Thursday, October 20, 2016

బహు భాషల కథలు – భారతీయ జీవన చిత్రాలు




-డా. జె. సీతాపతి రావు, తెలుగు అధ్యాపకులు,

            సమాజంలో జరిగే దృశ్యాలను, మనసులో మెలిగే భావాలకు చక్కగా ముడి పెట్టగలిగే వాడు కథకుడు. ఒక కవిత లేదా కథకు కానీ లేదా ఇతర సాహిత్య ప్రక్రియలకు కానీ మనః పాఠ్యం (mental text) ఉంటుందని ప్రపంచ ప్రసిద్ధ జానపద విజ్ఞాని ఫిన్నిష్ విమర్శకుడు ఆచార్య లూరి హాంకో ప్రతిపాదించాడు. దీన్నే ప్రాచీన అలంకారికులు ధ్వని అన్నారు. ఇదే అంతర్లయ కూడా. కథలోని భావనల్ని ఒక భాష నుంచి మరో భాషకు సహజంగా అందించగలిగే సృజనశీలుడు అనువాదకుడు. అలాంటి తత్త్వం ఉన్న వ్యక్తి భారతీయ భాషల్లో ఉన్న అతనికి నచ్చిన మానవీయ కోణాలను స్పృశించిన కథలను ఎంపిక చేసుకొని ప్రచురించిన అనువాద కథల సంపుటి అద్దంలో గాంధారి మరో  పదకొండు కథలు.
            బహు భాషలను ఆసక్తిగా నేర్చుకొని ఆయా భాషలనుంచి కథలను ఎంపిక చేసుకొని అనువదించిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు. “ఖానే వాలేకా నామ్ చోడో, ప్రతి గింజమీద రైతు సంతకం ఉంది. పీటమీద బతుకమ్మ, పీఠభూమి తెలంగాణ రెండూ ఒక్కటే” అంటూ తెలంగాణా తెలుగు జాతిని ఆలోచింపజేసిన బహుభాషా పండితులు శ్రీ నలిమెల భాస్కర్. ప్రస్తుతం కరీంనగర్‌ పట్టణంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పద్నాలుగు భాషల్లో వీరిది అందెవేసిన చేయి. నూరేళ్ళ పది ఉత్తమ మలయాళ కథలు, అద్దంలో గాంధారి, మంద అనే అనువాద కథా సంకలనాల్ని వెలువరించారు. మంద మరియు నాకూ స్వాతంత్య్రం వచ్చింది అనే రెండు కథలు, స్వతంత్ర కథలు. అనువాదానికి కథల్ని ఎంచుకొనే వీరి ధోరణి విలక్షణంగా కనిపిస్తుంది.
            “అద్దంలో గాంధారి” సంకలనంలో కన్నడం, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాళీ ఆరు భాషల్లోంచి రెండేసి కథల్ని ఎంపిక చేసి ప్రచురించారు. భారతీయ కథా సాహిత్యంలో వైవిధ్యాల్ని, జీవన స్థితుల్ని ఋజువు చేసిన కథలివి. ప్రాంతాలు వేరైనా జీవిత సమస్యలు, సత్యాలు అన్ని చోట్లా సమానమే. భారతీయ జీవన అంశాలను ఒక్క చోట నిలిపి భారతీయ సాహిత్యంపై విహంగవీక్షణం చేయిస్తాడు, భాస్కర్.
            డా. నలిమెల అనువాద సృజనాత్మక ప్రక్రియలకే పరిమితంకాక పరిశోధనలో ‘‘తెలుగు సామెతలు-ద్రావిడ భాషలతో తులనాత్మక పరిశీలన’’ అన్న అంశంమీద ఎం.ఫిల్, ‘‘తెలుగు మలయాళ సామెతలు - కుటుంబ జీవన చిత్రం’’ అనే సిద్ధాంత వ్యాసంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్‌. డి., పొందారు. వివిధ భాషాసాహిత్యాలపై పరిశోధనా వ్యాసాల్ని వెలువరించడంతోపాటు ‘‘సాహితీ సుమాలు’’ శీర్షికన వివిధ భాషాసాహిత్యాల్ని, ఆయా భాషల్లోని రచయితలను పరిచయం చేశారు. ‘‘తెలంగాణ పదకోశం’’ వీరికి భాషపట్ల ఉండే మమకారానికి పతాక స్థాయి.
            2014, మార్చి10న 2013 సంవత్సరానికిగాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. మలయాళంలో అనువాద నవల స్మారకశిలలుకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, డా. బోయి భీమన్న స్మారక పురస్కారం రూ. లక్ష నగదు, అనువాదరంగంలో కృషికిగాను 2014లో, 1997లో అద్దంలో గాంధారి అనువాద రచనకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, 1998లో మద్రాస్ కళాసాగర్ సిరిసిల్ల శాఖ పురస్కారం, 1999లో కళాజ్యోతి కరీంనగర్‌వారి పురస్కారం, 2000లో కవిసమయం పురస్కారం, 2001లో ఏపీ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2001లో బీఎన్ శాస్త్రి పురస్కారం, 2003లో సిరివెలుగులు (సిరిసిల్ల) పురస్కారం, 2006లో అధికార భాషా సంఘం పురస్కారం, 2008లో ద్వానా శాస్త్రి పురస్కారం, 2010లో ఇండియన్ హైకూక్లబ్ అనకాపల్లివారి పురస్కారం, ఇంకా పలు స్వచ్ఛంద సాహితీ సేవాసంస్థలచే సన్మానాలు పొందారు వీరి సాహితీ వ్యవసాయానికి మచ్చుతునకలు.
