-డా. జె. సీతాపతి రావు, తెలుగు అధ్యాపకులు,
సమాజంలో జరిగే దృశ్యాలను, మనసులో మెలిగే భావాలకు చక్కగా ముడి
పెట్టగలిగే వాడు కథకుడు. ‘ఒక కవిత లేదా కథకు కానీ లేదా ఇతర
సాహిత్య ప్రక్రియలకు కానీ మనః పాఠ్యం (mental text) ఉంటుం’దని ప్రపంచ ప్రసిద్ధ జానపద విజ్ఞాని ఫిన్నిష్
విమర్శకుడు ఆచార్య లూరి హాంకో ప్రతిపాదించాడు.
దీన్నే ప్రాచీన అలంకారికులు ధ్వని అన్నారు. ఇదే అంతర్లయ కూడా. కథలోని భావనల్ని ఒక
భాష నుంచి మరో భాషకు సహజంగా అందించగలిగే సృజనశీలుడు అనువాదకుడు. అలాంటి తత్త్వం
ఉన్న వ్యక్తి భారతీయ భాషల్లో ఉన్న అతనికి నచ్చిన మానవీయ కోణాలను స్పృశించిన కథలను ఎంపిక
చేసుకొని ప్రచురించిన అనువాద కథల సంపుటి ‘అద్దంలో గాంధారి
మరో పదకొండు కథలు’.
బహు భాషలను ఆసక్తిగా నేర్చుకొని ఆయా
భాషలనుంచి కథలను ఎంపిక చేసుకొని అనువదించిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు. “ఖానే
వాలేకా నామ్ చోడో, ప్రతి గింజమీద రైతు సంతకం ఉంది. పీటమీద బతుకమ్మ,
పీఠభూమి తెలంగాణ రెండూ ఒక్కటే” అంటూ
తెలంగాణా తెలుగు జాతిని ఆలోచింపజేసిన బహుభాషా పండితులు శ్రీ నలిమెల భాస్కర్. ప్రస్తుతం
కరీంనగర్ పట్టణంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పద్నాలుగు భాషల్లో వీరిది
అందెవేసిన చేయి. నూరేళ్ళ పది ఉత్తమ మలయాళ కథలు, అద్దంలో గాంధారి,
మంద అనే అనువాద కథా సంకలనాల్ని
వెలువరించారు. మంద మరియు నాకూ స్వాతంత్య్రం వచ్చింది అనే రెండు కథలు,
స్వతంత్ర కథలు. అనువాదానికి కథల్ని
ఎంచుకొనే వీరి ధోరణి విలక్షణంగా కనిపిస్తుంది.
“అద్దంలో గాంధారి” సంకలనంలో కన్నడం, తమిళం, మలయాళం,
హిందీ, మరాఠీ, బెంగాళీ
ఆరు భాషల్లోంచి రెండేసి కథల్ని ఎంపిక చేసి ప్రచురించారు. భారతీయ కథా సాహిత్యంలో
వైవిధ్యాల్ని, జీవన స్థితుల్ని ఋజువు చేసిన కథలివి. ప్రాంతాలు
వేరైనా జీవిత సమస్యలు, సత్యాలు అన్ని చోట్లా సమానమే. భారతీయ
జీవన అంశాలను ఒక్క చోట నిలిపి భారతీయ సాహిత్యంపై విహంగవీక్షణం చేయిస్తాడు, భాస్కర్.
డా. నలిమెల అనువాద సృజనాత్మక
ప్రక్రియలకే పరిమితంకాక పరిశోధనలో ‘‘తెలుగు సామెతలు-ద్రావిడ భాషలతో తులనాత్మక పరిశీలన’’ అన్న అంశంమీద ఎం.ఫిల్, ‘‘తెలుగు మలయాళ సామెతలు -
కుటుంబ జీవన చిత్రం’’ అనే సిద్ధాంత వ్యాసంతో ఉస్మానియా
యూనివర్సిటీ నుంచి పిహెచ్. డి., పొందారు. వివిధ
భాషాసాహిత్యాలపై పరిశోధనా వ్యాసాల్ని వెలువరించడంతోపాటు ‘‘సాహితీ
సుమాలు’’ శీర్షికన వివిధ భాషాసాహిత్యాల్ని, ఆయా భాషల్లోని రచయితలను పరిచయం చేశారు. ‘‘తెలంగాణ
పదకోశం’’ వీరికి భాషపట్ల ఉండే మమకారానికి పతాక స్థాయి.
