. ఇందులో ముగ్గురు స్త్రీలు బలైన విధానాన్ని చూపాడు. నారెమ్మ భర్త ప్రవర్తనను అణిగి మణిగి ఓపికతో జీవించి మరణించింది.

            రెండోది ముసలమ్మ పాత్ర 'అయ్యా నా నెప్పుడైనా యీ సలికే సచ్చిపోతాన్రా, ఈ సలి సంకటంతోనే   సచ్చిపోతాను. శీతాకాలం, కర్ర లెక్కడా దొరకావు. కర్రలొదొరకవాని కప్పెట్టీకిమీ ఎక్కదేనా కొనో, కసింత అడుక్కొనో, సివరికి దొంగతనవేసేసినా సరే, నన్ను కాల్చీయాల' ఇది చలినుంచి విముక్తి కోసం ముసలమ్మ కోరిక. ఈ విముక్తే స్త్రీల చైతన్య జ్వాలగా సూచన. ఇక్కడ సివరికి, కప్పెట్టీకిమీ, కసింత, సలి లాంటి కళింగాంధ్ర మాండలికాలతో సహజత్వాన్ని కలిగించేలా వర్ణించాడు.

            మూడో స్త్రీ ముసలమ్మ కూతుర్లలో చివరమ్మాయి. ఆమె భర్త తాగుబోతు. వాడి పెట్టే బాధల్ని తట్టుకోలేక వేరేవాడితో లేచిపోయి, ఆమె సాహసంతో తన బాటుకును పునర్మించుకుంది. ఈమె నిర్ణయం తల్లికి నచ్చకపోయినా జీవితాన్ని సుఖమయం చేసుకోడానికి అదో మార్గంగా చూపాడు. కేవలం స్త్రీ కట్టుబాసిన కాదని, ఆమెకూ ఒక మనసు ఉంటుందన్న స్ఫృహను స్త్రీకోణంలోనుంచి పురుషుడు ఆలోచించాలనే తత్త్వాన్ని ఇక్కడ పాఠకుడికి చూపాడు.

5. 1.2. బలహీనులు కథా తత్త్వం:           

            "బలహీనులు" కథలో కథానాయిక ఒక అందగత్తె, నర్స్. 'నాకు దేవుడిమీద నమ్మకం వుంది అంటూ కథను మొదలుపెట్టి దేవుడు యిది నాకిచ్చిన శిక్షయోమోనని అనుమానం కలుగుతుంటుంది' అని ముగించాడు. ఇక్కడ ఏ పాత్రకూ పేరు లేదు. అందులో ఉన్న అమ్మాయిని వర్ణిస్తూ 'లోకంలోని సౌందర్య ధనులలో నేను ఒక్కర్తిని. రంగు నల్లనైనా అందులో నైగనిగ్యం వుంది. తీర్చిదిద్దిన వంపులతోడి నా సుందరమైన నల్లని కాంతుల శరీరానికి నల్లని వెడల్పాటి బోర్దారులతోటి తెల్లని చీర కడితే నా రూపం ఆరి తేరిన చిత్రకారుడితో చిత్రించిన బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ చింతలోని ఆకర్షణ ఉండేది. ఎదురైన వ్యక్తల్లా నా వైపు రెండవసారి చూడకుండా నడచిపోవడం ఆ నా పద్దెనిమిదేళ్ళలో ఎప్పుడూ యెరగను'. శీర్షికలో బలహీనులు అని ఆడవారి పట్ల మగవారు ఎలా ఉంటారో చెబుతూనే ఇందులో ఆ నర్స్ అతడి అభిప్రాయాన్ని తెలిసి కూడా పట్టించుకోక పోవడం ఆమె కన్నులో రంధ్రం పడడంతో చూపిస్తాడు. ఇది విభిన్నమైన ముగింపు.

5. 1.3. "అభిశప్తులు" కథలో అభిశాపము= ఊరక మోపిన నింద. బ్రాహ్మడితో లేచిపోయిన వచ్చిన రాఘవమ్మ అనే స్త్రీ జీవితం ఇందులో ప్రధానాంశం.  ఆమె పడిన అగచాట్లు, కూతుర్ల పెళ్లి, ఇవన్నీ పంచాయితీలో తగువుకు వస్తాయి. ఇవే ఆమె ముసలతనంలో అభిశప్తత. కులం, భర్తలేని స్త్రీ జీవితం సమాజంలో చిన్నచూపు. 'నేనేం మడులు కోరలేదే. మాన్యాలు కోరలేదే? పప్పన్నాలు పాయసాలూ కోరలేదే. కట్టేందుకి  చుట్టు చెంగాయి చీరలూ అలంకరించుకుందుకి ఆభరణాలూ కోరలేదే. ఏం కోరాను? పిడికెడు మెతుకులు. వాడి కంచం దగ్గర, వాడి పిల్లల కంచం దగ్గర, వాడి పెళ్ళాం కంచం దగ్గర రాలేపాటి పిడికెడు మెతుకులు కోరాను. వాడి పెళ్ళాం కుడిచేత్తో వేసినా, ఎడంచేతో పారేసినా, మలకలో పోసినా మొహాన విసిరినా మహాభాగ్యమని అందుకుంటానన్నాను. అది నన్ను లంజా అని తిట్టినా, ముండా అని తిట్టినా పడతా నన్నాను. తలంతా బొప్పెలు కట్టేటట్టు మొట్టికాయలు మొట్టిన పెదవి కదపనన్నాను' ఇది రాఘవమ్మ జీవిత అంతిమ దశ, వృద్ధాప్యం. చిన్న చిన్న వాక్యాల్లో అంతులేని బాధను దైన్యాన్ని కళ్ళకు కట్టించి కంటతడిని పెట్టి౦చాడు.