            కథల్ని ఎన్నుకోవడం, వాటిని తెలుగుకు ఎంతవరకు అవసరం అన్న విషయాలను కూలంకషంగా పరిశీలించిన మీద మాత్రమే ఇతర భాషల కథల్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యాలకు జాగ్రత్తగా పరిశీలించి  నలిమెలి భాస్కర్ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. మొత్తం కథలు పన్నెండు. కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో రెండేసి కథలను తీసుకున్నారు.
            సమాజానికి వెన్నుముక కుటుంబం. దానిలో ప్రధాన భూమిక ఆలుమగలు. వీరు సక్రమంగా జీవనం సాగిస్తూ రాబోయే తరానికి తీర్చి దిద్దాలి. అప్పుడే ఉత్తమ పౌరులు వస్తారు. అన్నిటికంటే విలువైనది జీవితం. దాన్ని పూర్తిగా అనుభవించాలి. కావాలని ఆత్మహత్యలు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. “మగడి మనోగతాన్ని ఎరిగిన సతిగా మారాను. మాగాడి అభిప్రాయానికి పూర్తిగా నా నడవదికను అలవర్చుకున్నాను. నిజం.. ఇది పూర్తిగా అతను ఆపాదించింది కాదు. నా వ్యక్తిత్వాన్ని నేనే కోల్పోయాను. అతనితో అనవసరంగా వాదించండం, పోరాడ్డం ఎందుకనే సోమరితనం తోనే నేను నేనుగా ఉండే ప్రయత్నం చేయలేకపోయాను”(పుట-4). భర్త భార్యను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆమెను కావాలని ఇబ్బందుల్ని పెట్టడానికా? అలాగే భార్య వైపునుంచీ ఇదే ప్రశ్న. ఒక సమస్యకు రెండువైపులనుంచీ ఇద్దరి వైపునుంచీ ఆలోచించాలి. కేవలం ఆవేశంతోనో, కోపంతోనో నిర్ణయాలు తీసుకోకూడదు. కోప తాపాలతో నిర్ణయాలు ఆ కుటుంబాన్ని ఇబ్బందులలోకి నెట్టి వేస్తాయ్.
            శీలా కచ్చితమైన అభిప్రాయాలు కల్గిన స్త్రీ. పైగా ప్రసూతి వైద్య నిపుణురాలు. భార్య, భర్తలు ఎందుకు ఉద్యోగాలు చేయాలి. వీరిద్దరూ ఉద్యోగాలు వెళ్తే పిల్లల్ని ఎవరు సంరక్షించాలి? ఒక స్త్రీ ప్రాచీన భావజాలం కలిగినప్పటికీ తన భర్త మీద ఉండే గొడవల నేపథ్యంలో ఒక ఆడపిల్లతో పోషణ చేయలేని తల్లి ఉన్నతమైన భావనతో ఒక స్థాయికి చేర్చడాన్ని ఈ కథ సూచిస్తుంది. మొదట్లో కష్టంగా ఉన్నా, తర్వాత పడే తృప్తి ఎలాంటి భావనల్ని ఇస్తుందో విశ్లేషిస్తుంది. కేవలం భర్త ఇచ్చే భరణం కోసం ఆతృతగా ఎదురు చూడకుండా తన శక్తితో బాధ్యతల్ని తీసుకునే స్త్రీ జీవితాన్ని దర్శించవచ్చు.
            ఇంకో పార్శ్వంలో చూస్తే కేవలం తండ్రి మాత్రమే చట్టం ప్రకారం పిల్లల పోషక కర్త. భార్యకు ఇష్టం లేకపోయినా, భర్తకు ఇష్టం లేకపోయినా విడిపోయాక పోషించాల్సినది కేవలం మగవాడే. దీనివల్ల ఉండే లేదా వచ్చే సమస్యలకు సహధర్మిచారిణి కాకపోయినా అర్థం చేసుకోవలసిన అవసరాన్ని ఉభయులు కలిగి ఉండాలి. ఒక చక్కని ఆధునిక జీవిత విధానాన్ని ఇందులో ధ్వనింపజేయడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. న్యాయ వ్యవస్థ పరిష్కారాల్ని సక్రమంగా సూచించడం సాధ్యంకాదని ధ్వనింపజేస్తుంది. ఒక్క మాటలలో చెప్పాలంటే అబల కాదు సబల అని స్త్రీ అని అనిపిస్తుంది.  
            భర్త ప్రధానంగా చూపే కథ “గురుత్వాకర్షణ”. ఇది బెంగాలీ భాషనుంచి అనువదించిన కథ. నిజానికి సైన్సులో జరిగే భూమికి ఉండే ఆకర్షణ కాకపోయినా భూమి పట్ల ఉన్న మమకారం ఇది. కలకత్తాలో పని చేసి వారాంతంలో సుదూరంగా ఉన్న తన గ్రామం, భార్య, పిల్లలు, తోటలు, పంటలు వాటికోసం ఒక శ్రమ జీవి పడే ఆరాటం, వారి అన్యూన్యత, అనురాగాలు కుటుంబ సంబంధాలు ఇందులో చూడవచ్చు. పల్లెనాటి ప్రత్యేకతలు ఏ కోశానా లేని పట్నాలలో కేవలం ఆర్థిక సంబంధాలే ఉన్నాయని ఇవి మానవ సంబంధాలను దెబ్బతీసేవిగా దారిస్తున్నాయని కవి ఆవేదన ఈ కథలో అంతర్లయ. బెంగాలీల జీవన విధానాన్ని సూచిస్తూ కలకత్తాలో పని చేస్తున్న ఒక పల్లెటూరి వ్యక్తి పట్నంలో ఉన్న సంబంధాలను, పల్లెల్లో ఉన్న సామరస్య భావనలను క్రోడీకరిస్తూ చూపించిన కథ బెంగాలీ కథ ఇది.