2014, మార్చి10న 2013 సంవత్సరానికిగాను అనువాద
సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. మలయాళంలో అనువాద నవల
స్మారకశిలలుకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు,
డా. బోయి భీమన్న స్మారక పురస్కారం రూ.
లక్ష నగదు, అనువాదరంగంలో
కృషికిగాను 2014లో, 1997లో అద్దంలో గాంధారి అనువాద రచనకు తెలుగు విశ్వవిద్యాలయ
పురస్కారం, 1998లో
మద్రాస్ కళాసాగర్ సిరిసిల్ల శాఖ పురస్కారం, 1999లో కళాజ్యోతి కరీంనగర్‌వారి
పురస్కారం, 2000లో
కవిసమయం పురస్కారం, 2001లో ఏపీ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం,
2001లో బీఎన్ శాస్త్రి పురస్కారం,
2003లో సిరివెలుగులు (సిరిసిల్ల)
పురస్కారం, 2006లో
అధికార భాషా సంఘం పురస్కారం, 2008లో ద్వానా శాస్త్రి పురస్కారం,
2010లో ఇండియన్ హైకూక్లబ్ అనకాపల్లివారి
పురస్కారం, ఇంకా
పలు స్వచ్ఛంద సాహితీ సేవాసంస్థలచే సన్మానాలు పొందారు వీరి సాహితీ వ్యవసాయానికి
మచ్చుతునకలు.
కథల్ని ఎన్నుకోవడం, వాటిని తెలుగుకు ఎంతవరకు అవసరం అన్న
విషయాలను కూలంకషంగా పరిశీలించిన మీద మాత్రమే ఇతర భాషల కథల్ని ఎంపిక చేసుకోవాల్సిన
అవసరం ఉంటుంది. ఈ నేపథ్యాలకు జాగ్రత్తగా పరిశీలించి నలిమెలి భాస్కర్ నిర్ణయం తీసుకున్నట్లు
కనిపిస్తుంది. మొత్తం కథలు పన్నెండు. కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో రెండేసి కథలను తీసుకున్నారు.
సమాజానికి వెన్నుముక కుటుంబం. దానిలో
ప్రధాన భూమిక ఆలుమగలు. వీరు సక్రమంగా జీవనం సాగిస్తూ రాబోయే తరానికి తీర్చి
దిద్దాలి. అప్పుడే ఉత్తమ పౌరులు వస్తారు. అన్నిటికంటే విలువైనది జీవితం. దాన్ని
పూర్తిగా అనుభవించాలి. కావాలని ఆత్మహత్యలు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. “మగడి
మనోగతాన్ని ఎరిగిన సతిగా మారాను. మాగాడి అభిప్రాయానికి పూర్తిగా నా నడవదికను
అలవర్చుకున్నాను. నిజం.. ఇది పూర్తిగా అతను ఆపాదించింది కాదు. నా వ్యక్తిత్వాన్ని
నేనే కోల్పోయాను. అతనితో అనవసరంగా వాదించండం, పోరాడ్డం ఎందుకనే సోమరితనం తోనే నేను నేనుగా ఉండే ప్రయత్నం
చేయలేకపోయాను”(పుట-4). భర్త భార్యను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆమెను కావాలని ఇబ్బందుల్ని పెట్టడానికా? అలాగే
భార్య వైపునుంచీ ఇదే ప్రశ్న. ఒక సమస్యకు రెండువైపులనుంచీ
ఇద్దరి వైపునుంచీ ఆలోచించాలి. కేవలం ఆవేశంతోనో, కోపంతోనో
నిర్ణయాలు తీసుకోకూడదు. కోప తాపాలతో నిర్ణయాలు ఆ కుటుంబాన్ని ఇబ్బందులలోకి నెట్టి
వేస్తాయ్.
శీలా కచ్చితమైన అభిప్రాయాలు కల్గిన
స్త్రీ. పైగా ప్రసూతి వైద్య
నిపుణురాలు. భార్య, భర్తలు ఎందుకు ఉద్యోగాలు చేయాలి.