 

5. 2. అనూకుల వైఖరితో కథా శీర్షకలున్న కథలు

5.2.1. "ఆర్తి" కథలో పైడయ్య గంగమ్మతో తనలోని మానసిక స్థితిని వ్యక్తంచేసే సందర్భంలో  నానార్నెల్లయి, ఆడ మనిషి కోసం ఉపాస వున్నాను. ఇయ్యాల ఇంటికొస్తె మాయమ్మా అత్తా కుమ్ములాడుకొని మమ్మల్నిడదీసినారు. నిన్నరాతిరి దాన్ని తవిటప్ప ఇంటికి రమ్మన్నాను. దానికీ నా బాధ అర్థవైనట్టు నేదు. కావాలంటే, పట్టంలో నా యిష్టవొచ్చినట్టే ననుండగల్దును. నాతోటోల్లంత యెలాగో తంటాలుపడతన్నారో నాను సూస్తునే వున్నాను. అన్నిట్లో అల్లాగుండొచ్చు గాని, ఆడ దాన్దగ్గిర అలాగుండాలంటే మనసొప్పుకోడంలేదు. ఇరుగమ్మకో పొరుగమ్మో పాటుపడితే ఇల్లిరగతియాల; కన్నెపిల్లని సెరిపితే, కలకాలం దానుసురు తగుల్తాది. మరింక రోడ్డోరమనుసులున్నారు. ఆల జోలికెల్తె, ఆసుపత్రికి పోవడం సరేసరి- పన్లో కెల్లకండ పదిరోజులుంటే కూల్డబ్బుల మాటేమిటి? అందుకే నా బాధ నాకు తెలియాల; ఆ దేవుడికి తెలియాలన్నాను.ఇక్కడ శ్రామిక జీవన విధానం, వారి ఆర్థిక స్థితిని ఒక ఆడ మనిషి కోసం ఉపవాసం ఉండడం, ఇంట్లో తగాదాలు, పట్నంలో నా వ్యక్తిగతమైన ఇష్టాలు ఉంటాయి. పల్లెలో అలా ఉండడానికి అవకాశం లేని పరిస్థితి. వారి మానసిక స్థితి విలక్షణం. మాండలికపదాలతో గ్రామీణజీవితాన్ని చూపారు. ఇది బలహీనుల కథకు విభిన్నమైన తత్త్వం.

            "ఆర్తి"కథ సంభాషణ సహజంగా సాగుతుంది. నడక (flow) విషయంలో రాతకీ మాటకీ తేడా కనిపిస్తుంది. రాస్తున్నప్పుడు కట్టుదిట్టంగా పదం తరవాత పదం, వాక్యంతరవాత వాక్యం తర్కంతో నడుస్తుంది.  గొప్పవాళ్లలో గొప్పవాళ్లూ, చాలాగొప్పవాళ్లూ, అతిగొప్పవాళ్లూ ఉన్నట్టే పేదవాళ్లలో కడుపేదలు, నిరుపేదలు ఉంటారుఅని వాక్యం. ఇది చదవగానే నాకు తోచిన మొదటి ఆలోచన పేదవాళ్లలో రెండే వర్గాలని. కానీ ఆ తర్వాత కథకుడు ఎర్రెమ్మ ఆస్తి లెక్కగట్టి ఆమె నిరుపేద, … కడుపేదల కోవలోకి చేర్చరాదుఅంటారు. ఆమెతో తైపారువేస్తే, బంగారి వొత్తి పేదరాలు మాత్రమే అవుతుంది”.  పేదరాలు వర్గం, నిరుపేద, కడుపేద కాక మరొక వర్గం అంటూ సూక్ష్మ విభజన చేస్తాడు.   కొంతవరకూ ఈ కథలో కథనం stream of consciousnessను పోలి ఉంటుంది.

5.2.2. "కీర్తి కాముడు" కథకు పేరుపెట్టడంలోనే కథలో అంతరార్థాన్ని చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. కొంత పొలం వ్యవసాయం చేయాలనుకునే వెంకయ్య నాయుడు అనే రైతు ఎలా చితికిపోయాడో కథనం ద్వారా చూపించారు. దేశానికి వెన్నెముక రైతు. పైగా అలా కీర్తి కాముకుడు కాడానికి పురాణ సాహిత్యమే కరణంగా రంతిదేవుడు, హరిశ్చంద్రుడు లాంటి కథలు ఎవరి ప్రయోజన౦ కోసం అనే ప్రశ్నించడం ద్వారా సమ సమాజ కాంక్ష కనిపిస్తుంది. గోదాన, భూదాన, హిరణ్య దానాల వల్ల కీర్తి ఎవరికి వస్తుంది? లాభం ఎవరికి? ఇవన్నీ లోకంలో ఉన్న విభిన్న అంశాలు వాటి వెనుక ఉన్న లోతైన భావాల్ని గ్రహించే ప్రయత్నం చేయించడం ఈ కథలో నేర్పు. 

5.2.3. "మహదాశీర్వచనం" కథలో కుటుంబంలోని స్త్రీ, పురుషుల సంబంధాలతోపాటు దేశంలోని ఆర్ధిక పతనం, రూపాయి విలువ పడిపోవడం లాంటి విషయాలున్నై. ఆర్థిక మాంద్యంలో ఒక మధ్యతరగతి కుటుంబం స్థితి, మధ్యతరగతి స్త్రీలపై మాంద్యం ప్రభావం, బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, కుటుంబ వ్యవస్థపై విమర్శలు, రక్షణ లేని జీవితం అంశాలపై మహదాశీర్వచనం కథ చెబుతోంది. 

5. 3. సమస్యలనుంచి  పారిపోవాలనుకునే శీర్షికల కథలు:

            5.3.1.             "పలాయితుడు" కథలో సమస్యలనుంచి పారిపోయిన రాజశేఖరాన్ని చూపారు. డిగ్రీ చదువుకున్నా ఆ చదువుకు కారణమైన మేనమామ, ఇష్టంలేని అతడి తత్త్వానికి ఏమాత్రం పొసగని మేనమామ కూతురుతో పెళ్లి, స్నేహితులు, చుట్టాలకు పెట్టేన ఖర్చులు, ఖర్చులకు చాలని జీతం...ఇలా ఎన్నో ఆర్థిక కష్టాలను ఆలంబనంగా సాగిన కథనమిది. పోట్లాడి స్నేహితులెలా కావచ్చో చూపిన పాత్ర రాజశేఖరం.

