Friday, June 24, 2011

మనుచరిత్ర - శైలీ పరిశీలన

మనుచరిత్ర - శైలీ పరిశీలన

-డా.జె.సీతాపతి రావు


శైలీ శాస్త్ర అధ్యయనం అంటే సాహిత్య రచనలను భాషాశాస్త్ర అనువర్తన(application)తో అనుశీలించడమే. శైలీ విషయాన్ని పరిశీలిస్తే మనం మామూలు మాటల్లో ఎవడి శైలి వాడిది అని అంటూ ఉంటాం. అయితే ఈ శైలీ విధానం సాహిత్యాన్ని, కవి రచనా దృష్టికి కూడా మరింత మెరుగులు, వన్నెలు అద్దేదిగా ఉండాలి. గురువులు, విశ్రాంత ఆచార్యులు పరిమి రామనరసింహంగారు సూచించిన కొన్ని అంశాలను తీసుకొని ఈ వ్యాసాన్ని తయారుచేయడానికి పూనుకున్నాను.

ఒక కవిత్వాన్ని అధ్యయనం చేయడానికి కొన్ని పరిమితులు విధించుకోవాలి. అందుకనే ఈ వ్యాసంలో కేవలం అల్లసాని వారి కవిత్వ శైలీ అంశాలను మాత్రమే వింగడిస్తాను. ఛందో వాక్య విన్యాసాలు, పద్య నిర్మాణం, అల్లసాని అల్లిక జిగిబిగి, భాషాప్రయోగాలను అందులోని భాగాలుగా తీసుకొని విశ్లేషిస్తాను.

అట జని కాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన

స్ఫుట నట నానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్ (2 -3)

ఈ పద్యం ఛందోపరంగా చంపకమాల అంటే చంపక పుష్పాల దండ. ఇందులో సహజమైన పుష్పాలతో పాటు కొంత కల్పన కూడా ఉంది. ఇది పూలను గుచ్చిన దారంలా అంతర్గతంగా నిక్షిప్తమై ఉంది. గున్న ఏనుగు విదిల్చిన పూలు చంపక పూలను మరపింపజేయడం అని భావించుకోవాలి. ఇది ఛందోనుభూతికి ఒక తార్కాణం.

అంబర చుంబి అనే పదం రానున్న కథకు కొంత ఉత్కంఠకు తెరతీస్తోంది. చుంబనం వరూధినికి ప్రవరుడు చేస్తాడా? అవును అని సమాధాన సూచన. అయితే మాయా ప్రవరుడని కథలోకి వెళ్తే గాని అసలు విషయం తెలియదు.

శిరస్ , చుంబి అనే పదాలు వాత్సల్యంతో ముద్దుపెట్టుకుంటున్న ఒక సోదరీ సంబంధాన్ని(భూమి, ఆకాశ గంగ) లేక హిమవంతుడు ,గంగ (తండ్రీ, కూతుర్ల అనుబంధం), నాయికా,నాయక (వరూధినీ ప్రవరుల) సంబంధాన్ని గానీ వ్యక్తం చేస్తోంది. అది చూసే వారి అభిరుచిని అనుసరించి ఉంటుంది.

భూమిసురుడు అనే పదంలో ఆ ప్రదేశం సుర భూమి(నరనారాయణులు నడికిన భూమి) ఇతడు కూడా అంతటివాడే. ఈ విషయాన్ని తర్వాత వరూధినిచే కవి చెప్పిస్తాడు.పైగా అక్కడ ఉండే అందానికి మరింత అందాన్ని ఇచ్చింది ప్రవరుడి అందం, వరూధిని అందం. ఈ మూడు అందాలను బిందు పూర్వక గ కారంతో కవి సూచించాడు (అభంగ,తరంగ, మృదంగ). అభంగానికి ప్రకృతి, తరంగానికి వరూధిని(ఆమె ఆపలేని మోహం), మృదంగానికి ప్రవరుడు(ఒక ప్రక్క సాయం సంధ్య మరో ప్రక్క వరూధిని) చిహ్నాలు.

స్ఫుట, నట, కటక పదాలు వరూధిని పరంగా అన్వయిస్తే ప్రవరాఖ్యుడు తన భర్త అని స్పష్టంగా అనుకుంది. కాని నాటకమైంది. ఆమె జీవితం కటక ప్రాయమైంది. గాజు బొమ్మైంది. ప్రాసలో ఉన్న ట కారం గాడీ తప్పింది. నటన అయ్యింది. ఇది ఛందో విన్యాసం.

వర్ణనాశైలికి ఒక మణి రాజం ఈ పద్యం.

సాధారణంగా (వ్యాహహారంలో) వాక్యం చెప్పవలసిన విషయాన్ని ఒక ప్రత్యేక మైన ప్రణాళికను అనుసరించి ఉంటుంది. కావ్యంలో కవి చెప్పదలచిన అంశం ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. అది అతడు అనుకున్న ప్రణాళికలో ఒదిగినట్లు పద్యరచన చేస్తాడు. దీన్నే కథన శిల్పమో లేక నిర్మాణశిల్పమో అనవచ్చు.

ముహుర్ ముహుర్ అనడం దక్షిణ సన్నాయి మేళంలోని ఎడమవైపు పట్టుకునే కర్రతో చేసే ధ్వని. కుడిచేతితో మృదంగాన్ని కొట్టేటప్పుడు వచ్చే లుఠదభంగ తరంగ మృదంగ ధ్వని. ఆ ధ్వనికే నీళ్లు చిమ్ముతున్నాయి. అది వర్షమని నెమళ్లు నాట్యం చేస్తున్నాయి. ఆ నాట్యానికే గున్నఏనుగులు తమ తొండంతో పుష్పాలతో ఉన్న చెట్లను ఊపుతున్నాయి. అవి పూలను రాలుస్తున్నాయి. చెట్లు స్వయంపోషకాలు. అది నాట్యానికి ఇచ్చిన బహుమతిగా అనిపించడం వర్ణణాత్మక శైలి. కర పదం చెట్లు ఒకదానికి ఒకటి తాకడం వల్ల కర్ కర్ అనే శబ్దం వస్తుంది. దాన్నే ఈ పదం తో సూచిస్తున్నాడు. కర కంపిత పదం చెట్టు చెట్టు తగలడం వల్ల వచ్చే ధ్వనికి సంకేతం.