            “అద్దంలో గాంధారి” కథ భారతంలో ఉన్న గాంధారి పాత్ర కథే. పార్శ్వాలు, విశ్లేషణ విభిన్నం, ఆలోచనీయం. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుందని అది మసిపూసి మారేడు కాయ చేసే సమాజానికి అనుసరించి వ్యక్తుల ప్రవర్తనలు మారిపోవడానికి నిదర్శనంగా ఈ పాత్రను ఎంపిక చేసినట్లు అనిపిస్తుంది. కన్నడ భారతంలో పర్వ నవలను రాసిన యస్. యల్. భైరప్ప దృష్టికోణాలు కొంతవరకు కలిగి ఉండి, సామాజిక జీవన విధానంలో కలిగే భావాలను వ్యతిరేకదిశలో సమాజంలో చెలామణి అవ్వడాన్ని ఈ కథ ధ్వనింపజేస్తుంది.
            గాంధారి అందగత్తే. ఆమె కళ్లను చూసి పొగడని వారు లేరు. అలాంటిది ఆమె కళ్ళకు గంటలు కట్టుకోవడం కేవలం నిరసనకే అనేది వీరి భావన. “గాంధారీ! నిజం చెబుతున్నాను, నీ ఈ కళ్లని కలువలనుకొని తుమ్మెదలు ముద్దాడుతాయి. అంత అందంగా వున్నాయి నీ కళ్ళు. నిన్ను వరించే రాకుమారుడు నీ కళ్లను చూస్తూనే మొదటి రాత్రి పొద్దు పుచ్చుతాడు”(పుట. 17)ఇది చెలికత్తె చేసిన వ్యాఖ్య.
            “అతను కళ్ళు లేకుండా గుడ్డివాడు. నేను కళ్లున్నా గుడ్డి దాన్ని. గుడ్డివానికి గుడ్డిది జోడి... కూతురు గుడ్డిది అనే అంశంతోనైనా పెళ్లి ఆగిపోతుందేమో నాన్న చిన్ని ఆశ. నాలో కానీ రాజగురువుగారికి ఈ వార్త తెలియడంతో వారన్నారట ఇలా- గాంధారి ఉత్తమ శీలవంతురాలు. లోకంలో సూర్య చంద్రులున్నంత కాలం ఆమె కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. పతి భక్తి పరాయణురాలు”. (పుట 21) ఈ మాటలుకన్నా చెవుల్లో వేడి సీసంపోయడం నయం అని గాంధారికి అనిపించింది. ఒక్కసారి కట్టుకొన్న ఆ పట్టీ తమాషాకో, బెదిరింపుకో కట్టుకున్న ఆ పట్టి జిగురులాగా నా విశాలమైన కళ్లని మూసి గాఢాంధకారంలో ఈ గాంధారిని ముంచెత్తింది. ఒక విషయాన్ని పదిమంది ఒకేలా చెప్తే అదే నిజంగా మారిపోతుంది అన్న హిప్నాటిజం భావనను ఇక్కడ రచయిత స్ఫురింపజేస్తున్నారు.
            చివరికి గుడ్డి రాజుతో వివాహం. బిడ్డల్ని చూచుకోలేక, వారి అలనాపాలనా కూడా చూడక తన కన్నవారు తన అభిప్రాయాన్ని అడగకుండానే కట్టబెట్టారు అన్న భావనతో చివరకు మెట్టినింటినికూడా నాశనం కావాలనుకున్న భయంకరమైన తత్త్వాన్ని చూపించడం ఈ కథ ప్రత్యేకత. ఇప్పటి సీరియల్లకు ఏ మాత్రమూ తక్కువ కానీ విలనిజం ఈ పాత్ర స్వభావం. ఆడవారికి నచ్చాలంటే వారిలోని ఉండే వికృత భావాలను వేరే పాత్రలద్వారా బయటకు తీసుకువస్తే దానిలో వారు ఆనందాన్ని పొందుతారు. దీన్ని మనోవిజ్ఞాన వేత్తలు దమనం అనే మానసిక భావనగా చెబుతారు. గుడ్డి భర్త పిల్లల్ని చూడగలిగినా మొండిదైన అహం. ఆ పై సమాజం దాన్ని సానుభూతిగా చూపడం. పుట్టినింటివారి మీద తీరని పగ. వెరసి ఆ భావన వైవిధ్యాల సుడిగుండాలగా మారింది. చివరలో పశ్చాత్తాపం చెందినా అప్పటికే కాలం కారిపోతుంది. నేను కళ్ళు విప్పుకొని వచ్చిన దాన్ని కాను, కప్పుకొని వచ్చిన దాణ్ణి అనడం ఈ పాత్రకు పరాకాష్ట. 
            “బొమ్మకు అటువైపు” కథా సంగతికి వస్తే- ఇందులో కుటుంబవ్యవస్థే ప్రధానాంశం. ఇందులో భర్తది శాడిష్టు స్వభావం. నిగమశర్మ అక్క తన తమ్ముడు ఇల్లు మొత్తం దోచుకువెళ్ళిపోయినందుకు బాధపడలేదట. తన ముక్కెర పోయినందుకు బాధ పడిందట. ఆమె దృష్టిలో అది మంగళప్రదం. అలాంటి దాన్ని తీసుకువెళ్ళడం బాధాంశం. ఇక్కడ తాగుడు భర్త. కట్నం ఇవ్వలేని తండ్రి. విలువలున్న కుటుంబ స్త్రీ. కోర్టులకు వెళ్ళడమే కాలయాపన. ఆపై న్యాయం కోసం ఏళ్ళు గడిచిపోతాయి. స్త్రీ పురుష సంబంధాల విషయంలో కోర్టు ఏం తీర్పు నిస్తుంది? విడిపోకుండా వుండండి అని తీర్పు చెప్పే న్యాయాధిపతి పరస్పరం అన్యోన్యంగా ఉండండి అని ఉత్తర్వులు ఇవ్వగలడా?’ అని న్యాయవ్యవస్థనే సవాల్ చేయగలిగే కథ ఇది. మంగళ సూత్రాన్ని భర్త ఉండగానే అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో టైలరింగ్ మిషన్ కొనుక్కొని ఆధునికమైన జీవనాన్ని సాగించిన పంథా కన్నీళ్లు తెప్పించక మానదు. భర్త త్రాగుడుతో తనువు చాలించినా సుమంగళిగా అలంకరించుకొని తర్వాతకూడా ప్రతీకారం తీర్చుకోవడం అద్దంలో గాంధారి కథకు కౌంటర్ గా కనిపిస్తుంది ఈ కథ.