వీరిద్దరూ ఉద్యోగాలు వెళ్తే పిల్లల్ని ఎవరు సంరక్షించాలి? ఒక
స్త్రీ ప్రాచీన భావజాలం కలిగినప్పటికీ తన భర్త మీద ఉండే గొడవల నేపథ్యంలో ఒక
ఆడపిల్లతో పోషణ చేయలేని తల్లి ఉన్నతమైన భావనతో ఒక స్థాయికి చేర్చడాన్ని ఈ కథ
సూచిస్తుంది. మొదట్లో కష్టంగా ఉన్నా, తర్వాత పడే తృప్తి
ఎలాంటి భావనల్ని ఇస్తుందో విశ్లేషిస్తుంది. కేవలం భర్త ఇచ్చే భరణం కోసం ఆతృతగా
ఎదురు చూడకుండా తన శక్తితో బాధ్యతల్ని తీసుకునే స్త్రీ జీవితాన్ని దర్శించవచ్చు.
ఇంకో పార్శ్వంలో చూస్తే కేవలం తండ్రి
మాత్రమే చట్టం ప్రకారం పిల్లల పోషక కర్త. భార్యకు ఇష్టం లేకపోయినా, భర్తకు ఇష్టం లేకపోయినా విడిపోయాక
పోషించాల్సినది కేవలం మగవాడే. దీనివల్ల ఉండే లేదా వచ్చే సమస్యలకు సహధర్మిచారిణి
కాకపోయినా అర్థం చేసుకోవలసిన అవసరాన్ని ఉభయులు కలిగి ఉండాలి. ఒక చక్కని ఆధునిక
జీవిత విధానాన్ని ఇందులో ధ్వనింపజేయడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. న్యాయ వ్యవస్థ
పరిష్కారాల్ని సక్రమంగా సూచించడం సాధ్యంకాదని ధ్వనింపజేస్తుంది. ఒక్క మాటలలో
చెప్పాలంటే అబల కాదు సబల అని స్త్రీ అని అనిపిస్తుంది.
భర్త ప్రధానంగా చూపే కథ “గురుత్వాకర్షణ”.
ఇది బెంగాలీ భాషనుంచి అనువదించిన కథ. నిజానికి సైన్సులో జరిగే భూమికి ఉండే ఆకర్షణ
కాకపోయినా భూమి పట్ల ఉన్న మమకారం ఇది. కలకత్తాలో పని చేసి వారాంతంలో సుదూరంగా ఉన్న
తన గ్రామం, భార్య, పిల్లలు, తోటలు, పంటలు
వాటికోసం ఒక శ్రమ జీవి పడే ఆరాటం, వారి అన్యూన్యత, అనురాగాలు కుటుంబ సంబంధాలు ఇందులో చూడవచ్చు. పల్లెనాటి ప్రత్యేకతలు ఏ
కోశానా లేని పట్నాలలో కేవలం ఆర్థిక సంబంధాలే ఉన్నాయని ఇవి మానవ సంబంధాలను
దెబ్బతీసేవిగా దారిస్తున్నాయని కవి ఆవేదన ఈ కథలో అంతర్లయ. బెంగాలీల జీవన
విధానాన్ని సూచిస్తూ కలకత్తాలో పని చేస్తున్న ఒక పల్లెటూరి వ్యక్తి పట్నంలో ఉన్న
సంబంధాలను, పల్లెల్లో ఉన్న సామరస్య భావనలను క్రోడీకరిస్తూ
చూపించిన కథ బెంగాలీ కథ ఇది.
“అద్దంలో గాంధారి” కథ భారతంలో ఉన్న
గాంధారి పాత్ర కథే. పార్శ్వాలు, విశ్లేషణ విభిన్నం, ఆలోచనీయం. ప్రతి మనిషికి ఒక
వ్యక్తిత్వం ఉంటుందని అది మసిపూసి మారేడు కాయ చేసే సమాజానికి అనుసరించి వ్యక్తుల
ప్రవర్తనలు మారిపోవడానికి నిదర్శనంగా ఈ పాత్రను ఎంపిక చేసినట్లు అనిపిస్తుంది. కన్నడ
భారతంలో ‘పర్వ’ నవలను రాసిన యస్. యల్. భైరప్ప
దృష్టికోణాలు కొంతవరకు కలిగి ఉండి, సామాజిక జీవన విధానంలో
కలిగే భావాలను వ్యతిరేకదిశలో సమాజంలో చెలామణి అవ్వడాన్ని ఈ కథ ధ్వనింపజేస్తుంది.