ఒక వాయిద్యం(గులక రాళ్ల ధ్వని - మృదంగం), దానికి నాట్యం(నెమలి), ప్రేక్షకుడు(గున్నఏనుగు) బహుమతి ప్రదాత(చెట్టు పూలను ఇవ్వడం) కవి పాత్రే ప్రవరాఖ్యుడు. ఇలా ఇది కవిత్వ శైలికి మణిహారంగా చెప్పొచ్చు.

అట జని భూమిసురుడు శీతశైలమున్ కాంచె అది వాక్యం. ఇక్కడతో అన్వయం అయిపోయింది. ఈ శీతలశైల వర్ణన ఉంది. దాన్ని మహావాక్యం లేదా దీర్ఘ సమాస యుక్తంగా రచనచేయడం కవికి ఉండే ప్రణాళికలో భాగం. హిమాలయాల సుదీర్ఘత చెప్పదలచుకున్నడు ఈ సందర్భంలో. అందుకే పూర్వభాగంలో అటజని కాంచె అని చెప్పి, శీతశైలాన్ని చూసేటప్పటికి చివరవరకు వాక్యం అయ్యింది. అభంగ తరంగ పదాలు - అభంగ లో మహాప్రాణాక్షరం పర్వతం యొక్క ఎత్తును, తరంగ అల్పప్రాణ అక్షరం పర్వతం యొక్క పల్లాన్ని ధ్వనిరూపంగా సూచిస్తోంది. పూర్వపశ్చిమాలకు వ్యాపించి ఉన్న హిమాలయాలు మహాకవికాళిదాసు శ్లోకాన్ని '' పూర్వాపరౌ వారినిధీ విగాహ్య '' ను తలపింపజేస్తోంది.

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరు వేడెదు భూసురేంద్ర! యే

కాంతమునందున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా

గింతియ కాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీ

కింత భయమ్ము లే కడుగ నెల్లిద మైతిమి మాట లేటికిన్

ప్రాస స్థానంలో ఉన్న పదాలను పరిశీస్తే ఇంత - తెరువు; కాంత - జవరాండ్ర; ఇంతి - ఎరుగవే; ఇంత – లేకడుగవే.

ఇంత తెరువు - ఇది చాలా మంచి మార్గం - ప్రవరుడి పరంగా - అతడికి ఎవరో ఉన్నారు సాయం చేస్తారని అనుకున్న మార్గం, వరూధిని పరంగా అందంగా ఉన్నాడు అని, మనసులో (శృంగారానికి)చలనం కలిగింది. ఆ చలనానికి కవి చూపించిన మార్గం కూడా ఇదే.

కాంత - జవరాండ్ర - నేను వయస్సులో ఉన్న స్త్రీని.

ఇంతి ఎరుగవే - స్త్రీ గురించి నీకు తెలియదా?

ఇంత అడుగన్ - ఇంత వరకు వచ్చాక కూడా దాస్తూ ఉంటావా?!

''వంద నలయదు వేవురు వచ్చినేని '' అంటూ ప్రవరుడి భార్య సోమిదమ్మను ప్రథమాశ్వాసంలో వర్ణించాడు కవి. దానికి భిన్నంగా తన ఇష్టం వచ్చినట్లు చేయగల స్వేచ్ఛ, వ్యక్తిత్వం వరూధిని స్వంతం. ఈ అంశాలు ప్రవరుడికి కొత్త. ఈ జవరాండ్ర పదం అప్పటి(అప్పడాలు)ఆలును కాదు. వయస్సులో ఉన్న వడి(యా)ఆలును అని స్ఫురింపజేస్తోంది. ఇంతకు ముందు చెప్పిన అంశానికి వేగవంతమైన(update) విషయం ఇది. ఇది జవరాండ్ర పదానికి ఉండే జవసత్త్వంగా భావించాలి. ఇది ప్రాస పదాలతో ఉన్న ఛందో విశేషం.

''మాట లేటికిన్ '' అనడంలో మాటలతో పనే లేదు, ఎప్పుడో నీ వశమైపోయాను. నువ్వు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే తర్వాత మాయాప్రవరుడికి (గంధర్వుడికి) సులువుగా వరూధుని వశమైంది అనే సూచన ఈ సందర్భంలో గమనింపవచ్చు. 'మును వచ్చిన త్రోవ ' అనడంలో మునులు సైతం ఈ త్రోవలోనే వస్తారు. అదే స్వర్గం. అని సూచ్యం.

తండ్రీ! నాకు ననుగ్రహింప గదె వైద్యంబంచు బ్రార్థించినన్

గండ్రల్ గా నటు లాడి ధికృతుల బోకాల్మంటి వోహో మదిన్

దీండ్రల్ గల్గినవారి కే కరిణి నేనిన్ విద్య రాకుండునే

గుండ్రాడాచిన్ బెండ్లి యేమిటికి జిక్కుంగష్ట ముష్టింపచా

ఈ పద్యంలో "గానటులాడ" అని విభాగం చేసుకున్నప్పటికి "నటులాడ" అని చెప్పుకున్నట్లయితే నటులాడ అనే పదం భావి కవితా అంశాన్ని సూచించడం గమనించదగిన అంశం. తర్వాత చెప్పబోయో అనినం కన్నులు జేవురింప నధరం ... అంటూ సుధీర్ఘ కోపఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు నాట్యఫక్కిలో పాఠకులకు సైతం భయాన్ని కలిగింప చేయడం గమనింపవచ్చు. ధికృతుల్ పదం ధిక్కారచేష్టకు పరాకాష్టగా విశ్లేషిస్తుంది.

ప్రార్థించడం అనుగ్రహించడం తర్వాత సమయంలో కూడా జరుగుతాయి. పద్యక్రమంలో ముందు అనుగ్రహించడం, తర్వాత ప్రార్థించడం ఉన్నప్పటికీ వాటిని బ్రహ్మమిత్రుడు శపించిన తర్వాత ప్రార్థన చేయడం అతడు అనుగ్రహించడం గా మనం అనువర్తించవచ్చు. ఇది పద్య అన్వయక్రమంలో ఒక జిగి.

కరిణి యేనిన్ అనే పదం ఏనుగు ఉండే మదాన్ని (యేన్ , నాకు )ఇందీ వరాక్షుడి గర్వాన్ని, అహంకారాన్ని సూచిస్తోంది. ఇది పద వైచిత్రి. ఆడ ఏనుగుతో పొల్చడం వల్ల ఆ కోపం, గర్వం ఎంతో సేపు ఉండదని సూచన.