            మరణం మనిషికి చెంతనే ఉంటుంది. ఆకలి దాన్ని ఒక సాధనం. పేదరికానికి తమ్ముడే ఈ ఆకలి. పని లేని, పని దొరకని పల్లెల్లో పరువుగా బతకలేని పడిన కుటుంబ దీనగాథ “ఆకలి”. వలసలు పోవడానికి ఉన్న కారణాలు అవి జీవన విధానంపై ఎలాంటి ప్రమాదకరమైన పాత్రను పోషిస్తాయో వివరిస్తుంది. ఇది ఈనాటి చిరుద్యోగులను, చదువులు ఉండీ కొలువులు లేని కుటుంబాలను ధ్వనింపజేస్తూ కథనం సాగిస్తుంది. ఏ ఆకు దొరికేతే దానితో కడుపు నింపుకునే దయనీయమైన స్థితికి కారణం ఎవరు అన్నది పాఠకుల వదిలేయడం కథలో కొత్తదనం. ప్రశ్నలను గుప్పించకుండా సహజంగా గమనం సాగించడం మరో తత్త్వం. ఆలోచనకు కావల్సిన స్థితి ఉంటుంది. అంతిమంగా తెలియకుండానే ఆకలి చావు. దీనికి కథకుడు– పొద్దు పొడిచింది. అందరూ వచ్చి వారి వారి పనులు చేసుకుంటున్నా ఆ కుటుంబం వారు లేవలేదు. వాళ్ళు ఆకలితో చావలేదు. అలా అనడం తప్పు. ఆకలిని చల్లార్చుకోబోయి చచ్చారు. పలు రకాల ఆకుల కూరల్లో ఉన్న ఓ విషపు కూర వాళ్ళు చంపుకోవాలనుకున్న ఆకలికే ఆహారం దొరికింది అంటూ ముగిస్తాడు. మానవత్వం మృత్యువులోకి వెళ్లిపోవడం ఈ కథలో సూచిస్తున్నాడు.
            తీవ్రవాదానికి కారణం ఏమిటి? ఎవరు? అన్న ప్రశ్నలను ఆలోచింపజేస్తూ కొంతమంది కారకులు అన్న విషయాన్ని ధ్వనింపజేయడం “ఆగస్టు-25” కథాంశం. మంగలి కొడుకును అన్యాయంగా తీవ్రవాదిగా ముద్రవేసి పోలీసులు దౌర్జన్యంగా చంపేస్తారు. అతడిని కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఆ మంగలి తండ్రి అదే రోజు తన కొడుకు చావుకు కారణమైన యస్. ఐ., కొడుకును తన మంగలి కత్తెతో పీకను కోయడం కథలో ప్రతీకారం. కంచే చేను మేస్తే న్యాయం ఎక్కడ దొరుకుతుంది అని ధ్వనింపజేయడం ఈ కథా తత్త్వం.
            శుభ్రత కోసం ఏర్పడినవి ఆచారాలు. అవి తార్కికమైన, సహజమైన పద్ధతిలో ఉండాలి. జంతు ధర్మాలు మనం ఎంత మార్చినా మారవు. మనిషి మాత్రం అందుకు భిన్నంగా కనబడుతున్నాడా? వాటిని తగిన విధంగా మాత్రమే మనం నడుచుకోగలగాలి. మనలో ఉండే జంతు స్వభావాలు, రాక్షస భావనలు ఎలా బయటకు వస్తాయో సూచించిన కథ “మూర్తి దంపతులు”. ఎంతో గారంగా పెంచిన మూర్తి దంపతుల కుక్క పిల్ల కథ. పైకి కనిపించినా మనిషిలో ఉండే క్షమాగుణాన్ని క్రూరంగా మారడానికి చిన్న కథాంశం ద్వారా సూచించాడు. శాఖాహారం బదులుగా ఒక ఎలుకను బయట తిన్నందుకు ఇంటికి తెచ్చి రాత్రంతా కొట్టి చివరకు దాన్ని చంపడం పెద్దవాళ్ళైన మూర్తి దంపతులకు ఎలా మనసొచ్చింది అని సూచిస్తాడు.
            మట్టిని నమ్ముకున్నవాడికి మనసు ఉంటుంది. కరెన్సీకి కట్టుడయినవాడు కారుణ్యాన్ని కాల్చేస్తాడు. ఏ మనిషి ప్రకృతిని సక్రమంగా వాడుకుంటాడో అతడే మనసున్న మనిషి. పల్లెల్లో ఉన్న వారి జీవనం, పట్నాలలో వారి జీవనాన్ని పోలుస్తూ చెప్పే కథ కాలుష్యం. కలకత్తా జీవనం అక్కడ ఉండే దయనీయమైన ఆర్థిక సంబంధాలను, కాలుష్యపు కోరల విలయ తాండవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం ఈ కథలో ప్రత్యేకత.