            సినిమా హాల్లో సీటుమీద కర్చీఫ్ వేసి ఆపిన సీట్లో మరొకరు వచ్చి కూర్చోగా ఆరంభమైన చిన్నపాటి తగాదా నేపథ్యంలో కొంతవరకు సాగిన ప్రస్థానం రాజశేఖర్ గదివరకు వచ్చి, ఇబ్బంది పడిన క్షణం వరకు విచిత్రమైన మనిషి అనుకుంటూనే టూకీగా కథ సాగింది. పైగా మీరింకా సినిమా హాలు సంఘటన మరిచిపోలేదనుకుంటాను అనడం సాధారణమైన సంభాషణగానే సాగింది. 'ఒక్కసారిగా మీకు స్వీట్లూ, హట్లూ కాదు కదా ఒట్టి కాఫీ కూడా నేను పోయదలచుకోలేదు. నా జేబులో చాలా డబ్బులున్నాయి. కానీ మీకు ఒక్క దమ్మిదీ అయినా యీయను. దయచేసి మీరు నన్ను వేధించకండి. ఇంతకు ముందు నిత్యం మిరిట్లా నా గదికి వచ్చి నా కిబ్బంది కలిగించడం నేను భరించను. మీరింక నా గదికి రాకండి' అనడం కథకు మరో మలుపు.

            'నాకా మనిషి కృతజ్ఞత చూపించిన విధం చూస్తే జాలీ, అందులో వ్యక్తమైన నాతోడి ఆయన స్నేహం తలచుకుంటే మహదానందం కలిగాయి' అంటూ కథకుడి మానసిక స్థితిని చెప్పే ప్రయత్నం చేశాడు.      విన్నావా బాబూ! పిల్లదాని వంటి మీద బంగారం అంతా అమ్మేశాడు. నాలుగు తులాల గొలుసు, రెండు తులాల పుస్తెలనాను, తులంన్నర ఎత్తు గాజుల జత, సమస్తం అమ్మేశాడు. ముక్కువీ, చెవివీ మాత్రం యింకా ముట్టుకోలేదు. మంగళసూత్రం జోలికి పోలేదు. సర్వగుటకాయస్వాహా' అంటూ రాజశేఖరం మేనమామ చెప్పడంతో రాజశేఖర్ మిత్రులకు చుట్టాలకు ఎలా ఖర్చులకోసం డబ్బులు వాడుతున్నాడో తెలుస్తుంది.  ఇద్దరు మిత్రులు ఒకరికొకరు ఉత్తరాలు రాయడం ఉండేది.   కాకపోతే రాజశేఖర్ ఒకే సారి ఉత్తరం రాశాడు. మూడేళ్ళ తర్వాత. మానవుడి సామాజిక జీవి అని, అతడి కష్ట సుఖాలు, ఆనంద విషాదాలు, లక్ష్యాలు సాధించడం, సాధించకపోవడం, అతని ప్రయత్నం ఒక్కదానిమీదే ఆధారపడి ఉండవనీ, ఎవడి జీవిత పగ్గాలు వాని చేతులోనే  ఉన్నట్టు కనిపించినా నిజానీకవి అతడి చేతులలో లేవని, బహుశా మీరు గ్రహించగలిగి ఉండరు. అందుకు కారణం మీ రిప్పుడు మళ్ళా పొరపడుతున్నట్లు. మీ ప్రయాణం లోపం ఒక్కటే కాదు, మీ పుట్టుక, మీ పుట్టుకకు ముందే మీకై ఏర్పడిపోయిన జీవన పథ ప్రమేయం కూడా చాలా ఉంది. అంటూ సుదీర్ఘ జీవితానుభవగీతను బోధిస్తున్నట్లు ఒక వేగంతో కథనాన్ని నడిపించారు. ఇండతా అనుభవంలో తను సంపాదించిన సత్యాలు.  ఇలా చైతన్య స్రవంతి ధోరణిలో సాగుతుంది లేఖావ్యాసంగం. చివరికి 'ఈ ఇంద్రజాలానికంతటికీ కారణం ఇపుడు మానవుడానుసరిస్తున్న ఆర్థిక విధానం' అంటూ ఆర్థిక సంబంధాల స్థితిలోకి తీసుకువస్తాడు. తనదైన వ్యక్తిత్వాన్ని చంపుకుంటూనే ఎన్నో ఉద్యోగాలు చేసిన కచ్చితత్త్వాన్ని వదలనివాడు, చివరికి కుటుంబం నుంచి పలాయనం చిత్తగించడమే ఈ పలాయితుడు.

5. 4. కుటుంబ అనుబంధాల ప్రధానంగా సాగే కథలు: 

5.4.1. "అభిమానాలు" కథ సుదీర్ఘమైంది. 18 సంఘటనల సమాహారం.  చలపతి అనే చిన్నపిల్లాడి పట్ల భాస్కర౦ అనే చిన్నాన్న పాత్ర ఎలా ప్రవర్తించాడు, ఆలోచించాడు లాంటి విషయాలు ఉన్నై.

5.4.2.             జీవధార: ఈ కథలో మానవ విలువల చర్చి ఉంది. అందరూ సమృద్ధిగా సంతోషంగా ఉండాలనే మానవ లక్ష్యాన్ని చూపారు. నీళ్ల కోసం స్త్రీలు పడే బాధను బాగా వర్ణించారు. స్త్రీలను వ్యక్తిగా, శ్రమజీవిగా చూడడ౦ ఈ కథలో ప్రత్యేకం. 

6. సింహావలోకనం:

            కళింగాధ్ర కథావాహికలో కారా మాష్టారు దళిత, పేద జీవితాల్లోకి తరచి చూసి వారి మాండలిక భాషను వాడి, ప్రతి భావన మరోసారి ఆలోచన చేయమనే చెప్పేంత హత్తుకుంటై.  'పురాతన చరిత్రకోశం భూమి పొరల్ని తవ్వే ఆర్కియాలజిష్టులా పొరపొరా విడదీసి చూపేదాకా చరిత్ర  సమాచారం ఆవిష్కారం కానట్లు కారా కథల్ని ప్రతి పోరా జాగ్రత్తగా విప్పితేగాని బోధపడద'ని వెల్చేరు నారాయణ రావు గారి మాటల్నిబట్టి లోతైన  అభివ్యక్తి కారా వారిది.  కొడవటి గంటి కుటుంబరావు గారిదగ్గర కథా శైలిని, కథను ఎలా రాయకూడదో, లోపాల్ని ఎలా సర్దుకోవాలో రావి శాస్త్రి గారి దగ్గర తెలుసుకున్న కారా సమాజాన్ని వినూత్నంగా దర్శించి కృతకృత్యులయ్యారు.