పెండ్లి పదం ఇందీవరాక్షుడి కుమార్తె పెళ్లిని పరోక్ష సూచనగా భావించవచ్చు. ఆ వివాహం స్వరోచితో జరుగుతుంది. మహానుభావుల మాటలను అనుసరించి ప్రకృతి సైతం మారిపోతుంది అని అందుకే వీరిద్దరికి, అడవిలో కలుపుతుంది. ఇది మరో గమ్మత్తు. ఇలా మనుచరిత్ర లోని చాలా అంశాలను గమనించవచ్చు.

సాంకేతిక విద్యార్థుల తెలుగు - అనుశీలన

- డా. జె. సీతాపతి రావు,

విభిన్న తరహాలో తెలుగును పరిచయం చేసిన విశ్వవిద్యాలయం రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో 6సం.ల బి.టెక్., Integrate course గా గురుకుల (residential) విద్యావిధానం ఉంది. మొదటి రెండు సంవత్సరాలు యం.బై.పి.సి.,(మాథ్స్, బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రి) చదివే విద్యార్థులకు రెండవ భాషగా తెలుగును అభ్యసిస్తారు. తెలుగును బోధించేతీరు, దాని స్థితిగతులును విశ్లేషించడం ఈ వ్యాసోద్దేశం.

ఈ విశ్వవిద్యాలయంలో మరో ప్రత్యేకత లెర్నింగ్ బై డూయింగ్ విద్యా విధానం. ఈ తరహా విద్యా విధానంలో ఆ పాఠానికి సంబంధించిన నిపుణులతో వీడియోలద్వారా బోధన ఉంటుంది. అందమైన కుర్చీలతో లాప్ టాప్ ల సహకారంతో అన్ లైన్ ద్వారా, సంబంధిత అంశాల మీద సందేహాలను మెంటర్స్/లెక్చరర్స్ సహకారంతో తీర్చుకోవచ్చు. డౌన్ లోడ్ కూడా చేసుకునే వీలు ఉంది. ఇది తరగతికి సంబంధించిన విధానం. ఈ విశ్వవిద్యాలయంలో మరో ప్రత్యేకత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిగ్రీతో పాటు, ఇంజనీరింగుకు సంబంధించిన మరో డిగ్రీకూడా లభిస్తుంది.
తెలుగు సంస్కృతి, అనుభవ పాఠాలను నీతుల రూపంలో రంగరించిన సంకలంతో వచ్చిన పాఠ్యపుస్తకం "తెలుగు జాతి వివేకం". మాతృ భాష మీద మమకారం, తెలుగు భాషమీద అభిమానం, ముచ్చట గొలిపే చిన్ని చిన్ని తేట గీతులు, అందమైన ఆటవెలదులు, అచ్చమైన కందాలు, ఉత్పల, చంపకమాలలతో అలరారే అద్భుత ఆలోచనల సమాహారం ఈ పుస్తకం. మూడు చిన్న వాక్యాల్లో చెప్పాలంటే - తెలుగు జాతికి ప్రతిరూపం. తెలుగు భాషకు మణిహారం. తెలుగు తల్లికి తలమాణికం.
పద్యభాగ విషయంలో భర్తృ హరి సంస్కృతంలో సుభాషిత రత్నావళి రాసారు. దాని ప్రాతిపదికగా, ఇందులో 14 పద్ధతుల్లో విభాగాలు చేసారు.
మొదటి పద్ధతి ధర్మ పద్ధతి.
"ధర్మో రక్షతి రక్షిత:" ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత విద్యార్థి దశనుంచి అవసరం. ధర్మం అనే పదం ఇంగ్లీషువారుసైతం మనదేశంనుంచి వారి భాషలోకి అదే పదంగా తీసుకున్నారు. భూమిమీద ఏదైతే మనిషిని మనిషిగా నిలుపుతుందో అదే ధర్మం. మానవ ఐక్యత , విశ్వమానవశ్రేయస్సు దాని లక్ష్యం. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు. సనాతనమైంది. దీనికి సంబంధించి 14 అంశాలతో పద్యాలున్నాయి. అందులో కొన్ని -
1. కోపాన్ని జయించాలనడం. 2.కోపాన్ని జయించినట్లయితే కోర్కెలు తీరతాయి అని చెప్పడం. 3.శత్రుత్వాన్ని మంచితనంతో జయించాలి. 4.చేతులకు దానం; నీతిగా బ్రతకడం; స్త్రీకి మానాన్ని కాపాడుకోవడం అభరణాలు. 5. ఒరుల మనసుని నొప్పించకుండా ఉండడం సంస్కారం. 6. సమస్త ప్రాణుల్ని తమలా చూడడం. 7. చెట్లను ఆదర్శంగా తీసుకొని, వాటిని సంరక్షించడం. 8. ముసలి తలిదండ్రులను ప్రేమించడం.


ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిపేది నీతి పద్ధతి.
అసందర్భంగా నవ్వడం ఆపదలు కోరి తెచ్చుకోవడం లాంటిది. పరోపకారాన్ని కలిగి ఉండాలి. నిజాన్ని మాట్లాడడం, కోటకు మంచి భటుడు, చీటికి చేవ్రాలు ప్రాణ ప్రదమైనవి. బాహు బలం కంటే బుద్ధి బలం గొప్పది. దాన్ని కూడా అలవర్చుకోవాలి. ఎవరు చెప్పినా విని, యుక్తాయుక్త విచక్షణ కలిగి నీతి పరుడిగా ఎదగాలి. అతిథిని దేవుడిగా భావించాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం నేరం. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. అవినీతి సంపాదన మంచిది కాదు, నేరం కూడా అంటూ నీతి పద్ధతులు వివరించారు.
వివేక పద్ధతిలో ప్రయోజనకరమైన పనిని చేయడం వివేకం. " ప్రయోజన హీనోపి మందో పి నప్రవర్తతే '' అనే నీతిని వ్యక్తం చేస్తోంది. అందుకే అభ్యాసం ప్రయోజలేని విద్య, తిండికి జరగని ఉద్యోగం ప్రయోజనాన్ని ఇవ్వవు. అలాగే రహస్యమైన విషయాలు ఎవరివి వారి దగ్గరే ఉంచుకోవాలి. తెలివైనవాడు కొత్త, పాతల మేలుకలయికతో ముందుకు వెళ్తాడు. విద్యవలన పరమ ప్రయోజనం వినయం. దాని ద్వారా చివరకు ఐహిక ఆముష్మిక సుఖాలను పొందడం జరుగుతుంది. దానికి స్వయం కృషి చాలా అవసరం.