            అవినీతి అక్రమాలకు అడ్డాగా మారుతున్న సమాజం. దానికోసం బలితీసుకుంటున్నా అమాయకపు మనుషుల జీవితాలు, పెద్దమనుషుగా చెలామణి అవుతున్న బడా బాబుల మానసిక స్థితులు కథాంశం “ఇల్లు”. బొగ్గు గనుల్ని కొండ ప్రజలతో రాత్రికి రాత్రి తవ్వించి, లారీలకు ఎక్కించి అక్రమంగా తరలించే బాదాబాబులు వారిని ఎలా ఉపయోగించి మాయ మాటలు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారో తెల్పిన కథ. మనిషి స్వార్థం ఆపై అదనంగా అక్రమంగా సంపాదించుకునేందుకు ఎంతటి పాపానికైనా ఒడిగడతారని సూచించడం ఈ కథలో ప్రత్యేకత.
            వ్యక్తి స్వార్థం నుంచి స్థాయిని పెంచి ఎక్కువ మంది ప్రాణాలను సైతం తీసుకోవడం ఎలాంటి సందేహంలేని, వెనుకాడని తత్త్వాన్ని తెలిపే మరో కథ “బలి”.  పురుగులు మందుల వ్యాపారం మనుషుల్ని ఎలా బలిగొంటుందో విశ్లేషిస్తాడు. ఒక జర్నలిస్ట్ చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఆ విషయాన్ని ఎడిటర్ కి తగిన విధంగా వివరించి చెప్పాడు. తను అన్నీ చూసుకుంటానని ఆ జర్నలిస్ట్ మాధవ రావును విదేశాల్లో శిక్షణకు ఎంపిక చేశారు. తన మనస్సు మాత్రం స్పష్టంగా చెబుతూనే ఉంది- బలి తీసుకున్న ఆ మందుల కంపెనీని ఏమి చేయలేడని. ఏది భారతదేశంలో ఫోర్త్ ఎస్టేట్ కు ఉన్న క్రమశిక్షణ. ప్రభుత్వాల పని తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాల్సిన వార్తలను వ్యక్తి స్వార్థంతో బలైపోవడం ఈ కథలో ధ్వన్యంతరగా కనిపిస్తుంది.
            మానవ సేవే మాధవ సేవ. ఇలాంటి మాటలు వినడానికి బాగుంటాయి. వ్య్వహారానికి వచ్చేటప్పటికి వ్యక్తి స్వార్థాలు ప్రవేశిస్తాయి. విశ్వ శ్రేయస్సు కోరుకుంటున్నామనుకొనే పెద్దమనుషులు స్వార్థ శక్తి దాసోహం అవడం ఈ కథకు మూల సూత్రం. ఒక ఉరిశిక్ష పడిన వ్యక్తి ని తన ప్రయోగాలకు వాడాలని భావించిన ఒక వైద్యుడి కథ ఇది. జక్సో కంపెనీ వారు పెద్ద మొత్తంలో బహుమతిని విల్సన్ సిండ్రోమ్  పై ప్రయోగాలు చేసి మందులు కనిపెట్టిన వారికి ఈ బహుమతిని ఇస్తారు. విల్సన్ టెంపరేచర్/ థైరాయిడ్ సిండ్రోమ్ అని దీనికి పేరు. ఇది లో టెంపరేచర్, హెయర్ లాస్ లాంటి తత్త్వాలు వస్తాయి. విటమిన్స్, పౌష్టికాహారం తగ్గడం వల్ల ఈ విల్సస్ సిండ్రోమ్ రావచ్చు. ఈ అంశాలతో కూడిన కథ- గిన్నీ పిగ్.
            గిన్నీ పిగ్ అనేది ఎలుక జాతికి చెందినది. తెలివైన జంతువు. మానవ శరీరానికి దగ్గరగా దీని శరీర నిర్మాణం ఉంటుంది. దక్షిణ అమెరికాలో దీన్ని తింటారు. ఎక్కువ మెడికల్ వెల్యూస్ ఉన్న జంతువు. పైగా పెంపుడు జంతువు కూడా. 4 నుంచి 5 సంవత్సరాలు జీవితకాలం. ఉరిశిక్ష పడిన అతడి మీద ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించదలచిన డాక్టర్ చివరికి పాథర్ దగ్గరికి వెళ్ళడం అతడు ఎక్కువ డబ్బును ఆశించడం చేస్తాడు. ఇది వ్యక్తి స్వార్థంగా కూడిన బలి కథకు వైద్య విద్యా సంబంధమైన, మత పరమైన స్వార్థాలకు నిదర్శనం.
            చివరిగా ఎవరు హిందువు? అని ప్రశ్నిస్తూ సాగిన మరో బెంగాలీ కథ “ఎవరు హిందువు”. మతం అన్న పదానికి మానవత్వం కలిగి ఉండడమే అన్న అర్థాన్ని స్పృశిస్తూ సాగిన కథ ఇది. రోజూ గంగా స్నానం తప్పని సరిగా చేసిన ఒక ముసలి వయస్సు వచ్చిన వ్యక్తి తను గంగలో మునగడానికి వెళ్ళే వైనాన్ని సూచిస్తూనే ఒక వ్యక్తి అపస్మార స్థితిలో ఉన్న వాడిని కాపాడడం ఇంతకీ అతడు వేరే మతస్థుడు. మతం కన్నా మానవత్వం గొప్పది అని నిరూపించిన కథగా దీన్ని చెప్పవచ్చు.
            మొత్తం కథల్ని పరిశీస్తే భారతకాలం నుంచి ప్రస్తుతం వరకు ఉన్న కుటుంబం, అందులో స్త్రీ, మతాల విశ్వాసాలు మనుషుల్ని ఏవిధంగా ప్రవర్తింపజేస్తున్నాయో కతానాంశాలద్వారా సూచించడం. వాటికి ఆధునిక భావనల్ని ధ్వనించేలా విశ్లేషించడం. అనువాదాల అవసరాలను పాఠకులు గుర్తించాల్సిన స్థితిని ఈ కథలు చెబుతున్నాయ్. తెలుగు వారికి ఉండే తెగువను, కుటుంబం పట్ల ఉండాల్సిన కర్తవ్యాలను తగిన విధంగా బాధ్యతలను వహించాల్సిన తీరు తెన్నులను ఈ కథలు చక్కగా దర్శింపజేస్తున్నాయ్.