గాంధారి అందగత్తే. ఆమె కళ్లను చూసి
పొగడని వారు లేరు. అలాంటిది ఆమె కళ్ళకు గంటలు కట్టుకోవడం కేవలం నిరసనకే అనేది వీరి
భావన. “గాంధారీ! నిజం చెబుతున్నాను, నీ ఈ కళ్లని కలువలనుకొని తుమ్మెదలు ముద్దాడుతాయి. అంత అందంగా
వున్నాయి నీ కళ్ళు. నిన్ను వరించే రాకుమారుడు నీ కళ్లను చూస్తూనే మొదటి రాత్రి
పొద్దు పుచ్చుతాడు”(పుట. 17)ఇది చెలికత్తె చేసిన వ్యాఖ్య.
“అతను కళ్ళు లేకుండా గుడ్డివాడు. నేను
కళ్లున్నా గుడ్డి దాన్ని. గుడ్డివానికి గుడ్డిది జోడి... కూతురు గుడ్డిది అనే అంశంతోనైనా
పెళ్లి ఆగిపోతుందేమో నాన్న చిన్ని ఆశ. నాలో కానీ రాజగురువుగారికి ఈ వార్త
తెలియడంతో వారన్నారట ఇలా- గాంధారి ఉత్తమ శీలవంతురాలు. లోకంలో సూర్య చంద్రులున్నంత
కాలం ఆమె కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. పతి భక్తి పరాయణురాలు”. (పుట 21) ఈ
మాటలుకన్నా చెవుల్లో వేడి సీసంపోయడం నయం అని గాంధారికి అనిపించింది. ఒక్కసారి
కట్టుకొన్న ఆ పట్టీ తమాషాకో, బెదిరింపుకో కట్టుకున్న ఆ పట్టి జిగురులాగా నా విశాలమైన కళ్లని మూసి
గాఢాంధకారంలో ఈ గాంధారిని ముంచెత్తింది. ఒక విషయాన్ని పదిమంది ఒకేలా చెప్తే అదే
నిజంగా మారిపోతుంది అన్న హిప్నాటిజం భావనను ఇక్కడ రచయిత స్ఫురింపజేస్తున్నారు.
చివరికి గుడ్డి రాజుతో వివాహం.
బిడ్డల్ని చూచుకోలేక,
వారి అలనాపాలనా కూడా చూడక తన కన్నవారు తన అభిప్రాయాన్ని అడగకుండానే కట్టబెట్టారు
అన్న భావనతో చివరకు మెట్టినింటినికూడా నాశనం కావాలనుకున్న భయంకరమైన తత్త్వాన్ని చూపించడం
ఈ కథ ప్రత్యేకత. ఇప్పటి సీరియల్లకు ఏ మాత్రమూ తక్కువ కానీ విలనిజం ఈ పాత్ర
స్వభావం. ఆడవారికి నచ్చాలంటే వారిలోని ఉండే వికృత భావాలను వేరే పాత్రలద్వారా బయటకు
తీసుకువస్తే దానిలో వారు ఆనందాన్ని పొందుతారు. దీన్ని మనోవిజ్ఞాన వేత్తలు దమనం అనే
మానసిక భావనగా చెబుతారు. గుడ్డి భర్త పిల్లల్ని చూడగలిగినా మొండిదైన అహం. ఆ పై
సమాజం దాన్ని సానుభూతిగా చూపడం. పుట్టినింటివారి మీద తీరని పగ. వెరసి ఆ భావన
వైవిధ్యాల సుడిగుండాలగా మారింది. చివరలో పశ్చాత్తాపం చెందినా అప్పటికే కాలం
కారిపోతుంది. ‘నేను కళ్ళు విప్పుకొని వచ్చిన దాన్ని కాను, కప్పుకొని వచ్చిన దాణ్ణి అనడం’ ఈ పాత్రకు
పరాకాష్ట.
“బొమ్మకు అటువైపు” కథా సంగతికి వస్తే-
ఇందులో కుటుంబవ్యవస్థే ప్రధానాంశం. ఇందులో భర్తది శాడిష్టు స్వభావం. నిగమశర్మ అక్క
తన తమ్ముడు ఇల్లు మొత్తం దోచుకువెళ్ళిపోయినందుకు బాధపడలేదట. తన ముక్కెర పోయినందుకు
బాధ పడిందట. ఆమె దృష్టిలో అది మంగళప్రదం. అలాంటి దాన్ని తీసుకువెళ్ళడం బాధాంశం.