            ఉపనిషత్ అనే పదానికి వేదాంతం, ధర్మం, ఏకాంతం అనే మూడు అర్థాలున్నై. వాటిని కాళీపట్నం రామారావు కథల్లో పాఠకులకు చూపించారు. ప్రజాభాషను ప్రత్యేకంగా మాండలిక పదాల్ని ఎంపికచేసుకొని కథను రాయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజాసాహిత్యాన్ని వాడినట్లై౦ది.  బుగత అంటే యజమాని/ భూస్వామి/ పెద్దకులం వాళ్ళు అనే అర్థంలో బ్రాహ్మణ వ్యక్తుల్ని అనడం పరిపాటి. ఇక్కడ కేవలం కులవాచి కాకుండా పదజాలాన్ని నిర్మించడంలో బుగతగా చూస్తే ఉత్తరాంధ్ర ప్రజాసాహిత్యపు బుగతగా,  ఉత్తరాంధ్ర కథోపనిషత్ కారా కనిపిస్తారు.

ఆధారాలు:

పొద్దు- అంతర్జాల తెలుగు పత్రిక

కాళీపట్నం ... నవాతీతరణం

నవ్య నీరాజనం - సంపాదకుడు జగన్నాథ శర్మ

సాహిత్య ప్రస్థానం, జూన్ 2021(సాహిత్య పత్రిక)

వ్యాస వారథి (సాహిత్య వ్యాసాలు)- డా. తుర్లపాటి రాజేశ్వరి.

ఆంధ్ర పత్రిక జయ సంవత్సరాది సంచిక.

ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక: మార్చి 1953

అక్షరాలా కథానాయకుడు, ఈ టీవి ఆంధ్రప్రదేశ్, జూన్, 4, 2021 ఇంటర్యూ 

(6, 7 డిసెంబర్, 2022  తేదీలలో జరిగిన జాతీయ సదస్సు, జె.యం. జె. కళాశాల, తెనాలి లో పత్ర సమర్పణ ) printed with ISSN: 2277-7881" peer Reviewed & Refereed International Journal IJMWE, Vol 11, Issue 12(3), Dec, 2022. Impact Factor: 8.017, IC Value: 5.16, ISI Value:2.286, International Journal of Multidisciplinary Educational Research.  Editor -in Chief Prof. Dr. Victor Babu Koppula.

 

Wednesday, May 31, 2023

కర్పూర వసంత రాయలు కావ్యం పై ఇతర కావ్యాల ప్రభావం- విశ్లేషణ

 

-        డా. జాడ సీతాపతి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రిబుల్ ఐటి,

నూజివీడు ప్రాంగణం, ఏలూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. 

విద్యుల్లేఖ: seethuphd@gmail.com ; సంచారవాణి: 9951171299

 

Key words: కర్పూర వసంత రాయలు- నృసింహ పురాణంలో వర్ణనల ప్రభావం- మానసిక స్థితులు- గంగానది గొప్పదాన్ని స్వీకరణ- పురాణాల నుంచి కొన్ని అంశాల స్వీకరణ- ఆరాధన తత్త్వం- విశ్లేషణ, విమర్శనాత్మకం

1. కావ్య నేపథ్యం

సాహిత్య సృజన ఆదర్శం, ఆనందం కోసం. కొత్తదనం దీనికి బీజం. ప్రాచీన కావ్యాల సౌందర్యాన్ని పుణికి పుచ్చుకొని కొత్తదిగా మార్చినా పాఠకుడి మనసులో వాహ్వ్ అనే భావోదయం కలుగుతుంది.

క్రీస్తు శకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని కుమార గిరి రెడ్డి అనే రెడ్డి రాజు రాజ్యాన్ని పాలించాడు. 1957 ఇది ఒక కథాత్మక గేయకావ్యం-- క్రీస్తుశకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని అంధ్రదేశాన్ని పాలించిన ' రసికప్రభువు' -కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్తాన నర్తకి 'లకుమ; ఈ లకుమా ప్రభువుల ప్రణయగీతం కర్పూరవసంతరయలు. మల్లంపల్లి సోమశేఖరశర్మగారి HISTORY OF REDDY'S KINGDOMS లో కుమారగిరి రెడ్డి కి కర్పురవసంతరయలు అన్న బిరుదు ఉన్నదని ఉదహరించారు. ప్రతి సంవత్సరం 9 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తుండేవాడు 'కుమారగిరి'. పంజాబు నుండి కర్పూరాన్ని, గోవా నుండి కుంకుమ ద్రవ్యాలను తెప్పించి ఆ 9 రోజులు జనంపై వెదజల్లుతుండేవాడట.  ఆ నేపథ్యంలో ఈ కావ్యానికి శ్రీకారం చుట్టారు సినారె. లకుమ ఒక కల్పిత పాత్ర. ఈమెను సజీవ చిత్రణ చేయడానికి పూనుకున్నారు.

2. కథలోకి వెళ్తే:

కర్పూరవసంత రాయలు ఒక రెడ్డి రాజు. పాలనా దక్షుడు, సంగీత నృత్యాలంటే చెవికోసుకుంటాడు. అది పిచ్చిగా మారితే ప్రమాదమేగా. ఈ భావనల్ని తీసుకున్న సి. నారాయణ రెడ్డిగారు కొంత చరిత్రను, కొంత సృజనను కలిపిన వసంత కర్పూర పరిమళం ఈ కర్పూర వసంత రాయలు.

3. పాత్ర స్వభావం: లకుమ అందగత్తె, ఆపై నాట్యపు జాణ. వసంత రాయల హృదయపు వీణగా మారింది. రాజు తలచుకుంటే వైభవానికి కొరతా?, ఆదరణకు ఆలోచనా? కవికి ఉన్న నృత్యాభివేశం, నాట్య౦లో గ్రహించిన విశేషాలు మరింత పాకాన పెట్టాయి. అది విచిత్ర మలపులతో, వలపులతో లకుమను చుట్టాయి. వెరసి ఆమె నిర్ణయాన్ని ఆమె తీసుకున్నట్లు చేశాయి.