Saturday, November 29, 2014

అందాలకు....మెరుపు
అందాలకు కొసమెరుపెప్పుడు?
సంసారానికి జీవం ఎప్పుడు?

మధ్యతరగతి అంథహాసం
మబ్బు వీడని సూర్యకాంతి
నింగినంటిన మెరుపు ధరలు
కల్లలైన జీవితపు పగటి కలలు
నరుని మనసు నాట్యమాడితే?!

ఇంటిలోన ఈగల మోత
కడుపులోన ఈగలమోత
అందమని పేరే ఓ నటన

మట్టి కలిపిన మనిషి చూడు
దిక్కులేని తెలివి చూడు
మనిషినంటిన కలిమిచూడు
కుళ్ళుచాటున కులముచూడు

మెరుపునున్న కాంతి కావాలా?
దగ్గరున్న మంచి వదలి
లేని దగ్గులు మానుమింక
భూమినుండి బతుకుతెరవు
చూడుమింక

ఒట్టి మెరుపుల గొప్పలేల?
బతుకివ్వని తిండి ఏల?
నీతిలేని కలిమి ఏల?
కలకాలం కుళ్ళుతో
కోట్లుండినా చావు ఏల?
ఏదినిజం? ఏది శాశ్వతం...

Thursday, November 20, 2014

పదాలలో ఉన్న కొన్ని అల్ప, మహాప్రాణాక్షరాలు



                                                పదాలలో ఉన్న కొన్ని అల్ప, మహాప్రాణాక్షరాలు
                                                                   -డా. జాడ సీతాపతిరావు,
            సాధారణంగా మనం వాడే పదాలలో ఉన్న అక్షరాల్ని రాసేటప్పుడు కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. దానికి కారణం  ఆ పదాలను సరిగ్గా అనకపోవడం కానీ, దానికి మూల రూపం తెలియకపోవడం, వాటిని తరచుగా వాడకపోవడం మొదలైనవి కారణాలు కావచ్చు. ఎక్కువమంది మనం ఎలా అంటున్నామో అలాగే రాయాలి అని పదాల అర్థాలను పట్టించుకోకుండా కొందరు ఉంటున్నారు. తద్వారా అస్పష్టతకు దారితీస్తున్నది. ఈ మహా ప్రాణ అక్షరాలు సంస్కృత భాషకు సంబంధించినవి, వాటిని సరిగ్గా ఉచ్చరించాలి. తెలుగులో మహాప్రాణాక్షరాలు లేవు. వాటిని మనం తెలుగులోకి 19 మహాప్రాణాక్షరాలు దిగుమతి చేసుకున్నాం. మహాప్రాణాక్షరాలు అంటే ఉచ్చారణలో ఎక్కువ ఒత్తిడితో అనేవి, జట(కొన్ని ప్రాంతాలలో ఒత్తు అంటారు. అక్షరం కింద చిన్న గీత ఉన్నది) ఉన్న అక్షరాలు అని సామాన్య అర్థం. క-చ-ట-త-ప వర్గలోని 2, 4 అక్షరాలు మహాప్రాణాలు. ఇప్పుడు మహా ప్రాణాక్షరాలున్న వాక్యాలు, పదాలు చూద్దాం-
            వాహనాల వెనుక నిదానమే ప్రధానము అనే వాక్యాన్ని రాస్తుంటారు. అంటే వేగంగా వెళ్లకుండా, సమవేగంగా వెళ్ళడం ముఖ్యం అని అర్థం. నిదానము అంటే ఆత్రపడకుండా విచారించడం/ వెళ్ళడం. ఇక్కడ అల్ప ప్రాణ అక్షరం “దా” సహజవేగాన్ని, దీర్ఘం కావడం ఎక్కువ దూరాన్ని కూడా సూచించవచ్చు. ప్రధానం అనే పదం “ముఖ్యం” అనే అర్థాన్ని నొక్కి వక్కాణిస్తున్నది. కాబట్టి నిధానం కాదు. నిదానం. ప్రదానం కాదు ప్రధానం. ప్రదానం అంటే ఇవ్వడం అని అర్థం. నిధానం అంటే ఉంచుట, పాతర అని అర్థాలు. దీనికి మూల రూపం నిధి”. దీని నుంచి వచ్చింది నిధానం అని తెలుసుకోవాలి. 
            ఈ సందర్భంలో రంగులతో రాసేవాడు అక్షరదోషాలతో రాసినట్లయితే మరింత అనుమానాలు వస్తాయి. నిధనమే అని రాశాడనుకోండి నిధనం అంటే కులం, చావు, చేటు అని అర్థాలు. నిధనమే అంటే వాడి చావే వీడికి ముఖ్యం అన్నమాట.
            ప్రదానము అని రాశాడనుకుంటే ప్రకృష్ట దానము, గొప్పయీవి అని అర్థాలు. మంచి దానం చేయడం అన్నమాట. నిదానంగా వెళ్ళడం మంచి దానం లాంటిది అని అర్థం చేసుకోవాలి. వాడు తెలియక రాసినా అది భావ దోషం కాదు. ఎందుకంటే మెల్లగా వెళ్ళడం వల్ల ప్రాణాలు పోకపోతే ఈ పదం సరిపోతుంది. ప్రధనము అని రాశాడనుకోండి దానికి అర్థం యుద్ధం, చీల్చుట. కాబట్టి రాసే వారు సరిగ్గా రాయాలి. రాయు అనే పదం వ్రాయు నుంచి వచ్చింది. వ్రాత నుంచి వ్రాయు అయింది. రేఫ పోయి రాయు అని అంటున్నాం. కానీ “వాడు గోడకు వీపును రాసాడు” అన్నచోట, “వాడు రాస్తున్నాడు” అన్నచోట సందర్భాలు తెలియకపోతే అపార్థాలు చేసుకునే వీలు ఉంది కదా!
            భోజన శాలలలో (హోటల్స్) “శాఖాహార భోజనం మా ప్రత్యేకత” అని రాయడం మనం చూసే ఉంటాం. శాఖం అంటే కొమ్మ, వేద భాగం,  చేయి అని అర్థాలు. అంటే ఆ భోజనంలో కొమ్మలు వస్తాయి. లేదా చేతులు వస్తాయి. అంటే మాంసాహారమా లేకపోతే కూరగాయల ఆహారమా అనే సందేహం వస్తుంది. నిజమైన పదం కూరగాయల భోజనం కదా అంటే శాకాహారం అని రాయాలి. శాకం అంటే కూర అని అర్థం. ఈ కూర ఆకు, పువ్వు, కాయలు మొదలైన భేదాలతో పది రకాలు. శాకం అన్న పదానికి టేకు చెట్టు, ఒక ద్వీపం, శక్తి అనే నానార్థాలున్నాయి.  
            భేదం అన్న చోట మొదటి అక్షరమే మహాప్రాణం. దీని ఉచ్చరించేటప్పుడు సరిగ్గా అనాలి. మరో పదం బోధన ఇక్కడ మహాప్రాణంగా తెలుసుకోవాలి. ఉచ్చారణ అన్న పదంలో మహా ప్రాణ అక్షరం లేదు. ఉత్ అనేది ఉపసర్గ. పైకి అని అనడం అని గమనించాలి. ఉచ్ఛిష్టాన్నము అనే చోట “చ్ఛి” మహాప్రాణం. ఇతరులు తినగా మిగిలిన అన్నం అని అర్థం. ఉచ్ఛ్వాసములో “చ్ఛ్వ” మహాప్రాణాక్షరం. ఊపిరి బయటకు వదలడం అని అర్థం.  కచ్చితంగా అన్న పదంలో మహాప్రాణ అక్షరం లేదు. మనం ఒత్తి పలికేస్తూ మొదట ఉన్న అక్షరాన్ని క బదులుగా అని అనేస్తుంటాం. ఖండితం అన్న పదంలోని ఖ వల్ల ఇలా అని ఉండవచ్చు. కచ్చితంగా అనే పదం మాత్రం నిఘంటువులో ఉంది. కచ్చితం అంటే ఎచ్చు తక్కువలు లేకుండా సరిగా ఉండేది అని అర్థం. ఖండితం అంటే నరకబడినది అని నిఘంటువులోని అర్థం. ఖచితం అనే మరో పదం ఉంది. ఈ పదానికి చెక్కబడినది అని అర్థం.
