Saturday, November 29, 2014

అందాలకు....మెరుపు
అందాలకు కొసమెరుపెప్పుడు?
సంసారానికి జీవం ఎప్పుడు?

మధ్యతరగతి అంథహాసం
మబ్బు వీడని సూర్యకాంతి
నింగినంటిన మెరుపు ధరలు
కల్లలైన జీవితపు పగటి కలలు
నరుని మనసు నాట్యమాడితే?!

ఇంటిలోన ఈగల మోత
కడుపులోన ఈగలమోత
అందమని పేరే ఓ నటన

మట్టి కలిపిన మనిషి చూడు
దిక్కులేని తెలివి చూడు
మనిషినంటిన కలిమిచూడు
కుళ్ళుచాటున కులముచూడు

మెరుపునున్న కాంతి కావాలా?
దగ్గరున్న మంచి వదలి
లేని దగ్గులు మానుమింక
భూమినుండి బతుకుతెరవు
చూడుమింక

ఒట్టి మెరుపుల గొప్పలేల?
బతుకివ్వని తిండి ఏల?
నీతిలేని కలిమి ఏల?
కలకాలం కుళ్ళుతో
కోట్లుండినా చావు ఏల?
ఏదినిజం? ఏది శాశ్వతం...

Thursday, November 20, 2014

పదాలలో ఉన్న కొన్ని అల్ప, మహాప్రాణాక్షరాలు



                                                పదాలలో ఉన్న కొన్ని అల్ప, మహాప్రాణాక్షరాలు
                                                                   -డా. జాడ సీతాపతిరావు,
            సాధారణంగా మనం వాడే పదాలలో ఉన్న అక్షరాల్ని రాసేటప్పుడు కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. దానికి కారణం  ఆ పదాలను సరిగ్గా అనకపోవడం కానీ, దానికి మూల రూపం తెలియకపోవడం, వాటిని తరచుగా వాడకపోవడం మొదలైనవి కారణాలు కావచ్చు. ఎక్కువమంది మనం ఎలా అంటున్నామో అలాగే రాయాలి అని పదాల అర్థాలను పట్టించుకోకుండా కొందరు ఉంటున్నారు. తద్వారా అస్పష్టతకు దారితీస్తున్నది. ఈ మహా ప్రాణ అక్షరాలు సంస్కృత భాషకు సంబంధించినవి, వాటిని సరిగ్గా ఉచ్చరించాలి. తెలుగులో మహాప్రాణాక్షరాలు లేవు. వాటిని మనం తెలుగులోకి 19 మహాప్రాణాక్షరాలు దిగుమతి చేసుకున్నాం. మహాప్రాణాక్షరాలు అంటే ఉచ్చారణలో ఎక్కువ ఒత్తిడితో అనేవి, జట(కొన్ని ప్రాంతాలలో ఒత్తు అంటారు. అక్షరం కింద చిన్న గీత ఉన్నది) ఉన్న అక్షరాలు అని సామాన్య అర్థం. క-చ-ట-త-ప వర్గలోని 2, 4 అక్షరాలు మహాప్రాణాలు. ఇప్పుడు మహా ప్రాణాక్షరాలున్న వాక్యాలు, పదాలు చూద్దాం-
            వాహనాల వెనుక నిదానమే ప్రధానము అనే వాక్యాన్ని రాస్తుంటారు. అంటే వేగంగా వెళ్లకుండా, సమవేగంగా వెళ్ళడం ముఖ్యం అని అర్థం. నిదానము అంటే ఆత్రపడకుండా విచారించడం/ వెళ్ళడం. ఇక్కడ అల్ప ప్రాణ అక్షరం “దా” సహజవేగాన్ని, దీర్ఘం కావడం ఎక్కువ దూరాన్ని కూడా సూచించవచ్చు. ప్రధానం అనే పదం “ముఖ్యం” అనే అర్థాన్ని నొక్కి వక్కాణిస్తున్నది. కాబట్టి నిధానం కాదు. నిదానం. ప్రదానం కాదు ప్రధానం. ప్రదానం అంటే ఇవ్వడం అని అర్థం. నిధానం అంటే ఉంచుట, పాతర అని అర్థాలు. దీనికి మూల రూపం నిధి”. దీని నుంచి వచ్చింది నిధానం అని తెలుసుకోవాలి. 