4. కథలో సంఘటనలు: ఇతర కావ్య ప్రభావాలు: 

            వసంత రాయలు లకుమను తీసుకొని అహోబలక్షేత్రం వెళ్ళాడు. స్వామిని దర్శించుకున్నాడు. దీన్ని కవి అందంగా కవిత్వీకరించాడు. దీన్ని ఒక సన్నివేశంగా మలిచాడు. సాయంకాలానికి వసంతేశుల ప్రయాణం. ఆ రాత్రి నిద్ర, ఉదయాన్నే లేచి స్వామి దర్శనం. పూదోటలో పూలు కోసి స్వామి పూజకు ఏర్పాట్లు. రాయలు నరసింహ స్వామి స్తుతి, పూజ ఇంకొకటి. అహోబల స్వామిని దర్శించారన్న ఒక్క విషయాన్ని ఇన్ని విభాగాలుగా చేసి కవి చేశాడ౦టే కవి ప్రతిభా విశేషాలు ఇందులో కనిపిస్తున్నాయి.

            ఇలాంటి వర్ణనకు దగ్గరిగా ఎఱ్ఱన నృసింహ పురాణంలో అహోబిలస్వామి వర్ణన కనిపిస్తుంది. అది  విష్ణువు నరసింహ అవతార౦గా ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి ఎత్తుకొని వెళ్ళి అహోబిల పర్వతం మీదకెగిరి అక్కడ చంపుతాడు. ఈ కథ ఐదో ఆశ్వాసంలో ఉంది. దీన్ని సినారె లకుమ వసంత రాయల వర్ణనలో కొంత వాడుకున్నాడు. లకుమా వసంతేశులు స్వామి దర్శనార్థం అహోబిలం చేరుకున్నారు.  అక్కడ భవనాశిని అనే నదిలో స్నానం. లక్ష్మీవనంలో పూలను కోయడం.

భవనాశినీధునీ పావనపయ స్నాత/ములు ప్రభాతాలసానిలపోతములు వీచె.

సుఖనిద్రనున్న రాజునకు ప్రాతస్సమీ/రములు వైతాళికత్వమును నిర్వర్తించె.

            భవనాశినిలో ఉదయం వేళ గాలి స్నానం చేసి వచ్చింది. నిద్రలో ఉన్న రాజుకు మెలకువ వచ్చింది. ఆ గాలికి కవి వైతాళికత్వాన్ని ఆరోపం చేస్తున్నాడు. దీనివల్ల అలంకారంతో పాటు కవితా సౌందర్యం కనబడుతుంది.

నుత లక్ష్మీవన పుష్ప సౌరభములు న్సొంపారి లోలోర్మి సం...... గావించె నాహ్లాదమున్(నృసి౦హ. 5-129)

            ఈ పద్యంలో లక్ష్మీవన పుష్ప సౌరభాలతో గాలి వచ్చింది. ఆపై మృదువుగా వీచింది. ఈ పద్యంలో మంద పవనుడు, ప్రభాతాలసానిలపోతములుగా మారిపోయాడు. అక్కడి దేవతాద్విజకోటి, వసంత రాయలుగా కవి మార్చుకున్నాడు. వసంత రాయలను మేల్కొల్పడానికి వైతాళికులు లేరు. కానీ కవి రాచమర్యాదలకు భంగం కలగకుండా కల్పించాడు.

5. లకుమ పరిస్థితి చూస్తే:

నిదుర మునిగిన లకుమ నీలాలకలతోడ/కోడెగాడుపులు దాగుడుమూతలాడుకొనె' కోడె గాలుపులు దాగుడు మూతలు లాంటి పదాలు ఏదో జరుగుతుందని కవి ఉత్కంఠను లేపుతున్నాడు.

ఇరుదెస నబ్ధి నాథుడు.... రచ్చటన్(5-135)

            ఈ పద్యంలో విష్ణువు ఒడిలో స్థిర నివాసం ఉన్న అందమైన తీగలలాంటి లక్ష్మీదేవి కేశపాశాలకు కొత్త నృత్య విలాసాలను వాయుదేవుడు కల్గిస్తున్నాడు అని చెప్పాడు. లక్ష్మీదేవి స్థానంలో లకుమాదేవి. మృదుల మారుత లీలన్, కోడెగడుపుగా మార్చాడు. శ్రీకర కుంతల భార చారు వల్లరులు అనే ప్రయోగం నీలాలక గా మార్చు కున్నాడు. నూత్న నర్తన విలాసము అనే ప్రయోగం దాగుడు మూతలుగా. ఎఱ్ఱన గాలి సోమరిగా, పైగా అతడు పిల్లవాడే. సినారె కోడెతనాన్ని చూపాడు. అప్పటికి కవికి కూడా కోడె వయసేగా. రాజు బలవంతుడు, తన ప్రతాపం సాగదు. అందుకని సోమరి పిల్లాడుగానే ఉన్నాడు. లకుమకు బలం లేదు. ఈమెను చూడగానే వాడికి ఎక్కడ లేని బలం వచ్చింది. మనుషుల ప్రతాపం అంతా బలహీనులమీదే. అధికారులు కూడా మనుషులే. కానీ బలమైన వారిముందు వారి అధికారం చెల్లదు కదా.... అనే లోకం తీరును చూపాడు.

6. నరసింహ స్వామి వర్ణన: గంగానది మాహాత్మ్యం

"శ్రీ కమనీయమూర్తి నరసింహ పదాంబుజ సేవగోరి మ౦.... మహోత్సవంబుతోన్"(5-122)

అందమైన రూపంతో ఉన్న నరసింహస్వామి పదపద్మాలను సేవించాలని గంగానది చాలా కెరటాలతో మత్తెక్కిన తుమ్మెదలతో మనోహరమైన పద్మలతో, చల్లని నీటిబిందువులతో మనోహరంగా ప్రకాశించే మహోత్సవంతో తన సహజమైన శరీర విలాసంతో ఈ భువికి దిగి వచ్చిందని ఎఱ్ఱన వర్ణించాడు.

అహోబలుని చరణసేవకై దివి/నవతరిలిన మందాకినిలో. ఇందులో ఉరుకులు పరుగులు నేటి మందాకినీలో లేవు.