నిరంతర కార్యసాధన అవసరం. ప్రజ్ఞావంతులు పనిని సాధించడంలో వచ్చిన కష్టాలను తలచుకొని దాన్ని వదలివేయరు. కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి. అట్టివాడే స్థితప్రజ్ఞుడు అని తెలుసుకోవాలి. ధర్మం చిన్నవాడు చెప్పినా విని, ఆచరించాలి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే పల్లెలనుంచి వచ్చిన విద్యార్థులు తమ మాట తీరును మెరుగుపరుచుకోవాలి. దీనికి సంబంధించిన పద్యాలు మచ్చుకు కొన్ని -
1.వాక్కులే నిజమైన భూషణాలు అని చెప్పే భర్తృహరి పద్యం.
2.ఆ వాక్కువల్ల ప్రయోజననాన్ని చెప్పే పద్యం –
"మాటల చేత భూపతులు మన్నన చేసి, పురంబులిత్తు, రా
మాటల చేత దేవతలు మన్ననచేసి, వరంబులిత్తు, రా
మాటల చేత మానినులు మన్నన చేసి, సుఖంబులిత్తు, రా
మాటలు నేర్వకున్న, అవమానము, న్యూనము, మానభంగమున్".
3. ప్రియంగా మాట్లాడడంవల్ల లోకానికి ప్రియులౌతామని చెప్పే పద్యం.(30) ప్రియంగా మాట్లాడడం మంచిదే కదా అని అసత్యాన్ని చెప్పకూడదని చెప్పే పద్యం (17) కూడా ఉంది. ఆ మాట్లాడడంలో మర్మాలను తెలుసుకోవాలి అని చెప్పే పద్యం (48).


మంచివాడు అంటే ఎవడు? అని ప్రత్యక్షంగా చెప్పడం ఒక పద్ధతి. మూర్ఖుడి లక్షణాలు చెప్పి, అవి కాని వాడు మంచివాడు అని చెప్పడం మరో పద్ధతి. మూర్ఖులు సహజంగా పుట్టుకతో వచ్చిన వారు కొందరు, అజ్ఞానంతో మూర్ఖులు మరో రకం. గర్వంతో మూర్ఖత్వం పొందడం మరో అంశం. ఆయా స్వభావాలనుబట్టి గుర్తించి, దూరంగా ఉండాలి. ఈ అంశాలకు సంబంధించి ఉదాహరణలు ఇచ్చారు. గాడిద గంధపు చెక్కలు ఎన్నిసార్లు మోసినా దాని పరిమళాన్ని గ్రహించలేదు. అలాగే హీనబుద్ధుడు కూడా ఘనుడు కాలేడు.(87) అయితే ఇక్కడ విద్యార్థికి కావలసింది ఓర్పు, వినయం, తెలుసుకోవాలనే కోరిక, లక్ష్య సాధన దిశగా ప్రయత్నం ఆవసరం. వ్యక్తిలోని వ్యక్తిత్వాన్ని, పాండిత్యాన్ని బట్టి గౌరవం వస్తుందని వివరించే పద్యం 81 వది.

దుర్జనుడికి, మూర్ఖుడికి తేడా ఏంటి? మూర్ఖుడు వెంటనే బయటపడిపోతాడు. దుర్జనుడు మనస్సులో దాచుకుంటూ అప్పుడప్పుడు దాన్ని ప్రయోగిస్తుంటాడు. వాడిని కనుక్కోవడం కష్టం. అయినా ''కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?'' అంటూ విశ్లేషించారు. కంచు, కనకం మోత అనే ఒక ఉదాహరణతో వివరించే ప్రయత్నంతో చేసారు(91). నిరాడంబరతకూడా సజ్జనుడి గుణం. విద్యార్థి ఉన్నత స్థానాన్ని పొందాలి. అక్కడతో పని పూర్తవలేదు. అప్పుడే మొదలైందని భావించాలి. ఎలాగంటే - దానికి భర్తృహరి సుభాషితాన్ని ఉదాహరణగా చెప్పారు - ఆకాశంబు నుండి శంభుని శిరం నుండి పతనం అయిన గంగ సముద్రంలోనే కలిసింది. కానీ శివుని శిరస్సును పొందలేకపోయింది. అలాగే ఉన్నత స్థానాన్ని పొందినవాడు దాన్ని నిలుపుకొనే ప్రయత్నం ఎల్లప్పుడూ చేయాలి. అంటే బద్ధకం వీడాలి అని తెలుసుకోవాలి.

అల్పబుద్ధివాడు తెలివైన వాడిని అల్లరపాలు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్షీర సాగరంలో కాకి రెట్ట వేసినంత మాత్రాన సముద్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. తెలివైనవాడు వెంటనే దాన్ని గమనించి వాడి పట్ల జగరూకతతో ఉంటూ దూరంగా ఉండాలి. తెలివైన వాడు మందితో తగాదా పెట్టుకోడు. ఒక్క మాటలో చెప్పలంటే

'అకారణంగా పరులను హింసించేవాడు దుర్జనుడు '.
దుర్జనులను, సజ్జనులను ఎలా గుర్తించాలి? అంటే ఉప్పు, కర్పూరంలా ఉంటారు. వారి గుణాలను, చేసిన పనుల ఆధారంగా తెలుసుకోవాలి. నిత్యం నిజాన్నే మాట్లాడాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఆపదల్లో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ధనం ఉన్నప్పుడు కప్పల్లా వచ్చేవారే బంధువులు.(137)



ఇతరులమనసుకు నొప్పికలగకుండా, ఏ సమయంలో ఏది మాట్లాడాలో అలవరచుకోవాలి(136). స్త్రీల విషయంలో - ఆమెకు బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టకపోతే సిరిఉంటుంది. లేదంటే అది పోతుంది. విద్యార్థి ప్రశ్నించడం ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. అంటే తరగతి గదిలో శ్రద్ధగా పాఠ్యాంశాలను విన్నవాడే ప్రశ్నలు వేయగలడు. ఇది విద్యార్థి లక్షణాల్లో ఒకటి. ప్రశ్నలు వేయమన్నామని అసందర్భపు ప్రశ్నలు కూడా వేస్తారు కొందరు. అవి కావాలని వేస్తే, వారికి కాలం వృధా చేయడం అంటే ఇష్ట పడుతున్నారని వేరే చెప్పక్కర్లేదు.