ఇక్కడ తాగుడు భర్త. కట్నం ఇవ్వలేని తండ్రి. విలువలున్న కుటుంబ స్త్రీ. కోర్టులకు
వెళ్ళడమే కాలయాపన. ఆపై న్యాయం కోసం ఏళ్ళు గడిచిపోతాయి. ‘స్త్రీ పురుష సంబంధాల విషయంలో కోర్టు ఏం
తీర్పు నిస్తుంది? విడిపోకుండా వుండండి అని తీర్పు చెప్పే
న్యాయాధిపతి పరస్పరం అన్యోన్యంగా ఉండండి అని ఉత్తర్వులు ఇవ్వగలడా?’ అని న్యాయవ్యవస్థనే సవాల్ చేయగలిగే కథ ఇది. మంగళ సూత్రాన్ని భర్త ఉండగానే
అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో టైలరింగ్ మిషన్ కొనుక్కొని
ఆధునికమైన జీవనాన్ని సాగించిన పంథా కన్నీళ్లు తెప్పించక మానదు. భర్త త్రాగుడుతో
తనువు చాలించినా సుమంగళిగా అలంకరించుకొని తర్వాతకూడా ప్రతీకారం తీర్చుకోవడం
అద్దంలో గాంధారి కథకు కౌంటర్ గా కనిపిస్తుంది ఈ కథ.
మరణం మనిషికి చెంతనే ఉంటుంది. ఆకలి
దాన్ని ఒక సాధనం. పేదరికానికి తమ్ముడే ఈ ఆకలి. పని లేని, పని దొరకని పల్లెల్లో పరువుగా బతకలేని పడిన
కుటుంబ దీనగాథ “ఆకలి”. వలసలు పోవడానికి ఉన్న కారణాలు అవి జీవన విధానంపై ఎలాంటి
ప్రమాదకరమైన పాత్రను పోషిస్తాయో వివరిస్తుంది. ఇది ఈనాటి చిరుద్యోగులను, చదువులు ఉండీ కొలువులు లేని కుటుంబాలను ధ్వనింపజేస్తూ కథనం సాగిస్తుంది.
ఏ ఆకు దొరికేతే దానితో కడుపు నింపుకునే దయనీయమైన స్థితికి కారణం ఎవరు అన్నది
పాఠకుల వదిలేయడం కథలో కొత్తదనం. ప్రశ్నలను గుప్పించకుండా సహజంగా గమనం సాగించడం మరో
తత్త్వం. ఆలోచనకు కావల్సిన స్థితి ఉంటుంది. అంతిమంగా తెలియకుండానే ఆకలి చావు.
దీనికి కథకుడు– ‘పొద్దు పొడిచింది. అందరూ వచ్చి వారి వారి
పనులు చేసుకుంటున్నా ఆ కుటుంబం వారు లేవలేదు. వాళ్ళు ఆకలితో చావలేదు. అలా అనడం
తప్పు. ఆకలిని చల్లార్చుకోబోయి చచ్చారు. పలు రకాల ఆకుల కూరల్లో ఉన్న ఓ విషపు కూర
వాళ్ళు చంపుకోవాలనుకున్న ఆకలికే ఆహారం దొరికింది’ అంటూ
ముగిస్తాడు. మానవత్వం మృత్యువులోకి వెళ్లిపోవడం ఈ కథలో సూచిస్తున్నాడు.
తీవ్రవాదానికి కారణం ఏమిటి? ఎవరు? అన్న ప్రశ్నలను
ఆలోచింపజేస్తూ కొంతమంది కారకులు అన్న విషయాన్ని ధ్వనింపజేయడం “ఆగస్టు-25” కథాంశం.
మంగలి కొడుకును అన్యాయంగా తీవ్రవాదిగా ముద్రవేసి పోలీసులు దౌర్జన్యంగా చంపేస్తారు.
అతడిని కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఆ మంగలి తండ్రి అదే రోజు తన
కొడుకు చావుకు కారణమైన యస్. ఐ., కొడుకును తన మంగలి కత్తెతో
పీకను కోయడం కథలో ప్రతీకారం. కంచే చేను మేస్తే న్యాయం ఎక్కడ దొరుకుతుంది అని
ధ్వనింపజేయడం ఈ కథా తత్త్వం.