            ఈ సందర్భంలో రంగులతో రాసేవాడు అక్షరదోషాలతో రాసినట్లయితే మరింత అనుమానాలు వస్తాయి. నిధనమే అని రాశాడనుకోండి నిధనం అంటే కులం, చావు, చేటు అని అర్థాలు. నిధనమే అంటే వాడి చావే వీడికి ముఖ్యం అన్నమాట.
            ప్రదానము అని రాశాడనుకుంటే ప్రకృష్ట దానము, గొప్పయీవి అని అర్థాలు. మంచి దానం చేయడం అన్నమాట. నిదానంగా వెళ్ళడం మంచి దానం లాంటిది అని అర్థం చేసుకోవాలి. వాడు తెలియక రాసినా అది భావ దోషం కాదు. ఎందుకంటే మెల్లగా వెళ్ళడం వల్ల ప్రాణాలు పోకపోతే ఈ పదం సరిపోతుంది. ప్రధనము అని రాశాడనుకోండి దానికి అర్థం యుద్ధం, చీల్చుట. కాబట్టి రాసే వారు సరిగ్గా రాయాలి. రాయు అనే పదం వ్రాయు నుంచి వచ్చింది. వ్రాత నుంచి వ్రాయు అయింది. రేఫ పోయి రాయు అని అంటున్నాం. కానీ “వాడు గోడకు వీపును రాసాడు” అన్నచోట, “వాడు రాస్తున్నాడు” అన్నచోట సందర్భాలు తెలియకపోతే అపార్థాలు చేసుకునే వీలు ఉంది కదా!
            భోజన శాలలలో (హోటల్స్) “శాఖాహార భోజనం మా ప్రత్యేకత” అని రాయడం మనం చూసే ఉంటాం. శాఖం అంటే కొమ్మ, వేద భాగం,  చేయి అని అర్థాలు. అంటే ఆ భోజనంలో కొమ్మలు వస్తాయి. లేదా చేతులు వస్తాయి. అంటే మాంసాహారమా లేకపోతే కూరగాయల ఆహారమా అనే సందేహం వస్తుంది. నిజమైన పదం కూరగాయల భోజనం కదా అంటే శాకాహారం అని రాయాలి. శాకం అంటే కూర అని అర్థం. ఈ కూర ఆకు, పువ్వు, కాయలు మొదలైన భేదాలతో పది రకాలు. శాకం అన్న పదానికి టేకు చెట్టు, ఒక ద్వీపం, శక్తి అనే నానార్థాలున్నాయి.  
            భేదం అన్న చోట మొదటి అక్షరమే మహాప్రాణం. దీని ఉచ్చరించేటప్పుడు సరిగ్గా అనాలి. మరో పదం బోధన ఇక్కడ మహాప్రాణంగా తెలుసుకోవాలి. ఉచ్చారణ అన్న పదంలో మహా ప్రాణ అక్షరం లేదు. ఉత్ అనేది ఉపసర్గ. పైకి అని అనడం అని గమనించాలి. ఉచ్ఛిష్టాన్నము అనే చోట “చ్ఛి” మహాప్రాణం. ఇతరులు తినగా మిగిలిన అన్నం అని అర్థం. ఉచ్ఛ్వాసములో “చ్ఛ్వ” మహాప్రాణాక్షరం. ఊపిరి బయటకు వదలడం అని అర్థం.  కచ్చితంగా అన్న పదంలో మహాప్రాణ అక్షరం లేదు. మనం ఒత్తి పలికేస్తూ మొదట ఉన్న అక్షరాన్ని క బదులుగా అని అనేస్తుంటాం. ఖండితం అన్న పదంలోని ఖ వల్ల ఇలా అని ఉండవచ్చు. కచ్చితంగా అనే పదం మాత్రం నిఘంటువులో ఉంది. కచ్చితం అంటే ఎచ్చు తక్కువలు లేకుండా సరిగా ఉండేది అని అర్థం. ఖండితం అంటే నరకబడినది అని నిఘంటువులోని అర్థం. ఖచితం అనే మరో పదం ఉంది. ఈ పదానికి చెక్కబడినది అని అర్థం.