            ఇంకో మహా ప్రాణాక్షరం అర్థం. అర్థం అంటే శబ్దార్థం, ఇంద్రియార్థం, కారణం, ధనం, నివృత్తి, న్యాయం, ప్రయోజనం, వస్తువు అని అర్థాలు. అర్ధ అంటే సగం అని అర్థం. దీని ఉచ్చారణ సరిగా అనాలి, దాన్ని గమనించాలి. అర్థన అంటే యాచన, వేడుకోలు అని అర్థాలు. విద్యార్థి అన్న చోట ఈ పదం మనం సరిగా వాడాలి. విద్య లో ద్య అల్పప్రాణం, విద్యార్థిలో ర్థి మహాప్రాణం.
            యథేచ్ఛగా విహరిస్తున్నాడు అనే వాక్యంలో రెండు మహా ప్రాణాక్షరాలు ఉన్నాయి. థే, చ్ఛ. యథా+ ఇచ్ఛ అని విభాగం. ఇచ్చవచ్చినట్లు అని దీనికి అర్థం. ఇక్కడ ఇచ్చ అని ద్విత్వాక్షరం వాడడం జరిగింది. ఇది దంత్యమైన చ కారం. వాంఛ అనే పదం దీనికి పర్యాయ పదం అని తెలుసుకోవాలి. ఇక్కడ మహా ప్రాణాక్షరం ఉంది.   
            నేను యథార్థమే చెబుతున్నాను అనే వాక్యంలో మహా ప్రాణాక్షరాలు థా, ర్థ లు ఉన్నాయి. సత్యం అని దీనికి అర్థం.  యథాక్రమం అనే పదంలో క్రమాన్ని అతిక్రమించక అని అర్థాన్ని గ్రహించాలి. “యాదాస్తు” అనే హిందీ విశేషణంలో మాత్రం మహాప్రాణాక్షరం లేదు. దీనికి ఆజ్ఞాపూర్వకమైన ఉత్తరం అని అర్థం.
            “అభ్యాసము కూసువిద్య” అనే సామెతలో అభ్యాసముద్వారానే విద్య వస్తుంది అనే భావన ఉంది. అభయ, అభాగ్యం, అభిలాష, అభ్యర్థి, అభ్యసనం, అభ్యుదయం (=ప్రగతి), మొదలైన పదాలలో భ మహాప్రాణం. ర్థి మహాప్రాణం.
             “వాడు మేధావి” అనే వాక్యంలో అనేది మహాప్రాణం. మేధ అనే పదానికి- చిలుక; (విణ) మేధకలవాడు అనే అర్థాలున్నాయి. దీనినే అల్పప్రాణంగా రాస్తే “మేదావి” అప్పుడు దీని అర్థం ఔపాసనాగ్నిమసి. మేధ అంటే ధారణాశక్తి గల బుద్ధి; యజ్ఞం అని అర్థాలు ఉన్నాయి. మేదించు= మర్దించు, మేదిని= భూమి; మేదురము= చక్కనై నునుపైనది అన్న పదాలు చూసి మరింత పరిజ్ఞానాన్ని పొందవచ్చు.
            శబ్దం అనే పదానికి పూర్వంలో నిశ్ చేరి నిశ్శబ్దం అనే పదం ఏర్పడింది. దీనిలో మహా ప్రాణాక్షరం లేదు. కేవల సంయుక్తాక్షరం. శబ్దం గట్టిగా ఉంటుంది కాబట్టి దానికి ఊనికను ఆధారంగా ఒత్తిడి పెంచి శబ్ధం అని మహాప్రాణాక్షరంగా రాసేస్తుంటారు. విద్యార్థి దశలో దాన్ని సరిచేయాలి.
            ఆధి అనే పదం చూద్దాం. దీనికి మనోవ్యధ, కుదువ, ప్రత్యాశ, వ్యసనం, ఉనికిపట్టు అని అర్థాలు. ధి మహాప్రాణం. దీన్ని హ్రస్వంగా రాస్తే “ఆది” అంటే “మొదలు” అని అర్థం. ఆది అనే పదం కొన్ని చోట్ల దేశీయ తెలుగులో, సంస్కృతంలోనూ కనిపిస్తున్నది. ఆధిభౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం అనే పదాలలో ఆధి మొదటిగా కనిపిస్తున్నది. ఆధిభౌతికం అంటే భూతాలవల్ల కలిగింది(పృథివి మొదలైనవి భూతాలు); ఆధిదైవికం అంటే దైవం వల్ల కలిగేది. ఆధ్యాత్మికం అంటే ఆత్మవల్ల కలిగేది అని అర్థం. ఇలాంటి పదాలు తరచూ రావు కానీ వాటిని వచ్చినప్పుడు మరింత లోతుగా చూడాలి.
            “వెంకటాచలధామ” మొదలైన పదాలలో ధా మహాప్రాణం. ధామం అంటే ఇల్లు, చోటు, వెలుగు, కాంతి, ప్రభవం, మేను, పుట్టువు అని అర్థాలు. ఈ ధా ని అల్పప్రాణంగా రాస్తే దామము. అంటే పశువుల్నికట్టే పలుపు, హారము అనే అర్థాలు వస్తాయి. వెంకటేశ్వరుణ్ణి పశువుల్ని కట్టే తాడుతో కట్టడానికి మనం యశోదాదేవీ కాదుకదా.
            “వాడు మంచి ఆస్తి/ ఆస్థి పరుడు” అనే వాక్యంలో స్థి అని మహాప్రాణాక్షరంతో రాస్తే ఎముక అని అర్థం. అల్పప్రాణాక్షరంతో రాస్తే ధనాన్ని కూడబెట్టాడని అర్థం. ఆస్థ అని రాస్తే ఆస్థానం, రాజసభ అని అర్థాలు. వాడు ఎముకల పుష్టి వాడా? డబ్బు ఉన్నవాడో తెలుసుకొని రాయాలి.  పుష్టి అనే పదానికి పోషణం, బలుపు, సమృద్ధి అని అర్థాలు.  కాబట్టి సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకొని రాయాలి.  
            ఇలా ఒక పదం కోసం నిఘంటువును చూస్తూ ఉంటే చాలా పదాలకు అర్థాలు తెలుస్తాయి. శబ్ద జ్ఞానం పెరుగుతుంది. వాటిమీద పట్టు సాధించవచ్చు. పూర్వం అమరకోశాన్ని కంఠోపాఠం చేసేవారు. దానివల్ల శబ్ద శక్తి వారికి అలవడేది. ఆంగ్ల విద్యల పుణ్యమా అని ఇప్పుడు ఆ స్థితి లేకుండా పోయింది. కనీసం మనకు తెలియని పదం వచ్చినప్పుడు దానికి సంబంధించిన వ్యుత్పత్తి,  అర్థం, పర్యాయ పదాలు, నానార్థాలు గమనిస్తూ ఉంటే శబ్ద శక్తి పెరుగుతుంది. మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. అవసరం అయినచోట వాటిని వాడుతుండాలి. పద సంపద ఉంటే తెలుగు భాష బాగా వచ్చిన తెలుగువారు మరే ఇతర భాషనయినా సులువుగా గ్రహించ వీలు ఏర్పడుతుంది. ప్రయత్నం చేయాలి. శ్రద్ధ, ఆసక్తి ఉండాలి.