శుభ్రత కోసం ఏర్పడినవి ఆచారాలు. అవి
తార్కికమైన, సహజమైన పద్ధతిలో ఉండాలి.
జంతు ధర్మాలు మనం ఎంత మార్చినా మారవు. మనిషి మాత్రం అందుకు భిన్నంగా కనబడుతున్నాడా? వాటిని తగిన విధంగా మాత్రమే మనం నడుచుకోగలగాలి. మనలో ఉండే జంతు స్వభావాలు, రాక్షస భావనలు ఎలా బయటకు వస్తాయో సూచించిన కథ “మూర్తి దంపతులు”. ఎంతో
గారంగా పెంచిన మూర్తి దంపతుల కుక్క పిల్ల కథ. పైకి కనిపించినా మనిషిలో ఉండే
క్షమాగుణాన్ని క్రూరంగా మారడానికి చిన్న కథాంశం ద్వారా సూచించాడు. శాఖాహారం
బదులుగా ఒక ఎలుకను బయట తిన్నందుకు ఇంటికి తెచ్చి రాత్రంతా కొట్టి చివరకు దాన్ని
చంపడం పెద్దవాళ్ళైన మూర్తి దంపతులకు ఎలా మనసొచ్చింది అని సూచిస్తాడు.
మట్టిని నమ్ముకున్నవాడికి మనసు
ఉంటుంది. కరెన్సీకి కట్టుడయినవాడు కారుణ్యాన్ని కాల్చేస్తాడు. ఏ మనిషి ప్రకృతిని
సక్రమంగా వాడుకుంటాడో అతడే మనసున్న మనిషి. పల్లెల్లో ఉన్న వారి జీవనం, పట్నాలలో వారి జీవనాన్ని పోలుస్తూ చెప్పే
కథ కాలుష్యం. కలకత్తా జీవనం అక్కడ ఉండే దయనీయమైన ఆర్థిక సంబంధాలను, కాలుష్యపు కోరల విలయ తాండవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం ఈ కథలో
ప్రత్యేకత.
అవినీతి అక్రమాలకు అడ్డాగా మారుతున్న
సమాజం. దానికోసం బలితీసుకుంటున్నా అమాయకపు మనుషుల జీవితాలు, పెద్దమనుషుగా చెలామణి అవుతున్న బడా బాబుల
మానసిక స్థితులు కథాంశం “ఇల్లు”. బొగ్గు గనుల్ని కొండ ప్రజలతో రాత్రికి రాత్రి
తవ్వించి, లారీలకు ఎక్కించి అక్రమంగా తరలించే బాదాబాబులు
వారిని ఎలా ఉపయోగించి మాయ మాటలు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారో తెల్పిన కథ. మనిషి
స్వార్థం ఆపై అదనంగా అక్రమంగా సంపాదించుకునేందుకు ఎంతటి పాపానికైనా ఒడిగడతారని
సూచించడం ఈ కథలో ప్రత్యేకత.
వ్యక్తి స్వార్థం నుంచి స్థాయిని
పెంచి ఎక్కువ మంది ప్రాణాలను సైతం తీసుకోవడం ఎలాంటి సందేహంలేని, వెనుకాడని తత్త్వాన్ని తెలిపే మరో కథ
“బలి”. పురుగులు మందుల వ్యాపారం మనుషుల్ని
ఎలా బలిగొంటుందో విశ్లేషిస్తాడు. ఒక జర్నలిస్ట్ చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఆ
విషయాన్ని ఎడిటర్ కి తగిన విధంగా వివరించి చెప్పాడు. తను అన్నీ చూసుకుంటానని ఆ
జర్నలిస్ట్ మాధవ రావును విదేశాల్లో శిక్షణకు ఎంపిక చేశారు. తన మనస్సు మాత్రం
స్పష్టంగా చెబుతూనే ఉంది- బలి తీసుకున్న ఆ మందుల కంపెనీని ఏమి చేయలేడని. ఏది
భారతదేశంలో ఫోర్త్ ఎస్టేట్ కు ఉన్న క్రమశిక్షణ. ప్రభుత్వాల పని తీరును ఎప్పటికప్పుడు
ప్రజలకు తెలపాల్సిన వార్తలను వ్యక్తి స్వార్థంతో బలైపోవడం ఈ కథలో ధ్వన్యంతరగా
కనిపిస్తుంది.