            ఇంకో మహా ప్రాణాక్షరం అర్థం. అర్థం అంటే శబ్దార్థం, ఇంద్రియార్థం, కారణం, ధనం, నివృత్తి, న్యాయం, ప్రయోజనం, వస్తువు అని అర్థాలు. అర్ధ అంటే సగం అని అర్థం. దీని ఉచ్చారణ సరిగా అనాలి, దాన్ని గమనించాలి. అర్థన అంటే యాచన, వేడుకోలు అని అర్థాలు. విద్యార్థి అన్న చోట ఈ పదం మనం సరిగా వాడాలి. విద్య లో ద్య అల్పప్రాణం, విద్యార్థిలో ర్థి మహాప్రాణం.
            యథేచ్ఛగా విహరిస్తున్నాడు అనే వాక్యంలో రెండు మహా ప్రాణాక్షరాలు ఉన్నాయి. థే, చ్ఛ. యథా+ ఇచ్ఛ అని విభాగం. ఇచ్చవచ్చినట్లు అని దీనికి అర్థం. ఇక్కడ ఇచ్చ అని ద్విత్వాక్షరం వాడడం జరిగింది. ఇది దంత్యమైన చ కారం. వాంఛ అనే పదం దీనికి పర్యాయ పదం అని తెలుసుకోవాలి. ఇక్కడ మహా ప్రాణాక్షరం ఉంది.   
            నేను యథార్థమే చెబుతున్నాను అనే వాక్యంలో మహా ప్రాణాక్షరాలు థా, ర్థ లు ఉన్నాయి. సత్యం అని దీనికి అర్థం.  యథాక్రమం అనే పదంలో క్రమాన్ని అతిక్రమించక అని అర్థాన్ని గ్రహించాలి. “యాదాస్తు” అనే హిందీ విశేషణంలో మాత్రం మహాప్రాణాక్షరం లేదు. దీనికి ఆజ్ఞాపూర్వకమైన ఉత్తరం అని అర్థం.
            “అభ్యాసము కూసువిద్య” అనే సామెతలో అభ్యాసముద్వారానే విద్య వస్తుంది అనే భావన ఉంది. అభయ, అభాగ్యం, అభిలాష, అభ్యర్థి, అభ్యసనం, అభ్యుదయం (=ప్రగతి), మొదలైన పదాలలో భ మహాప్రాణం. ర్థి మహాప్రాణం.
             “వాడు మేధావి” అనే వాక్యంలో అనేది మహాప్రాణం. మేధ అనే పదానికి- చిలుక; (విణ) మేధకలవాడు అనే అర్థాలున్నాయి. దీనినే అల్పప్రాణంగా రాస్తే “మేదావి” అప్పుడు దీని అర్థం ఔపాసనాగ్నిమసి. మేధ అంటే ధారణాశక్తి గల బుద్ధి; యజ్ఞం అని అర్థాలు ఉన్నాయి. మేదించు= మర్దించు, మేదిని= భూమి; మేదురము= చక్కనై నునుపైనది అన్న పదాలు చూసి మరింత పరిజ్ఞానాన్ని పొందవచ్చు.
            శబ్దం అనే పదానికి పూర్వంలో నిశ్ చేరి నిశ్శబ్దం అనే పదం ఏర్పడింది. దీనిలో మహా ప్రాణాక్షరం లేదు. కేవల సంయుక్తాక్షరం. శబ్దం గట్టిగా ఉంటుంది కాబట్టి దానికి ఊనికను ఆధారంగా ఒత్తిడి పెంచి శబ్ధం అని మహాప్రాణాక్షరంగా రాసేస్తుంటారు. విద్యార్థి దశలో దాన్ని సరిచేయాలి.