మాటలవల్ల స్నేహ సంబంధాలు వర్థిల్లుతాయి(186). ధనాన్ని సంపాదించాలి. దాన్ని అనుభవించాలి. లేదా దానం చేయడం దాని ప్రయోజనాలు. అలా కాక లోభత్వం కలిగి ఉన్నట్లయితే అది అశాంతిని కలిగిస్తుంది(199) అని గ్రహించాలి. మొత్తం మీద వేమన శతకంనుంచి 72 పద్యాలు, సుమతి శతకం నుంచి 29 పద్యాలు, భర్తృహరి సుభాషితాలనుంచి (అనువాదంగా వచ్చిన) 19 పద్యాలు, భాస్కర శతకం నుంచి10 పద్యాలు, ఆంధ్రమహాభారతం నుంచి 13పద్యాలు ఇలా ప్రాచీన కవిత్వానికి చెందినవిగా నూరు పద్యాలు; మిగిలినవి ఉండేల మాల కొండారెడ్డి రచించిన మానవగీత, జీవన గీతాలు, సత్యం శివం సుందరం నుంచి 34పద్యాలు; మల్లెమాల, దాశరథి మొదలగు వారి రచనల నుంచి నూరు పద్యాలు ఇచ్చారు. దీనివల్ల పాత కొత్తల మేలు కలయికగా జీవన సారాన్ని తెలుసుకోవాలి.


గద్య భాగానికి వస్తే నీతిచంద్రికలోని గ్రాంధిక భాషలో ఉన్నసూక్తుల్ని తీసుకున్నారు. ఈ సూక్తులు పద్యాలలోని చాలా అంశాలనే సూచిస్తూ ఉన్నప్పటికీ, అనువాదానికి అనువుగా ఉన్నాయి. దు:ఖ భాగులు, వారి లక్షణాలు, ప్రయత్న ఫలాలు, సజ్జన సాంగత్యం, చదువుకున్న చదువును జీవితంలోకి అనుప్రయుక్తం (application) చేయమనడం, స్వతంత్రంగా జీవించమనడం, ఆర్తత్రాణ పరాయణత్వాన్ని కలిగి ఉండడం ముఖ్యమైనవి.

ఆంధ్రదేశ ప్రాచీనత, భాషావిషయకమైన అంశాలు, పాలనా పరమైన అంశాలను పరిచయం చేసారు. చదువు కథలు అనే కథల సంపుటి నుండి దాశరథి రంగాచార్య రచించిన చదువు కథానిక ఈ పుస్తకంలో ఉంది. పేదవాడు చదువుకోవాలనే కోరిక, వాడుపడే కష్టం కళ్లల్లో నీటిని నింపుతుంది. కాలాన్ని వృధా చేయకుండా, గతంలో ఉన్నపేదరికాన్ని మరచి పోకుండా, ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటూ విద్యార్థి జీవితాన్ని కొనసాగించాలి. పట్నంలో ఉన్నా పల్లెను మరచిపోకూడదు. చదువుపట్ల పట్టుదల కలిగి ఉన్నట్లయితే ప్రయత్నంతో కార్యసిద్ధిని పొందవచ్చుఅని నిరూపించిందీ కథానిక.

దీనిలో పద్యాలలోచదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ధారణా శక్తి పెరుగుతుంది. ఈ పద్యాలకు నీతి కథలు జోడించి చెప్పడం వల్ల తెలుగు తరగతి అంటే ఇష్టంతో పాటు, అంతవరకు నేర్చుకుంటున్న బోధనాంశాలనుండి ప్రశాంత చిత్తులవుతారు. తెలుగు భాషను, అందులోని ఆనందాన్ని గ్రహించడానికి వీలుకలుగుతుంది. మనోవికాశానికి కూడా దారి తీస్తుంది.

మొత్తం 200 పద్యాలు పద్యభాగంలోను; 25 నీతిసూక్తులు, ఆంధ్రం – తెలుగు నాడు నేడు, మాండలికాల(dialect) పరిచయం, చదువు కథానిక, చదువుకోసం చేసే ప్రయత్నం గద్య భాగంలోను; వ్యాకరణ విభాగంలో ఛందస్సు, పద్య భేదాలు - లక్షణాలు, అలంకారాలతో ఈ పుస్తకం, మొదటి సంవత్సర కాలం ముగిసిపోతాయి.

ఈ పుస్తక సంకలన కర్త - డా. ఉండేల మాల కొండారెడ్డి, పరిష్కర్త - వాచస్పతి, డా. కె. కుసుమా రెడ్డి. మొదటి ముద్రణ 2009, ద్వితీయ ముద్రణ 2010. వెల 50రూపాయలు మాత్రమే. ఈ పుస్తకం కొనాలనుకుంటే లభ్యమయ్యే స్థలం - రిజిస్ట్రార్, రాజీవ్ ఈ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, మహావీర హాస్పటల్ ఎదురుగా, మాసబ్ టాంక్ , హైదరాబాదు 500 028. విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పక బుధ్ధులు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఈ పుస్తకం తప్పక సహకరిస్తుంది.తెలుగు జాతి వివేకంద్వారా మంచితనాన్ని, సేవాదృక్పథాన్ని అలవరచి తెలుగువారి వివేకాన్ని చాటుదాం. ఇదండి తెలుగు జాతి వివేకం.