“భవరోగంబుల కౌషధంబు భవ పాపజ్వాలకున్ వైరి దు

ర్భవ పంక ప్రవిశోధనంబు బవ భావస్ఫార తృష్ణాహరం

భవనాశిని భవనాశిని

భవనాశిని యనుచు... గలదే"(5- 151) ఈ చిన్న కంద పద్యంలో మూడు సార్లు ప్రశంసించడం జన్మ రాహిత్యానికి సూచన. కవులు కవిత్వ ఫలం ఇదేగా...

“నా కరుణారసంబు భవనాశిని నాన వినాశ... భవ్యతన్”(5-152 ) నా కరుణా రసమే ఈ భావ నాశిని నదిగా నాశం లేని ఆకృతిని పొందింది. ఇది స్వర్గ, మర్త్య, నాగలోకాలన్నిటిని పవిత్రం చేసే నీటిని కలిగి ఉంది. అందువల్లే ప్రశంసలు పొందింది. లోకాతిశయమైన చూపులకు సాఫల్యాన్ని కూర్చే పావనత్వం, మహత్వంతో ప్రకాశిస్తుంది అని చెప్పడం ఎఱ్ఱన పురాణం. భవనాశిని వర్ణన. డెబ్భై పై బడిన ఇక్కడి పదాలు సి నా రె గారి కలంలో పది పది పన్నెండు పదాలకు తీసుకువచ్చారు.

"భవభయ పాప జ్వాలాహారులు/భవనాశినిలో పారెడు నీరులు.

భవరుక్పీడిత జనౌషధమ్ములు /భవనాశినిలో పయఃపథమ్ములు".

భవ అనేపడం నాలుగు పదాల్లోనూ కవి ప్రయోగించాడు. హారులు, నీరులు; జనౌషధమ్ములు, పథమ్ములు అనే మూడు నాలుగు అక్షరాలతో అంత్యప్రాసను వాడాడు. నీటి ఉధృతితో పాటు, పైకి కిందకి వచ్చే కెరటాల పౌనః పున్యానికి శబ్దసూచిక.  

7. పురాణపు సౌరభం:

          ఎఱ్ఱన స్థల పురాణ౦ చెప్పడం ప్రధానం. కర్పూర వసంత రాయలులో భవనాశినిలో స్నానం చేసి, స్వామిని దర్శించుకొని, నాట్యం చేస్తుంటే చూడాలి. అంటే ఎఱ్ఱనగారికి ఈ నదీ జలాలు కేవలం ప్రాప పరిహరణ. కర్పూర వసంత రాయలకు చాలా పనులు. 

            లకుమతో కూడి రాయలు స్వామిని దర్శించుకున్నారు. స్వామికి పెద్ద పెద్ద గోళ్ళు. అవి వజ్రాయుధంలా వాడిగా, కఠినంగా, తళతళ మెరుస్తూ ఉన్నాయి. ఏ ఆయుధం చేతా చావకూడదని బ్రహ్మనుంచి వరం పొందాడు కదా హిరణ్యకశిపుడు.

అలఘు తరాట్టహాసము లజాండ కటాహము వ్రయ్య భీషణో

జ్జ్వల వికట స్ఫురత్కులిశశాత నఖాంకుర తీవ్ర పాతనం

బుల నసురేంద్రుడు పేరురము బొల్పఱ జించి కలంచి శోణితం

బులు దొరగించె ద్రు౦చె బ్రోవులుగా బలుబ్రేవులుక్కునన్( 5-99) హిరణ్య కశిపుడిని తన ఒడిలో ఉంచి నృసింహ స్వామి పెద్ద పెద్ద అట్టహాసలతో బ్రహ్మాండమనే పాత్రను ముక్కలు చేయగా, భయంకరమైన, ప్రకాశవంతమైన వజ్రాయుధంలా వాడిగా ఉన్న తన నఖాగ్రలతో బాగా గిచ్చడంవల్ల రాక్షసరాజు ఉన్నత వక్షాన్ని అందం చెడేటట్లు చీల్చి, కల్లోల పరిచి, రక్తం పారించాడు. చాలా ప్రేవుల్ని ముక్కలుగా చేశాడని ఎఱ్ఱన వర్ణన.

దీన్ని సారాన్ని సూటిగా సినారె తన కవిత్వంలో చూపారు: ఒక్కదెస హిరణ్యకశిపు/డొక్కను జీల్చిన పవిధా

రానిశాతనిష్ఠుర నఖ/ రమ్ములు మిరుమిట్లు గొల్ప.  కేవలం గోర్లే ఆయుధం కానీ ఆయుధం అవడం వల్ల అదే ప్రధానం. దాన్ని ఇక్కడ తీసుకున్నారని గ్రహించవచ్చు.

అంతేకాదు, “శితనారసింహ నఖరా/ హత దైత్య  మహిప సూపహారంబున ద/ ర్పిత యయ్యే ననగ బరిశా౦/

తతనొందె ద్రిలోక పీడ తత్కర్షణ మాత్రన్ ( 5- 106) నరసింహ స్వామికి ఉన్న వాడిగోర్లతో చంపి, రాక్షస రాజుకి కానుకతో తృప్తి పరచినట్లు ఉన్నదని, ఒక్క క్షణ కాలంలోనే ముల్లోకాల పీడను విరగడ చేశాడని ఎఱ్ఱన వర్ణన.

సినారె మాత్రం వసంత రాయలు స్తుతించి, అక్కడ ఉన్న వారంతా పొగడుతుండగా దేవతలు అహో! బలా, అని పొగిడారట.“మీరు మదీయ బలం బహోబల శబ్ద పూర్వకంబుగా ప్రశంసించితిరి గావున నీ తీర్ధం బహోబల నామధేయంబున ద్రిభువన పావనంబై వెలయుంగాత” అని ఎఱ్ఱన చెప్పాడు.

సినారె: ఆమ్నాయమ్ములు నాలుగు /సాకృతులై నీ గుణమ్ము/ లాలపించ ఈ గిరి వే/ దాద్రిగ పేరొందెనంట అని చెప్పారు.

ఎఱ్ఱన నృసింహ పూరణంలో నృసింహస్వామిని స్తుతిస్తూ దండకాన్ని(5-109) రెండు పుటలు రాశాడు. ఇక్కడ సినారె మాత్రా ఛందస్సును వాడుతూ గేయ స్తుతి చేశాడు.