మానవ సేవే మాధవ సేవ. ఇలాంటి మాటలు
వినడానికి బాగుంటాయి. వ్య్వహారానికి వచ్చేటప్పటికి వ్యక్తి స్వార్థాలు
ప్రవేశిస్తాయి. విశ్వ శ్రేయస్సు కోరుకుంటున్నామనుకొనే పెద్దమనుషులు స్వార్థ శక్తి
దాసోహం అవడం ఈ కథకు మూల సూత్రం. ఒక ఉరిశిక్ష పడిన వ్యక్తి ని తన ప్రయోగాలకు
వాడాలని భావించిన ఒక వైద్యుడి కథ ఇది. జక్సో కంపెనీ వారు పెద్ద మొత్తంలో బహుమతిని
విల్సన్ సిండ్రోమ్ పై ప్రయోగాలు చేసి
మందులు కనిపెట్టిన వారికి ఈ బహుమతిని ఇస్తారు. విల్సన్ టెంపరేచర్/ థైరాయిడ్ సిండ్రోమ్ అని దీనికి పేరు. ఇది
లో టెంపరేచర్, హెయర్ లాస్ లాంటి తత్త్వాలు వస్తాయి.
విటమిన్స్, పౌష్టికాహారం తగ్గడం వల్ల ఈ విల్సస్ సిండ్రోమ్
రావచ్చు. ఈ అంశాలతో కూడిన కథ- గిన్నీ పిగ్.
గిన్నీ పిగ్ అనేది ఎలుక జాతికి
చెందినది. తెలివైన జంతువు. మానవ శరీరానికి దగ్గరగా దీని శరీర నిర్మాణం ఉంటుంది.
దక్షిణ అమెరికాలో దీన్ని తింటారు. ఎక్కువ మెడికల్ వెల్యూస్ ఉన్న జంతువు. పైగా
పెంపుడు జంతువు కూడా. 4 నుంచి 5 సంవత్సరాలు జీవితకాలం. ఉరిశిక్ష పడిన అతడి మీద ప్రయోగాన్ని విజయవంతంగా
పరీక్షించదలచిన డాక్టర్ చివరికి పాథర్ దగ్గరికి వెళ్ళడం అతడు ఎక్కువ డబ్బును
ఆశించడం చేస్తాడు. ఇది వ్యక్తి స్వార్థంగా కూడిన బలి కథకు వైద్య విద్యా సంబంధమైన, మత పరమైన స్వార్థాలకు నిదర్శనం.
చివరిగా ఎవరు హిందువు? అని ప్రశ్నిస్తూ సాగిన మరో బెంగాలీ కథ
“ఎవరు హిందువు”. మతం అన్న పదానికి మానవత్వం కలిగి ఉండడమే అన్న అర్థాన్ని స్పృశిస్తూ
సాగిన కథ ఇది. రోజూ గంగా స్నానం తప్పని సరిగా చేసిన ఒక ముసలి వయస్సు వచ్చిన
వ్యక్తి తను గంగలో మునగడానికి వెళ్ళే వైనాన్ని సూచిస్తూనే ఒక వ్యక్తి అపస్మార
స్థితిలో ఉన్న వాడిని కాపాడడం ఇంతకీ అతడు వేరే మతస్థుడు. మతం కన్నా మానవత్వం
గొప్పది అని నిరూపించిన కథగా దీన్ని చెప్పవచ్చు.
మొత్తం కథల్ని పరిశీస్తే భారతకాలం
నుంచి ప్రస్తుతం వరకు ఉన్న కుటుంబం, అందులో స్త్రీ, మతాల విశ్వాసాలు
మనుషుల్ని ఏవిధంగా ప్రవర్తింపజేస్తున్నాయో కతానాంశాలద్వారా సూచించడం. వాటికి
ఆధునిక భావనల్ని ధ్వనించేలా విశ్లేషించడం. అనువాదాల అవసరాలను పాఠకులు
గుర్తించాల్సిన స్థితిని ఈ కథలు చెబుతున్నాయ్. తెలుగు వారికి ఉండే తెగువను, కుటుంబం పట్ల ఉండాల్సిన కర్తవ్యాలను తగిన విధంగా బాధ్యతలను వహించాల్సిన
తీరు తెన్నులను ఈ కథలు చక్కగా దర్శింపజేస్తున్నాయ్.
No comments:
Post a Comment