అందంగా కనిపించే ఈ ఆకాశహర్మ్యాలను చూసి,
ఇదేదో అద్భుతమని ఆనందించా...
వైట్ కాలర్ జీతం,యూనివర్సిటీ జాబ్ కదా అని అనుకున్నా
లేప్ టాప్ లు ఇచ్చారు కదా టాప్ గా ఉంటుందనుకున్నా
ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది ఇది టేపుల బతుకని,
ఒప్పందాల సుడిగుండమని,
వంగివంగి సలాం చెయ్యాలని, గులాం గిరీ అవ్వాలని.
ఒక వేళ పర్మినెంట్ చేస్తారేమో అనే చిగురించే లోపలే
నాలోని నైరాశ్యం (నిరాశ)నిజాల్లోకి రమ్మంటుంది
పల్లెటూరి పిల్లల్ని నైతిక, సేవాదృక్పథంగా
భావి ఇంజనీర్లుగా, చరిత్రను తిరగ రాయాలని
పల్లెల్ని అందలం ఎక్కించాలని
అందమైన భారతమాతకు అలంకారాలు కావాలని
మనసున నిల్పి సృష్టించి , నవ్వే మందుగా ఇచ్చిన మనీషి మరలిపోయే..
నీ కాంట్రాక్టు అయ్యింది ఖాళీ చేయమంటే...
నా చేయి సాయంకోసం మిన్నులవైపు దీనంగా...
కనిపించిన ఆ ఆకాశమే శూన్యమై వెక్కిరించింది.
విధులు ఎవరికీ తెలియవు
హక్కుల గురించి మాట్లాడే అర్హతే లేదు
క్రమశిక్షణ లేటు ఫీజుతో భర్తీ
స్టాప్ మీటింగ్ ఒక టైమ్ వేష్ట్ ప్రోగ్రామ్
ఒక బకరా ఎదురు తిరిగి విధులడిగితే
మరో బకరా సిద్ధంగా ఉన్నాడని
యాజమాన్యపు ధైర్యం
మొత్తమంతా అరచేతిలో స్వర్గంగా
నిండైన జీవితం... ఎండిన ఆశ
´´ఉద్యోగాలకు ఇది ఒక ప్లాట్ ఫాం´´ అంటూ
కడుపునిండిన మాటలతో కాంట్రాక్టు యాజమాన్యం..
ఉన్నత ఉద్యోగం, ఉత్తమ విద్యార్థులు అనే ఆనందం ఒకప్రక్క
సంతృప్తితో బతకలేని బడి పంతులు మరో ప్రక్క
గంటకో జీ.వో, పనిచేసినవాడికే రాళ్ళ దెబ్బల అక్షింతలు
మత్తు వదలని యాజమాన్యం.. చిత్తు కాబోతున్న వైనం
వెరశి బి.పి. లకు గురౌతున్న ఉద్యోగులు
దినం తెలియకుండానే తెల్లారుతున్న పయనం...
లెర్నింగ్ బై డూయింగ్ అంటూ వీడియోల అభిలాష
వద్దు మొర్రో అంటూ విద్యార్థుల ఘోష
గంట క్లాసు గంట మాస్ కావాలనే విద్యార్థులు
ఫీడ్ బ్యాక్ పేరుతో ఉద్యోగులకు విద్యార్థులిస్తున్న రేటింగ్
గతి తప్పిన మతులు, గాడీ తప్పుతున్న గౌరవం
పొగడ్తలే కవ్వింపుల నిప్పు నిజాలు
బి.టెక్., కు రాగానే హైటెక్కుల టెక్కులు
పేదరికాన్ని మరిచిన, డాంబిక దారిద్ర్య ప్రదర్శన
పొగడ్తలతో మురిసిపోతూ అహం కారాలకు పోతున్న విద్యార్థి లోకం
విభజించి పాలిస్తున్న యాజమాన్యం
న్యాయదేవత నిట్టూర్పుల జాప్యం
అసలే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆపైన అడ్ హాక్ లు,
అవుట్ సోర్సింగుల గమ్మత్తులూ…
ఏం కానున్నాయో!?..
ఇంకే "రాజ"న్నల మనసుని జయించాలో... కాలమే కరుణించాలో..
పర్మినెంట్ అనే పదం ఈ సంస్థకు "మునగ చెట్టు కొమ్మ" ఏమో..
అలసి... సొలసి... వెరశి...
కాంట్రాక్టు ఉద్యోగాలపేరుతో నాట్యం చేస్తున్న
రాజీవ్, రాజన్నల ఆత్మలకు అశాంతిగా…
రాజీవ్ విశ్వవిద్యాలయాలు…
0 comments:
Post a Comment