ఉచ్చారణ వ్రాతల్లో అక్షరాలు- అల్ప మహాప్రాణతలు



                                               
ప్రధానము = 1. పరమాత్మ, 2. ప్రకృతి, 3. బుద్ధి, 4. ముఖ్యము
ప్రధనము= 1. యుద్ధం, 2. చీల్చుట.
ప్రథమము= 1. మొదటిది, 2. ముఖ్యం.
ప్రథితి/ ప్రథ = ప్రఖ్యాతి, పేరు
పథము= మార్గం, త్రోవ
పథ్యము= హితం
దృక్+ పథము= దృక్పథము. దృక్= కన్ను, చూపు, బుద్ధి, చూచువాడు
దృఢము= అత్యంతం, (విణ) 1. అధికం, 2. దిటవుకలది, 3. గట్టిది, 4. బలిసినది{దృఢంగా ఆహారం తింటే దిటవుగా తయారవుతావు}
దృతము= సం.వి. ఆదరింపబడినది.
ద్రుతము= సం.క్రి. విణ. 1. త్వరితం, వడిగలది, 2. కరిగినది, 3. చీలినది
దృతి= తిత్తి, భస్త్ర
ద్రుమము = 1. వృక్షము, పారిజాత వృక్షం. (డు)1. కింపురుషుడు, 2. శిశుపాలుడి స్నేహితుడు
గృహస్థుడు= భార్యను పరిగ్రహించి, ధర్మార్థ కామములను నడుపుతూ వేద పాఠము, వైశ్వదేవాది హోమము, అతిథి పూజ, పితృతర్పణం, భూతబలి, అన్న ఐదు యజ్ఞాల్ని చేస్తూ ప్రవర్తించేవాడు;  ఇలుఱేడు.
పదకము = క్రమం, పతకము
పటిష్టము= మిక్కిలి పటువైంది.
ప్రతిష్ఠ= గౌరవం; చోటు; శాశ్వతంగా నిలుపుట; నెల, నావగవ ఛందస్సు.
ప్రతిష్ఠించు = శాశ్వతంగా నిలుపు
యథేచ్ఛ = ఇచ్చవచ్చినట్లు
యథార్థం= సత్యం
యథాక్రమం= క్రమాన్ని అతిక్రమించక
యాదాస్తు= (హిం.వి) ఆజ్ఞాపూర్వకమైన ఉత్తరం
యాదృశం= ఎటువంటిది
యామి= కులస్త్రీ, తోడ పుట్టినది
యమి= ముని; హంస
యుగ్యము= గజాదివాహనము, (పుం) కాడి మోసే యెద్దు
యుగ్మము= జత, యుగళం
యుతం= కూడుకొన్నది; లెక్క; కలియకూడింది; వేఱు పడ్డది
యతనము= యత్నం, జతనము
మేధావి= చిలుక; (విణ) మేధకలవాడు
మేదావి= ఔపాసనాగ్నిమసి
మేధ= ధారణాశక్తి గల బుద్ధి; యజ్ఞం
మేదించు= మర్దించు
మేదిని= భూమి
మేదురము= చక్కనైనునుపైనది
పదరు= త్వరపడు; కోపించు, చలించు; (క్రి) ఆక్షేపించు, (ఆ.వి.బ)త్వరితపు మాట
పదురు= త్వరపడు; (వి) విధం, అధికారం, త్వరితపు మాట
ఱంకె = (దే.వి)ఋషభధ్వని; ధ్వని, కేక
ఱంకెత= (ద్వ.విణ)(ఱంకు+ ఎత) జారిణి
ఱంపము= (దే.వి) (ఱంపము+కాడు) = కోయువాడు, ఱంపగాడు, పలకలు లోనగునవి కోసెడు సాధనం, క్రకచము
ఱవ్వ= దూఱు, నింద
రవము= ధ్వని, కంఠ ధ్వని
రవ= వై.వి = అణువు, (పుప్పొడి రవ్వ); ఖండం; వజ్రం; రవగాలు; (విణ) సన్న
రచ్చ= రాజమార్గం; మండపం; సభ; గోష్ఠి; కలకము; కలహము
వరబడి= (దే.వి) కఱవు
వరవుడు= దాసి
వఱద= దే.వి) వెల్లువ, ప్రవాహం
వరదుడు= వరాన్ని ఇచ్చేవాడు