శేషేంద్ర శ్వాస, ధ్యాస

గొరిల్లా లా కవిత్వ గర్జన చేసిన విప్లవ భాషా విధాత, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, నెమలి నేస్తగాడు, అమరపురికేగిన గుంటూరు శేషేంద్రశర్మ ఆధునిక భారతాన్ని ఆవిర్భవింపజేసి ప్రజలకు అందించిన ప్రసిద్ధమైనకవి. కవిసేనతో కవిత్వ బాణికి కొత్తసృష్టిని, కవితానికి మెస్మరిజాన్ని కలబోసిన కవితా ఉద్దండుడు. కవిత్వం, జర్నలిజం, విమర్శ, సైన్సు సంబంధి విషయాల్లో అనేక రచనలు చేసిన శేషేంద్ర స్ఫురద్రూపి కూడా. శేషేంద్ర మే,30,2007న పరపదించారు. వారి స్మృత్యర్థం వారి మీద గౌరవంతో ఈ వ్యాసం రాస్తున్నాను. శేషేంద్ర రాసిన ఆధునిక మహాభారతం ఆధారంగా శేషేంద్ర శ్వాస, ధ్యాసను విశ్లేషించడం ఈ వ్యాసోద్దేశం.
''ఏమని రాశేన్
నిన్ను గురించి ఓ శేషేన్ -
నీకు నిద్ర అంటే
రాత్రి శయ్యలోచేసే సాహస యాత్ర
నీకు కవిత అంటే
క్రూరజీవన రాస్తాల్లో ప్రవేశించిన పాత్ర '' అంటూ శేషేంద్ర తలపులతో ప్రారంభిస్తే...
ఈ శేషేన్ అని పిలిచేది శ్రీశ్రీ. ఇద్దరు మహా కవులను మిత్రులుగా ఆంధ్రమాత కన్నది. శ్రీ శ్రీ పీడిత, తాడిత ప్రజలకోసం కవిత్వం రాస్తే; ఆధునిక ప్రజకోసం, భూమికోసం శేషేంద్ర తన కవిత్వాన్ని రాసాడు. త్రికరణ శుద్ధిగా ఉన్న మనిషి కథగా శేషేంద్ర తన కథనే తాను రాసుకున్నట్లు భావించాడు.
''నా బాల్యాన్ని చెరువులమీద జామ చెట్లమీద
గుర్ర్రపు పిల్లలమీద వెదజల్లాను
స్త్రీలమీద పుస్తకాలమీద
కుమ్మరించాను యౌవనాన్ని
రక్తాన్ని పిండి త్రాచుల్లాంటి
వాక్యాలకు పోసి పెంచాను
ఇప్పుడు రాత్రివచ్చింది '' (ఆద్మీపర్వం. పుట.181)
అంటూ కవి తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూనే రాత్రికి రావడం గుర్రపు పిల్లలమీద , చెరువులమీద , జామ చెట్లమీద బాల్యన్ని వెదజల్లడంలో ఇప్పటికీ తాను అనుభవించిన బాల్యం ఇంకా స్పష్టంగా రచయిత దర్శించ గలుగు తున్నాడు. ఆ బాల్యపు చేష్టలు ఎంత అనుభూతి ప్రధానమైనవో అని భావించడం కనిపిస్తోంది. బాల్యాన్ని గురించి ఆలోచించిన వాళ్ళే ఇప్పుడు తక్కువగా ఉన్నారు. ఆ చేష్టల్లో ఉన్న స్వేచ్ఛ ఇప్పటి పిల్లల్లో లేదని కవి ఆవేదన. ఇంతకీ ఆ స్వేచ్చతో ఏం చేద్దామని అనుకున్నారు? ఇది కవికి కలిగిన ప్రశ్న. దానికి ఆయనే సమాధానం చెప్పేస్తున్నాడు చూడండి.
'' స్వేచ్ఛ మనిషికి మొదటి శ్వాస, అది నీరక్తపు సజీవ భాష, భూమినించి నీవు నీ చివరి అడుగు తీసేవరకు నిలుపుకోవలసిన ఒకే ధ్యాస '' (పుట. 41) స్వేచ్ఛ లేనిదే మనిషిగా ఉండడం అనవసరం. అది ఒకరు ఇవ్వవలసిన అగత్యం లేదు. దానికి సవాలక్ష కారణాలు... జీవితం అంటూ ప్రారంభించి చెప్పవద్దు. '' నా బ్రతుకు వెయ్యివిధాలుగా నీవనే ఒక నాజూకు నూలు పోగులజాలంతో అల్లిన దుకూలం '' అంటారు.
ఆధునిక మహా భారతం చదువుతున్న కొద్దీ ఆనందం వస్తూ ఉంటుంది. అయితే కవితావేశాన్ని పాఠకుడు అందుకోవాలి. స్పష్టతను గుర్తుంచుకోవాలి. అలా కాకుంటే మధ్యలో సంధానం ఇబ్బందికి గురైపోతుంది. అయితే శేషేంద్ర కవిత్వంలో పదును దశకుమార చరిత్ర కథలా, అంతర్వాహినిలా అలంకారాలు ప్రవహిస్తాయి.
శేషేంద్రకు బాల్యం అంటే ఇష్టం. అతడి మనసు వెన్న. అలాగని ప్రతిసారి అలాగే కనబడడు. '' ఎక్కడ పసితనం కూడా బతకడానికి పని చెయ్యాలో అక్కడ నిజంగా తెగిపోయాయి నాచేతులు నిజంగా రాలిపోయాయి నా నాలిక పడిపోయింది. అక్కడ నేను ఝంఝా మారుతాన్ని కాను, ఆ పసివాడి కాళ్ళమీద, నా ఆత్మ లో ముత్యాల దండ తెగి అతడి మ్రోల పడిపొయింది, నా పద్యం అటువైపు చూడలేక ఏడ్చింది '' ఇది శేషేంద్ర మనసు. పసివాడి కాళ్ళముందు కడివెడు కన్నీళ్ళు పోశాను అనడం శేషేంద్రలోని అనుభూతి, బాల కార్మికులు పడే యాతనలను తట్టుకోలేని స్థితి. ఇదంతా బాలుర స్థితి, బాల్యపు సంగతులు.
''రైతు నాగలి మోస్తున్నాడు
క్రీస్తు శిలువ మోసినట్లు
ఈ దేశపు గర్భగుడిలో దేవుడి జీర్ణమై పోయాడు
ఆకలి వేస్తోంది మరో దేవుడి కోసం'' (పుట. 98) ,
'' ఇక్కడ దున్న తున్న ఓ అన్నా
నీవు ఒంటరి వాడివి కావు, నీవు కన్నీటి బొట్టుగా ఆగిపోవు '' (పుట 34)
మీరు నన్ను పిలిచారు, కానీ పిలవక పోయినా