            అసలు నరసింహ స్వామిని కొలవడంలో ముఖ్యంగా: నరసింహ స్వామికి దేవతలందరకు ఇక్కడకు వచ్చి నన్ను భక్తితో ప్రతిరోజూ కొలిస్తే వారి సుఖ సంతోషాలు ఇస్తాననడం. రెండోది వసంతోత్సవం స్వామికి, రాయడికి ఇష్టం.

8. పూజలు పునస్కారాలు:

            లకుమ స్వామిని స్తుతించింది. లక్ష్మీదేవి ప్రత్యేకంగా: “ధృతి శాంతియు దృష్టియు స/న్మతి యను నెచ్చెలులతోడ/వేదవేద్యు అంకపీఠి/ వెలసిన లక్ష్మిని భజించె”. లక్ష్మీదేవి నరసింహ స్వామిలో చేరటానికి సమీపంలో ఉన్న పూదోట నుంచి వచ్చింది. అందుకే ఆ తోటకు లక్ష్మీవనం అని దేవతలు, స్వామి పేరు పెట్టారు. అందులో లకుమ కూడా అక్కడనుంచే వచ్చిందట.

శాంతియు దుష్టియున్ ధృతియు సన్మతియున్ మొదలైన నెచ్చలుల్

సంతత భక్తి  దంన్గొలువ సంయమి దేవ గణంబు లద్భుతా

శ్రాంత కుతూహల స్ఫురణ గన్గొనుచుండగా నట్లు వచ్చి శ్రీ

కాంత ముకుండు నంకతాటి గైకొని యెన్ స విలాస ఖేలతన్” (5-125)లోకైక మాత శ్రీ మహాలక్ష్మి శాంతి, తుష్టి, ధృతి, సన్మతి మొదలైన ముఖ్య చెలికత్తెలతో భక్తితో తన్ను సేవిస్తుండగా, ముని, దేవతాగణాలు ఆశ్చర్యంతో నిండిన కుతూహలంతో బుద్ధితో చూస్తుండగా, స విలాసంగా శ్రీ మహావిష్ణువు ఒడిలోకి చేరింది.

“పుండరీకపత్ర జైత్ర/ ములు స్వామి ప్రసన్ననేత్ర/ ములలో అమృతంపునవ్వు/ మొక్కలు చూచెను రాయడని” లకుమ నాట్యం తర్వాత కూడా రాజు లకుమ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇద్దరూ ఒరసి పట్టుకొని ఉన్నారని అమృతంపు నవ్వు మొలకలు చూసినట్లు సినారె పేర్కొన్నారు.  ఇది ఆమె శాశ్వత కీర్తికి సూచన.

9. ఎఱ్ఱన వర్ణనలు- సినారె  సొంపు

సిత కమల దళంబులకున్/బ్రతియగు లోచనము లందు బ్రబల ప్రసాద

స్మిత రుచి జాలములు దిశా /ప్రతతిన్ బూర్ణేందు రుచుల భంగి వెలి౦గెన్(5-114) తెల్లని పద్మాల రేకులకు సమానమైన అతని కన్నులలో ప్రసన్నతతో కూడిన చిరునవ్వుల కాంతులు విస్తరించాయి. అవి దిక్కుల సమూహాన్ని పున్నమి చంద్రుడి కాంతుల్లా ప్రకాశిస్తున్నాయి అని ఎఱ్ఱన వర్ణన.

ఇందులో అమృతపు నవ్వు మొక్కగా, సిత కమలం, పుండరీకంగా కవి దర్శించారు.

కోఱలు గీటుచు న్నయన కోణములం దహన స్ఫులింగముల్

గాఱగ గార్నముల్ బిగియగా ఘన కేసరముల్ విదుర్చుచున్

మీఱిన యుబ్బునన్ బొదలి  మీదికి మూరెడు పేర్చి కింక దై

వాఱగ బట్టె బిట్టు దితి పట్టి నృసింహు డసహ్య తీవ్రతన్ (5- 95) స్వామి కోఱలుగీటుచు, కళ్ల చిరవనుంచి నిప్పురవ్వలు విడుస్తూ, చెవులు నిశ్చయంగా దట్టమైన పొడవైన కేసరాలు విదులిస్తూ హద్దుమీరిన ఉత్సాహంతో ముందరికి మూరెడు వ్యాపించగా కోపం పెరిగి సహింప శక్త్య౦గా వేగంతో హిరణ్య కశిపుణ్ణి గట్టిగా పట్టుకొన్నాడు. ఇలాంటి చూడడానికి భయంకరమైన ఆ రూపాన్ని కవిగారు లకుమకు తెచ్చి చూపించాడు.

సంధ్యాశోణములు హరి/స్వామినయనకోణములం/దున హిరణ్యకశిపుని నె/త్తురుచారలు చూచె లకుమ.

కేసరములు పటపట నూ/గించుచు గర్చించు క్రుద్ధ/కంఠీరవమూర్తి చూచి/ కంపితయైపోయె లకుమ”.

 నయన కోణం అనే పదాన్ని సినారె వాడుకున్నారు. దహన స్ఫురిలింగము అనే పదాన్ని నెత్తురు చారలుగా  మార్చారు. ఎర్రదనం ఎఱ్ఱన ప్రయోగం తీసుకున్నాడు. కోరలు గీటుచు, కర్ణముల్ బిగియగా, మీఱిన యుబ్బునన్ బొదలి మీదికి మూరెడు పేర్చి ఇన్నిటిని కలిపి ఒక్క  క్రుద్ధ కంఠీరవమూర్తిగా సినారె మార్చాడు. ఈ దెబ్బకు లకుమ రాజు గారి భుజం మీద వాలింది.

10. భీమేశ్వర పురాణం - బసవ పురాణం

            భీమేశ్వర పురాణంలో భీమేశ్వరుడు దక్షారామ వాటికలోకి ప్రవేశిస్తున్నప్పుడు దేవతలంతా ఒకదగ్గరికి వచ్చారట. అది వసంత కాలం. వసంతోత్సవ కేళికి భీమనాథుడే ఆజ్ఞ ఇచ్చినట్లు

            ఆజ్ఞ వాటి౦చె గెలీ విహారములకు / భీమనాథు౦డు  దేవతాగ్రామణులకు

            గంధ కర్పూర కస్తూరికా ప్రశస్త/వస్తుకోటులు నొసగె నవారితముగ

            ఈ భీమనాథుడి స్థానం కర్పూర వసంత రాయల స్థానం అయింది.  అక్కడి దేవతలు ఇక్కడ ప్రజలు. గంధ కర్పూరాదులను భీమనాథుడు దేవతలకిస్తే ఈ వసంతరాయలు తాను ప్రజల మీద చల్లుతున్నాడు. ప్రజలు సంతోషం కోసం.