            ఆధి అనే పదం చూద్దాం. దీనికి మనోవ్యధ, కుదువ, ప్రత్యాశ, వ్యసనం, ఉనికిపట్టు అని అర్థాలు. ధి మహాప్రాణం. దీన్ని హ్రస్వంగా రాస్తే “ఆది” అంటే “మొదలు” అని అర్థం. ఆది అనే పదం కొన్ని చోట్ల దేశీయ తెలుగులో, సంస్కృతంలోనూ కనిపిస్తున్నది. ఆధిభౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం అనే పదాలలో ఆధి మొదటిగా కనిపిస్తున్నది. ఆధిభౌతికం అంటే భూతాలవల్ల కలిగింది(పృథివి మొదలైనవి భూతాలు); ఆధిదైవికం అంటే దైవం వల్ల కలిగేది. ఆధ్యాత్మికం అంటే ఆత్మవల్ల కలిగేది అని అర్థం. ఇలాంటి పదాలు తరచూ రావు కానీ వాటిని వచ్చినప్పుడు మరింత లోతుగా చూడాలి.
            “వెంకటాచలధామ” మొదలైన పదాలలో ధా మహాప్రాణం. ధామం అంటే ఇల్లు, చోటు, వెలుగు, కాంతి, ప్రభవం, మేను, పుట్టువు అని అర్థాలు. ఈ ధా ని అల్పప్రాణంగా రాస్తే దామము. అంటే పశువుల్నికట్టే పలుపు, హారము అనే అర్థాలు వస్తాయి. వెంకటేశ్వరుణ్ణి పశువుల్ని కట్టే తాడుతో కట్టడానికి మనం యశోదాదేవీ కాదుకదా.
            “వాడు మంచి ఆస్తి/ ఆస్థి పరుడు” అనే వాక్యంలో స్థి అని మహాప్రాణాక్షరంతో రాస్తే ఎముక అని అర్థం. అల్పప్రాణాక్షరంతో రాస్తే ధనాన్ని కూడబెట్టాడని అర్థం. ఆస్థ అని రాస్తే ఆస్థానం, రాజసభ అని అర్థాలు. వాడు ఎముకల పుష్టి వాడా? డబ్బు ఉన్నవాడో తెలుసుకొని రాయాలి.  పుష్టి అనే పదానికి పోషణం, బలుపు, సమృద్ధి అని అర్థాలు.  కాబట్టి సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకొని రాయాలి.  
            ఇలా ఒక పదం కోసం నిఘంటువును చూస్తూ ఉంటే చాలా పదాలకు అర్థాలు తెలుస్తాయి. శబ్ద జ్ఞానం పెరుగుతుంది. వాటిమీద పట్టు సాధించవచ్చు. పూర్వం అమరకోశాన్ని కంఠోపాఠం చేసేవారు. దానివల్ల శబ్ద శక్తి వారికి అలవడేది. ఆంగ్ల విద్యల పుణ్యమా అని ఇప్పుడు ఆ స్థితి లేకుండా పోయింది. కనీసం మనకు తెలియని పదం వచ్చినప్పుడు దానికి సంబంధించిన వ్యుత్పత్తి,  అర్థం, పర్యాయ పదాలు, నానార్థాలు గమనిస్తూ ఉంటే శబ్ద శక్తి పెరుగుతుంది. మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. అవసరం అయినచోట వాటిని వాడుతుండాలి. పద సంపద ఉంటే తెలుగు భాష బాగా వచ్చిన తెలుగువారు మరే ఇతర భాషనయినా సులువుగా గ్రహించ వీలు ఏర్పడుతుంది. ప్రయత్నం చేయాలి. శ్రద్ధ, ఆసక్తి ఉండాలి.