మిమ్మల్ని వెతుక్కుంటూ నేనే వచ్చే వాడ్ని '' అంటూ రైతుకు తన మద్దతుని తెలుపుతున్నాడు. శ్రమించేవాడికోసం ఆయన ఎంతటి త్యాగాన్ని అయినా చేస్తాడు. ''నేను సత్యాగ్రాహి! సత్యం గుండెల్లో బ్రద్దలవుతున్న అగ్ని పర్వతం, నా గొంతులో గర్జిస్తున్న జలపాతం '' అంటూ యుద్ధోన్ముఖుడుగా శేషేంద్ర దర్శనమిస్తాడు.
ఇంకా...
''నా గొంతు నా ప్రజలకు దానం చేశాను. నా జాతే నా భాషకు ప్రాణవాయువు, నాదేశం నా శిల్పానికి ఆయువు, నేను రక్త ప్రవర్తను. ఈ ప్రయాణంలో ఆవిష్కరిద్దాం మనిషికి మృత్యువు లేదని, జీవితం ఎన్నటికీ చావదని, చాలా దూరం నడవాలి. సొంత గోడల్ని దాటి రండి ''. (పుట.39)అంటూ ప్రజను చైతన్య పరచడం గమనించదగిన అంశం. శేషేంద్ర అమృత తుల్యమైన జీవనం కోసంచాలా కష్టపడాల్సిన ఆవశ్యకతను విశదం చేసారు. ఈ వాక్యాలు మహాభారతంలోని పాండవులు హిమాలయాలగుండా స్వర్గం చేరుకునే దిశగా ప్రయాణం సాగించడాన్ని గుర్తుకుతెస్తోంది.
కేవలం ఊహల్లోనే కవిత్వం రాయడానికి శేషేంద్ర ఇష్టపడరు. ఆధునిక మహా భారతం ప్రారంభంలోనే ''లేస్తోంది ఉష : కాంతుల్లోనించి ఒక హస్తం '' అంటూ శ్రామిక కర్షక వర్గాలందర్నీ చైతన్య పరచడం గమనించదగినది. కవి తన కవిత్వ ధాటితో ప్రజను ఏకతాటిమీద నడిపించాలని ప్రయత్నం చేసాడు. శేషేంద్ర కవిత్వంలో '' నేను '' చాలాసార్లు కనబడుతుంది. ఆ నేను అనేది దేనికి ప్రతీకగా వాడుతున్నాడో తెలిస్తేగానీ విషం బోధపడదు. ఒకసారి శ్రామిక శక్తిగా, విప్లవ మూర్తిగా, అందమైన ప్రకృతిగా, చిన్న పిల్లాడిలా, సముద్రంలా చాలా రకాలుగా కనబడుతుంది.
శేషేంద్ర కవిత్వంలో వైదికాంశాలు ఉపనిషదంశాలు కనబడతాయి. వ్యక్తిగత జీవితంలో కూడా వాటిని ఆచరించాడు.
'' నేను మానవ జీవిత పొలాలన్నీ దున్నుతా, ఈ చేత్తో నేను ఏఅందాన్ని సృష్టించలేదు? నా బ్రతుకొక సున్న కానీ నడుస్తున్నా... ''
''పూర్ణ మద : పూర్ణ మిదం పూర్ణాత్ పూర్ణమదచ్చుతే
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవావిశిష్యతే'' అంటూ సమస్తం పూర్ణం నుంచే వచ్చింది అనే వేద మంత్రాన్ని స్ఫురించేలా సూచించారు.
శేషేంద్ర ఉదయ కాలంలో స్నానం చేసాక సూర్య నమస్కారం చేస్తారు. సూర్యుడు ప్రకృతి ప్రాసాదించిన వరంగాను, బతుకు సారధిగాను భావించేవారు. ఆ సూర్యుడే విజృంభిస్తే మండే సూర్యుడిగా మారుతాడని నిరూపించేదే మండే సూర్యుడు కవిత్వం. అదే సూర్య పర్వంగా ఆధునిక మహాభారతంలో చేర్చారు. సూర్యోదయం శ్రామికుడికి ప్రతీక గా పేర్కొన్నారు.
శేషేంద్ర కవిత్వంలో సింబాలిజం, ఆలంకారిత, పదచిత్రాలు మనం దర్శించవచ్చు. కవిత్వంలో కవిత్వపు పాలు ఉందా? ఉంటే అదే చిరకాలం నిలచి ఉంచేలా చేస్తుందని నమ్మే వ్యక్తి శేషేంద్ర.
లేస్తోంది హస్తం అన్నప్పుడు ఆ హస్తం శ్రామికుడికి, ఆ శ్రామికుడు సూర్యుడికి ప్రతీక. ఎర్ర కోరికను కనడం, విప్లవభావాన్ని వినూత్నంగా వ్యక్తీ కరించడం ఇతడికి అలవాటు. ఈ నేపథ్యాలలో అలంకారిత సహజంగానే వస్తుందీతనికి.
కర్షకుడు అంటే అమితమైన అభిమానం. ఇతని కవిత్వంలో కర్షక, దాని పర్యాయపదాలు చాలా కనబడతాయి. " నేను మానవ జీవిత పొలాలన్నీ దున్నుతా " అంటూ ఆకలిని తీరుస్తున్న కర్షకుడు లేనిదే మానవజీవితం లేదని కవి సందేశం.
శ్రామికుడు ఎప్పుడూ దోపిడీకి గురి అవుతునే ఉన్నాడు. అందుకే తిరగబడమని కవి చైతన్యపరుస్తూ ఉండాలని ఇతడి సిద్ధాంతం. కర్షకుడిని ఉద్దేశించి - '' కొండలతో సముద్రాలతో కలిసి బతికేవాడికి తుఫానులొక లెఖ్కా " అని తీర్మానిస్తాడు.
''కాలాన్ని నా కాగితం చేసుకుంటా - దాని మీద లోకానికి ఒక స్వప్నం రాసి ఇస్తా '' అంటూ అందమైన స్వప్నంతో సమసమాజ స్థాపనకు నడుబిగించిన మేధావి శేషేంద్ర.
ఎంతటి వాడికైన కాలం తనలో కలుపుకుంటూనే ఉంటుంది. అయితే శేషేంద్రకు నిద్ర పట్టదు. ఆయన నిద్రలో గడిపిన రోజులు చాల తక్కువ. తన కవిత్వమే ఆయుధంగా నిలిచి ఒక విప్లవకవిగా గుర్తింపు పొందాడు. పైన ఉండే అధికారులకు, అపైన పెత్తనం చెలాయించేవారికి శేషేంద్ర ఒక సింహ స్వప్నం.
శేషేంద్రలో ప్రేమ విశ్వమానవ సమానతకు దారితీస్తుంది.
''ప్రేమ ప్రేమంటే మాటల్తో ప్రేమవుతుందా
రెండు పూటల్ నషాతో మా దాహం తీరుతుందా?