“తనతోడ నడచువా/ రిని జూచి, అల్లన శి /రము నూచి, మందహా /సము చేసి, నిండు దో

సిళ్లతో మృగమద/శ్రీ చందనరజమ్ము /కుండికలతో అచ్చ/గొజ్జంగి నీరమ్ము

కుమ్మరించె వసంతనృపుడు/కుసుమించె జనచిత్త మపుడు”.  

            భీమేశ్వరుని స్థానాన్ని వసంత రాయలకు కల్పించడం వల్ల గొప్పతనాన్ని పెంచినట్లయింది. రాయలు ఈ భీమేశ్వరుడి భక్తులు. శివభక్తులు శివుడితో సమానమంటాడు. పాల్కురికి సోమన బసవ పురాణంలోది ఈ సంఘటన.  

అచ్యుతుమీద జల్లే దుగ్ధాబ్ధి కన్య/ భారతీదేవి పద్మజు పైని జల్లె

శచి మహేంద్రుని జల్లెవాసంత కేలి/ గంధ కర్పూర కస్తూరికా జలంబు

 అచ్యుతుడు, లక్ష్మి; సరస్వతి బ్రహ్మ, శచీ ఇంద్రులు ఒకరిపై ఒకరు జల్లుకున్నారు అనే మాటల్ని అని వరుస అయిన వారిమీద “వరుస గలిసినవారు /కనుల కాశ్మీర ధూ /ళిని గొట్టి నగినారుఅని సినారె వర్ణించి చూపరులను, పాఠకులను నవ్వించారు.

“చెవిలోన బాఱంగ జిమ్మె గొజ్జగనీట/ గాల భైరవు నొక్క కలువక౦టి” ఇందులో అంత వరస వాయి లేవు. సినారె కర్పూర వసంత రాయలు లో జాగ్రత్తగా పదాల్ని వాడాడు: ప్రౌఢాంగనలు కొత్త/కోడెకాండ్రను దరిసి /చెవులలో పన్నీరు/ చిలికి పర్విడినారు”. ప్రౌఢాంగన అయితే కొత్త కోడెకాండ్రను సమీపించి పన్నీరు జల్లుతారు. ఆ కాలువక౦టిని సినారె ప్రౌఢా౦గన గా మార్చుకున్నారు. ఇది ఔచిత్యం కూడా. దేవతలే పరిమళ జలాలు జల్లుకోవడం చూసి తన్ను తను మరిచిపోయాడు.

11. ఛందో వైవిధ్యం:

            మాత్రా ఛందస్సు విషయంలో మొదటిది నాగార్జున సాగరం. రెండోది కర్పూర వసంత రాయలు. దీనిలో ఖండగతిని కొద్దిగా వాడుతూ, త్ర్యస్ర గతి, మిశ్ర, చతురస్ర గతుల్ని విశేషంగా వాడారు. ఒక రకమైన గతిలో కొన్ని చోట్ల మాత్రల్ని పెంచి, కొన్ని చోట్ల తగ్గించారు. వెంట వెంటనే గతుల్ని కూడా మార్చారు. ఛందో వైవిధ్యం, గతి వైచిత్రి పాఠకుడికి కొత్త ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ప్రతీ చరణంలో యతి, ప్రాస లకు బదులుగా అంత్య నియమాలు వాడారు.

12. సింహావలోకనం:

కవిత్వ శక్తికి అధ్యయనం ఒక అవసరం. ప్రతిభకు ఇది పట్టం గడుతుంది. కవనం ధారగా సాగడానికి ఛందస్సు బాటగా నిలుస్తుంది. చరిత్ర, ఊహ, ఆశ్చర్యం, ఆనందం, అద్భుతంతో కలిసిన ఆత్మత్యాగం దేశరక్షణలో భాగంగా వ్యక్తి స్వేచ్చకంటే గొప్పదిగా అన్వేషించారు.  లకుమ వాస్తవాన్ని గుర్తించింది. తన వ్యక్తి గత జీవితం కంటే  దేశానికి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన విరాగిగా ఆత్మత్యాగిగా వెలిగింది. అందుకే ఇప్పటికీ అక్కడ కస్తూరి సౌరభమే అనడం కవికి ఆ పాత్ర పట్ల ఆదరణకు అనురక్తికి చిహ్నం. పరమ సాధ్వీగా లకుమ రక్తంతో కూడిన  ప్రాణం  అంత్యంత అదరణతో ప్రేమించిన వసంతరాయల జీవితం కొండవీటి మట్టిలో కర్పూర సౌరభమై పంచ భూతాత్మకంగా నిలిచి౦ది.

ఆధారాలు:

ఆచార్య భూమయ్య, అనుమా౦డ్ల: మొదటి ముద్రణ: 2000: కర్పూరవసంత రాయలు కథా కళా ఝంకృతులు: ప్రచురణ మనస్వినీ దేవి, హైదరాబాదు.

ఆచార్యనారాయణ రెడ్డి, సింగిరెడ్డి: 8 వ ముద్రణ 2021: కర్పూర వసంత రాయలు: వరేణ్య క్రియేషన్స్, హైదరాబాదు

ఎఱ్ఱన: 1924:  నృసింహ పురాణము,  వావిళ్ల రామ శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి

జానకీ రాం, ఆచంట: కర్పూర వసంత రాయల కావ్య పరిచయం:

డా. వెంకట రామకృష్ణ శాస్త్రి, రెమిల్ల: 2020: నృసింహ పురాణము, టీకా తాత్పర్యాలు: రాఘవేంద్ర పబ్లిషర్స్, విజయవాడ.

(ఔచిత్యం- అంతర్జాల  పత్రికలో ముద్రితం: AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023: ISSN: 2583-4797

link: https://www.auchithyam.com/advanced/latest/march23_05.php)