ఉచ్చారణ వ్రాతల్లో అక్షరాలు- అల్ప మహాప్రాణతలు



                                               
ప్రధానము = 1. పరమాత్మ, 2. ప్రకృతి, 3. బుద్ధి, 4. ముఖ్యము
ప్రధనము= 1. యుద్ధం, 2. చీల్చుట.
ప్రథమము= 1. మొదటిది, 2. ముఖ్యం.
ప్రథితి/ ప్రథ = ప్రఖ్యాతి, పేరు
పథము= మార్గం, త్రోవ
పథ్యము= హితం
దృక్+ పథము= దృక్పథము. దృక్= కన్ను, చూపు, బుద్ధి, చూచువాడు
దృఢము= అత్యంతం, (విణ) 1. అధికం, 2. దిటవుకలది, 3. గట్టిది, 4. బలిసినది{దృఢంగా ఆహారం తింటే దిటవుగా తయారవుతావు}
దృతము= సం.వి. ఆదరింపబడినది.
ద్రుతము= సం.క్రి. విణ. 1. త్వరితం, వడిగలది, 2. కరిగినది, 3. చీలినది
దృతి= తిత్తి, భస్త్ర
ద్రుమము = 1. వృక్షము, పారిజాత వృక్షం. (డు)1. కింపురుషుడు, 2. శిశుపాలుడి స్నేహితుడు
గృహస్థుడు= భార్యను పరిగ్రహించి, ధర్మార్థ కామములను నడుపుతూ వేద పాఠము, వైశ్వదేవాది హోమము, అతిథి పూజ, పితృతర్పణం, భూతబలి, అన్న ఐదు యజ్ఞాల్ని చేస్తూ ప్రవర్తించేవాడు;  ఇలుఱేడు.
పదకము = క్రమం, పతకము
పటిష్టము= మిక్కిలి పటువైంది.
ప్రతిష్ఠ= గౌరవం; చోటు; శాశ్వతంగా నిలుపుట; నెల, నావగవ ఛందస్సు.
ప్రతిష్ఠించు = శాశ్వతంగా నిలుపు
యథేచ్ఛ = ఇచ్చవచ్చినట్లు
యథార్థం= సత్యం
యథాక్రమం= క్రమాన్ని అతిక్రమించక
యాదాస్తు= (హిం.వి) ఆజ్ఞాపూర్వకమైన ఉత్తరం
యాదృశం= ఎటువంటిది
యామి= కులస్త్రీ, తోడ పుట్టినది
యమి= ముని; హంస
యుగ్యము= గజాదివాహనము, (పుం) కాడి మోసే యెద్దు
యుగ్మము= జత, యుగళం
యుతం= కూడుకొన్నది; లెక్క; కలియకూడింది; వేఱు పడ్డది
యతనము= యత్నం, జతనము
మేధావి= చిలుక; (విణ) మేధకలవాడు
మేదావి= ఔపాసనాగ్నిమసి
మేధ= ధారణాశక్తి గల బుద్ధి; యజ్ఞం
మేదించు= మర్దించు
మేదిని= భూమి
మేదురము= చక్కనైనునుపైనది
పదరు= త్వరపడు; కోపించు, చలించు; (క్రి) ఆక్షేపించు, (ఆ.వి.బ)త్వరితపు మాట
పదురు= త్వరపడు; (వి) విధం, అధికారం, త్వరితపు మాట
ఱంకె = (దే.వి)ఋషభధ్వని; ధ్వని, కేక
ఱంకెత= (ద్వ.విణ)(ఱంకు+ ఎత) జారిణి
ఱంపము= (దే.వి) (ఱంపము+కాడు) = కోయువాడు, ఱంపగాడు, పలకలు లోనగునవి కోసెడు సాధనం, క్రకచము
ఱవ్వ= దూఱు, నింద
రవము= ధ్వని, కంఠ ధ్వని
రవ= వై.వి = అణువు, (పుప్పొడి రవ్వ); ఖండం; వజ్రం; రవగాలు; (విణ) సన్న
రచ్చ= రాజమార్గం; మండపం; సభ; గోష్ఠి; కలకము; కలహము
వరబడి= (దే.వి) కఱవు
వరవుడు= దాసి
వఱద= దే.వి) వెల్లువ, ప్రవాహం
వరదుడు= వరాన్ని ఇచ్చేవాడు