నీవు రాశీనవే పాడి దాసీ నయితి... '' (పుట. 247)అంటూ ప్రజలందరూ ప్రేమఉన్న చోట దాసీగా ఉన్నా ఇష్టపడతారని, అది అధికారంతో చెలాయిస్తే చేయడానికి ఇష్టపడరని విశ్వసిస్తాడు. శేషేంద్ర ప్రేమ పర్వంలో మరెన్నో అంశాలు గ్రహించవచ్చు. అయితే అవి ప్రేయసి, ప్రేమికులకు సంబంధించినవిగా, ప్రేమ తత్త్వాన్ని తెలియజేసేవిగా కూడా చూడవచ్చు.
''రండి, మా గుమ్మానికి తోరణాలుకండి
మానవ జీవితాన్నొక మహోత్సవం చేయండి
పిడికెడు వసంతాలు అందరికీ భిక్షపెట్టమంటావు
నీకుమాత్రం ప్రేమించే రెండు పెదవులు చాలునంటావు'' అంటూ ఎర్రగా విరగబూచిన వనజ్వాలలో ఉన్న మిలియన్ల పూలు గొంతు విప్పి పాడడం, మానవజీతాన్ని అందమైన వసంతంతో పోల్చడం కవి అనుభూతికి మానవ సంబంధానికి ఒక ఉదాహరణ.
బాధలనే అగ్ని నుంచి కవి బయటపడి సువర్ణంగా మారతాడని శేషేంద్ర భావించారు. వాల్మీకి మొదట ఎన్నో పాపాలు చేసాడు, బాధలు అనుభవించాడు, కిరాతుడయ్యాడు. అవ్యక్తాన్ని వ్యక్తం చేసుకున్నాడు. అనుభవంతో ఒక అందని బిందువునందుకున్నాడు. ఇదంతా కవితా పరిణితిగా, వ్యక్తంనుంచి అవ్యక్త దశకు చేరుకోవాలని, ద్రష్టగా మారాలని బోధించారు. వేమనను రేంబోతో కలిసి దర్శించడం ఒక అనుభూతి. పరుసవేది సిద్ధించిందా? అని అడిగేలోపే ''హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజా '' అని రాయడాన్ని శేషేంద్ర చదివారు. ఇలా కవి ఎదుటవారి హృదయంలోని అంశాన్ని ముందుగానే కనిబెట్టాలని శేషేంద్ర భావన. రాసేభాషకు మాట్లాడే భాషకు తేడా అవసరం లేదని భావించినవాళ్ళలో శేషేంద్ర ఒకరు.
''నీవు ఇప్పుడు లే ఉ
కానీ వాలుతున్నావు ఒక కొండలా '' ఇలాంటి వాక్యాలు శేషేంద్ర కవిత్వంలో మనకు కనిపిస్తాయి. ఆధునిక మహాభారతం చివరన భారతీయ కర్షకేతిహాసోపేత ఆధునిక మహాభారతాన్ని శేషేంద్ర రాసినట్లు తెల్పారు.
'' నే నెప్పుడు గొంతెత్తినా నా కోసం కాదు
యాభైకోట్లమంది కోసం గొంతెత్తుతాను ...
నేనంతా పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు
ఒక దేశపు జెండాకున్న పొగరుంది'' ఇది శేషేంద్ర అంతరంగం. ప్రజకోసం కవిత్వాన్ని వినియోగించడంలో గర్వపడే స్వభావి శేషేంద్ర.
ఆధునిక మహాభారతం వింటే, గులాం మనస్తత్వ కారణంగా వంగిపోయిన మోకాళ్లలో బలం వచ్చి, మనిషి కాళ్ళు నిటారుగా నిలుస్తాయి. నిర్భయత వచ్చి మనిషి మనిషిగా మారి భూగోళానికి ఇరుసుగా మారతాడని కవి సూచించారు. అదే ఫలప్రదంగా కీర్తిపొందుతుందని భావించాడు.
వర్గచేతన సిద్ధి, ఆత్మ గౌరవవృధ్ధి
జనవైరి నిర్మూలన, సమతా సమున్మీలన
సత్కాల వర్షళి, సస్య సంధ్యాకేళి
క్షామ రహిత గ్రామ ప్రభాత వాహ్యాళి
పశుపక్షి వృక్షాది ప్రాణికోట్లకు హాయి
పూర్ణ విగళితరుజ, దేశదేశప్రజ
ధన ధాన్య సమృధ్ధి, విద్యాన్న గృహ లబ్ధి
ఆబాలగోపాలమూ అన్యోన్య భూగోళమూ '' ఇది విశ్వమానవ, జీవకోటి పట్ల కవికుండే శ్రేయోదృష్టి. అదే ఆధునిక మహాభారతానికి ఫలశ్రుతి. క్షామ రహిత గ్రామాలు, ధనధాన్యాదులతో విద్య భూగోళానికి అవసరంగా సూచించాడు. పైన వన్నీ అవి ఈ భారతాన్ని చదివి వంటపట్టించుకుంటే ఆయా ప్రజలద్వారా సాధ్యమౌతుందని చెప్పడం కవి ద్రష్టత్వానికి తార్కాణం.
ఇలా శేషేంద్ర మన మధ్య లేకపోయినా, కవిగా, మేధావిగా ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందారు. రాష్ట్రేందు గా కీర్తి పొందారు. ఆయన కీర్తిశేషులైనప్పటికీ ఆతన పేరున ఆతని భార్య ఇందిరా ధనరాజ్ గిరి గారు, వారి కుమారులు శేషేంద్ర రచనలను పునర్ముద్రించి పాఠకులకు అందజేయడం శేషేంద్ర స్మృతికి సంబంధించి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు ఇప్పించడం ముదావహం. శేషేంద్ర జీవితం అంతా కవిత్వానికి, సాహిత్య సేవకు అంకితం చేస్తూనే తన వంతు పాత్రను పోషించారనడంలో అతిశయోక్తిలేదు. ఇప్పటివరకు పరిశోధనాత్మకంగా మూడు యం.ఫిల్., లు రెండు పిహెచ్.డి., లు ఆయన సాహిత్యం మీద వచ్చాయి. శేషేంద్ర కవిత్వాన్ని చదవి అర్థం చేసుకోడానికి కొంత పాండిత్యం అవసరం. చాలా దేశాలు శేషేంద్ర పర్యటన చేసారు. చాలామంది అభిమానులను సంపాదించారు. చాలా భాషల్లో ఈతని కవిత్వం అనువాదం పొందింది.